న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జనవరి 1నుంచి అమలుకానున్న నగదు బదిలీ పథకం (డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ - డిసిటి) లబ్ధిదారులను ఆధార్ కార్డుతో సిద్ధం చేయాలని ప్లానింగ్ కమిషన్ 43 జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ పథకాన్ని అమలుచేసేందుకు దేశవ్యాప్తంగా 43 జిల్లాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఈ 43 జిల్లాల్లో నగదు బదిలీ పథకం తొలి దశ జనవరి 1నుంచి ప్రారంభం కానుంది. లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగివుండాలని, వారిని పథకం ప్రారంభానికి ముందే గుర్తించి సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని ప్లానింగ్ కమిషన్ ఆదేశించింది. అయితే డిసిటి అమలు కోసం గుర్తించబడిన జిల్లాల్లో కొంతమందికి ఆధార్ కార్డు అందకపోవడం, బ్యాంక్ ఖాతాలు లేకపోవడం వంటి అడ్డంకులు ఉన్నాయని గుర్తించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణను సంబంధిత జిల్లా కలెక్టర్ రూపొందించుకోవాలని ప్లానింగ్ కమిషన్ పేర్కొంది. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేని లబ్ధిదారులను గుర్తించి వాటిని పొందే విధంగా ప్రచారం నిర్వహించాలని కూడా సూచించింది. పథకం ప్రారంభానికి ముందుగానే జిల్లా యంత్రాంగాలు పూర్తిచేయాల్సిన పనుల్ని నిర్దేశించింది. లబ్ధిదారుని డేటాబేస్‌ను డిజిటలైజ్ చేయడం, దాన్ని ఆధార్ కార్డు డేటాబేస్‌తో జతచేయాలని పేర్కొంది. ఆధార్ కార్డు లేని లబ్ధిదారుడ్ని యుఐడిఎఐ రిజిస్ట్రార్ వద్ద నమోదుచేసుకోవడం, బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయడం వంటి పనులు పూర్తిచేయాలని సూచించింది. ఒకవేళ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా లేనిపక్షంలో ఖాతాలు తెరిచే విధంగా వారికి సహకరించాలని సూచించింది. కొత్తగా తెరిచిన బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని పేర్కొంది. ఆధార్ సభ్యత్వం తీసుకునేలా, బ్యాంకు ఖాతాలు తెరిచేలా లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రచారాన్ని చేపట్టాలని కూడా సూచించింది. నగదు బదిలీ కార్యక్రమం కింద 34 పథకాలు చేరనున్నాయి.
అధికారులకు గట్టి ఆదేశాలు
english title:
n
Date:
Monday, December 24, 2012