మదురై, డిసెంబర్ 23: సిపాయి తిరుగుబాటుకు వందేళ్ల ముందే బ్రిటీష్ పాలనను దక్షిణ భారతీయులు వ్యతిరేకించినప్పటికీ స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్రను చరిత్రకారులు సరిగా వెలుగులోకి తేలేదని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆదివారం ఇక్కడ అన్నారు. 17-18 శతాబ్దానికి చెందిన తొలి స్వాతంత్య్ర పోరాటంగా భావించే తిరునల్వేలి జిల్లాలోని వీరన్ అళగు ముత్తు కోనె జరిపిన పోరాటంపై 20 నిమిషాల డాక్యుమెంటరీని ఆయన విడుదల చేస్తూ, ఇప్పటికీ పాఠ్య పుస్తకాల్లో సైతం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తొలి స్వాతంత్య్ర పోరాటంగా సిపాయి తిరుగుబాటును మాత్రమే పేర్కొంటున్నాయని ఆయన అన్నారు. అయితే దానికన్న వందేళ్ల ముందే కోనె బ్రిటీష్ ప్రతినిధికి వ్యతిరేకంగా పోరాడాడని ఆ తర్వాత వీరపాండ్య కట్టబొమ్మన్, పులితేవన్ లాంటి పాళెగాళ్లు వారికి వ్యతిరేకంగా పోరాటం చేసారని చిదంబరం చెప్పారు. అయితే ఈ పోరాటాలకు చరిత్రలోతగిన స్థానం లభించలేదని ఆయన ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ప్రభుత్వ డాక్యుమెంట్లు స్థానిక చరిత్రకారులు, వారు రాసిన వ్యాసాల వల్ల మాత్రమే ముత్తు కోనెలాంటి అమరవీరులు జరిపిన పోరాటాల గురించి మనం తెలుసుకోగలుగుతున్నామని చిదంబరం అన్నారు. 1789లో బ్రిటీష్ సామ్రాజ్య ప్రతినిధిని వ్యతిరేకించినందుకు ముత్తు కోనె, మరో ఏడుగురిని ఫిరంగికి కట్టి దారుణంగా కాల్చి చంపారు. అంతేకాకుండా వందలాది మంది చేతులను నరికేసారు. ‘దేశ స్వాతంత్య్రం కోసం మొదటగా రక్తం చిందిచిన వారు తమిళులయినందుకు మనమంతా ఎంతో గర్వించాలి’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా స్వాతంత్య్ర పోరాటం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఒకటుందని, అదే మనమంతా కలిసికట్టుగా ఉండాలనేది అని ఆయన అంటూ, ఈ దేశాన్ని పాలించడానికి, పన్నులు వసూలు చేయడం లాంటివి చేయడం కోసం బ్రిటీష్ వాళ్లు భారతీయులను, లేదా తమ చేతిలో కీలుబొమ్మల్నే ఉపయోగించుకున్నారని చెప్పారు. బ్రిటీష్ వాళ్లతో పోరాడడానికి యాదవుడైన కోనె కత్తీ, డాలు చేపట్టాడని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.
చిదంబరం విమర్శ
english title:
s
Date:
Monday, December 24, 2012