తిరుపతి, డిసెంబర్ 20: ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగాల్లో తెలుగు చదివిన వారికి ప్రాధాన్యత పెంచినప్పుడే తెలుగుభాష సంపూర్ణంగా జీవిస్తుందని ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ సూచించారు. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్‌లో గురువారం తెలుగుభాషా సమస్యపై రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన నిఖిలేశ్వర్ స్వాగతోపాన్యాసం చేస్తూ తెలుగుభాష జీవించడం పాలకుల చేతిల్లో వుందన్నారు. తెలుగువారికి ఉద్యోగావకాశాల్లో మెరుగు పరుస్తూ ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందన్నారు. ఇందుకు పాలకులు గట్టి హామీ కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలుగుభాష అమలుకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోకుండా అట్టహాసంగా ప్రపంచ తెలుగుమహాసభలు నిర్వహించడం ఏమిటని ఆయన విమర్శించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ప్రేమావతి మాట్లాడుతూ తెలుగుభాష పరిరక్షించడానికి తీసుకున్న చర్యల్లో ప్రధానంగా విద్యాబోధనలు అన్నీ మాతృభాషలోనే జరగాలని సూచించారు. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ తెలుగుభాషా సమస్యపై అవగాహన కల్పించేవిధంగా ఒక పత్రాన్ని సమర్పించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఈ అవగాహన పత్రాన్ని అంగీకరించారు. తెలుగుభాషోద్యమ సమితి నగర అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి మాట్లాడుతూ ప్రపంచ తెలుగుమహాసభల వలన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం తప్ప తెలుగుభాషకు ఒరిగేది ఏమి లేదని స్పష్టం చేశారు. అందుకు కారణం తెలుగుభాష పరిరక్షణ, అభివృద్ధి పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమేనన్నారు. విప్లవ కవి, సాహితీ విమర్శకులు జెట్టి జయరామ్ మాట్లాడుతూ న్యాయశాఖలో తెలుగుభాషను అమలు చేసేందుకు ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుభాషోద్యమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సామల రమేష్ మాట్లాడుతూ తెలుగుభాష సంరక్షణ, అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఎన్ని మార్లు తాము మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని నిప్పులు చెరిగారు. భాషాభివృద్ధి పట్ల తాము చేసుకున్న విన్నపాలన్నీ అరణ్యరోదనగానే మారాయి తప్ప న్యాయం జరగలేదన్నారు. ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో పాలకులు అనుసరిస్తున్న తప్పడు విధానాలతోనే మాతృభాష మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జే ఉపేంద్రర్, డిఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి ఉపేంద్రర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలు, 500 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుభాషను అధికార భాషగా అన్ని రంగాల్లో వెంటనే అమలు చేయాలని, త్రిభాషా సూత్రాన్ని రద్దు చేసి మాతృభాషలో అన్ని స్థాయిల్లో విద్యాబోధన చేయాలని లాంటి డిమాండ్లతో ప్లేకార్డులు ప్రదర్శిస్తూ చేసిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది.
మోడి విజయంతో అంబరాన్నంటిన సంబరాలు
తిరుపతి, డిసెంబర్ 20: వరుసగా మూడవసారి గుజరాత్‌లో నరేంద్రమోడి విజయం సాధించడంతో తిరుపతిలో బిజెవైఎం నాయకులు రాటకొండ విశ్వనాథ్ ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. తిరుపతి రైల్వేస్టేషన్ కూడలి వద్ద మధ్యాహ్నం 1 గంటకు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి ద్విచక్రవాహనాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ గుజరాత్‌లో మోడి గెలుపు దేశరాజకీయాలకు మలుపు అన్నారు. జరగబోయే 2014 ఎన్నికల్లో నరేంద్రమోడి నేతృత్వంలో బిజెపి అత్యధికస్థానాలు సాధిస్తుందన్నారు. నరేంద్రమోడిని ప్రధానమంత్రిగా చూడడానికి పార్టీ వర్గాలే కాకుండా భారతీయులందరూ కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు సుబ్రహ్మణ్యంయాదవ్, జిల్లా నాయకులు సుబ్రమణ్యంయాదవ్, నాయకులు లక్ష్మణ్, జయచంద్ర, జగన్మోహన్, మంజునాథ్, ప్రభాకర్, నాగరాజరాయల్, నాగినేని చంద్రయ్య, అశోక్, రవి, రాజారెడ్డి, మాణిక్యరాంపటేల్, శివ తదితరులు పాల్గొన్నారు.