సిద్దవటం, డిసెంబర్ 26 : పోలీసులు ప్రజలతో సోదరభావంతో మెలగాలని ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా సూచించారు. బుధవారం ఎపిఎస్పీ 11వ బెటాలియన్‌లో నాలుగు బెటాలియన్‌కు సంబంధించిన కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 సంవత్సరం ముందు బ్రిటీష్ వారు పోలీసులను ఆట వస్తువులా వాడుకునే వారని గుర్తు చేశారు. దీంతో పోలీసులకు ప్రజల పట్ల సరైన భావం లేదన్నారు. అందుకోసం ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసులు నడుచుకోవాలన్నారు. ప్రజలకు ఎలా న్యాయం చేయాలో అందరూ తెలుసుకోవాలన్నారు. 90 శాతం మంది ప్రజలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వారిని ఆదుకునేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్క రోజు ఒక కుటుంబానికైనా సహాయం చేయాలన్నారు. గతంలో పిల్లలు మారాం చేస్తే గబ్బర్‌సింగ్ వస్తున్నారని చెప్పేవారని, అయితే ప్రస్తుతం పోలీసులు వస్తున్నారని అని చెప్పే దుస్థితికి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. మంచి నడవడికతో క్రమ శిక్షణతో మెలగి శిక్షణను పూర్తి చేసుకోవాలని కోరారు. ఇన్‌చార్జ్ కమాండెంట్ రమేష్ మాట్లాడుతూ 9 నెలల పాటు జరిగే శిక్షణలో ట్రైనీ కానిస్టేబుళ్లందరికీ కర్నూలు నుంచి 56, నిజామాబాద్ 229, నల్గొండ నుంచి 50, కరీంనగర్ 29 మొత్తం 364 మందికి ఇండోర్, ఔట్‌డోర్ శిక్షణ ఇచ్చి మంచి పోలీసులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, రవీందర్, ఆర్‌ఐలు జివి రామిరెడ్డి,దస్తగిరి, ప్రవీణ్‌కుమార్, అలీబాషా, ఆర్‌ఎస్సైలు రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
* ట్రైనీ కానిస్టేబుళ్లకు ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా సూచన
english title:
s
Date:
Thursday, December 27, 2012