అలహాబాద్/ వారణాసి, డిసెంబర్ 25: ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మహిళల పట్ల చులకన భావం కారణంగా వారిపై ఇలాంటి అమానుష దాడులు జరుగుతున్నాయని, అందువల్ల మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని, వారు దేశాభివృద్ధికి తమ వంతు సేవలు అందించేందుకు అనువైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సమర్థనీయమే అయినప్పటికీ హింస సమస్యకు పరిష్కారం కాదని రాష్టప్రతి మంగళవారం అలహాబాద్‌లో మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ 9వ స్నాతకోత్సవంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసనల సమయంలో గాయపడిన కానిస్టేబుల్ మృతి చెందడంపైనా ఆయన విచారం వ్యక్తం చేసారు. పరిస్థితి పట్ల ప్రభుత్వం అప్రమత్తమైందని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. ఎంతో గుండెధైర్యాన్ని ప్రదర్శించిన బాధితురాలు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. సమాజంలోని కొన్ని వర్గాలు మహిళల పట్ల ప్రచారం చేస్తున్న చులకన భావం కారణంగానే వారిపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ప్రణబ్ అన్నారు.
అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టప్రతి మాట్లాడుతూ, అత్యంత దారుణమైన ప్రతికూల పరిస్థితుల్లోను ఎంతో గుండె ధైర్యాన్ని ప్రదర్శించిన బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఢిల్లీలోను, ఇతర నగరాల్లోను యువకులు వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని, మహిళల భద్రతకు బలమైన చర్యలు తీసుకోవాలని, మన మహిళలకు ముప్పుగా పరిణమించే నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించడానికి వీలుగా మరింత కటిన మైన చట్టాలు చేయాలని డిమాండ్ చేయడాన్ని దేశ ప్రజలంతా చూసారన్నారు.
మహిళలకు రక్షణ కల్పించడానికి అన్ని చర్యలనూ తీసుకుంటామని ప్రధానమంత్రి సైతం హామీ ఇచ్చారని రాష్టప్రతి అన్నారు. ‘మీ ఆవేదన, ఆగ్రహం న్యాయమైనవే. అయితే హింసద్వారా ఏమీ సాధించలేమనే విషయాన్ని మరిచిపోవద్దు. మహిళల పట్ల చులకన భావాన్ని మార్చడానికి ఒక సమాజంగా మనమంతా కృషి చేద్దాం’ అని ఆందోళనకారులనుద్దేశించి ప్రణబ్ అన్నారు.
చులకన భావం వద్దు.. హింస పరిష్కారం కాదు యువతకు రాష్టప్రతి పిలుపు
english title:
m
Date:
Wednesday, December 26, 2012