హైదరాబాద్, డిసెంబర్ 25: కాంగ్రెస్ నాయకులు దేవున్ని కూడా అమ్ముకునే స్థాయికి దిగజారారని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం టిడిఎల్‌పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.
ప్రపపంచలో అత్యధిక మంది హిందువులు వెళ్లే ఆలయం, ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయం తిరుమల తిరుపతిని ఎన్టీఆర్ హయాంలో ఎంతో పవిత్రంగా ఉండేట్టు చూశారని, ఆ తరువాత చంద్రబాబు హయాంలో సైతం అదే విధంగా ఉండేదని అన్నారు. కానీ వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత చివరకు తిరుమలను సైతం అపవిత్రంగా మారుస్తున్నారని విమర్శించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చివరకు కాంగ్రెస్ నాయకులు టికెట్లు సైతం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమలలో కొందరు అధికారులు తిరుపతికి వచ్చి మద్యం తాగి, మాంసం తిని తిరిగి తిరుమల వెళుతున్నారని ముద్దు ఆరోపించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టిటిడి చైర్మన్, ఇవో నృత్యాలు చేస్తున్నారు, కోలాటాలు ఆడుతున్నారని విమర్శించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న సుబ్రమణ్యంను ఇవోగా ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో టికెట్లు అమ్ముకున్న వ్యవహారాలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆ ఇద్దరిని తొలగించాలి
ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై జరిగిన అత్యాచారం సంఘటనలో కేంద్ర హోంశాఖ మంత్రి షిండే బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన్ని మంత్రిపదవి నుంచి తొలగించాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు, గోపాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను, యువతను హోంమంత్రి మావోలతో పోల్చడం తగదని, ఆయన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థరాత్రి స్వతంత్య్రం వచ్చిందని అర్ధరాత్రి రోడ్డుపై తిరుగుతారా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తమ పేరు నుంచి గాంధీ పేరు తొలగించాలని డిమాండ్ చేశారు. గాంధీజీ చెప్పిన దానికి వ్యతిరేకంగా వీళ్లు వ్యవహరిస్తున్నారని గాలి, బొజ్జల విమర్శించారు.
........................
అఖిలపక్షం తర్వాత
రాజకీయాల్లో పెనుమార్పులు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
జగ్గయ్యపేట, డిసెంబర్ 25: ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం కచ్చితంగా చెప్పాల్సి ఉంటుందని, అలా కాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఉంటాయని, ఆ ప్రభావం కేంద్ర రాజకీయాలపై కూడా పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. పట్టణానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మంగళవారం మాట్లాడుతూ గతంలో ఇందిరగాంధీ హయాంలో కోలుకోలేని స్థితికి కాంగ్రెస్ చేరిందని గుర్తుచేశారు.
.............................
పార్లమెంటులో తేల్చాలి: బివి రాఘవులు
హైదరాబాద్, డిసెంబర్ 25: ప్రత్యేక తెలంగాణ అంశంపై సర్వోన్నతమైన పార్లమెంటులోనే తేల్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పాత్రికేయులతో మాటాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తమ నిర్ణయమని ఆ విషయాన్ని ఎన్నడో కేంద్రానికి, వివిధ కమిటీలకు తేల్చి చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.