హిందూపురం టౌన్, డిసెంబర్ 26: హిందూపురం మున్సిపల్ పరిధిలోని పరిగి బస్టాండ్ సమీపంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా ఇఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణానికి కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ రంగయ్య, మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్‌రావులు తెలిపారు. స్థానిక పరిగి బస్టాండ్‌లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ ద్వారా పట్టణ పరిధిలోని సగం వార్డులకు నీటిని సరఫరా చేయడం జరుగుతోంది. అయితే ట్యాంక్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీతోపాటు ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణలు పరిశీలించారు. ట్యాంక్‌ను నిర్మించి ఎన్ని సంవత్సరా లు అయింది, ప్రస్తుతం దాని సామ ర్థ్యం తదితర వివరాలను తెలుసుకున్నారు. వెంటనే నూతనంగా ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. దీనికి తోడు నూతనంగా ఇఎల్‌ఎస్‌ఆర్ నిర్మించేందుకు స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో స్థలాన్ని కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీంతో కోటి రూపాయల వ్యయంతో నూతన ట్యాంక్‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయడంతోపాటు ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. కాగా ప్రస్తుతం ట్యాంక్ ద్వారా పంపిణీ అవుతున్న నీటి సరఫరాకు సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొన్నట్లు మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్‌రావు తెలిపారు.
కృత్రిమ కాళ్ల ఏర్పాటు శిబిరం ప్రారంభం
అమరాపురం, డిసెంబర్ 26: కాళ్లు కోల్పోయిన వికలాంగులకు అమరాపురంలో కేసరిచంద్, పూనం చంద్‌సేథి ఛారిటబుల్ ట్రస్టు, కర్ణాటక మర్వాడీ యూత్ ఫెడరేషన్, భారతీయ జైన్ మిలన్, స్థానిక ఆరోగ్య మైత్రీ కూటమిలు బుధవారం సంయుక్తంగా కృత్రిమ కాళ్ల అమరిక శిబిరాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యులు బసవరాజ్, పద్మరాజ్‌జైన్‌లు మాట్లాడుతూ కృత్రిమ కాళ్ల ఏర్పాటు శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కాళ్లు కోల్పోయిన బాధితులకు కృత్రిమ కాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక జైన దేవాలయంలో కాళ్లు ఏర్పాటు చేసుకోవడానికి కొలతలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు కొలతలు తీసుకొన్న వికలాంగులకు కృత్రిమ కాళ్లు అమర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఆశాప్రభు, కాంగ్రెస్ నాయకులు వాగేష్ పాల్గొన్నారు.