సింహాచలం, డిసెంబర్ 24: పరమ పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులపై లాఠీచార్జి చేయడం దారుణమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వచ్చిన భక్తుల పట్ల తిరుమల పాలకులు అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అన్యమతాల ప్రభావం పెరిగిపోతున్న తరుణంలో హిందువుల పట్ల ఇలా ప్రవర్తించడం తగదన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి తీసుకుంటున్న చర్యలు అభినందించదగ్గవే అయినప్పటికీ ధర్మ పరిరక్షణకు మరింత చొరవ తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. సంప్రదాయాలను, శాస్త్రాలను చిత్తశుద్ధితో పాటించే సింహాచల పుణ్యక్షేత్రంలో ముక్కోటి ఏకాదళి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు.
చిత్రం... సింహాచలంలో ఉత్తర ద్వార దర్శనానికి వస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి