న్యూఢిల్లీ, డిసెంబర్ 25: చట్టాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించటం కంటే రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయవలసిన తరుణం ఆసన్నమయ్యిందని సిపిఎం అభిప్రాయపడింది. చట్టాల అమలులో అడుగడుగునా పేరుకుపోయిన నిర్లక్ష్యం వల్ల నేరగాళ్లకు భయం లేకుండా పోతోందని ఆ పార్టీ తన అధికార పత్రికలో వ్యాఖ్యానించింది. దేశం పరువు ప్రతిష్టలను మంట కలిపిన ఇరవై మూడేళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం పాలకులకు కనువిప్పు కావాలని ఈ సందర్భంగా సిపిఎం స్పష్టం చేసింది. జి 20 దేశాలన్నింటి కంటే మన దేశంలోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒక సర్వే ధృవీకరించింది. మన కంటే అన్ని విధాలా వెనుకబడిన కాంగో, ఆఫ్గనిస్థాన్‌తో సరిసమానంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో హత్యల కంటే శరవేగంలో అత్యాచారాలు జరుగుతుండగా, ఇందుకు కారణమైనవారు అధికశాతం చట్టం పరిధి నుంచి సురక్షితంగా బయట పడిపోతున్నారు. న్యాయవ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ విభాగాలు సమర్థవంతంగా పని చేయలేకపోతున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 1.05 న్యాయమూర్తులుంటే తప్పించి కేసుల పరిష్కారం శరవేగంలో జరిగే అవకాశాలు లేవని లా కమిషన్ 1987లో చేసిన ప్రతిపాదన ఇప్పటివరకూ సక్రమంగా అమలుకాలేదని సిపిఎం తెలియచేసింది. మహిళలు, అమ్మాయిలపై జరిగే అత్యాచారాల కేసులను త్వరితంగా పరిష్కరించి దోషులను కఠినంగా దండించటానికి ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారినీ కఠినంగా శిక్షించటానికి రూపొందించిన క్రిమినల్ చట్టం సవరణ బిల్లుకు చట్టరూపం ఇవ్వటానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేసింది.
చట్టాల అమలుపై సిపిఎం విమర్శ
english title:
a
Date:
Wednesday, December 26, 2012