ఇంపాల్, డిసెంబర్ 23: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ విలేఖరి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సినీనటితో అసభ్యకరంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్ అరెస్టుకు డిమాండ్ చేస్తూ సినీ పరిశ్రమ వర్గాలు పిలుపునిచ్చిన నిరవధిక బంద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఇంపాల్ జిల్లా సమీపంలోని తంగ్మైబంద్ ప్రాంతంలో ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని తగులబెట్టడమేగాక, వాహన రాకపోకలకు అడ్డుతగులుతుండంతో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో నానౌ సింగ్(29) అనే విలేఖరి మృతి చెందినట్లు ఇక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రైమ్ న్యూస్’ అనే వార్తా పత్రికకు నానౌ సింగ్ విలేఖరిగా వ్యవహరిస్తున్నాడు. పోలీసుల కాల్పుల్లో నానౌ సింగ్ ఛాతి భాగంలో బుల్లెట్ దిగగా, ఇక్కడి ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కాగా, విలేఖరి మృతి చెందిన వార్తా మణిపూర్ లోయ ప్రాంతాల్లోని పలుచోట్ల హింసకు దారి తీసింది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ ఇంపాల్ జిల్లాల్లో భారీగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, అక్కడి అధికారులు తెలిపారు. విలేఖరి మృతితో ఆస్పత్రికి చేరుకున్న మణిపూర్ హోంమంత్రి విచారం వ్యక్తంచేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులకు సహకరించాల్సిందిగా ఆందోళనకారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్న జర్నలిస్టులు మృతదేహాన్ని మణిపూర్ ప్రెస్‌క్లబ్‌కు తరలించారు.
మణిపూర్ బంద్‌లో దుర్ఘటన
english title:
p
Date:
Monday, December 24, 2012