గుత్తి, డిసెంబర్ 26: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ నెల 28న జరుగనున్న కాంగ్రెస్ పార్టీ 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని డిసిసి అధ్యక్షులు మధుసూదన్‌గుప్తా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి డిసెంబర్ 28 నాటికి 127సంవత్సరాలు అవుతుందని, ఈ సందర్భంగా 28తేదీ ఉదయం అనంతపురం డిసిసి కార్యాలయంలో నిర్వహించ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
కమీషన్ల కోసమే
కాంగ్రెస్ నాయకుల ఆరాటం
బొమ్మనహాళ్, డిసెంబర్ 26: కమీషన్ల కోసమే కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతూ కొత్త పథకాలు, పనులు ప్రారంభిస్తు, ప్రజా సమస్యలు పెడచెవిన పెట్టారని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. ముందుగా మండలంలోని నేమకల్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే కాపు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ కణేకల్ నుండి బొమ్మనహాళ్‌కు వెళ్లే ప్రధాన రహదారి. రూ 18 కోట్లు, బొమ్మనమాళ్ నుండి తారాకాపురం రోడ్డు నిర్మాణానికి రూ. 3.5కోట్లు, బల్లనగుడ్డం నుండి ధర్గావన్నూరుకు రూ. 4,5 కోట్లు నిధులు మంజూరైన పనులు ప్రారంభించలేదని విమర్శించారు. రాయదుర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టకుండా మంత్రి, ఎంపి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా రైల్వే పనుల్లో కమీషన్లకోసం పాకులాడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. రోడ్డు పనులు తొందరగా ప్రారంభించకుంటే సంక్రాంతి తర్వాత ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్‌రెడ్డి, చంధ్రశేఖర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, రవీంధ్రనాధ్‌రెడ్డి, వన్నూరుస్వామి, నేమకల్ గ్రామస్థులు పాల్గొన్నారు.