రాజమండ్రి, డిసెంబర్ 24: సహకార సంఘంలో సభ్యత్వం పొందేందుకు చెల్లించాల్సిన షేరు ధనం పూర్తిగా చెల్లించని వారు మిగిలిన సొమ్ము చెల్లించి, ఓటు హక్కు పొందడానికి జనవరి 4వ తేదీ వరకు మరో అవకాశాన్ని సహకార శాఖ ఇచ్చింది. సహకార సంఘంలో షేరు ధనం రూ.300 చెల్లించిన వారికి మాత్రమే ఓటు హక్కు కలిగిన సభ్యత్వం లభిస్తుందన్న సంగతి విదితమే. భూమి యజమాని లేదా కౌలు రైతులతో పాటు నిర్ణీత డిపాజిట్ కలిగిన వారు ఇలాంటి రూ.300 షేరు ధనం చెల్లించి ఓటు హక్కుతో కూడిన సభ్యత్వాన్ని పొందవచ్చు. కానీ కొంత మంది పాత కాలం నాటి సభ్యులు రూ.300 షేరు ధనం చెల్లించలేదు. గతంలోని సహకార నిబంధనల ప్రకారం కొంత మంది రూ.10, మరికొంత మంది రూ.100 షేరు ధనాన్ని మాత్రమే చెల్లించారు. అలాంటి వారు ప్రస్తుతం షేరు ధనం ఎంత ఉందో చూసి, మిగిలిన షేరు ధనం ఎంత చెల్లించాలో ఆయా సహకార సంఘాల్లోని కార్యదర్శులు చెబుతారని, దానికి అనుగుణంగా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే సభ్యత్వం లభిస్తుందని తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారి కిషోర్ ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. ఇలాంటి తక్కువ షేరు ధనం కలిగిన సభ్యులు పూర్తి షేరు ధనాన్ని చెల్లించడానికి జనవరి 4వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అయితే ఇలాంటి వారు కూడా అన్ని అర్హతలు కలిగి ఉండాలన్నారు. భూ యజమాని, కౌలు రైతు, డిపాజిట్‌దారు తదితర అర్హతల్లో ఏదో ఒక అర్హత ఉంటేనే మిగిలిన షేరు ధనాన్ని చెల్లించి, ఓటు హక్కుతో కూడిన సభ్యత్వాన్ని పొందే అవకాశం లభిస్తుందని డిసిఓ కిషోర్ చెప్పారు. కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఈ నెల 21వరకు విధించిన గడువు ముగియటంతో తుది ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో సహకార సంఘాల అధికారులు ఉన్నారు. ఎన్నికలు జరగనున్న సహకార సంఘాలకు ఈ నెల 21వ తేదీనే ఎన్నికల అధికారుల నియామకం కూడా జరిగిపోవటంతో, బాధ్యతలు స్వీకరించిన అధికారులు ఓటర్ల జాబితాలను స్వాధీనంచేసుకునే పనిలో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఒకటి రెండు రోజుల్లో ఓటర్ల జాబితాలన్నీ ఎన్నికల అధికారుల చేతుల్లోకి రానున్నాయి. ఎన్నికల అధికారుల నియామకం ద్వారా సహకార ఎన్నికల ప్రక్రియ దాదాపు మొదలైనప్పటికీ, ఇప్పటికీ ఇంకా సభ్యుల ఓటు హక్కు అర్హతపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. సహకార సంఘం నుండి అప్పు తీసుకున్న సభ్యుడు గడువు తీరిన తరువాత ఏడాది వరకు చెల్లించకపోయినప్పటికీ ఓటు హక్కుకు అర్హుడిగానే సహకార చట్టం చెబుతోంది. అయితే అర్హతనుగానీ, అనర్హతనుగానీ ఏ ప్రాతిపాదికన అమలుచేయాలి? అప్పు తీసుకున్నప్పటి నుండి ఏడాది గడువుగా పరిగణించాలా? లేక బకాయి చెల్లించేందుకు ఇచ్చిన అవకాశం ఎప్పటి వరకు ఉందో, అప్పటి నుండి ఏడాదిగా పరిగణించాలా? తదితర అనుమానాలు ఇంకా సహకార శాఖ అధికారుల్లో ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తాను తీసుకున్న రుణాలను, ఎప్పటిలోపు తిరిగి చెల్లించాలి? బకాయిపడ్డ సభ్యుడికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుందా? లేదా? తదితర అంశాల్లో ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది.
తక్కువ షేరు ధనం కలిగిన వారికి 4 వరకు గడువు
english title:
s
Date:
Tuesday, December 25, 2012