Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తిరుపతి నగర వీధుల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయ గుబాళింపులు

$
0
0

తిరుపతి, డిసెంబర్ 27: కడలి అంచులు దాటి కదిలింది తెలుగు.. ఎదలోతుల్ని దాటి ఎగిసింది తెలుగు.. అని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి డాక్టర్ సి నారాయణరెడ్డి తన కలం నుండి అక్షర జల్లును కురిపించారు. ఈ నేపధ్యంలో అంతరించిపోతున్న భాషల్లో తెలుగుభాష 14వ భాషగా వుందని యునెస్కో వెల్లడించిన సర్వేలు సగటు తెలుగువాడి గుండెల్లో గుబులు నింపింది. 37 ఏళ్ల తరువాత తొలిసారిగా ఆంధ్రరాష్ట్రంలో అందులోనూ తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో గురువారం ప్రారంభమైన నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభల తీరుతెన్నులు ప్రతి తెలుగుగుండెల్లో నవచైతన్యాన్ని నింపి మన మాతృభాష అజరామరమనే విశ్వాసాన్ని పెంపొందింపజేస్తోంది. ప్రపంచ తెలుగుమహాసభల ప్రారంభ సూచికగా కళాకారులు, మేధావులు, విద్యార్థులు, కవులు, పండితులతో తెలుగుతల్లి విగ్రహం నుండి ప్రారంభమైన ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ముందుగా స్థానిక పూర్ణకుంభం సర్కిల్‌లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాజన ప్రదర్శనను ప్రారంభించారు. తెలుగుతల్లి విగ్రహం నుండి ప్రారంభమైన కళాప్రదర్శన మహాజన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది. తెలుగు భాషాభిమానులు, ప్రతినిధులు, కళాకారులు, కవులు, విద్యార్థులు ప్రదర్శించిన ఈ ప్రదర్శన ఆద్యంతం చూపరులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. సుమారు 10 వేల మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. జానపదులు, వొగ్గుకథ కళాకారులు, దేవరపెద్ది, వీధినాటకాలు, తప్పెటగుళ్లు, పిల్లంగట్లు, తరగలు, గరకలు, గంగిరెద్దులు, బుడబుక్కల, కీలుగుర్రాలు, కొండదేవర, కోయదొరలు, చెంచులు, చిందు, యక్షగానం, పులివేషాలు వంటి కళాకారులు చేసిన విన్యాసాలతో, డప్పుల వాయిద్యాలతో నగరం హోరెత్తింది. విద్యార్థులు తెలుగుతల్లి, భరతమాత వేషధారణలతో ఆకట్టుకున్నారు. రాముడు, భీముడు, కృష్ణుడు వంటి పురాణ ప్రముఖుల వేషాలతో, ఝాన్సీలక్ష్మిబాయి, సరోజినీనాయుడు వంటి స్వాతంత్ర వీరనారీమణుల వేషాలతో నగర వీధుల్లో కళాకారులు సందడి చేశారు. శ్రీకృష్ణదేవరాయుల భువన విజయం కళావైభవం, తెలుగు వైభవం, గ్రామ దేవతలు, తెలుగు కవయిత్రులు, తెలుగుజాతరలు, ఆధునిక కవులు, తెలుగుకళా వైభవం వంటి శకటాలు తెలుగుకళా వైభవాన్ని చాటుతూ చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు, వివిధ పాఠశాలల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో నగర వీధుల్లో సందడి చేశారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం సాగిన తెలుగు కళావైభవ ప్రదర్శన నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతికి ముందే పండగ వచ్చిందా? అన్న అనుభూతిని కల్గిస్తూ తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. సభలు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర ప్రాంగణం నుండి నగరంలోని వీధులన్నీ మామిడి తోరణాలతో, అరటి బోదెలతో అలంకరించారు. సభా ప్రాంగణంతో పాటు నగరంలోని వీధులన్నీ తెలుగుభాషా ప్రముఖులు, కళాకారుల చిత్రపటాలతో, గోడలపై రాసిన తెలుగుపద్యాలు, నీతి వాక్యాలతో ఎటుచూసినా తెలుగువైభవం గుబాళించింది. అనుకున్న సమయం ప్రకారమే రాష్టప్రతి రాకముందే కళాకారుల ప్రదర్శనలు ప్రధాన వేదికను చేరుకున్నాయి. అప్పటికే ప్రధాన వేదిక స్వదేశీ, విదేశీ ప్రతినిధులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో కిక్కిరిసిపోయింది. కళాకారుల రాకతో ఆ ప్రాంగణానికి నిండుదనం చేకూరింది. ఒక దశలో ప్రధాన ప్రాంగణం నిండదేమో అని అధికారులు ఆలోచించి విద్యార్థులతో నింపాలని భావించి రప్పించారు. మహాసభలకు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. ఐదు ఉపవేదికలైన జానపదం, సంగీతం, రంగస్థలం, నృత్యం, సాహిత్యం వేదికలు కూడా వెలవెలబోతాయని అందరూ భావించారు. ఎవరూ ఊహించని రీతిలో ప్రతి ఉపవేదికలూ కళాప్రియులతో, భాషాభిమానులతో కళకళలాడింది. దీంతో ఆయా వేదికపై తమ ప్రతిభను చూపే కళాకారులు, కవులు, సాహితీవేత్తల్లో కూడా నూతనోత్సాహం కొట్టొచ్చినట్లు కనపడింది. ఒక విధంగా చెప్పాలంటే ఏ యే రంగం పట్ల ఆసక్తి వుందో ఆ అభిరుచులతో ఆయా వేదికలను ఎంచుకుని ఆద్యంతం ఆసక్తిగా తిలకించి, ఆలకించి పులకించారు. అంటే కళాభిమానులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు ఎవరి తృష్ణను వారు తీర్చుకున్నారనే చెప్పాలి. సకల కళాప్రియులైన ప్రేక్షకులు అన్ని వేదికలను కలియ తిరుగుతూ మధురానుభూతిని పొందారు. జానపద వేదికపై నుండి కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలకు కళాప్రియులు మంత్రముగ్ధులయ్యారు. చెంచులు, గరగలు, యక్షగానాలు, కొమ్ములు, సుగాలీ, దింపానృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదర్శన ముగించుకుని వేదిక దిగివచ్చిన తరువాత కూడా వారితో కలిసి వారి డప్పుల వాయిద్యాలకు అనుగుణంగా అనేక మంది నృత్యాలు చేశారు. మరికొంత మంది ఫొటోలు దిగారు. ఇక రంగస్థల వేదికలో తిరుపతికి చెందిన కోనేటి సుబ్బరాజు ప్రదర్శించిన మేఘనాథుని పద్యనాటకం, కావలికి చెందిన ఏవి మల్లేశ్వర్‌రావు ప్రదర్శించిన అమ్మఒడి పద్యనాటకం, వైజాగ్‌కు చెందిన శివప్రసాద్ ప్రదర్శించిన కన్యాశుల్కం నాటకం కళాప్రియులను కట్టిపడేసింది. సంగీతం వేదికపై నుండి తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గాత్రకచ్చేరి ప్రేక్షకులను వీనులవిందుగావించింది. అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన సంగీత విద్వాంసులు నాగేశ్వర్‌రావు, మధుసూదన్‌లు వినిపించిన భక్తిగీతాలు శ్రోతలను ఆధ్యాత్మిక చింతనతో నింపాయి. వంకాయల నరసింహ బృందంచే నిర్వహించిన మూడు తరాల మృదంగ లయవిన్యాసం, ఈశ్వర్ ప్రసాద్ నృత్య సంకీర్తన, చిన్నారి గాయకులు శరత్ సంతోష్, సబీహ్య, పల్లవి, ప్రవీణ, సాయిరమ్య, శే్వతా, రోహిత్, సౌమ్యల పాడుతాతీయగా గానవిభావరి సంగీత వేదికకు శోభను తీసుకువచ్చి పెట్టాయి. నృత్యం వేదికపై నుండి పలువురు చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు లయబద్దంగా, రసరమ్యంగా వున్నాయి. బెంగుళూరుకు చెందిన మంజుభార్గవి, డాక్టర్ అలేఖ్యాబృందం, డాక్టర్ సరస్వతిలు చేసిన కూచిపూడి నృత్యాలు కళాభిమానుల గుండెల్లో వీణలు మోగించాయి. సాహితీవేదిక కవులు, సాహితీ వేత్తలు, రచయితలతో నిండిపోయింది. అవధానులు, అష్టావధానులు, శతావధానులు, శత సహస్రావధానులతో సభకు ఉగాది శోభను తెచ్చిపెట్టింది. ఆధునిక కవి సమ్మేళనం ఆద్యంతం రసజ్ఞులను రంజింపజేసింది.

స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న రాష్టప్రతి
తిరుపతి, డిసెంబర్ 27: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర ప్రాంగణంలో మూడురోజుల పాటు జరుగనున్న నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభలను ఆయన గురువారం ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం వద్ద రాష్టప్రతికి రాష్టద్రేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి సి రామచంద్రయ్య, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జెఇఓ శ్రీనివాసరాజులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ఆయన శ్రీవారి ఆలయానికి బయలుదేరారు. ముందుగా స్వామివారి పుష్కరిణికి వెళ్లి జల సంప్రోక్షణ చేసుకుని క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. మహాద్వారం వద్ద ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇస్థికపాల్‌తో స్వాగతం పలికారు. సాంప్రదాయ దుస్తులతో వచ్చిన రాష్టప్రతిని మంగళ వాయిద్యాల మధ్య ఆలయంలోకి తీసుకువెళ్లారు. స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులు రమణదీక్షితులు రాష్టప్రతికి స్వామివైభవాన్ని హిందీలో తెలియజేశారు. శేషవస్త్రాన్ని బహూరించారు. ఆలయంలో ప్రదక్షణగా వచ్చిన ఆయన హుండీలో కానుకలు సమర్పించి, ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎంపిలు, టిటిడి చైర్మన్, అధికారులతో గ్రూఫు ఫొటో దిగారు. అనంతరం రంగనాయకుల మండపం చేరుకున్నారు. వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆయనకు స్వామివారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు. చైర్మన్ దంపతులు రాష్టప్రతికి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం తనకు వేద ఆశీర్వచనం పలికిన టిటిడి చిన్నజియ్యర్ బృందానికి రాష్టప్రతి ముకుళిత హస్తాలతో నమస్కరించారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి భక్తులకు అభివాదం చేశారు. అక్కడినుంచి నేరుగా తిరుచానూరు వచ్చి చేరుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న రాష్టప్రతికి ఆలయ అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుగుప్రయాణం అయ్యారు. కాగా స్వామి, అమ్మవార్లను దర్శించుకునే సమయంలో ఆయన వెంట గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కిల్లీ కృపారాణి, రాష్ట్ర మంత్రి రామచంద్రయ్య, టిటిడి చైర్మన్ బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పాలక మండలి సభ్యులు ఎల్లార్ శివప్రసాద్, సిహెచ్ లక్ష్మణ్‌రావు, సివిఎస్‌ఎస్‌ఓ జివిజి అశోక్‌కుమార్, అడిషినల్ సివిఎస్‌ఓ శివకుమార్, ఆలయ డిప్యూటి ఇఓ చిన్నంగారి రమణ తదితరులున్నారు.

తెలుగుసభల్లో పలు ఆవిష్కరణలు
తిరుపతి, డిసెంబర్ 27: నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభల వేదికపై నుండి పలు ఆవిష్కరణలు వెలువడ్డాయి. శ్రీవారి హుండీలో 1వ శతాబ్ధం రోమ్ చక్రవర్తి కాలంలో వేసిన బంగారు, వెండి, రాగి నాణేల నుండి 20వ శతాబ్ధంలో నిజాం కాలం నాటి నాణేల వరకూ సేకరించి ముద్రించి, వాటి చరిత్రను తెలియజేసే పుస్తకాన్ని టిటిడి పరిశోధనా పుస్తకంగా ముద్రించగా ఈసభల్లో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ సభల సమాచారాన్ని తెలియజేస్తూ ముద్రించిన తెలుగువాణి ప్రత్యేక సంచికను రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవిష్కరించారు.
రాష్టప్రతికి ఆనందనిలయం బహూకరించిన సిఎం
నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభలకు విచ్చేసిన రాష్టప్రతి ప్రణభ్ ముఖర్జీని రాష్టమ్రుఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డైమండ్స్‌తో తళతళలాడుతున్న శ్రీవారి ఆనందనిలయ నమునాను, భగవద్గీతను తెలుగులో ముద్రించిన తాళపత్రాలను బహూకరించారు.

తెలుగుభాష అమలుకు కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్‌లే అడ్డంకి
* అధికారభాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ సంచలన వాఖ్యలు
తిరుపతి, డిసెంబర్ 27: తెలుగుభాష అమలులో కొంత మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు అనుసరిస్తున్న తీరుతెన్నులు ఒక అడ్డంకిగా మారుతున్నాయన్నాయని మాజీ ప్రధాన సంపాదకుడు, అధికారభాషా సంఘం మాజీ అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ సంచలన వాఖ్యలు చేశారు. గురువారం నాడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాంగణంలో ప్రారంభమైన నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభల నేపధ్యంలో జరుగుతున్న చర్చావేదికల్లో భాగంగా అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్ అధ్యక్షతన జరిగిన రెండవ వేదికలో జరిగిన పాలనాభాషగా తెలుగు అనే అంశంపై అధికారభాషా సంఘం - జరిగిన కృషిపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాష అభివృద్ధి పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. న్యాయస్థానాల్లో తెలుగు అమలుకు సంబందించి ఎవ్వరూ పెద్దగా శ్రద్ద చూపకపోవడం ఒక లోపమన్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే పోలీసు వ్యవస్థలో కూడా తెలుగుభాష అమలు లేకపోవడం పలు రకాల సమస్యలను సృష్టిస్తోందన్నారు. ఈ నేపధ్యంలో నిజమైన నేరస్తుడు కూడా భాషాప్రయోగంలో వున్న లోపభూయిష్టాలతో తప్పించుకునే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఇందుకు సంబందించి ఎపి పోలీస్ అకాడమీలో పనిచేసిన ఐపిఎస్ అధికారి ఉమాపతి జరిపిన ఒక సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు జూశాయన్నారు. ఒక నేరస్తుడికి సంబందించి ఎఫ్‌ఐఆర్‌ను తయారు చేసే విషయంలో ఆంగ్లభాషలో తయారు చేయడంలో అందులో దొర్లుతున్న పద తప్పిదాలతో అర్ధాలు తీరు మారి అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. వాస్తవానికి గతంలో తాను అధికారభాషా సంఘం అధ్యక్షుడుగా వున్నప్పుడు ఇలాంటి అంశాలకు సంబందించి ప్రధానంగా, న్యాయస్థానం పోలీసు వ్యవస్థలో తెలుగుభాష అమలుకు సంబందించి ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ఆ ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే బుట్టదాఖలు అయ్యాయని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లలేదన్నారు. అప్పటి డిజిపి హోదాలో వున్న స్వర్ణజిత్‌సేన్‌కు కూడా 30 పదకోశాలతో కేసుల తయారు చేసే తీరుతెన్నులపై తాను రూపొందించిన విధానాలను అందించడం జరిగిందన్నారు. అయితే ఆయన తెలుగు వ్యక్తి కాదుకాబట్ట తాను పంపిన విధానాలను అమలు చేయలేదని తాను భావించి ప్రతి జిల్లాలో వున్న ఐపిఎస్, ఐఎఎస్ అధికారులకు కూడా పంపడం జరిగిందన్నారు. అయితే కొంత మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు స్పందించినా మరికొంత మంది ఆశించినంత రీతిలో స్పందించలేదన్నారు. వాస్తవానికి న్యాయస్థానాలను ఆశ్రయించేవారిలో అందరూ ఆంగ్లభాషను తెలిసిన వారే వుండరన్నారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగులోనే వాదనలు, ప్రతివాదనలు, తీర్పులు వుంటే రాష్ట్రంలో సగటు వ్యక్తికి అర్ధం అయ్యే అవకాశం వుంటుందన్నారు. తద్వారా ఏదైనా అభ్యంతరాలు వున్నా వ్యక్తం చేయడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుందన్నారు. ఇదిలా వుండగా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు అన్న మొదటి చర్చావేదికలో విదేశాల్లోని తెలుగువారు విద్యాసమస్యల్లో భాగంగా తెలుగుభాషా పరిరక్షణకు తెలుగుఅసోషియేషన్ ఆఫ్ లండన్ (తాళ్) కృషి అంశంపై లండన్ తెలుగు అసోసియేషన్ నాయకులు కోటా మల్లేష్ మాట్లాడుతూ లండన్‌లో బ్రిటీష్‌లైబ్రరీలో తెలుగుపుస్తకాలకు విశేష ఆదరణ వుందన్నారు. ఇక్కడ అందుబాటులో లేని అనేక ప్రముఖ పుస్తకాలు కూడా లండన్ బ్రిటీష్ లైబ్రరీలో వున్నాయన్నారు.

మాట్లాడితే తెలుగు భాష బతకదు
తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు బుద్ద ప్రసాద్ స్పష్టం
వాల్మీకిపురం, డిసెంబర్ 27: మాట్లాడితే తెలుగు భాష బతకదని తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా గురువారం తిరుపతి పశు వైద్య విశ్వవిద్యాలయంలో అధికార భాషగా తెలుగు అమలుపై జరిగిన చర్చా వేదికకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపధ్యంలో మాతృభాషలు మృతభాషలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు మొదట జరిగిన నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు వేరన్నారు. ఆనాడు పిజి వరకు తెలుగు చదుకునేవారని, కాని నేడు పిల్లలు కానె్వంట్ చదువుతోనే తెలుగు మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1913లో ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఉద్యమం ప్రారంభమైందని, ఇప్పుడు ఆ భాషనే మరిచిపోయే స్థితికి నేడు మనం చేరుకున్నామన్నారు. తెలుగు భాషా సంఘం కోరుకున్న లక్ష్యం ఇంతవరకు నెరవేరలేదని విచారం వ్యక్తం చేశారు. 1956లో అధికార భాషా చట్టం వస్తే 1974 వరకు సంఘం ఏర్పాటుకాలేదన్నారు. అనంతరం తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సినీ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని వారు వారి భాషలోనే మాట్లాడుతున్నారని చెప్పారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాల పేర్లు అన్నీ వారి వారి భాషల్లోనే ఉంటాయని, మన రాష్ట్రంలో కూడా తెలుగులోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ చర్చవేదికలో శాసన మండలి సభ్యులు పిజె వెంకటేష్, విల్సన్, వెంకటేశ్వర్‌రావు, అధికార భాషా సంఘం సభ్యులు ఎబికె ప్రసాద్, వెలిచాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

యువతకు దోహదపడేవే ఉప చర్చా వేదికలు
* మంత్రి డాక్టర్ శైలజానాథ్ వెల్లడి
ఆంధ్రభూబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 27: నేటి యువతకు దోహదపడేదే ఉప చర్చావేదికలు అని ప్రాథమిక విద్య, సర్వశిక్షా అభయాన్ శాఖామంత్రి ఎస్.శైలజానాథ్ అన్నారు. గురువారం ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వర ప్రాంగణంలో విద్యారంగ ప్రగతిపై చర్చావేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఉప చర్చా వేదికలు నేటి విద్యార్థులకు సోపానాలన్నారు. మారుతున్న విద్యావ్యవస్థల గురించి తెలియజేసే ఈ చర్చావేదికల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వక్త డాక్టర్ ఆచార్య విశ్వనాథప్ప మాట్లాడుతూ పాఠ్యప్రణాళికా బోధనా భాషలపై విద్యార్థులు విజ్ఞానాన్ని వారే సంపాదించుకునేలా విద్యాబోధన చేయాలన్నారు. విద్యలో మార్పులు చోటు చేసుకున్నాయని తార్కిక పద్ధతిలో గణిత బోధన చేయాలన్నారు. ఆచార్య హరినాథ్ మాట్లాడుతూ భాషపై మమకారం, అభిరుచి కలిగించేవే గ్రంథాలయాలన్నారు. భాషా వ్యాప్తిలో తెలుగు అధ్యాపకులు, గ్రంథాలయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. పరిశోధనల ద్వారా నైపుణ్యం, సభల ద్వారా శ్రవణ నైపుణ్యం కలుగుతుందన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా పెద్దలు ప్రేరేపించాలన్నారు. ఆచార్య రావి రంగారావు మాట్లాడుతూ తెలుగు పరిశోధనా అధ్యయనాలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సమర్పించే తెలుగు నివేదికలకు అనుమతించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తమిళంలో పరిశోధనలు చేస్తుంటే తెలుగు ఎందుకు పరిశోధనలు జరగడం లేదని ప్రశ్నించారు. పూర్వపరిశోధనా సంస్థను ప్రతి విశ్వవిద్యాలయంలో అమలు చేయాలన్నారు. పరిశోధనా పద్దతి, విశే్లషణ, వంటి అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సరోజిని, శ్రీలక్ష్మి, తదితరులు ప్రసంగించారు.

తెలంగాణపై తీసుకునే నిర్ణయం ఎన్నికల ముందు తీసుకున్నదే..!
* మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 27: తెలంగాణపై తీసుకున్న నిర్ణయం ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయమేనని మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత నాయకుల అభిమతం కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర విభజనకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వారు నాయకులుగా చలామణి అయ్యేందుకే రాష్ట్రాన్ని విభజించాలని కోరుకుంటున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో నాయకులు ఆడుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులకు సెల్యూట్ అని వెళ్లిపోయారు.

భారీ భద్రత మధ్య తెలుగు సంబరాలు ప్రారంభం
* విఐపిల రాకతో ఎటుచూసినా ట్రాఫిక్...ట్రాఫిక్..
* తెలుగు కళావిందు ఆరగించిన తిరుపతి జనం
తిరుపతి, డిసెంబర్ 27: ప్రపంచ తెలుగుమహా సభలు భారీ భద్రత మధ్య గురువారం ఉదయం ప్రారంభమైయ్యాయి.్భరత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిదిగా విచ్చేసి సభలను ప్రారంభించారు. రాష్టప్రతికి స్వాగతం పలికేందుకు ఒక రోజు ముందే తిరుపతికి చేరుకున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, గుండు సుదారాణి, మంత్రులు వట్టివసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, డికె అరుణ, పార్ధసారది, రఘువీరారెడ్డి, స్పీకర్ నాదెళ్ళ మనోహర్ తదితరులు పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు. ఒక వైపు విఐపిలు, మరో వైపు జాతీయ, అంతర్జాతీయ స్ధాయి ప్రతినిదులు పెద్ద ఎత్తున తిరుపతికి రావడంతో పోలీసులకు దిక్కుతెలియని పరిస్థితి ఏర్పడింది. బందోబస్తు నిమిత్తం పశ్చిమ గోధావరి, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాల నుండి 200 మంది చొప్పున పొలీసులను రప్పించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుండి జిల్లాకు 400 మంది చొప్పున పోలీసులను రప్పించారు. మొత్తం 6వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 8 మంది ఎఎస్‌పిలు,32 మంది డిఎస్‌పిలు, 110 మంది సిఐలు,3వేల మంది కానిస్టేబుల్స్, 200 మంది మహిళా హోంగార్డులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. ఒక వైపు నగరంలో మహాజన ప్రదర్శన, మరో వైపు రాష్టప్రతి కాన్వాయ్‌లను సమన్వయం చేస్తూ పోలీసులు ముందుగానే పటిష్టమైన ప్రణాళికలను రూపొందించినా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ దృశ్యాలే కనిపించాయి.
చిత్రం.. హాయ్ భళారే విచిత్రం...
నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభలకు విచ్చేసిన ప్రతి హృదయం తెలుగు సంస్కృతి, సాంప్రదాయం కళావిందు భోజనం ఆరగించారు. ఎటుచూసినా తెలుగువైభవాన్ని తిలకించి పులకించారు. జానపద కళారూపాలైన చెక్క్భజన, పండరిభజన, చిందులు, యక్షగానాలు, చెంచులు, గరకలు, ఉరుములు, తప్పెటగుళ్లు, గంగిరెద్దులు, వీధినాటికలు, కోలాటాలు, కొమ్ములు, దింసా నృత్యాలు, బుడబుక్కల, కొమ్ములు, గురవయ్యలు, యానాదులు, లంబాడీలు, దేవరపెద్ది, తోలుబొమ్మలాటలు, డప్పులు, సన్నాయి, హరిదాసులు, హరికథలు, బుర్రకథలు, పల్లెసుద్దులు, కాటికాపర్లు, సాధన శూరులు, పిల్లంగట్లు తదితర కళారూపాలతో జానపద ఉపవేదిక సందడి చేసింది. ఈ వేషాలతో నగరం సందడిగా మారింది. పాఠశాల విద్యార్థులనే కాదు ప్రతి ఒక్కర్ని అబ్బురపరిచింది. మన తెలుగు సంస్కృతి ఇంత గొప్పదా? అన్ని సంస్కృతులు, కళలు మనవేనా? అన్న ఆశ్చర్యాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాయి. అనేక మంది చిన్నాపెద్ద తేడా లేకుండా కళాకారులతో కలిసి నృత్యం చేయడం, వారితో కలిసి ఫొటోలు తీసుకోవడం విద్యార్థులు, చిన్నారుల హృదయాల్లో నిజంగానే తెలుగు సంబరాన్ని నింపిందనే చెప్పాలి. చిత్రం భళారే విచిత్రం అని చెప్పక తప్పదు.
ఓం నమః..శివాయః..అంటూ అలరించిన సుబ్బరామిరెడ్డి
నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభల్లో రాష్టప్రతి ప్రసంగానికి ముందుగా ప్రసంగం చేసిన ఎంపి సుబ్బరామిరెడ్డి తన శివభక్తిని చాటుకుంటూ ప్రసంగించి అందర్నీ అలరించారు. ప్రపంచ తెలుగుమహాసభల ద్వారా మన తెలుగును కాపాడుకుందాం. తెలుగువాడి దెబ్బా అంటే గోల్కొండ అబ్బా అనాలి అంటూ సభను రంజింపజేశారు. మళ్లీ జన్మంటూ వుంటే తాను తెలుగువాడిగానే జన్మించాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నానన్నారు. ధర్మ శరణం గచ్ఛామి.. బుద్దం శరణం గఛ్చామి, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ బిగ్గరగా స్మరిస్తూ ఒక్కసారిగా సభను తనపైపు ఆకర్షింపజేశారు. సినీనటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు తనకు తెలుగుభాష అన్నా, తెలుగుజాతి అన్న ఎంతో మక్కువ ఎక్కువ అన్నారు. మన తెలుగుభాష తియ్యదనం మరేభాషలోనూ లభించదన్నారు. సభలో ఆహ్వానితులను ఆహ్వానిస్తూ తమ తెలుగుపాండిత్యాన్ని, పద సంచలన విన్యాసాలను వినిపిస్తూ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ గౌరవాధ్యక్షులు కెవి రమణాచారి, సంచాలకులు రాళ్ళబండి కవితా ప్రసాద్ అందర్ని అలరింపజేశారు. నాల్గవ ప్రపంచ తెలుగుమహాసభలకు దేశ, విదేశాల నుండి తరలివచ్చిన ప్రతినిధులతో అటు రైల్వే స్టేషన్ ఇటు బస్టాండ్ కిక్కిరిసి పోయింది. ఎటు చూసినా సభలకు వచ్చే ప్రతినిధులు, ప్రముఖులు, వారికి స్వాగతం పలికేవారితో సందడిగా మారింది.

* తిరుపతిలో అంబరాన్ని అంటిన తెలుగు సంబరాలు * ఆకట్టుకున్న కళాప్రదర్శనలు, శకటాలు
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>