హైదరాబాద్, డిసెంబర్ 25: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాంగణంలో ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కె. చిరంజీవి, సాంస్కృతిక మండలి చైర్మన్ ఆర్వీ రమణ మూర్తి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలకు భేషైన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుది ఏర్పాట్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం నాడు తిరుపతిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమాలపై ప్రభుత్వం 52 పేజీల కార్యక్రమ కరదీపికను విడుదల చేసింది. ప్రధాన సభాస్థలికి శ్రీ వేంకటేశ్వర ప్రాంగణం అని నామకరణం చేయగా, దానికి అనుబంధంగా రంగస్థల వేదిక, సంగీత వేదిక, నృత్యవేదిక, జానపద వేదిక, సాహిత్య వేదికలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సురభి నాటకాలను టిటిడి ఆడిటోరియంలోనూ, అత్యంత పురాతన తెలుగు ప్రాభవాలను ప్రదర్శించే చలనచిత్రాలను ప్రతాప్ థియేటర్, బిగ్‌సినిమాలో ప్రదర్శిస్తారు. వీటికి తోడు అక్షర కల్పవృక్షం, సైకత శిల్పాలు, ప్రదర్శనశాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
గీతంతో ఆరంభం
సభా ప్రారంభం రావు బాలసరస్వతి దేవి, పి సుశీల, జానకిల ప్రార్ధనాగీతంతో మొదలవుతుంది. ఇతివృత్త గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తారు. వెనువెంటనే రాష్టప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2.30 నుండి కవిసమ్మేళనాలు, నృత్యరూపకలాలు ప్రదర్శిస్తారు.
సభల సందర్భంగా 274 మంది ప్రముఖులను సన్మానిస్తారు.
ఈ సందర్భంగా వారికి 5116 రూపాయిలు పారితోషికాన్ని అందిస్తారు. సాహిత్య రంగం నుండి 31 మంది, సంగీతరంగం నుండి 51, నృత్య రంగం నుండి 29 మంది, నాటక రంగం నుండి 60 మంది, జానపద రంగం నుండి 21 మందిని, ఇతర రంగాలకు చెందిన వారు 58 మందిని, ఇతర రాష్ట్రాలు దేశాలకు చెందిన 13 మందిని సత్కరిస్తారు.
2013 తెలుగు మహాసంవత్సరం 274 మందికి సన్మానం
english title:
t
Date:
Wednesday, December 26, 2012