అనంతపురం, డిసెంబర్ 26 : ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు విధులు చాలా కీలకమని వ్యక్తిగత సమస్యల నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకూ మన పాత్ర ముఖ్యమని పోలీసు శిక్షణ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ షానవాజ్ ఖాసీం పిలుపునిచ్చారు. ఇటీవల సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యి కర్నూలు నుంచి 358 మంది, చిత్తూరు నుంచి 184 మంది, తిరుపతి నుంచి 165 మంది అభ్యర్థులు ఇక్కడి పోలీసు శిక్షణ కళాశాలకు శిక్షణ నిమిత్తం వచ్చారు. వీరందరికీ ఇక్కడ తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. బుధవారం స్థానిక పిటిసిలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో సేవలిందించేందుకు అవసరమైన శిక్షణ తొమ్మిది నెలల కాలంలో క్రమశిక్షణతో నేర్చుకోవాలని, ఇక్కడ ఎంత చిత్తశుద్ధితో శిక్షణ పొందుతామో మునుముందు సర్వీసులో కూడా అదేస్థాయిలో సేవలు అందించి పోలీసు శాఖకు మంచిపేరు తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. ప్రతి పోలీసు తగినంత శారీరక, మానసిక పటిష్టత విషయం పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. పోలీసులు ఎల్లప్పుడు మర్యాదపూర్వకంగా, సహనంతో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలోపిటిసి వైస్ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి, డిఎస్పీలు శ్రీనివాసులు, రామకృష్ణయ్య, నాగరాజు, పిటిసి పరిపాలనాధికారి అమీర్‌బాషా, పోలీసు వైద్యులు ఆదిశేషు, సిఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది, శిక్షణ నిమిత్తం వచ్చిన ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆదాయం పెంచండి
కళ్యాణదుర్గం, డిసెంబర్ 26: కళ్యాణదుర్గం మున్సిపల్‌లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెరగాలంటే, మున్సిపల్ ఆధాయం పెరగాలని, అయితే ప్రతి ఒక కార్మికుడుకి రూ.1500 పెంచుతున్నట్లు మున్సిపల్ ప్రత్యేకాధికారి నీలకంఠారెడ్డి తెలిపారు. బుధవారం కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దుర్గంలో పని చేస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలంటే, ఆదాయం పెరగాలని, పెంచడానికి అధికారులు పని చేయాలని, ప్రజలు సహకరించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ ఆధాయ పరిస్థితుల్లో ఒక కార్మికుడుకి రూ.1500 పెంచినట్లు, తెలిపారు. జెవివి జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇతర కార్మికుల నేతలు మున్సిపల్ ప్రత్యేకాధికారితో చర్చలు జరిపి, కార్మికుల జీతాలు పెరగడానికి కృషి చేశారు.
శిశువుల మృతదేశాలపై విచారణ
అనంతపురం సిటీ, డిసెంబర్ 26: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సెప్టిక్ ట్యాంకులో బయటపడ్డ మృతశిశువులకు సంబందించి పోస్టుమార్టం నిర్వహించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆసుపత్రి సర్వీసుల జిల్లా సమన్వయకర్త డాక్టరు శివప్రసాద్‌ను ఆదేశించినట్లు జిల్లా ఇన్‌ఛార్జీ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ ప్రకనటలో తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంకులో ఇద్దరు శిశువుల మృతదేహాలు బయటపడ్డాయని, అందుకు సంబందించి పెనుకొండ డియస్పీ కోలార్ కృష్ణ ప్రాథమిక నివేదిక సమర్పించారని, మృతశిశువులు ఆసుపత్రికి సంబందించినవా లేక బయటనుండి వచ్చిన వారు పడవేశారా అని సమగ్ర విచారణ జరపాలని డిసిహెచ్‌ఎస్‌కు, ఆర్‌ఎంఓకు ఆదేశించారు. పోస్టు మార్టం నివేదిక, సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
టీచర్ వేధింపులపై చర్యలు తీసుకోండి
ధర్మవరం టౌన్, డిసెంబర్ 26: తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న టీచర్ వైఖరికి నిరసనగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్థానిక కేశవనగర్ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాల ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా ఆ పాఠశాలలో పనిచేస్తే ఆంగ్ల ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషించడమేకాకుండా మానసిక, లైంగికంగా పాల్పడుతున్నాడని 6వ తరగతి, 3వ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పాఠశాల యాజమాన్యంతో వాగ్వివాదానాకి దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమను చిన్నపాటి తప్పుచేసినా ఆడ పిల్లల ముందు బట్టలు ఊడదీసి మర్మాంగంపై బెత్తంతో కొట్టేవాడని 6వ తరగతికి చెందిన కొందరు విద్యార్థులు వాపోయారు. అంతేకాకుండా తాము ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో చేతుల మీద కొరికి పళ్ళ గాట్లను లెక్కపెట్టాలని విద్యార్థినులను వేస్తున్నాడని తెలిపారు. బాలురులను తమ ముందు లోదుస్తులు లేకుండా నిలబెట్టడంతో సిగ్గుతో కుంగి పోతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు నరేష్ నరసింహారెడ్డి, ఓబిరెడ్డి, రాజారెడ్డిలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన ఎంఇఓ నూర్‌అహ్మద్, సిఐ నరసింగప్పలు బాధిత విద్యార్థులను విచారించి సంఘటనకు కారకుడైన టీచర్ జాన్‌పై కేసు నమోదు చేస్తామని, అంతేకాకుండా పాఠశాల యజమాన్యంపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల తల్లి తండ్రుల నుండి సిఐ, ఎంఇఓ లిఖిత పూర్యకంగా ఫిర్యాదులు తీసుకున్నారు.
వైభవంగా హనుమాన్ వ్రతం
గుంతకల్లు, డిసెంబర్ 26: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో బుధవారం అంగరంగ వైభవంగా హనుమాన్ వ్రతం నిర్వహించారు. హనుమాన్ వ్రతం పురస్కరించుకుని సతీ సువర్చల సమేతుడైన ఆంజనేయస్వామి భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేలాది మంది హనుమ దీక్షా పరులు శరణు ఘోషలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవంబర్ 14వ తేదీన ప్రారంభమైన హనుమ మండల దీక్ష, డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమైన అర్ధ మండల దీక్షలు చేపట్టిన హనుమ భక్తులు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది ఇరుముడులతో బుధవారం రాత్రికి దేవాలయం చేరుకుని స్వామి వారికి సమర్పించిన విషయం విధితమే. స్వామి వారికి భక్తులు ఇరుముడులలో సమర్పించిన సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రిని సేకరించిన ఆలయ సిబ్బంది, బుధవారం నిర్వహించిన హనుమాన్ వ్రతానికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలో మూల విరాట్‌కు మహాభిషేకం, విశేష పుష్పలంకారాలు, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీట ధారణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దేవాలయం సమీపంలో హనుమాన్ వ్రతం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేధికపై ఆంజనేయస్వామి, సతీమణి సువర్చల విగ్రహలను కొలువు దీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా వేద పండితులు ఆంజనేయ స్వామికి ఇరుముడులలోని నెయ్యితో స్వామి వారిని అభిషేకించారు. నిత్య బ్రహ్మచర్యం, శీతల స్నానం, భూతల శయనం, కఠిన నియమ నిష్టలతో దీక్షను పూర్తి చేసుకున్న భక్తుల చేత హనుమాన్ వ్రతాన్ని చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, భక్తుల శ్రీరామ శరణు ఘోషలతో కసాపురం మార్మోగిపోయింది. అనంతరం భక్తులకు దీక్ష విరమణ, తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి సురేష్‌బాబు, ఎఇఓ ధనుంజయ, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, సమూహ దేవాలయాల ఇఓ మల్లికార్జున, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.