మెదక్, డిసెంబర్ 24: కల్లు దుకాణాల లైసెన్సు రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సిఐ, ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఎసిబి) చేతికి చిక్కారు. 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా మెదక్ సిఐ పాత్లోత్ లక్ష్మి, ఎస్‌ఐ సత్యనారాయణలను మెదక్-నిజామాబాద్ జిల్లాల ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెదక్ కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి చెందిన రామాస్వామి కుమార్‌గౌడ్, విఠల్‌గౌడ్‌తో పాటు ఇతరులకు సంబంధించిన నాలుగు కల్లు దుకాణాల లైసెన్సులు రెన్యువల్ చేసేందుకు మెదక్ ఎక్సైజ్ సిఐ లక్ష్మి, ఎస్‌ఐ సత్యనారాయణ లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగారు. దీంతో 35 వేల రూపాయల లంచం ఇవ్వడానికి బాధితులు అంగీకరించి ఈ నెల 18న 10 వేల రూపాయలు అందజేశారు. మిగతా డబ్బులు ఇవ్వలేక బాధితులు తమను ఆశ్రయించినట్లు ఎసిబి డిఎస్‌పి శంకర్‌రెడ్డి తెలిపారు. బాధితుల నుండి తీసుకున్న 25 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు సిఐ, ఎస్‌ఐని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్న అధికారులు
english title:
acb
Date:
Tuesday, December 25, 2012