భద్రాచలం, డిసెంబర్ 24: మహా పవిత్రదినంగా భావించే ముక్కోటి ఏకాదశినాడు కలియుగ వైకుంఠంగా భాసిల్లుతోన్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులకు కలియుగ శ్రీవైకుంఠుడిగా దర్శనమిచ్చాడు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణలు, ధూపదీపాల నడుమ జయ జయ ధ్వానాలు మార్మోగుతండగా స్వామి వారి దర్శనం కోసం భక్తజనావళి రామనామ స్మరణలతో కళ్లలో ఒత్తులు పెట్టుకుని నిరీక్షించారు. మంగళహారతులు, మేళతాళాల మధ్య సరిగ్గా 5 గంటలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వారం నుంచి జగదభిరాముడు దర్శనం ఇవ్వడంతో భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. తమ ఆరాధ్య దైవమైన స్వామి వారిని గరుడ వాహనంపై మహావిష్ణువు రూపంలో కనులారా తిలకించి పునీతులయ్యారు. ఉత్తరద్వారంలో కొలువైన భద్రాద్రి చతుర్భుజ రాముడిని దర్శించుకునేందుకు వేకువజామునే భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్తరద్వారం వద్దకు చేరుకున్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే ఏకకాలంలో ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో 108 ఒత్తులతో స్వామి వారికి సేజ్యహారతిని ఇవ్వగా భక్తులంతా కళ్లకు అద్దుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గరుడ వాహనంపై రామయ్య, హనుమద్ వాహనంపై లక్ష్మణుడు, గజవాహనంపై సీతమ్మవార్లను ఆశీనులను చేసి తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభ ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, వగ్గెల మిత్రసేన, జిల్లా కలెక్టర్ జైన్, ఐటిడిఎ పీఓ జి వీరపాండియన్, దేవస్థానం ఇఓ కె రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలం, డిసెంబర్ 24: భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లను దర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సోమవారం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రం పోటెత్తింది. వరుసగా సెలవు దినాలు రావడంతో స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులతో రద్దీగా మారింది. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించినట్లు అధికారులు తెలియజేశారు. సోమవారం ఉదయం నల్గొండ జాయింట్ కలెక్టర్ హరి జవహర్‌లాల్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవస్థానం ఎఇవో రాజశేఖర్ ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఆది దంపతుల దర్శనం తరువాత స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు.
ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్న వైకుంఠ రాముడు