హైదరాబాద్, డిసెంబర్ 21: భారతదేశం ఆచార వ్యవహారాలతో కూడుకుందని, ఇందులో వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ఆదరించి, ప్రోత్సహించాలని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, సద్గురు శ్రీశ్రీశ్రీ కందుకూరి శివానందమూర్తి ఉద్భోధించారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ టివోలీగార్డెన్స్‌లో సద్గురు శివానంద మూర్తి పేరిట ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులు 2012’ ప్రదానోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. అయిదుగురు పురస్కార గ్రహీతలకు ఎమినెంట్ సిటిజన్ పురస్కారాల ప్రదానోత్సవానికి ముందు శ్రీశ్రీశ్రీ శివానందమూర్తి అనుగ్రహభాషణం చేస్తూ పురస్కార గ్రహీతలు మనదేశంలోనే గాక, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించారని అభినందించారు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ సామాజిక, ఆర్థిక, వైద్య, విజ్ఞాన, పరిశోధన, అణుశక్తి రంగాల్లో నిపుణులను, నిష్ణాతులను సత్కరించుకోవటం మన ధర్మమని ఆయన సూచించారు. వీరితో పాటు నేటి యువతరాన్ని కూడా విశ్వవిద్యాలయం స్థాయిలో వారికి ఆసక్తిగల రంగాల్లో సరైన విధంగా ప్రోత్సహిస్తే సత్ఫలితాలొస్తాయన్నారు.
అనంతరం శివానందమూర్తి చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్టసేవలందించిన అయిదుగురు ప్రముఖులకు ఎమినెంట్ సిటిజన్ అవార్డులను ప్రదానం చేసి, సత్కరించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పెన్ స్టేట్ స్టాటిస్టిక్ ప్రొఫెసర్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ప్రొ. సి.ఆర్. రావు ప్రసంగిస్తూ భారతదేశంలో ఎంతో మంది మేధావులు, శాస్తవ్రేత్తలు చేసిన కృషి ఫలితంగానే ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో మన దేశానికి మంచి పేరు, ప్రఖ్యాతలు దక్కాయన్నారు. గణితశాస్త్రంలో నాటి నుంచి దేశానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుందంటూ సి.వి.రామన్, మోక్షగుండం విశే్వశ్వరయ్యలను ఆయన గుర్తుచేశారు. నేటి తరంలో కూడా యువశాస్తవ్రేత్తలను ప్రోత్సహిస్తే వారు కూడా విశిష్ట సేవలందించే ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. కానీ మన దేశంలో సైన్స్, టెక్నాలజీ విభాగంలో యువశాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని సంస్థలు అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం సైన్స్, టెక్నాలజీ, గణితం, అణురంగంలో ముందుందని ఆయన తెలిపారు. నేడు పురస్కారాలను స్వీకరించిన వారంతా కూడా ఈ దేశానికి ఆయా రంగాల్లో ఉత్తమ సేవలందించటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకపాత్ర పోషిస్తుండటం అభినందనీయం అన్నారు.
అనంతరం సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కె. బసవరాజ్ ట్రస్టు కార్యకలాపాల గురించి నివేదికను సమర్పిస్తూ దేశంలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వారిని ఎంపిక చేసి ప్రతి ఏటా డిసెంబర్ 21న సత్కరించటం ఆనవాయితీ అని వివరించారు. గడచిన 19 సంవత్సరాల్లో ఇప్పటి వరకు వివిధ రంగాల్లో విశిష్టసేవలందించిన 119 మందికి ఈ పురస్కారాలను ప్రదానం చేసినట్లు తెలిపారు. మాజీ డిజిపి హెచ్.జె. దొర, ఆంధ్రభూమి వారపత్రిక న్యూస్ ఎడిటర్ ఎ.ఎస్.లక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రదానోత్సవానికి ముందు సంపత్ ఆచార్య సంగీత కచేరీ, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
అవార్డు గ్రహీతలు
వైద్య రంగానికి సంబంధించి కార్డియాలజీ విభాగంలో వైద్య నిపుణురాలు డా. ఎస్. పద్మావతి, న్యాయశాఖకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య, అలాగే వైజ్ఞానిక రంగంలో భాగంగా సుప్రసిద్ధ ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్టు డా. అనిల్ కకోడ్కర్, మెటలార్జికల్ విభాగంలో అనేక పరిశోధనలు చేసి పేరుగాంచిన సైంటిస్టు డా. శ్రీకుమార్ బెనర్జీ, స్పేస్ కమిషన్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగ కార్యదర్శి గానే గాక, భారత జాతీయ సునామీ హెచ్చరికల వ్యవస్థకు మొట్టమొదటి ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులైన డా.కె.రాధాకృష్ణన్‌లు ‘శివానంద ఎనిమెంట్ సిటిజన్ అవార్డు 2012’లను స్వీకరించి, తమ స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన తరపున ప్రత్యేకంగా సత్కరించి, తిరుమల ప్రసాదాన్ని అందజేశారు.
...................
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సద్గురు కందుకూరి శివానందమూర్తి. స్పేస్ కమిషన్ చైర్మన్ డా.కె. రాధాకృష్ణన్,
సుఫ్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య, సుప్రసిద్ధ న్యూక్లియర్ సైంటిస్టు డా. అనిల్ కకోడ్కర్, వైద్య నిపుణురాలు డా. ఎస్. పద్మావతి, శాస్తవ్రేత్త డా. శ్రీకుమార్ బెనర్జీలకు అవార్డులను బహూకరిస్తున్న దృశ్యం
ఎమినెంట్ సిటిజన్ అవార్డుల ప్రదానోత్సవంలో సద్గురు శివానందమూర్తి
english title:
p
Date:
Saturday, December 22, 2012