తిరుపతి, డిసెంబర్ 20: తెలుగులో సుస్వాగతం అంటే మరణించిన మన పితృ దేవతలను ఆహ్వానించడానికి వినియోగించే తెలుగు పదమని, అయితే నేడు ఆ పదాలను స్వాగతానికి బదులుగా సుస్వాగతమని వాడటం తప్పని, అదే విధంగా పత్రికల్లో భాషా పదప్రయోగంలో తప్పులు దొర్లకుండా నిబద్ధత కనపరచాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ ఉద్బోధించారు. ప్రపంచ తెలుగుమహాసభల నేపధ్యంలో ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు తూపల్లి జనార్ధన్ అధ్యక్షతన వర్శిటీ సమూహ మందిరం (సెనేట్‌హాల్)లో తెలుగు జర్నలిజం - భాషా ప్రామాణీకం అన్న అంశంపై జరిగిన సదస్సుకు ప్రధాన వక్తగా విచ్చేసిన మేడిపల్లి మాట్లాడుతూ ఎంతో గొప్పదైన తెలుగుభాష పదాలు, అర్థాలు తెలుసుకోకుండా ఆ పదాలను ఎలాపడితే అలా ఉపయోగించడం ఒక పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాగతం అంటే ఒక వ్యక్తిని ఆహ్వానించడం అన్నారు. సుస్వాగతం అంటే మరణించిన పితృదేవతలను ఆహ్వానించడమన్నారు. నేడు సభలు, సమావేశాల్లో వేదికలపై స్వాగతం, సుస్వాగతం అని చెపుతూ ఆహ్వానిస్తున్నారన్నారు. స్వాగతంతో పాటు సుస్వాగతం అంటే అది మరింత గొప్పగా ఉంటుందన్నది మనవాళ్ల భావన అన్నారు. స్వాగతంలోనే ఒక మంచి ఆహ్వానం వుందన్నారు. స్వాగతానికి సుస్వాగతం అని అనుసంధానం చేయాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా బ్యానర్లను కూడా ఇలా కడుతున్నారన్నారు. ఇది తెలిసి చేస్తున్న తప్పులని తాను చెప్పడం లేదన్నారు. ఒక తెలుగుపదానికి వున్న అర్థం, పరమార్థాన్ని తెలుసుకోకుండా చేస్తున్న తప్పిదాలుగా తాను చెపుతున్నానన్నారు. జయంతి అంటే శ్రీకృష్ణుడు పుట్టిన సమయాన్ని జయంతి నక్షత్రమంటారని, అయితే ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజును జయంతిగా జరుపుకుంటున్నారన్నారు. పత్రికల్లో వర్ధంతి, జయంతి అని రాయడం సరికాదన్నారు. ఒక వ్యక్తి పుట్టిన రోజున దోషాలు ఉంటే చేసే పూజా కార్యక్రమాన్ని వర్ధంతి అంటారన్నారు. అయితే నేడు మరణించిన రోజున వర్ధంతి అని మనం సంబోధిస్తున్నామన్నారు. పాత్రికేయుడు అని, విలేఖరి అని రాయకూడదన్నారు. ఎందుకంటే పాత్రికేయుడు అంటే పత్రికలకు పుట్టినవాడు అని అర్థం వస్తుందన్నారు. కౌంతేయుడు అంటే కుంతీకి పుట్టిన వాడు అని అర్థం వస్తుందని మనం గ్రహించాలన్నారు. ప్రజలకు భాషపై పట్టుసాధించాలంటే పత్రికలే ప్రామాణికమన్నది అక్షర సత్యమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు భాషా ప్రయోగం చేసే సమయంలో తప్పులు దొర్లకుండా నిబద్ధత పాటించాలన్నారు. ఒక పోలీసు తప్పు చేస్తే ఖాకీల కండకావరమని, ఖాకీల కిరాతకమని రాస్తారన్నారు. అదే మేలు చేస్తే పోలీసులు ఔదార్యమని రాస్తారని అయితే ఇక్కడ వచ్చే సరికి ఆంగ్లపదాన్ని వినియోగిస్తారన్నారు. రక్షకభట నిలయం అని బోర్డులు వుంటే అక్కడ తప్పు జరిగితే భక్షకభట నిలయమని పదప్రయోగం చేస్తారన్నారు. 200 సంవత్సరాలుగా భారతీయులను పాలించిన ఆంగ్లేయులు వారి భాషను మనపై రుద్ది వెళ్లారన్నారు. అది ఏ పాలకులకైనా సహజగుణమన్నారు. హైదరాబాద్‌ను పాలించిన నవాబులు ఉర్ధూ భాషను ప్రజలపై రుద్దారన్నారు. అందుకే మనం నేడు గొప్ప తెలుగుకవులైన డాక్టర్ సి నారాయణరెడ్డి, దాశరధి రంగాచార్య వంటి వారు కూడా ఉర్ధూ భాషలోనే చదువుకున్నారన్నారు. వాస్తవానికి ఆంగ్లం మాట్లాడేవారు కేవలం 3 శాతం మంది మాత్రమే వున్నారని, వీరు తక్కిన 97 శాతంపై రుద్దుతున్నారన్నారు. ఇక ప్రధాన మంత్రిని కొన్ని సందర్బాల్లో ప్రధాని అని సంబోధిస్తారన్నారు. అందుకు ఉదాహరణగా నేడు తిరుపతికి ప్రధాని రాక అని పత్రికలు రాస్తున్నాయన్నారు. ప్రధాని అంటే కొంత మంది ముఖ్యల్లో ఒకరని అర్థమన్నారు. అలా కాకుండా ప్రధాన మంత్రి అని రాయాలన్నారు. సివిల్ సర్వీస్ చేసే ఒక వ్యక్తి ఒక జర్నలిస్టుతో సమానమన్నారు. జర్నలిస్టుకు ఎలా అయితే సమాజంలోని అన్ని రంగాలపై అవగాహన వుంటుందో అదేవిధంగా సివిల్ సర్వీస్ చదివిన వ్యక్తికి వుంటుందన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్వీయూ ఉపకులపతి ఉదగిరి రాజేంద్ర మాట్లాడుతూ వాడుక భాషలో కొన్ని అనివార్యంగా ఇంగ్లీషుపదాలు దొర్లుతాయన్నారు. వాటిని అంతగా తప్పపట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. రైల్వే స్టేషన్‌ను దూమశఖట నిలయం అని సంబోధిస్తే సగటు మనిషికి అర్థంకాని పరిస్థితి నేడు నెలకొని వుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాడుకలో వున్న కొన్ని పదాలు దొర్లుతున్నాయన్నారు. కొన్నిపదాల విషయంలో ఆ కారణంగా ఆంగ్లపదాలను ఉపయోగిస్తున్నామన్నారు. ఆ విధానం మార్చుకోవాల్సిన అవసరం వుందన్నారు. సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వర్‌రావు మాట్లాడుతూ నేడు ప్రాశ్చాత్య పోకడల మధ్య తెలుగుభాషా పదాలు ఇంకిపోయాయన్నారు. అందుకు కారణం తొలి నుండి తెలుగుభాష పరాయిభాష పెత్తనంలో కొనసాగడమేనన్నారు. తెలుగుభాషలోని 90 శాతం పదాలు సంస్కృత భాష నుండి తెచ్చుకున్నవేనన్నారు. ఆంగ్లేయుల పాలనలో తెలుగుభాష పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే 1938వ సంవత్సరం నాటి కృష్ణాపత్రిక భాషకు నేటి పత్రికల భాషకు నక్కకు నాగలోకానికి వున్నంత వైరుధ్యం వుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా నాటి దూరదర్శన్‌కు నేటి 24 గంటల టీవి ఛానల్స్‌కు ఎంతో వైరుధ్యం వుందన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలుగుభాషను పరిపూర్ణంగా అందించాల్సిన అవసరం వుందన్నారు. భాషాభివృద్ధిలో వ్యాపారపరంగా వుండే పత్రికలకు పూర్తి స్థాయిలో నిబద్ధత వుండదన్నారు. ఎందుకంటే నాటి స్వాతంత్ర ఉద్యమాలు సాగే సమయానికి నడిచిన పత్రికలకు నేటి వ్యాపార ధోరణితో సాగుతున్న పత్రికలకు ఎంతో తేడా వుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు పరిపూర్ణమైన భాషను అందిస్తాయని భావించలేమన్నారు. ఈ నేపధ్యంలో పరిపూర్ణమైన తెలుగుభాషను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే వుంటుందన్నారు. మరో సీనియర్ పాత్రికేయుడు రామాంజనేయులు (మహర్షి) మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో తెలుగువారు ఉన్నారన్నారు. వారు స్వచ్ఛమైన తెలుగుభాషను నేటికీ మాట్లాడుతున్నారన్నారు. పూర్తిస్థాయిలో తెలుగుభూమిపై వున్న మనలాంటివారే పరాయిభాషలో పడి కలుషితం అయ్యామన్నారు. ఈ సమావేశంలో ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి గిరిధర్, నాయకులు సుకుమార్, దాము తదితరులు పాల్గొన్నారు.
* భాషా పద ప్రయోగంలో పత్రికలు మరింత నిబద్ధత కనపరచాలి * ఆచార్య మేడిపల్లి రవికుమార్ ఉద్బోధ
english title:
s
Date:
Friday, December 21, 2012