కూచిపూడి, డిసెంబర్ 24: ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్దేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రధాన నాట్యాచార్యుడు డాక్టర్ వేదాంతం రామలింగశాస్ర్తీ ఈ ఏడాది కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. జూలై 3, 1963న కృష్ణాజిల్లా కూచిపూడిలో సత్యవతమ్మ, సూర్యనారాయణ శర్మకు జన్మించారు. ఈయన ఎంఎ పిహెచ్‌డి అభ్యసించారు. నటుడిగా, నృత్య దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా కూచిపూడి నాట్యంలోని అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. ప్రతినాయక పాత్రలో ఈయన చూపించే హావభావాలు ఆయా పాత్రలకు జీవం పోశాయి. ఈయన ప్రతినాయకుడైన కీచకుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, హిరణ్యకస్యపుడు, అలాగే శివుడు, నరసింహస్వామి, నారదుడు, గజాసురుడు వంటి దేవతా పాత్రల్లోనూ, అమరజీవి పొట్టి శ్రీరాములుగా, పింగళి వెంకయ్యగా, గౌతమ బుద్ధుడిగా ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఈయనకు రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు ఉగాది పురస్కారాలు అందజేసింది. నటరత్న అవార్డును, ఉత్తమ నాట్యాచారుడు అవార్డులను సౌత్ సెంట్రల్‌కు చెందిన లలిత కళాసమితి అందజేసింది. రామకృష్ణ పరమహంస అవార్డును అందుకున్నారు. 1974 నుండి పలు సంస్థల నుండి దేశ విదేశాల ప్రశంసా, సత్కారాలను అందుకున్నారు. 1998లో సిరియా దేశంలో 18 రోజులు పర్యటించారు. 2002లో లండన్‌లో నిర్వహించిన ఈట మహాసభల్లో ప్రదర్శన ఇచ్చారు. ఈయన 5వ ఏట నుండే వంశపార్యపరంగా వస్తున్న కూచిపూడి నాట్యాన్ని సోదరుడు నాట్యాచారుడైన వేదాంతం రాధేశ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించారు. కీర్తిశేషులు వేదాంతం పారదీశం, సినీ నృత్య దర్శకులు వెంపటి పెదసత్యం, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. 1984లో వేదాంతం కూచిపూడి కళాపరిషత్ స్థాపించి వందలాది మంది ఔత్యాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చారు.
తిరుమలలో బ్లాక్ టికెట్ల జోరు
పోలీసులకు పట్టుబడిన టిటిడి ఉద్యోగి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, డిసెంబర్ 24: వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఒక్కో విఐపి టిక్కెట్టును ఐదు వేల నుండి 10 వేలకు విక్రయించిన ఘనులుంటే చిన్న ఉద్యోగులు తమ స్థాయికి తగ్గట్లుగా 300 రూపాయల టిక్కెట్లను 1500 రూపాయల నుండి 2 వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఒక ప్రముఖ మీడియా కన్నువేయడంతో సుధాకర్ అనే టిటిడి స్టోర్ కీపర్ ఆరు టిక్కెట్లను 10 వేలకు విక్రయించడం వెలుగు చూసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదువేల రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకున్న సుధాకర్ టిక్కెట్లు తీసుకువచ్చే సమయంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంపై టిటిడి సివిఎస్‌ఓ అశోక్‌కుమార్ ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు.
నేడు తిరుపతికి సిఎం
తిరుపతి, డిసెంబర్ 24: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తిరుపతికి వస్తున్నట్లు అనధికార సమాచారం. ఉదయం ఆయన తిరుపతికి చేరుకుని అధికారులతో సమీక్షించి ఏర్పాట్లను పరిశీలించి తిరిగి వెళతారని సమాచారం.
మావోల తలలపై పెరిగిన రివార్డులు
పాడేరు, డిసెంబర్ 24: మావోయిస్టు దళాల్లో పనిచేస్తున్న నాయకులు, సభ్యుల తలలపై రివార్డులు గణనీయంగా పెరిగాయి. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్‌ను, సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌ను రూరల్ జిల్లా ఎస్‌పి జి శ్రీనివాసరావు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు లొంగిపోయేందుకు ఇదే మంచి తరుణమన్నారు. సెంట్రల్ కమిటీలో ఉండే వారికి 25 లక్షలు, రాష్ట్ర కమిటీలోని వారికి 20 లక్షలు, రీజినల్ కమిటీలోని వారికి 10 లక్షలు, డివిజన్ కమిటీ సభ్యులకు ఎనిమిది లక్షలు, డిప్యూటీ కమాండర్ స్థాయి వారికి ఐదు లక్షలు, ఎల్‌జిఎస్ కమాండర్‌కు నాలుగు లక్షలు, ఎల్‌జిఎస్ డిప్యూటీ కమాండర్‌కు మూడు లక్షలు, మిలటరీ విభాగంలోని సభ్యులకు రెండు లక్షలు, దళ సభ్యులకు లక్ష, మిలీషియా సభ్యులకు ఐదు వేల రూపాయల వంతున రివార్డులను ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ఎవరేంటో 28న తేలిపోతుంది
ఎంపి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 24: తెలంగాణ అంశంపై ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో తేలిపోతుందని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం స్ధానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో చేపట్టిన పాదయాత్రలో తెలంగాణపై చెప్పిన మాటలే అఖిలపక్ష సమావేశంలో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగా కాంగ్రెస్ వైఖరి చెప్పాలంటూ దాటవేసే ప్రయత్నం మాత్రం చేయవద్దని కోరారు. అలాగే తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిన వైఎస్సార్‌సిపి కూడా అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీలో స్పష్టమైన వైఖరి చెప్పకపోతే కాంగ్రెస్‌తోసహా అన్ని పార్టీల నాయకులెవర్నీ తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.
నేడు టి-న్యాయవాదుల చలో సంగారెడ్డి
పోలీసుల అప్రమత్తం
సంగారెడ్డి,డిసెంబర్ 24: గత కొంతకాలంగా తెలంగాణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డిపై తెలంగాణ న్యాయవాదులు దాడిని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యలో చలో సంగారెడ్డి కార్యక్రమం నిర్వహించి జయప్రకాష్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన అడ్వకేట్లు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. అయితే, జగ్గారెడ్డి మాత్రం ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో లేకపోవడం విశేషం.
తాను లేని సమయంలో తన ఇంటి ముట్టడికి ప్రయత్నిస్తే గట్టిగా సమాధానం చెబుతామని జగ్గారెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. కాగా, న్యాయవాదులు చలో సంగారెడ్డి కార్యక్రమం సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భారీ సంఖ్యలో జిల్లా యంత్రాంగం పోలీసు బలగాలను మోహరింప చేస్తోంది.