హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగు సాహిత్య కళారంగంలో కూచిపూడి మహా బృంద నాట్యం మహాద్భుతమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అభివర్ణించారు. 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు ఉత్సవం మంగళవారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతదేశం ఎన్నో సాంప్రదాయ కళలకు పుట్టినిల్లని పేర్కొన్నారు. ప్రపంచంలోని కూచిపూడి నాట్య కళాకారులు, నాట్యాచార్యులు అందరినీ ఒకే వేదికపైకి రప్పించడం మహా విశేషమని కొనియాడారు. సాంప్రదాయ కళానృత్యం అయిన కూచిపూడిని కాపాడుకోవాలని, కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ నాట్యాన్ని సిద్ధేంద్రయోగి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ఓ వరం లాంటిదని, ఈ సమ్మేళనంలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన మంత్రి చెప్పారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ఆరువందల ఏళ్ల చరిత్ర కలిగిన కూచిపూడి నాట్యం తెలుగువారి గొప్ప కళా నైపుణ్యానికి నిదర్శనమన్నారు. మొన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ ఉత్సవాలు వరంగల్‌లో జరిగాయని, నేడు కూచిపూడి ఉత్సవాలు, రేపు ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయని వివరించారు. కాగా, 2014లో 10వేల మందితో కూచిపూడి నాట్యం జరుపుతామని నిర్వాహకులు వెల్లడించారు.
గిన్నిస్ రికార్డు
కూచిపూడి మహాబృంద నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ నాట్యంలో 5794 మంది కళాకారులు పాల్గొని రికార్డు సాధించారని లండన్ నుంచి వచ్చిన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధి ప్రవీణ్‌పటేల్ ప్రకటించారు. ఇదొక మహాద్భుతమని అభివర్ణించి, కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రి పొన్నాలకు ధృవీకరణ పత్రాల్ని అందజేసారు. 18 దేశాల నుంచి ఏడుగురు ప్రతినిధులు, 17వేల మంది పాల్గొన్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
కూచిపూడి నాట్య సమ్మేళనంలో పురంధ్రీశ్వరి