ఖమ్మం, డిసెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు చెప్పబోయే అభిప్రాయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీలను కేంద్రహోంశాఖ పిలవగా అందులో టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనంటూ గతం నుంచే స్పష్టం చేస్తూ వస్తున్నాయి. సిపిఎం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము అడ్డంకి కాదని, అయితే రాష్ట్రం కలిసి సమైక్యంగా ఉంటే అభివృద్ధి చెందుతుందని గతంలోనే స్పష్టం చేసింది. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంది. ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను పంపిస్తుండగా కేంద్ర హోంశాఖకు ఎటువంటి అభిప్రాయం చెప్తారనే విషయంపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీ తమ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్తుండగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అధినేత చంద్రబాబు ఇచ్చే లేఖను సీల్డ్ కవర్‌లో హోంశాఖామంత్రి షిండేకు అందచేస్తామని, వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటిస్తే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ నేతలను తిరగనివ్వమని ఇప్పటికే తెలంగాణ జెఏసి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అయితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేసేందుకు జెఏసి ప్రయత్నించే అవకాశం ఉందని ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ముందస్తుగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు పాఠశాలల యజమాన్యాలు కూడా ఆయా పార్టీల, ప్రభుత్వ వైఖరిపై ఆసక్తిగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా గతేడాది అనేక రోజులు పాఠశాలలు నడవకపోవటం గుర్తు చేస్తూ ఈ ఏడాది ఆ పరిస్థితులు రావని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీలు నిర్ణయం తీసుకోవాలని యజమాన్యాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
సర్పంచ్‌ను పీకకోసి చంపిన మావోలు
* మరోచోట ప్రభుత్వ వైద్యశాల ధ్వంసం
చింతూరు, డిసెంబర్ 27: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సర్పంచ్‌ను మావోయిస్టులు గురువారం పీకకోసి చంపారు. వివరాలు ఇలా వున్నాయి. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి గ్రామానికి సర్పంచ్ అయిన కొడియం నాగాను మావోయిస్టులు గురువారం అతని ఇంటి వద్ద నుంచి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి, మావోల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని నిర్ధారణకు రావటంతో నాగాను కత్తులతో పీకకోసి హతమార్చారు. ఇదిలా ఉండగా సుకుమ జిల్లా పొలంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని గోరుకొండ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్యశాలను మావోయిస్టులు పూర్తిగా ధ్వంసం చేశారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో
తండ్రీకొడుకుల సహా ముగ్గురు మృతి
టేకులపల్లి, డిసెంబర్ 27: జిల్లాలోని టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో దుమ్ముగూడెం ఆర్‌ఐతో పాటు తండ్రి కొడుకులు కొడుకులు వున్నారు. టేకులపల్లి మండలంలో జరిగిన ప్రమాదంలో తండ్రీకొడుకులు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను టిప్పర్ ఢీకొన్నప్రమాదంలో తండ్రీ కొడుకులు గురువారం అక్కడికక్కడే మృతిచెందారు. మండల పరిధిలోని బొమ్మనపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శంభునిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోప్యాతండాకు చెందిన బానోత్ లాల్‌సింగ్ (35), తన కుమారుడు బానోత్ దేవేందర్ (10)తో కలిసి మోటార్‌సైకిల్‌పై ఇల్లెందు - కొత్తగూడెం ప్రధాన రహదారిలో వెళ్తుండగా బొమ్మనపల్లి వద్ద పాల్వంచ నుంచి అతివేగంగా వస్తున్న టిప్పర్ వెనుక నుంచి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా తండ్రి లాల్‌సింగ్ టిప్పర్ టైరులో చిక్కుకుని మృతిచెందగా, కుమారుడు దేవేందర్ తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడి మృతిచెందాడు. దేవేందర్ కొత్తగూడెం శివశివాని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మృతునికి భార్య బుజ్జి, ఐదు సంవత్సరాల కూతురు ఉన్నారు. టేకులపల్లి ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్‌ఐ మృతి
దుమ్ముగూడెం: మండల పరిధిలోని భైరాగులపాడు, కేశవపట్నం గ్రామాల మధ్య బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుమ్ముగూడెం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.....దుమ్ముగూడెం మండలంలో ఆర్‌ఐగా పని చేస్తున్న వర్సా లక్ష్మీపతి (40) బుధవారం రాత్రి మండల కార్యాలయంలో విధులు ముగించుకొని చర్లలో ఉన్న తన భార్య వద్దకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కాగా మార్గమధ్యంలోబైరాగులపాడు, కేశవపట్నం గ్రామల మధ్యకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న తాటి చెట్టుకు బలంగా ఢీ కొంది. దీంతో లక్ష్మీపతి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈప్రమాదం అర్ధరాత్రి జరగడంతో తెల్లవారే వరకు ఎవరూ గుర్తించలేదు. తెల్లవారుజామున బైరాగులపాడు గ్రామానికి చెందిన కొంతమంది మృతదేహాన్ని చూసి దుమ్ముగూడెం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఐ బి సత్యనారాయణ తన సిబ్బందితో కలసి గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు లక్ష్మీపతి గత పదేళ్లుగా రెవెన్యూ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చర్ల మండలంలో ఎనిమిదేళ్లపాటు విఆర్‌ఓగా పని చేసి గత రెండేళ్ల క్రితం పదోన్నతిపై దుమ్ముగూడెం ఆర్‌ఐగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా మృతుని భార్య వీరమ్మ చర్ల మండల విఆర్‌ఓగా పని చేస్తున్నారు. మృతునికి ఓ కూతురు ఉంది. ఆర్‌ఐ స్వగ్రామం దుమ్ముగూడెం మండలం రామారావుపేట గ్రామం. జరిగిన సంఘటనపై దుమ్ముగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్‌ఐ మృతికి పలువురి సంతాపం :
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుమ్ముగూడెం ఆర్‌ఐ లక్ష్మీపతి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి తహశీల్దారు వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ కృష్ణ, సిబ్బంది, ఎండీఓ ఆర్వీ సుబ్రమణ్యంతో పాటు పలుపార్టీల నేతలు, ప్రముఖులు, విఆర్వోలు లక్ష్మీపతి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
తెలంగాణపై వీరు నోరు మెదపరే?!
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కాంగ్రెస్ ప్రతినిధులు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రధాన నాయకులు మాత్రం ఆ ఊసెత్తటం లేదు. అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, ఢిల్లీలలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయటమేకాకుండా ప్రకటనలు సైతం ఇస్తున్నారు. కానీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు జిల్లాలో ప్రధాన నాయకులుగా ఉన్న వారెవరు ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఇతర జిల్లాల నాయకుల్లాగా ప్రకటనలు చేయటం లేదు. దీనిపై జిల్లాలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమావేశమై ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేయగా, అందులో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు లేకపోవటం గమనార్హం. అలాగే తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు కూడా తమ శక్తి మేరకు వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుండగా జిల్లాకు చెందిన రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనోభావాలను గౌరవిస్తామని మాత్రమే చెప్తూ వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్తున్నా అది హైదరాబాద్ స్థాయిలో కూడా నాయకులకు విన్పించటం లేదు. ఇక జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఏకంగా తాము ఎప్పుడో తమ పార్టీ అభిప్రాయాన్ని చెప్పామని ఇతర పార్టీలే చెప్పాల్సి ఉందని తాజాగా ప్రకటించారు. అంతకుమించి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆమె ఎప్పుడు స్పష్టం చేసిన దాఖలాలు లేవు. ఇక డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో ఉంటే తన నియోజకవర్గ పనులు మాత్రమే చూసుకుంటూ ఈ అంశంపై స్పందించటం లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన (మిగతా 6లో)
అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌స్థాయిలో తెలంగాణకు అనుకూలంగా కొద్దిగా మాట్లాడుతున్నారు. కాగా ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటున్న కాంగ్రెస్ నాయకులు నోరుమెదపకపోవటంపై జెఏసి నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ప్రజాప్రతినిధులు మొక్కుబడి ప్రకటనలు చేస్తుండటం బాధాకరమని, ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష భేటిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇళ్ళ ఎదుట ఆందోళనలు చేసేందుకు వెనుకాడమని ఇప్పటికే తెలంగాణవాదులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అనుకూల వైఖరిని చెప్పేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు.
90 వేల కొత్తరేషన్ కార్డులు మంజూరు
బయ్యారం, డిసెంబర్ 27: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్ గురువారం బయ్యారం మండలంలో అకస్మిక పర్యటన జరిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో కొత్తగా రేషన్‌కార్డు నమోదుచేసుకున్న 1194మందికి రెండురోజుల తరువాత తహశీల్దార్ కార్యాలయంలో రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 90వేల కొత్త రేషన్‌కార్డులను మంజూరుచేసినట్లు తెలిపారు. జనవరి 1వతేదీ నుండి మీసేవా కేంద్రంలో డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్ట్ఫికెట్లు తీసుకోవచ్చన్నారు. మండల కేంద్రంలో ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంధంపల్లి పంచాయతీ శివారులోని వివాదాస్పదమైన భూమిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జెసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ రాములునాయక్, విఆర్‌ఓ రోశయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింగిల్ అజెండాతో అఖిలపక్షం ఢిల్లీ వెళ్లాలి
పినపాక, డిసెంబర్ 27: తెలంగాణా సాధన కోసం అనేక మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడినా ఇప్పటి వరకు వౌనంగా ఉన్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎట్టకేలకు పెదవి విప్పారు. గురువారం మండల పరిధిలోని ఏడూళ్ళబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు ఢిల్లీలో జరగనున్న అఖిలపక్షం సమావేశానికి నేతలంతా సింగిల్ అజెండాతో వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెసు పార్టీ నాయకులు అంతా ఏకాభిప్రాయంతో ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తెలంగాణా సమస్య పెండింగ్‌లో ఉండటం వలన అనేక మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చెయ్యాల్సి వచ్చిందన్నారు. తెలంగాణా సమస్యపై కాంగ్రెసు పార్టీ హైకమాండ్ సరైన సమయ లో సరైన నిర్ణయం తీసుకుంటామని మొదటి నుంచి చెబుతూ వచ్చిందని ఇప్పడు ఆ సమయం వచ్చిందన్నారు. ఇప్పటికైనా రాజకీయపార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉండాలని ఆయన కోరారు. ఇదే విషయం పీసీసీ అధ్యక్షుడు బొత్సా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలకు చెప్పానన్నారు. ఈ అఖిలపక్షం సమావేశంతో కాంగ్రెసు పార్టీ హైకమాండ్ తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కంది సుబ్బారెడ్డి, నాగయ్య, కొండేరు రాము తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని శిశువు మృతదేహం లభ్యం
కూసుమంచి, డిసెంబర్ 27: సుమారు వారం రోజుల వయస్సు గల శిశువు మృతదేహం గురువారం పాలేరు రిజర్వాయర్ చిన్నకాల్వలో లభ్యమైంది. కాలువ నీటిలో ఉన్న శిశువు మృతదేహం విషయాన్ని స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానిక సిఐ జి వెంకట్రావు శిశువు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గుర్తు తెలియని శిశువు మృతి అనుమానస్పదంగా ఉందని సిఐ తెలిపారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ వెంట ఎస్‌ఐ పి రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏజెన్సీ అభివృద్ధిపైనే దృష్టి : కలెక్టర్ జైన్
మణుగూరు, డిసెంబర్ 27: గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఏజెన్సీ అభివృద్ధిపైనే దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. గురువారం స్థానిక సింగరేణి విశ్రాంతి భవనంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. స్థానిక 30 పడకల ఆస్పత్రిని జనవరి 26లోగా పూర్తి స్థాయిలో 24 గంటల ఆస్పత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను టైంబాండ్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేరంటాలచెరువు, రేగులగండి, తుమ్మలచెరువుల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ పులుసుబొంత ప్రాజెక్టు మొదటి దశకు క్లియరెన్స్‌కు బెంగుళూరుకు నివేదికను పంపనున్నామని తెలిపారు. అలాగే కొంతమంది రేషన్‌కార్డులు ఏరివేతలో పోయామని, మరోమారు సర్వే చేసి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులు, సాగు, తాగునీటి సమస్యలపై దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం ఐటిడిఎ పీఓ జి వీరపాండియన్, పాల్వంచ ఆర్డీఓ వి శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‘బ్లాక్’ మార్కెట్లో
నీలి కిరోసిన్
భద్రాచలం, డిసెంబర్ 27: ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న నీలి కిరోసిన్ కొన్ని ఏజెన్సీ సంస్థల తీరు వల్ల సరైన సమయంలో రేషన్‌షాపులకు అందడం లేదు. ఆర్వోలు అందడం లేదనే సాకును చూపుతూ నెలాఖరున కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇందులో సైతం కొంత మేర కోత పెడుతూ రేషన్‌డీలర్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కిరోసిన్ కోత పెడుతున్నారు. సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ కొరవడటం వీరికి కలిసొస్తోంది. వివరాల్లోకి వెళ్తే.....్భద్రాచలం ఏజెన్సీలో ప్రతి నెలా 20వ తారీఖులోపు ఆయా రేషన్‌షాపులకు నీలి కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. కాగా ఆయా మండలాల నుంచి ఆర్వోలు అందడం లేదంటూ భద్రాచలంలోని ఏజెన్సీసంస్థ సరైన సమయానికి కిరోసిన్‌ను అందించడం లేదు. ప్రతీనెలా 20వ తేదీలోపు సరఫరా చేయాల్సి ఉండగా ఈ నెల 21,22 తేదీలతో పాటు 24,25,26 తేదీల్లో సైతం కిరోసిన్‌ను అందించారు. ఇక వాజేడు, వెంకటాపురం మండలాల్లో అయితే ఈ నెల 25,26 తేదీల్లో కిరోసిన్‌ను సప్లై చేశారు. వీటన్నింటికీ కిరోసిన్ ఆర్వోలు అందలేదనే సాకును చూపుతూ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల మేరకు 20వ తేదీలోపు, ఆయా రేషన్‌షాపుల వద్దనే కిరోసిన్ పోయాల్సి ఉండగా వాటిని పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ కిరోసిన్ పోస్తున్నారు. కిరోసిన్ ట్యాంకర్‌తో పాటు మండల ఆర్‌ఐ, విఆర్‌ఓలు ఉండాల్సి ఉండగా ట్యాంకర్ వచ్చిన సమయంలో కొలతల్లో తేడాలు వస్తున్నాయంటూ రేషన్‌డీలర్లు లబోదిబోమంటున్నారు. కిరోసిన్ పోసిన తర్వాత కొలతలు చూస్తే ఒక్కో పీపాకు 5-10 లీటర్ల మేర తక్కువగా వస్తుందని రేషన్‌డీలర్లు వాపోతున్నారు.