హిందూపురం, డిసెంబర్ 26: జిల్లా స్థాయి ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ప్రసూతి వార్డు వెనుక భాగంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ (మరుగుదొడ్డి గుంత)లో రెండు పసికందుల మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. బుధవారం సాయంత్రం ఈ సంఘటన వెలుగులోకి రావడం హిందూపురంలో చర్చనీయాంశమయింది. గతంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిసర ప్రాంతాల్లోని చెత్తకుండీల్లో ఇలాంటి పసికందుల మృతదేహాలు బయటపడ్డాయి. ఇటీవల హస్నాబాద్‌లోని మురికి కాలువలో ఓ పసికందు మృతదేహం బయట పడటం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని మరుగుదొడ్డి గుంతలో రెండు పసికందుల మృతదేహాలు బయట పడటం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రసూతి వార్డు వెనుకానే ఉన్న మరుగుదొడ్డి గుంతలో మృతదేహాలు లభ్యం కావడంపై భిన్న కథనాలు వ్యక్తమవుతున్నాయి. అబార్షన్ చేయించుకున్న అనంతరం మృతదేహాలను పడవేశారా లేదా బయట ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొని ఈ సంఘటనకు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పసికందు మృతదేహాల్లో ఒకటి మగ శిశువు కాగా మరొకటి ఆడ శిశువు. ఈ సంఘటన ధావనంలా వ్యాపించడంతో రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖలకు చెందిన అధికారులు వెంటనే స్పందించారు. తహశీల్దార్ విశ్వనాథ్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ, వన్‌టౌన్ సిఐ బి.శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీకి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. పసికందుల మృతదేహాలు మరుగుదొడ్డి గుంతలో ఉన్న సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించారు. కాగా మరుగుదొడ్డి గుంతలో పసికందుల మృతదేహాలు ఉండటంపై మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు ఇచ్చినా పోషించుకొనేవారమని కొందరు మహిళలు వాపోయారు. అయితే లింగ నిర్ధారణ పరీక్షల అనంతరం ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందులో ఓ మగ శిశువు, ఓ ఆడ శిశువు ఉన్నట్లు తేలడంతో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అబార్షన్ చేయించుకొనే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ సంఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణను అడగ్గా ఈ నెల 17వ తేదీన తమ ప్రసూతి వార్డులో రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణికి ప్రసవం అయిందని, అయితే బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని, ఈ మేరకు వారి నుండి సంతకాలను కూడా తీసుకున్నామన్నారు. రెండు, మూడు రోజుల క్రితమే ఆయా పసికందులను మరుగుదొడ్డి గుంతలో బయట వ్యక్తులు పడవేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయినా ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. ఇకపోతే మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
జిల్లా స్థాయి ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ప్రసూతి వార్డు
english title:
k
Date:
Thursday, December 27, 2012