హైదరాబాద్, డిసెంబర్ 25: ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశాని కన్నా ముందుగానే తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాలని, ఒక పార్టీ మరో పార్టీపై నెపం నెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తమ వైఖరి వెల్లడించని రాజకీయ పార్టీలకు తెలంగాణలో స్థానం ఉండదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమి వేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించకుండా తప్పించుకోజాలదని అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం పక్కన పెట్టి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం మంత్రులు కాంగ్రెస్ అధ్యక్షునిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీని కోసం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గంలోని తుక్కుగూడలో బుధవారం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు నాగం తెలిపారు.
కాంగ్రెస్, టిడిపి, వైకాపాలకు నాగం డిమాండ్
english title:
t
Date:
Wednesday, December 26, 2012