భోపాల్, డిసెంబర్ 23: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరయిన ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రశంసల వర్షం కురిపించి మరో వివాదానికి ఆజ్యం పోశారు. గుజరాత్‌లో పోషకాహార లోపం సమస్య అత్యంత నిరుపేద దేశాలుగా పేరుగాంచిన సోమాలియా లాంటి దేశాలకన్నా చాలా ఎక్కువగా ఉందని కట్జూ అంటూ, ఇందుకు మద్దతుగా గణాంకాలను సైతం ఉదహరించారు. గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి అంతా కూడా అబద్ధమని, ఎందుకంటే ఆ అభివృద్ధి సామాన్యుడికి ఏ విధంగాను మేలు చేయడం లేదని ఆయన అన్నారు. ‘2002లో గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణల కారణంగా మోడీపై పడిన మచ్చ తొలగిపోయే దారి కూడా లేదు’ అని ఆయన ఆదివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. గుజరాత్‌లో అభివృద్ధి గురించి మోడీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే వాస్తవానికి అక్కడ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పటికీ చాలా దారుణంగా ఉన్నాయని కట్జూ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి మోడీ విజయం సాధించడం గురించి మీరేం అనుకుంటున్నారని అడగ్గా, ఈ రోజుల్లో దేశంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి మచ్చా లేదని కూడా ఆయన అన్నారు. మోడీ చాలా గొప్పగా చెప్పుకొంటున్న అభివృద్ధి తమకు ఏమాత్రం ఉపయోగపడదనే విషయాన్ని గుజరాత్ ప్రజలు గ్రహించే రోజు వస్తుందని ఆయన అన్నారు.
తాను రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చౌహాన్‌ను కలిసి ఇక్కడ జరిగే ఓ ముషాయిరా (ఉర్దూ కవి సమ్మేళనం)లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించానని, ఆయన పావు గంట సేపు మాత్రమే పాల్గొంటానని చెప్పారని కట్జూ చెప్పారు. అయితే కార్యక్రమానికి వచ్చిన తర్వాత చౌహాన్ 50 నిమిషాల పాటు ఉండిపోయారని, అంతేకాకుండా ఉర్దూ కవిత్వాన్ని ప్రశంసించారని కూడా ఆయన చెప్పారు. ‘చౌహాన్ చాలా నిజాయితీపరుడు, వినమ్రుడైన వ్యక్తి అని నాకు అనిపించింది’ అని కూడా కట్జూ అన్నారు.
మోడీ అభివృద్ధి అంతా బూటకం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కట్జూ ధ్వజం
english title:
g
Date:
Monday, December 24, 2012