డి గన్నవరం, డిసెంబర్ 27: డి గన్నవరం ఇసుక రీచ్ నుంచి నదిలోని ఇసుక తినె్నల్లోకి తాత్కాలిక పర్మిట్‌తో నిర్మించిన ర్యాంపును హెడ్‌వర్క్స్ ఇఇ ఆదేశాలతో గురువారం తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులను ర్యాంపు నిర్వాహకులు అడ్డుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ర్యాంపు వద్దనున్న హెడ్‌వర్క్స్ అధికారులు స్వల్పంగా గండికొట్టి చేసేదేమీలేక తిరిగి వెళ్ళిపోయారు. ఈ ర్యాంపు నుండి నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో లారీలతో పెద్ద ఎత్తున ఇసుక తీసి స్టాక్ పాయింట్లకు తరలిస్తుండటంతో అక్విడెక్ట్‌కు ప్రమాదం వాటిల్లుతుందని పలువురు అభ్యంతరాలు లేవనెత్తిన విషయం విదితమే. ర్యాంపు వద్దకు ఇసుక పడవలు రావడం లేదన్న కారణంగా నదిలోకి ర్యాంపు నిర్మించేందుకు ఈ నెల 3న ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఇఇ పివి తిరుపతిరావు తాత్కాలిక పర్మిట్ ఇచ్చారు. దీంతో నదిలోకి ర్యాంపు నిర్మించి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తుండటంతో ఆందోళన మొదలయ్యాయి. ఈ కారణంగా ఇఇ గురువారం తాత్కాలిక ర్యాంపును తొలగించాలంటూ మళ్ళీ ఆదేశాలు జారీచేసారు. పొక్లయినర్‌తో ర్యాంపును తొలగించేందుకు వచ్చిన రాజోలు హెడ్ వర్క్స్ డిఇఇ వివి రామకృష్ణ, ఎఇ డి రాధాకృష్ణలను ర్యాంపు నిర్వాహకులు అయిన వెంకటేశ్వరరావు, స్టాండ్ అండ్ క్వారీ బోట్స్‌మెన్, ఫిషర్‌మెన్ సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు పోలీసు రక్షణ కోరారు. సుమారు 200 మంది సొసైటీ సభ్యులు అడ్డుకున్నారు. నదిలోకి నిర్మించిన ర్యాంపునకు రెండుచోట్ల స్వల్పంగా గండి కొట్టారు. తూరలతో సహా మొత్తం ర్యాంపు తొలగించాలని ఇఇ ఆదేశించారు. సొసైటీ సభ్యుల వ్యతిరేకించడంతో సాయంత్రం వరకు వేచి చూసిన అధికారులకు చివరకు చేసేదేమీలేక తిరిగి వెళ్ళిపోయారు. ఈ ర్యాంపు తొలగించకూడదంటూ హెడ్ వర్క్స్ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ర్యాంపు నుండి నదిలోకి లారీలు వెళ్లకుండా లస్కర్‌లను కాపలాగా ఉంచామని డిఇ చెప్పారు. పడవల ద్వారా మాత్రమే ఇసుక తీసుకుని విక్రయించుకోవాల్సివుందని ఆయన వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లో ర్యాంపు పరిశీలన : ఇఇ
వివాదం తలెత్తిన డి గన్నవరం ఇసుక ర్యాంపులో తాత్కాలికంగా నిర్మించిన ర్యాంపును తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు హెడ్‌వర్క్స్ ఇఇ తిరుపతిరావు వెల్లడించారు. గురువారం ఆయన ఫోన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో తమ కమిటీ పరిశీలిస్తుందని ఆయన వివరించారు. మైన్స్ ఏడి, గ్రౌండ్స్ వాటర్ డిస్ట్రిబ్యూటరీ డైరెక్టర్ తాను కలిసి ఇక్కడి పరిస్థితిని పరిశీలించి జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని ఇఇ చెప్పారు.
మల్లేశ్వరంలో కొత్త చమురు బావి
భద్రతకు అత్యంత ప్రాధాన్యం:ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ కృష్ణారావు
రాజమండ్రి, డిసెంబర్ 27: ఓఎన్జీసీ చమురు అనే్వషణలో భాగంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు రాజమండ్రి ఎసెట్ మేనేజర్ పి కృష్ణారావు వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని మల్లేశ్వరంలో కొత్త చమురు బావిని కనుగొన్నట్లు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జాతి సంపద అయిన ఓఎన్జీసీలో ఐదంచెల భద్రతాచర్యలు తీసుకుంటున్నామన్నారు. 653 సెక్యూరిటీగార్డులు, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సిఐఎస్‌ఎఫ్, కాంట్రాక్టు గార్డులతో పాటు పోలీసుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నామన్నారు. విలువైన, ప్రమాదకరమైన హైడ్రోకార్బన్ ఉత్పత్తులు, గ్యాస్ నిక్షేపాలు చోరీకి గురికాకుండా ఉత్పత్తి కేంద్రాలు, పైపులైన్ల వద్ద సిసి కెమెరాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతాచర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడాది ముగ్గురు చోరులు పట్టుకున్నామన్నారు. పైపులైన్ల వద్ద చమురు చోరీకి పాల్పడితే సంస్థకు నష్టం వాటిల్లడంతో పాటు, స్థానికులకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందన్నారు. పాత పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమండ్రి ఎసెట్ పరిధిలో 23 ఉత్పత్తి కేంద్రాలు, 8 రిగ్గులు, ఒక మినీ రిఫైనరీ, 650 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు ఉన్నాయని వివరించారు. రోజుకు 830 టన్నుల చమురు, 33లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నామన్నారు.
తక్షణం విధుల్లో చేరాలి
-కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు డిఇఒ ఆదేశం-
కాకినాడ సిటీ, డిసెంబర్ 27: డిఎస్సీ-2012 తుది జాబితాలో అర్హత సాధించి కౌనె్సలింగ్‌కు హాజరై ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్ధులందరూ తక్షణం విధుల్లోకి చేరాలని జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో డిఎస్సీ-2012 తుది జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు గురువారం కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యుర్థులందరి సర్ట్ఫికెట్‌లను పరిశీలించి ఉపాధ్యాయ నియామక పత్రాలను డిఇఓ శ్రీనివాసులరెడ్డి అందజేశారు. శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం సైతం మిగిలిన అభ్యర్ధులకు కౌనె్సలింగ్ నిర్వహించి విద్యార్హత సర్ట్ఫికెట్‌ల పరిశీలన అనంతరం నియామక పత్రాలను అందజేయనున్నారు. గురువారం కౌనె్సలింగ్‌కు హాజరైన అభ్యర్ధులందరూ తక్షణం విధుల్లోకి చేరాలని డిఇఓ శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు.
దిండి, టేకిశెట్టిపాలెం రీచ్‌లకు టెండర్లు ఖరారు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 28: మల్కిపురం మండలం రీచ్ నెంబర్ 45 దిండి, సఖినేటిపల్లి మండలం రీచ్ నెంబర్ 46 టేకిశెట్టిపాలెం ఇసుక రీచ్‌లకు టెండర్లు ఖరారు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బాబు ఎ తెలిపారు. గురువారం విధాన గౌతమీ సమావేశ హాలులో ఇసుక తవ్వకాల లీజ్ లాటరీని నిర్వహించారు. మొదట దిండి 63.000 కిలో మీటర్ల నుండి 69.000 కి.మీ వరకు ర్యాంప్‌కు లాటరీ వేశారు. దీని విస్తీర్ణం 2.94 హెక్టార్‌లు కాగా తవ్వకానికి 29.400 క్యూ.మీగా అనుమతించి 11 లక్షల 70 వేల 920 ధరగా నిర్ణయించారు. ఈ రీచ్‌కు 12 మత్స్యకార సొసైటీలు హాజరుకాగా ఇందులో రెండు సొసైటీలు రద్దు చేశారు. మిగిలిన 10 సొసైటీలకు సమాన కాలపరిమితికి లాటరీని నిర్వహించారు. మొదటగా వెంకటేశ్వర అగ్ని కులక్షత్రియ శాండ్ క్వారీ బోట్స్ మెన్ సొసైటీ, రెండవది మెరైన్ శాండ్ క్వారీ బోట్స్‌మెన్ ఫిషర్‌మెన్ సొసైటీకి కేటాయించారు. లీజు కాలపరిమితిని 10 సొసైటీలకు సమానంగా పంచుతున్నట్లు జెసి బాబు చెప్పారు. టేకిశెట్టిపాలెం 69.000కి.మీ నుండి 80.000 కి.మీ వరకు దీని విస్తీర్ణం 3.54 హెక్టార్‌లు కాగా ఇసుక తవ్వకానికి 35, 398 క్యూబిక్ మీటర్లు అనుమతించి దీనికి 14 లక్షల 15 వేల 920 రూపాయలు ధరగా నిర్ణయించారు. ఈ ర్యాంప్‌నకు విఘ్నేశ్వర సాండ్ క్వారీ, బోట్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ లాటరీ పద్ధతిలో పొందిందని బాబు తెలిపారు.
దిగుబడి తగ్గి దిగాలు
*కొబ్బరి రైతు కుదేలు
*తుపాను, ఎండలే కారణం
రావులపాలెం, డిసెంబర్ 27: నీలం తుఫాన్ ప్రభావం ఇంకా రైతన్నను వెంటాడుతూనే ఉంది. వరి పంటకు అపార నష్టం వాటిల్లడంతో కుదేలవుతున్న రైతాంగం తాజాగా కొబ్బరి పంట దిగుబడి గణనీయంగా తగ్గడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెం మండలంలో తాజాగా కొబ్బరి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. సుమారు రెండు నెలల క్రితం ఎకరానికి 1500 నుండి 3 వేల కాయల వరకు దిగుబడి రాగా ప్రస్తుతం ఆ దిగుబడి పది శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఎకరానికి 300 నుండి 500 కాయలు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిగుబడి పుష్కలంగా వున్న సమయంలో అంతంత మాత్రంగా ఉన్న ధర నేడు సంతృప్తికరంగా పెరిగినా దిగుబడి లేకపోవడం రైతులను దిగాలుకు గురిచేస్తుంది. 1996 తుఫాన్ ప్రభావంతో అప్పట్లో ఈ పరిస్థితి కనిపించిందని, ఆ తరువాత కాలంలో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమమని రైతులు అంటున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత దిగుబడి దింపు కూలీ ఖర్చులకు కూడా చాలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై అంబాజీపేట ఉద్యానవన శాస్తవ్రేత్త డాక్టర్ డి రామానందంను వివరణ కోరగా ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రత కారణంగా పూత దశలో పిందెలు ఎండిపోవడం, ఇటీవల నీలం తుపాను ప్రభావంతో కురిసిన వర్షపు నీరు చేలల్లో నిల్వవుండటం కారణంగా కొబ్బరి దిగుబడి తగ్గిందన్నారు. తిరిగి దిగుబడి యధాస్థితికి చేరడానికి మూడు నుండి నాలుగు నెలల కాలం పడుతుందన్నారు.
ఏడు తహసీల్దార్ కార్యాలయాలకు భవనాలు
-జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్
యు కొత్తపల్లి, డిసెంబర్ 27: జిల్లాలో 7 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు. గురువారం మండల కేంద్రం కొత్తపల్లిలో 30 లక్షలతో నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయానికి గురువారం కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలి పోయిన ఐదు ఎంపిడిఓ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయించి పూర్తి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు కొత్తపల్లిలో అసంపూర్తిగా మిగిలి పోయిన వ్యవసాయశాఖ భవనానికి పనులు పూర్తి చేసి ప్రారంభిమస్తామన్నారు. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా డాక్టర్ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ మండలంలో ప్రారంభం కానున్న మాతాశిశు సంరక్షణ పథకం(మార్పు), స్వాభిమాన్ పధకానికి ప్రజలు సహకరించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే వంగా గీత మాట్లాడుతూ తుపాన్లు, వరదల సమయంలో ఉపయోగించుకునేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీవో జవహర్‌లాల్‌నెహ్రూ, మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, కొత్తపల్లి తహసీల్దార్ కె రత్నకుమారి, ఎంపిడిఓ రామలక్ష్మితో పాటు కాంగ్రెస్ నాయకులు జ్యోతుల చక్రబ్బాయి, కాపురెడ్డి, పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాల నేతలతో యానాం ఎస్పీ సమావేశం
-అత్యాచార ఘటనలపై అవగాహన-
యానాం, డిసెంబర్ 27: యానాంలోని అన్ని మహిళా సంఘాల నాయకులతో యానాం ఎస్‌పి వౌనిక భరద్వాజ్ సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మహిళా సంఘాల నాయకులతో మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో ఒక మెడికల్ విద్యార్ధినిపై జరిగిన అఘాయిత్యాన్ని మహిళా సంఘాల నాయకులకు ఆమె వివరించారు. అలాగే ఈ సంఘటనలతో దేశ వ్యాప్తంగా మహిళల్లో చైతన్యం వచ్చిందని, యానాంలో మహిళలపై ఎటువంటి అత్యాచారయత్నాలు గానీ, అత్యాచారాలు గానీ జరిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదుచేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలపై జరిగే ఎటువంటి సంఘటనపైనైనా స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదుచేయాలన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టకుర్రు, రమాభాయినగర్, గణపతినగర్, వంశీకృష్ణ కాలనీ, కనకాలపేట, కురసాంపేట, పరంపేట, దరియాలతిప్ప, సావిత్రినగర్, గిరియాంపేట గ్రామాల్లోని మహిళా సంఘాల నాయకులతో పాటు పట్టణంలోని అన్ని మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అత్యాచారాల నిరోధానికి మహిళా సంఘాల సహకారం
రాజమండ్రి, డిసెంబర్ 27: పెరిగిపోతున్న అత్యాచారాల నిరోధానికి స్వయంసహాయక సంఘాల సహకారాన్ని తీసుకుంటామని డిఐజి జి సూర్యప్రకాశరావు వెల్లడించారు. స్వయంసహాయక సంఘాల సహకారంతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. గురువారం రాత్రి రాజమండ్రిలో ఓఎన్జీసి ఆస్తుల భద్రతపై పోలీసు, ఓఎన్జీసి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఓఎన్జీసి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మారుతున్న యువత పోకడ, దృష్టికోణం కూడా ఒక కారణమన్నారు. ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓఎన్జీసి భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్, చైనా వంటి దేశాలు, తీవ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లుతుందన్న ఉద్దేశంతో ముందస్తు భద్రతాచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అలాంటి హెచ్చరికలు ఏమీ రాలేదన్నారు. రేంజి పరిధిలో కొత్త 4 తీరప్రాంత గస్తీ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, ఈమేరకు సిబ్బందికి కూడా తగిన శిక్షణ ఇప్పిస్తున్నామని డిఐజి వివరించారు. తీరప్రాంత గస్తీ చర్యల్లో భాగంగా స్థానిక మత్స్యకారులను హోంగార్డులుగా నియమించి, వేగులుగా వినియోగించుకుంటామని తెలిపారు. ఉదయం బోటులో ఏలూరు రేంజి పరిధిలోని అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించామన్నారు. నేరాలు, చోరీలు, ఇతర కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్షించామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పండుగల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు. నేరగాళ్లు, చోరీ ముఠాలపై నిఘా వేయాలన్నారు. మధురపూడి ఎయిర్‌పోర్టు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. గత ఏడాది కన్నా ఈఏడాది రోడ్డు ప్రమాదాలు 7శాతం తగ్గాయన్నారు. రోడ్డ్భుద్రతా, ట్రాఫిక్ సలహా సంఘాలను పునరుద్ధరించి, చైతన్యం తెచ్చేందుకు కృషిచేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డిఐజి విజ్ఞప్తి చేశారు. దుడుకుగా వాహనాలను నడిపి ప్రమాదాల బారినపడవద్దన్నారు. కోస్తా జిల్లాల సాంప్రదాయమైన కోడిపందాల నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామన్నారు. ఈసమావేశంలో ఎస్పీలు టి రవికుమార్‌మూర్తి, శివశంకర్‌రెడ్డి, రమేష్, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉదయం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిపై బోటులో క్రైం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో ఎక్సైజ్ నేరాలు, కోడిపందాలు, చోరీలు, అత్యాచారాలు, ఇతర నేరాలపై సబ్‌డివిజన్ల వారీగా సమీక్షా జరిపారు. అలాగే ఆయా జిల్లాల సరిహద్దు సమస్యలపై కూడా చర్చించారు. అంతరాష్ట్ర దొంగలు, నేరగాళ్లపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన తెలగపాములు, స్టూవర్టుపురం వంటి ముఠాలు ఒరిస్సా, ఇతర పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారని వారిపై ప్రత్యేక నిఘాను కొనసాగించాలన్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు బీహార్ ముఠా ప్రవేశించిందన్నారు. నేరగాళ్ల కదలికలపై క్రిమినల్, క్రైం ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రేంజిలోని పోలీసులు చోరీలు, నేరాల నిరోధంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ టి రవికుమార్‌మూర్తి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శివశంకర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రమేష్, కృష్ణా జిల్లా ఎస్పీ జె ప్రభాకరరావు, ఆయా సబ్‌డివిజన్ల డిఎస్పీలు పాల్గొన్నారు.
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
జగ్గంపేట, డిసెంబర్ 27: పెద్దలు అంగీకరించకపోవడంతో ఒక ప్రేమజంట గురువారం రాత్రి జగ్గంపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి. జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన నీలపల్లి గోపి, చిట్టూరి సుప్రియ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అన్నవరం సత్యదేవుని సమక్షంలో బుధవారం వివాహం చేసుకుని గురువారం పోలీసులను ఆశ్రయించారు. తమ పెద్దల నుంచి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని కోరారు.
స్ర్తిశక్తి భవనాలు త్వరలో పూర్తిచేస్తాం
జడ్పీ సిఇఒ జయరాజ్
ఆలమూరు, డిసెంబర్ 27: నిర్మాణంలో ఉన్న స్ర్తిశక్తి భవనాలు త్వరలో పూర్తిచేయనున్నట్టు జడ్పీ సిఇఒ జయరాజ్ అన్నారు. గురువారం ఆలమూరు మండలం చెముడులంకలో జరుగుతున్న కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని, ఆలమూరులో జరుగుతున్న స్ర్తిశక్తి భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మారేడుమిల్లి, సామర్లకోట, రౌతులపూడి, కోరుకొండ, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో స్ర్తిశక్తి భవనాలకు నిధుల కొరత వలన జాప్యం జరిగిందని, వాటికి ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిధులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ భవనాలను త్వరలో పూర్తిచేయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే జిల్లాలో 670 ఆర్‌ఒ ప్లాంట్లు ఉన్నాయని, వాటిలో 181 ప్లాంట్లు పనిచేయడంలేదని అన్నారు. వాటిని పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్‌ను నిధులు కోరామన్నారు. ఆలమూరు మండలంలో చెముడులంక, ఆత్రేయపురం మండలం పేరవరం, రావులపాలెం మండలం కొమరాజులంక, కొత్తపేట మండలం కొత్తపేటలలో నిర్మాణంలో ఉన్న సామాజిక భవనాలను ఆయన పరిశీలించారు. దీనిపై నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట పంచాయితీరాజ్ డిఇ, ఎఇ మురళి, ఎంపిడివో ఎస్ సుభాషిణి, ఇతర అధికారులు ఉన్నారు.
డెంగ్యూతో వ్యక్తి మృతి
కొత్తపేట, డిసెంబర్ 27: మండల పరిధిలోని ఖండ్రిగ గ్రామానికి చెందిన బొక్కా రాంబాబు (28) అనే వ్యక్తి గురువారం డెంగ్యూ వ్యాధితో మృతిచెందాడు. రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందినట్టు బంధువులు పేర్కొంటున్నారు.
జలప్రభ పనులు పరిశీలించిన కలెక్టర్
గొల్లప్రోలు, డిసెంబర్ 27: ఇందిర జలప్రభ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ గురువారం పరిశీలించారు. గొల్లప్రోలు మండలం కొత్తవజ్రకూటం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిర జలప్రభ పథకం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జనవరి 2వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరామ్ రమేష్, ఇందిర జలప్రభ, ఆధార్ ప్రత్యక్ష లబ్ది బదిలీ పధకాలను ప్రారంభించనున్న నేపధ్యంలో కలెక్టర్ పనుల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కొత్తవజ్రకూటం గ్రామంలో 9.25 ఎకరాల భూమిని ఇందిర జలప్రభ పధకం ద్వారా 7 లక్షల 67 వేల 374 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ఎంపిడిఓ టిఎస్ విశ్వనాధ్ వివరించారు. తదనంతరం చెందుర్తి గ్రామ పంచాయితీ కార్యాలయంలో అధికారులు, బ్యాంక్ అధికారులతో సమీక్షించి పించ్‌నులకు సంబంధించిన నగదు బదిలీ నిమిత్తం లబ్దిదారులకు బ్యాంక్ అక్కౌంట్‌లు తర్వితగతిన ఓపెన్ చేయించాల్సిందిగా కోరారు. తదనంతరం స్థానిక మండల పరిషత్ యుపి పాఠశాల వద్ద ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ముందు ప్రకటించిన విధంగా ఐఎస్‌ఎల్ నగదు బదిలీని చేబ్రోలులో కాకుండా చెందుర్తి గ్రామంలోనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐఎస్‌ఎల్, పెన్షన్లు, ఉపాధి హామీ పధకం కూలీలకు సంబంధించి నగదు బదిలీ ఇక్కడే ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. అలాగే గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించనున్న బహిరంగ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్‌డిఎ పిడి మధుకర్‌బాబు, కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ పవన్‌కుమార్, ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు, తహశీల్దార్ పినిపే సత్యనారాయణ, ఎంపిడిఓ విశ్వనాధ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.