తిరుపతి, డిసెంబర్ 20: ఓ వైపు క్రీడలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూ మరో వైపు మొండి చేతులు చూపిస్తూ క్రీడాకారులను నిరుత్సాహ పరుస్తున్నాయని ఆంధ్రా హాకీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం నుండి మూడురోజుల పాటు తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాకీ మైదానంలో ఆంధ్రా రాష్ట్ర జూనియర్ బాలికల అంతరాష్ట్ర హాకీ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడామైదానం కావాలంటే తమ నుండి రోజుకు 1200 రూపాయలు చెల్లించాల్సి వుంటుందని టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల అధికారులు కోరడం దురదృష్టకరమన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని ఒక్కరోజు ముందుగానే తమకు తెలియజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా క్రీడామైదానం కోరడానికి ఉన్నతాధికారులను కలిసే సమయం కూడా లేకుండా పోయిందన్నారు. అన్ని రకాల క్రీడా పోటీలకు టిటిడి క్రీడామైదానాలను ఉచితంగా కేటాయించి క్రీడలను ప్రోత్సహించే దిశగా టిటిడి యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడురోజుల పోటీలకు 3.50 లక్షల రూపాయలు వ్యయం అవుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం నుండి ఒక్కరూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఈనేపధ్యంలో హాకీ అభిమానులు, వ్యాపారస్తులు ముందుకువచ్చి సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో హాకీ క్రీడాభివృద్ధికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదని, అటు తరువాత 30లక్షలు ఇచ్చేదని, నేడు పూర్తిగా మొండి చేయి చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ క్రీడ అయిన హాకీపై కూడా పాలకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. అయినప్పటికి ఈ క్రీడాపోటీలను నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. కాగా మూడురోజుల పోటీల్లో 280 మంది బాలికల క్రీడాకారులు హాజరు అవుతున్నారని, వీరికి ఉచిత భోజనాన్ని అందిస్తున్నామన్నారు. లక్ష్మినారాయణ కల్యాణమండపం అధినేత వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నారన్నారు. విజేతలకు ఒకటి నుండి నాలుగు స్థానాలు కేటాయిస్తున్నామని గెలిచినవారికి 5వేల నుండి 1000 రూపాయల వరకూ బహుమానం అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు సురేంద్రరెడ్డి, వెంకటరమణ, మహేష్, శ్రీను, రూపసుందర్ పాల్గొన్నారు.
సిఎం, కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్
గంగాధరనెల్లూరు, డిసెంబర్ 20: మండల పరిధిలో ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖామంత్రి చిదంబరం పర్యటించనున్నారు. దీంతో గురువారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, ఎస్పీ కాంతిరాణాటాటాలు వేల్కూరును సందర్శించి అధికారులకు సూచనలు అందచేశారు. ఈ పర్యటనలో నగదు బదిలీ పథకంపై అవగాహన కల్పించడంతోపాటు ఇప్పటికే 90శాతం ఆధార్‌కార్డులను బ్యాంకు ఖాతాలతో జత చేయడం ఇప్పటికే పూర్తి అయిందని, దీంతో ఆ కార్యక్రమం ఏర్పాట్లను చర్చించనున్నారని ఇండియన్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
రొంపిచెర్ల పంచాయతీ కార్యాలయంపై దాడి
రొంపిచెర్ల, డిసెంబరు 20: రొంపిచెర్ల పంచాయతీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం దాడిచేసి కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఫైల్స్‌ను చిందర వందరగా పడేశారు. పంచాయతీ కార్యనిర్వహణాధికారి గఫూర్ మీద దౌర్జన్యకారులు దాడిచేసి కొట్టారు. కార్యాలయంపై జరిగిన దౌర్జన్యం గురించి గఫూర్ స్థానిక పోలీసులకు, అధికారులకు పిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గఫూర్ సిబ్బందితో కలిసి ఇఒ ఆఫీసు పక్కనున్న మీటింగ్‌హాలు వరండాలో కూర్చుని పింఛను జాబితాలో పింఛనుదారుల ఆధార్, రేషన్‌కార్డు నెంబర్లను పరిశీలిస్తున్నారు. సాయంత్రం 4గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఇఒ కార్యాలయంలో అరుపులు వినపడటంతో ఇఒ గఫూర్, జూనియర్ అసిస్టెంట్ చలపతి అక్కడికి వెళ్ళి గలాటా చేస్తున్నవారిని ఇక్కడ గలాటా చేయెద్దు బయటకు వెళ్ళిపోమని చెప్పారు. పాసుపుస్తకాల్లో తహశీల్దార్ వేయాల్సిన సీలు నువ్వు ఎట్లా వేస్తావని దౌర్జన్యకారులు ఈవోను నిలదీశారు. నేను సీలు వేయలేదు, నా దగ్గర ఆ సీలు కూడా లేదు చూసుకోండి అని ఈవో చెప్పినా దౌర్జన్యకారులు పట్టించుకోకుండా మూకుమ్మడిగా ఈవో మీద దాడిచేసి కొట్టారు. చొక్కా పట్టుకుని ఆఫీసులో నుంచి బయటకు లాక్కువచ్చారు. ఆఫీసులో ఉన్న ఈవో ఫర్నీచర్‌ను కిందపడేసి ధ్వంసం చేశారు. రిజిస్టర్లు, ఫైల్స్‌ను చిందరవందరగా పడేశారు. ఈవో కూర్చునే కుర్చీని కార్యాలయం వెలుపల పడేశారు. కార్యాలయం తలుపులు, కిటికీలు కాళ్ళతో తన్నుతూ దౌర్జన్యం చేసినట్లు గఫూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పంచాయతీ కార్యాలయంలో దౌర్జన్యానికి పాల్పడినవారిని మాజీ మండలాధ్యక్షుడు ఒకరు వచ్చి తీసుకువెళ్ళారు. పంచాయతీ కార్యాలయంపైన, ఈవోపైన దాడి గురించి తెలియగానే పెద్దసంఖ్యలో ప్రజలు , అధికారపార్టీ నాయకులు శిద్దారెడ్డి, చెంచురెడ్డి, ఇబ్రహీంఖాన్, చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిజరిగిన పంచాయతీ కార్యాలయాన్ని ఎస్సై సి.వి.నాయక్ పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటన గురించి పీలేరు సి.ఐ పార్థసారధి విచారించారు.