కాకినాడ, డిసెంబర్ 24: రహదారి సౌకర్యం సక్రమంగా లేక కునారిల్లుతున్న రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని ఆవాసాలకు పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయ్యింది. గిరిజన ప్రాంతాలు మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరంతరాయంగా గస్తీ నిర్వహించాలన్నా, ఇతర ప్రాంతాలతో గిరిజనులు మమేకం కావాలన్నా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికార్లు ఏజన్సీ ప్రాంతాలకు నిర్భయంగా రాకపోకలు సాగించాలన్నా అందుకనుగుణంగా వౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యతను ప్రభుత్వం ఐఎపికి అప్పగించింది. దీంతో అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సంబంధిత శాఖల అధికార్లు సిద్ధం చేశారు. ఐఎపి ఇప్పటికే జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. వీటితో పాటు నాబార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నిధులతో ఏజన్సీ ప్రాంతంలో ఒక ఆవాసం నుండి మరో ఆవాసానికి, అంతర్ మండల, అంతర్ జిల్లా రోడ్ల విస్తరణకు ఐటిడిఎ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, పోలీస్, అటవీ శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు మాస్టర్‌ప్లాన్లను వచ్చే జనవరి 15వ తేదీలోగా ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. కాగా రాష్ట్రంలో అతిపెద్ద ఏజన్సీ ప్రాంతాన్ని కలిగివున్న తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలోని మండలాల్లో కనీసస్థాయిలో రహదారి సౌకర్యాలు లేని సుమారు 94 సమస్యాత్మక ఆవాసాలను ఐఎపి గుర్తించింది. ఈ ఆవాసాలను ప్రస్తుతం ఉన్న రహదార్లతో అనుసంధానించడానికి 342 కిలోమీటర్ల పొడవున 177 కోట్ల అంచనాతో 35 రహదార్ల పనులు చేపట్టాలని అధికార్లు ప్రతిపాదించారు. అలాగే నిరంతరాయంగా గస్తీ నిర్వహించే భద్రతా దళాలకు ఈ రహదారులు మరింత సౌకర్యాన్ని ఇవ్వనున్నాయి. రోడ్డు కనెక్టివిటీ లేని 494 ఆవాసాలను రోడ్లతో సంధానపర్చడానికి 410 పనులను మాస్టర్‌ప్లాన్ కింద ప్రతిపాదించారు. 1982.39 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి 890 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. నాబార్డు పథకం కింద 15 కోట్లు, జిఎంజిఎస్‌వై కింద 5 కోట్ల నిధులుండగా మిగిలిన నిధులను ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద సమకూర్చుకునే విధంగా ప్రతిపాదించారు. ఏజన్సీ మండలాలకు అంతర మండలాల అనుసంధానంతో పాటు పొరుగు జిల్లాలకూ అనుసంధానించేలా రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అధికార్లు సిద్ధంచేస్తున్నారు.
ఐఎపి కార్యాచరణ ప్రణాళిక
english title:
a
Date:
Tuesday, December 25, 2012