అనంతపురం, డిసెంబర్ 24: ఈ నెల 28న ఢిల్లీలోనిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ముందు యుపిఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని గణే నాయక్ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయకుండా ఎన్ని సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం నిర్వహించే సమావేశం మొక్కుబడికో తెలంగాణ ఎంపిలను బుజ్జగించడానికో అర్థం కావడం లేదన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే సిపిఎం పార్టీ మూడు ప్రతిపాదనలతో కేంద్ర హోం మంత్రికి లేఖలు రాసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో సహా స్పష్టమైన వైఖరిని ప్రకటించని టిడిపి, వైకాపాలతో ద్వైపాక్షిక చర్చలు జరపాలన్నారు. 28 జరిగే అఖిలపక్షం తరువాత మరో సమావేశానికి అవకాశం లేకుండా పార్లమెంటు ముందు ప్రతిపాదన ఉంచాలని తెలంగాణ నేతలు పట్టుబట్టాలన్నారు. కేంద్రాన్ని నిలదీయడం ద్వారానే న్యాయం జరుగుతుందన్నారు. తమ పార్టీ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేదీ లేనిదీ ఇంకా నిర్ణయించలేదన్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాఘవులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో వౌలికమైన మార్పులు చేపట్టే ముందు అన్ని పార్టీలతో ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ సొత్తుకాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమన్నారు. దీనిపై అఖిలపక్షం వేయాలని లేదా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్‌లతోచర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. శాసనసభ సమావేశాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. సమావేశాల నుంచి పారిపోవడానికి ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మోపిదేవి వెంకటరమణతోపాటు ధర్మాన ఇతర మంత్రులను విచారించాలన్నారు. 2013లో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయని ఇప్పటికే సర్‌చార్జీలు, ఇతర చార్జీల పేరుతోప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కోసం పోరాటానికి దిగక తప్పడం లేదన్నారు. భూమి, విద్యుత్ సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితోకంపుకొడుతోందన్నారు. మహిళా కమిషన్‌ను భ్రష్టుపట్టించారన్నారు. ఎపిపిఎస్సీని అవినీతిమయం చేశారని దుయ్యబట్టారు. సమావేశంలోసిపిఎం జిల్లా కార్యదర్శి జి ఓబుళ కొండారెడ్డి పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
english title:
a
Date:
Tuesday, December 25, 2012