అనంతపురం సిటీ, డిసెంబర్ 27: భవిష్యత్తులో టెక్నాలజి అనేది దేశాన్ని శాసిస్తుందని, ఆర్థికంగా ప్రపంచ దేశాలలో మన దేశం ప్రథమస్థానాన్ని 2050కి అక్రమిస్తుందని డిఫెన్స్ ఇన్స్‌ట్యూట్ ఆప్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజి విసి డా.ప్రహ్లాద పేర్కొన్నారు. గురువారం స్థానిక జెఎన్‌టియూ నాల్గవ స్నాతకోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఎన్‌టియూ విసి కె.లాల్‌కిషోర్ నుండి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్నారు. అనంతరం ప్రహ్లాద మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2050 నాటికి ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రథమ స్థానంలో ఉంచాలంటే యువత పరిశోధనల వైపుముందుకు పోవాలన్నారు. తాగునీరు, రవాణా, విద్యుత్, తదితర అంశాలలో ఆధునికం పోకడల కోసం పరిశోధనలు సాగాలన్నారు. ఆర్థిక, సాంకేతిక రంగాలు కలపి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిశోధనలలో ఇతర దేశాలలో ప్రైవేటు బాగస్వామ్యం ఎక్కువగా ఉందని, మన దేశంలో 7శాతం మాత్రమే ఉందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరిగితో పరిశోధనలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అభిప్రాయపడ్డారు. అంతేకాక పరిశోధనలను నిబద్దతోను, నిస్పక్షపాతంగా చేయాలని తెలిపారు. దేశంలో 200 మల్టినేషనల్ కంపెనీలు పరిశోధన, అభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. వీటిలో 2030కి భారత దేశ యువకులు దాదాపు 70 శాతం మంది పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో 2050 సంవత్సరానికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానంలో ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో సౌరశక్తిపై పరిశోధనలు చేసేందుకు మంచి అనువైన స్థలం అని తెలిపారు. దీనిపై జిల్లాలో పరిశోధనలు చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జెఎన్‌టియూ అనంతపురం నుండి అనేక మంది మేథావులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ విసి ఆచార్య కె.లాల్‌కిషోర్, రిజిష్టర్ హేమచంద్రారెడ్డి, రెక్టార్ సుదర్శన్‌రావు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
పసికందుల మృతిపై విచారణకు ఆదేశాలు
హిందూపురం, డిసెంబర్ 27: జిల్లా స్థాయి హోదా కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రి ప్రసూతి విభాగం వెనుక భాగంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో బుధవారం సాయంత్రం రెండు పసికందుల మృతదేహాలు లభ్యం కా వడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పెనుకొండ డిఎస్పీ కోలార్‌కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణల ద్వారా ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకొన్న జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో గురువారం విచారణాధికారిగా నియమితులైన జిల్లా ప్రభుత్వాసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ శివప్రకాష్ ఇక్కడికి చేరుకుని విచారణను ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను, లభ్యమైన రెండు పసికందుల మృతదేహాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ, ఆర్‌ఎంఓ డాక్టర్ సత్యనారాయణలను ఆయన విచారించారు. ఈ నెల 1వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్రి జరిగిన సాధారణ ప్రసవాలు, సిజిరియన్ ప్రసవాలు చేయించుకొన్న మహిళల పేర్లు, వారి వివరాలను సేకరించారు. ప్రభుత్వాసుపత్రిలో అబార్షన్లు చేయించుకొన్న అనంతరం మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారా, ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం తర్వాత పసికందులు చనిపోవడంతో ప్రభుత్వాసుపత్రి మరుగుదొడ్డి గుంతలో పడవేశారా, లింగ నిర్ధారణ పరీక్షల్లో వివరాలు తెలిసిన తర్వాత ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారా అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ విషయమై విచారణాధికారిగా నియమితులైన డాక్టర్ శివప్రకాష్ మాట్లాడుతూ, ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యమైన పసికందుల మృతదేహాలపై సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలను విచారించి వివరాలను సేకరించడం జరిగిందన్నారు. పసికందుల మృతదేహాలను అనంతపురం మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ విభాగానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
సిపిఐ నిరసన
ప్రభుత్వాసుపత్రి సెప్టిక్ ట్యాంక్‌లో పసికందుల మృతదేహాలు లభ్యం కావడంలో వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. లింగ నిర్ధారణ చేయడం చట్ట విరుద్ధమని చెబుతున్నా ప్రైవేటు నర్సింగ్ హోంల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పసికందుల మృతదేహాల లభ్యంపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రికి చెందినట్లు రుజువయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ శివప్రకాష్ చెప్పడంతో ఆందోళనకారులు శాంతించి విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సురేష్‌బాబు, దాదాపీర్, ఆసియాభాను, కెటి శ్రీనివాసరెడ్డి, అమర్‌నాథ్, రామాంజి, బాబయ్య, రాజ్‌కుమార్, ఇమాం, రామ్మూర్తి పాల్గొన్నారు.
డియస్సీ-12 అభ్యర్థులకు కౌనె్సలింగ్
అనంతపురం సిటీ, డిసెంబర్ 27: డియస్సీ-12లో ఎంపికైన అభ్యర్థులకు కౌనె్సలింగ్ నిర్వహించి పాఠశాలను కేటాయించారు. ఈ కౌనె్సలింగ్ స్థానిక ప్రభుత్వ కొత్తవూరు పాఠశాలలో డిఇఓ కె.శామ్యూల్, జెడ్పి సిఇఓ సుబ్బారెడ్డి, డిఇఓ కార్యాలయ ఎడి సాంబశివరావులు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులు మొదటి తమ ఒరిజినల్ సర్ట్ఫికెట్లు పరిశీలన చేయించుకుని కౌనె్సలింగ్‌కు హాజరయ్యారు. కౌనె్సలింగ్‌లో మొదట స్కూల్ అసిస్టెంట్‌లోని సోషియల్‌లో 42 పోస్టులకు, ఇంగ్లీషులో 26 పోస్టులకు, తెలుగులో 51 పోస్టులకు, ఉర్దూలో 2 పోస్టులకు, మ్యాథ్స్‌లో 31, ఫిజకల్ సైన్సులో 25 పోస్టులకు, బయాలజికల్ సైన్సులో 23, సంస్కృతంలో ఒకటి, పండితులకు 104 పోస్టులకు, పిఇటి 10పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలను కేటాయించారు. ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా ఎస్సీ కేటగిరిలో ఎంపికైన మహిళ తనకు పోస్టు వద్దని రాతపూర్వకంగా డిఇఓకు సమర్పించింది. దీంతో మరొక అభ్యర్థికి అవకాశం కల్పించాలని ఎస్సీలు పట్టుబట్టడంతో ఇంగ్లీషు కౌనె్సలింగ్ వాయిదా వేసి అన్ని సబ్జెక్టులు అయిన తరువాత నిర్వహించారు. జాబితాలో నూతన ఉపాధ్యాయులకు కొన్ని అనుమానాలను డిఇఓ నివృత్తి చేశారు. నేడు ఉదయం పదిగంటలకు 734 సెంకడరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు నిర్వహించే కౌనె్సలింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు హాజరుకావాలని డిఇఓ తెలిపారు. ఈ కౌనె్సలింగ్‌లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డిఇఓ కార్యాలయ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.
సహకార ఎన్నికలకు రాజకీయ రంగు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, డిసెంబర్ 27 : సహకార ఎన్నికల ప్రక్రియ మొదలయిన నేపథ్యంలో గురువారం రామగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సిఇవో రవిచంద్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సహకార ఎన్నికల రాజకీయ వత్తిళ్ళే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార ఎన్నికల నగరా మోగినప్పటి నుండి రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొనడంతో సహజంగానే రాజకీయ రంగు పులుముకుంది. ఆయా పార్టీలు తమ అనుయాయులతో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాయి. జిల్లాలో సుమారుగా లక్షన్నర మంది వరకూ కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సహకార ఎన్నికల పుణ్యమాని ఆధిపత్య పోరు నెలకొంది. సభ్యత్వ నమోదులోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక ఎన్నికలు మొదలయ్యి పూర్తయ్యే సరికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది. తాజాగా రామగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సిఈఓ రవిచంద్ర ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఆయన పదిహేను రోజుల క్రితమే పదోన్నతిపై రామగిరి సిఈఓ గా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివిధ రాజకీయ పక్షాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సభ్యులను చేర్చుకునేందుకు గడువు పూర్తయిన తరువాత కూడా తమ వారిని సభ్యులుగా చేర్చుకోమని వివిధ రాజకీయ పక్షాల నుంచి ఒత్తిడి వచ్చేదని సహ ఉద్యోగులు చెబుతున్నారు. రామగిరి సొసైటీలో 3144 మంది సభ్యులు ఉండగా, కొత్తగా 3900 మంది సభ్యులుగా చేరారు. కేవలం పదిహేను రోజుల్లోనే రెట్టింపు సంఖ్యలో సభ్యత్వం తీసుకోవడం గమనార్హం. పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం, డబ్బులు సకాలంలో చెల్లించపోవడంతోపాటు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్లతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కూడా వారంటున్నారు. సహకార ఎన్నికలకు నగారా మోగిన కొన్ని రోజుల్లోనే సొసైటీ సిఇవో ఆత్మహత్యకు పాల్పడడం ఇటు ఉద్యోగులతోపాటు రాజకీయ వర్గాలను కూడా కలవర పరుస్తోంది.
నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, డిసెంబర్ 27 : జిల్లా కేంద్రంలోని కొందరు ఆటోడ్రైవర్లు నేరాలకు పాల్పడుతూర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆటోడ్రైవర్ వృత్తికి కళంకం తెస్తున్నారని, అలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వారిపై చర్యలు తీసుకుంటామని అనంతపురం డిఎస్పీ యం. దయానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక టు టౌన్ పోలీసుస్టేషన్‌లో ఆటోడ్రైవర్లు, వివిధ ఆటోల యూనియన్లతో గురువారం డిఎస్పీ సమావేశమయ్యారు. గడచిన పది రోజుల్లో అనంతపురంలో జరిగిన నేరాల్లో సింహభా గం ఆటోడ్రైవర్లు నిందితులుగా ఉన్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసుశాఖ తరపున ఆయన కొన్ని సూచనలు చేశారు. ప్రయాణీకుల ఏవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్య లు ఉంటాయన్నారు. నేరస్థులు, నేర ప్రవృత్తి కలిగిన వారు, అనుమానాస్పదులను ముందుగానే గుర్తించి తమ కు సమాచారం అందించాలన్నారు. ఆటోలకు సంబంధించిన పత్రాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టుటౌన్, ఆత్మకూరు, ఇటుకలపల్లి, త్రీటౌన్, వన్ టౌన్ సిఐ లు ఎ. శ్రీనివాసులు, బి.విజయకుమార్, ఎస్.మహబూబ్‌బాషా, డి.్భస్కరరెడ్డి, ఎస్సైలు సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
జిల్లాలో ఆరు ప్రాజెక్టుల్లో అమృత హస్తం అమలు
మడకశిర, డిసెంబర్ 27: జిల్లాలో స్ర్తి, శిశు సంక్షేమ శాఖలో 17 ప్రాజెక్టులు ఉండగా తొలి దశలో ఆరు ప్రాజెక్టుల్లో జనవరి 1వ తేదీ నుండి ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలు చేస్తున్నట్లు సంబంధిత ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మీకుమారి తెలిపారు. గురువారం స్థానిక ప్రాజెక్టును ఆమె తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్నారు, ప్రభుత్వం అందజేస్తున్న పౌష్ఠికాహారం సక్రమంగా అందుతుందా లేదా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలకు సరైన పౌష్ఠికాహారం అందకపోవడంతో వారిలో రక్తహీనత తగ్గిపోవడంతో ప్రసవాలకు ఇబ్బందులకు గురవుతూ మృత్యువాతన పడుతున్నారన్నారు. జిల్లాలో 10,932 మంది గర్భవతులు, 14,587 మంది బాలింతలు ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. వీరికి జనవరి 1 నుండి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక్కపూట భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఇకపోతే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, ఆయా పోస్టులకు 885 దరఖాస్తులు వచ్చాయని, వీలైనంత త్వరలో వీటిని భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సిడిపిఓ లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు
పుట్టపర్తి రూరల్, డిసెంబర్ 27: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ పరిశీలకులు, జిల్లా ఎన్నికల జాబితా ఇన్‌చార్జ్ రాంభూపాల్ పేర్కొన్నారు. ఆయన గురువారం తహశీల్దార్ కార్యాలయం లో పెనుకొండ డివిజన్ పరిధిలోని 32 మండలాల తహశీల్దార్లతో ఎన్నికల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాలలో నివాసమున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలన్నారు. శాశ్వతంగా వలసలు వెళ్ళిన వారిని ఓటర్ల జాబితాలో తొలగించాలన్నారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాలలో ఇంటింటా సర్వేనిర్వహించి ఓటర్ల జాబితాను సిద్దం చేయాలన్నారు. ప్రస్తుతం వున్న ఓటర్ల జాబితాలో 64 శాతం మాత్రమే ఓటర్లు వుండాలని 36శాతం ఓటర్లు తొలగించామని తహశీల్దార్లు ఆయనకు తెలిపారు. ఓటర్లజాబితా తయారీలో చా లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతి మండలానికి ఒక సీనియర్ అసిస్టెంట్‌ను నియమించాలని బిఎల్ ఓలకు నెలకు రూ.500లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ఎన్నికల జాబితా నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తం గా రూ.100కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ ఈశ్వర్, తహశీల్దార్ మోహన్‌దాస్ ఆయామండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
సత్యసాయి సమాధిని
దర్శించిన రాంభూపాల్
ఎన్నికల జాబితా తయారీపై పుట్టపర్తిలో తహశీల్దార్ల సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్ అధికారి రాంభూపాల్ సత్యసాయి మహాసమాధిని గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆర్‌డిఓ ఈశ్వర్, తహశీల్దార్ మోహన్‌దాస్, ఎంపిడిఓ మంజునాథ్‌రావు స్వాగతం పలికారు.
వరినాట్లు వేసిన ఎమ్మెల్యే సునీత
రామగిరి, డిసెంబర్ 27: మండల కేంద్రమైన రామగిరి చెరువు ఆయకట్టుకింద రైతులు సాగుచేసే పొలాల్లో గురువారం రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీత వరినాట్లు వేసి సాగును ప్రారంభించారు. జిల్లాలో దాదాపుగా ఏ చెరువుకూ నీరు రాలేదు. అయితే రామగిరి చెరువు నిండడం విశేషమన్నారు. ఆ చెరువుకింద వరిసాగు చేయడానికి రైతులు సిద్దమయ్యారు. దీన్ని గమనించిన పరిటాల సునీత వరి సాగుచేస్తున్న పొలాల వద్దకు వెళ్ళి రైతులతో మాట్లాడారు. ఈ చెరువు కింద 153 ఎకరాల వరిసాగు చేస్తామని, అనధికారికంగా మరో 20 ఎకరాలు వుండవచ్చని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రతి రోజు ఇదే దారి వెంట వెళ్తూ రైతులు వరి నాటు పనుల్లో నిమగ్నమైవుంటే తానుకూడా వరి నాటాలని కుతూహలంతో వరి నాట్లు వేసినట్లు ఆమె రైతులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే దాదాపు అరగంటకు పైగా వరినాట్లువేసి కూలీల్లో ఆశ్చర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతి రోజూ పొలంగట్లవైపు దారి గుండా వెళ్తున్నాని, అయితే ఒక్క రోజైనా పొలం పనుల్లో పాల్గొనాలనే కుతూహలంతో వరినాట్లు వేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే వెంట టిడిపి జిల్లా కార్యదర్శి పరందామయాదవ్, మండల కన్వీనర్ రఘువీరా, తెలుగుయువత నాయకులు మాదాపురం శంకర్, శివకుమార్, గుర్రం శ్రీనివాసులు, పేపర్ శీన, మనోహర, గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కులప్ప పాల్గొన్నారు.
విజయానికి ప్రతిరూపమే శ్రీకృష్ణ దేవరాయలు
బెళుగుప్ప, డిసెంబర్ 27: విజయానికి ప్రతిరూపంగా ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలని శ్రీకృష్ణ దేవరాయల విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బెళుగుప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈశ్వరప్ప ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహ ఏర్పాటుకు ముఖ్య అతిథులుగా ఆచార్య రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈయనతోపాటు తెలుగు భాషా పరిరక్షణా సమితి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గొల్లపిన్ని శేషాచలం, జనప్రియ కవి వేలూరు వెంగన్న, ఎస్‌కెయు ఆచార్యులు గోవిందప్ప, రామగోపాల్, సాహితివేత్త గురువేపల్లి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌కెయు ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతికి వనె్న తెచ్చిన, తెలుగుభాషలందు తెలుగు లెస్స అన్న పుస్తకాలు శ్రీకృష్ణ దేవరాయలు విజయానికి ప్రతిరూపంగా నిలిచాయన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమి తి అధ్యక్షులు గొల్లపిన్ని శేషాచ లం, జనప్రియ కవి వేలూరు వెంగ న్న, సాహితివేత్త గురువేపల్లి నరసింహులు మాట్లాడుతూ భాషలన్నింటిలోకన్నా తెలుగు భాష ఎంతో మాధుర్యమైనదన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కొలువులోని అష్ట దిగ్గజాలలో జరిగినటి వంటి సన్నివేశాలను చమత్కరించారు. అనంతరం ఉపకులపతి రామకృష్ణారెడ్డిని, విగ్రహ ధాత ఉపాధ్యాయులు ఈశ్వరప్పను, కవుల ను ఆత్మీయులు, ఉపాధ్యాయ బృందం శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ భాగ్యలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ
ప్రపంచ మహా తెలుగు సభలను పురస్కరించుకుని బెళుగుప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఈశ్వరప్ప ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఎస్‌కెయు వైస్ ఛాన్సలర్ ఆచార్య రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఆయనను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కవులను, చిత్ర కళారంగంలో దస్తగిరి, శిల్ప కళలో శివలింగప్ప, సాహిత్యంలో నరసింహులు, సంగీతంలో టి.నరసింహులు, భజనరంగంలో లింగప్ప, జానపద కళలో రామన్న, కళారంగాలలో వీరిని ఎస్‌కెయు వైస్ ఛాన్సలర్ శాలువాలు, పూలమాలలు, మెమోంటోలతో కళాకారులను ఘనంగా సన్మాంచారు.
ఘనంగా జెఎన్‌టియూ స్నాతకోత్సవం
అనంతపురం సిటీ, డిసెంబర్ 27: జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలిజికల్ యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవం పరిపాలన భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మొదట జెఎన్‌టియూ ఉపకులపతి ఆచార్య కె.లాల్‌కిషోర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన డిఫెన్స్ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ విసి డా.ప్రహ్లాదకు ఘనంగా స్వాగతం పలికారు. ఆచార్య ప్రహ్లాద జ్యోతి వెలిగించి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఎక్కువ మార్కులు సాధించిన వివిధ విభాగాలకు చెందిన 27 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ఆచార్య ప్రహ్లాద, విసి లాల్‌కిషోర్‌లు అందజేసారు. యూనివర్సిటీ పరిధిలోని బి.టెక్, ఫార్మసీ, పిజి కోర్సుల కాన్వికేషన్ పట్టాలపై విసి లాల్‌కిషోర్ సంతకం చేశారు. అనంతరం విసి లాల్‌కిషోర్ యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. యూనివర్సిటీ పరిధిలో 117 ఇంజనీరింగ్, 35 ఫార్మసీ, 26 పిజి, 5 ఇంటిగ్రేటేడ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీలో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని, పరీక్షల విభాగపు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జాతీయంగా డైనమిక్-12ను, రేస్-12ను, ఎమర్జీ-12, ఫిక్సెల్-11, ఫ్యూజాన్11, ఈఈఎల్- 11, యాత్ర-11, ఎఎవిబ్రోవ్-11లను వివిధ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. యూనివర్సిటీ పరిధిలో మల్టినేషన్ కంపెనీలతో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహించి దాదాపు 2500 మందికి ఉద్యోగాలు పొందేలా చేసామన్నారు. 47 లక్షలతో ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అనంతరం పిహెచ్‌డి ప్రధానం చేసేందుకు కెబి.చంద్రశేఖర్, ఎం.టెక్ డిగ్రీలను ప్రధాన చేయాలని పిఆర్.్భనుమూర్తి, ఎం-్ఫర్మసీ డిగ్రీలను ప్రధాన చేయాలని వి.్భస్కర్ దేశాయ్, ఎంబిఎ డిగ్రీలను ప్రధాన చేయాలని ఉమామహేశ్వర్ గౌడ్, ఎంసిఎ డిగ్రీల ప్రదానం చేయాలని ఎ.ఆనంద్‌రావు, ఎంయస్సీ డిగ్రీలు ప్రదాన చేయాలని ఎన్.దేవన్న, బి.టెక్ డిగ్రీలను ఆంజినేయులు, బి-్ఫర్మసీ డిగ్రీలకు సత్యనారాయణ, గోల్డ్ మెడల్స్ ప్రదానంను గోవిందరాజు, కాన్వికేషను ప్రదానంపై రిజిష్టర్ హేమచంద్రారెడ్డిలు అనుమతితో డిగ్రీలను విద్యార్థులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విభాగాల డైరెక్టర్లు దేవకుమార్, కేశవరెడ్డి, జోజిరెడ్డి, పిఆర్‌ఓ రామశేఖర్‌రెడ్డి, గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు, కాన్వికేషన్ పొందిన విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.