న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంపై బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఎస్‌సిలకు మాత్రమే పరిమితం కాదని, వెనుకబడిన వర్గాలకూ ఆ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టంచేశారు. పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టి ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్ల సదుపాయాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వ విధానాలను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడిన మాయావతి..ఇదే ప్రయోజనాలను వెనుకబడిన తరగతులకు లభించేందుకు కావాల్సిన ప్రత్యేక బిల్లు అవసరమని దానికి తాము మద్దతిస్తామని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేష్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా మాయావతి విమర్శల వర్షం కురింపించారు. సచార్ కమిటీ సిఫార్సులకు అనుకూలంగా, సమాజ్‌వాదీ పార్టీని లక్ష్యంగా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లీంలకు 18 శాతం వాటాను ఇస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో అఖిలేష్ ప్రభుత్వం విఫలమైందన్నారు. శీతాకాల సమావేశాలు ముగుస్తాయనగా పార్లమెంట్‌లో ఒబిసి కోటా అంశాన్ని సమాజ్‌వాదీ పార్టీ లేవనెత్తిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ముస్లీం కోటా విషయాన్ని ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లీంలకు 18 శాతం రిజర్వేషన్‌ను సమాజ్‌వాదీ పార్టీ కల్పించలేకపోయిందన్నారు. ఉన్నత వర్గాలు ప్రయోజనం పొందడం సమాజ్‌వాదీ పార్టీకి అస్సలు ఇష్టం లేదని, ఉన్నత కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా ఆ పార్టీ విధించిన నిషేధాన్ని తమ హయాంలో ఎత్తివేశామని గుర్తుచేశారు. ఉన్నత కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు అవసరమన్న ఆమె అందుకు కూడా తమ పార్టీ అనుకూలంగా ఉంటుందన్నారు. అఖిలేష్ పాలనలో న్యాయం కనుమరుగైందని, లా అండ్ ఆర్డర్ అన్ని స్థాయిలలో అదుపు తప్పిందని, పోలీసులు కూడా కేసులను నమోదు చేసుకోవడం లేదంటూ ప్రజలు తనతో మొర పెట్టుకుంటున్నారని మాయావతి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మద్దతుకు మాయావతి హామీ
english title:
b
Date:
Monday, December 24, 2012