నల్లజర్ల, డిసెంబర్ 27: భారతదేశంలో విద్యా, ఉపాధి వ్యవసాయ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని లోక్‌సత్తా అధ్యక్షుడు ఎన్ జయప్రకాష్ నారాయణ అన్నారు. నల్లజర్ల ఎకెఆర్‌జి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. మన దేశంలో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు ఉన్నా వాటిని వినియోగించుకుని అభివృద్ధిలో ముందుకు వెళ్ళే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా పాలకుల అసమర్ధత వల్లే అభివృద్ధి జరగడం లేదన్నారు. 30 ఏళ్ళ క్రితం వ్యవసాయ రంగంలో పశ్చిమ గోదావరి జిల్లాలో హరిత విప్లవం సాధిస్తే అప్పటి నుండి ఇప్పటివరకు అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. దీనికి కారణం ప్రభుత్వాల అసమర్ధతేనని వ్యాఖ్యానించారు. చాలా మంది ప్రజలు కూడా తమకు పింఛను అందిందా, ఓటుకు డబ్బు, మద్యం సీసా ఇచ్చారా అని చూస్తున్నారే తప్ప దేశాన్ని అభివృద్ధిచేసే నాయకులను పాలకులుగా ఎన్నుకోవడం లేదన్నారు. పరిజ్ఞానం ఉన్న విద్యకోసం ప్రజలు పోరాటం చేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు.
శ్రీవారి దేవస్థానం
ఇఒగా వేండ్ర?
ద్వారకాతిరుమల, డిసెంబర్ 27: రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వేండ్ర త్రినాధరావు జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేవస్థానం ఇఓగా పనిచేస్తున్న విష్ణుప్రసాద్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కాకినాడ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న త్రినాధరావు ఇక్కడ నియమితులైనట్టు తెలిసింది. గతంలో ఈయన జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఇదిలావుంటే ఇఓ విష్ణుప్రసాద్‌కు మరో ఆరునెలల పాటు ఎక్స్‌టెన్షన్ వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కుటుంబ తగాదాల నేపధ్యంలో
కుటుంబ తగాదాల నేపధ్యంలో
తల్లి, తమ్ముడు హత్య
ఏలూరు, డిసెంబర్ 27 : కుటుంబ తగాదాల నేపధ్యంలో కన్న తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని అన్నయ్యే కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఏలూరు రూరల్ సి ఐ ఎం సుధాకరరావు కధనం ప్రకారం ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ సాయి నగర్ ప్రాంతానికి చెందిన సిరిగిపల్లి మురళీ, అతని తల్లి సిరిగిపల్లి కృష్ణవేణి (48), తమ్ముడు సిరిగిపల్లి కిషోర్ (23)లు జూట్‌మిల్లులో పనిచేస్తున్నారు. కాగా సిరిగిపల్లి మురళీకి ఇటీవలే వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇచ్చిన కట్నాన్ని మురళీ తల్లి కృష్ణవేణి గృహావసరాలు నిమిత్తం ఖర్చు చేసేసింది. తనకు ఇచ్చిన కట్నం సొమ్ము ఇవ్వాలంటూ మురళీ గత కొంతకాలంగా తల్లిని కోరుతూ వస్తున్నాడు. ఇటీవలే వారికి గల పొలంలో కొంత భాగాన్ని విక్రయించి కొంత నగదు అడ్వాన్సుగా తీసుకున్న విషయాన్ని తెలుసుకున్న మురళీ తన కట్నం డబ్బులు ఇవ్వాలంటూ గురువారం తల్లితో ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కిషోర్ ఈ వివాదంలో కల్పించుకుని కట్నం సొమ్ము ఇచ్చేది లేదంటూ మురళీకి తెగేసి చెప్పాడు. అంతటితో ఆగకుండా కిషోర్ కత్తితో అన్న మురళీపై దాడికి దిగాడు. తమ్ముడు చేతిలోనుంచి కత్తి లాక్కుని తల్లి కృష్ణవేణిని, తమ్ముడు కిషోర్‌లను విచక్షణా రహితంగా నరికేశాడు. తీవ్రంగా గాయపడిన వారిరువురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు ఎస్పీ విఎన్‌వి సత్యనారాయణ, రూరల్ సి ఐ ఎం సుధాకరరావు, ఎస్ ఐ దాశరధిలు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కృష్ణవేణి, కిషోర్‌ల మృతిని హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పటిష్ఠంగా సహకార ఎన్నికలు
కలెక్టర్ వాణీమోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, డిసెంబర్ 27 : జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం సహకార ఎన్నికల ఏర్పాట్లను కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 256 ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటీలకు వచ్చే ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 4వ తేదీల్లో నిర్వహించే ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాల పుస్తకాలను ముద్రించి సంబంధిత అధికారులకు అందజేయాలని జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఎన్నికల నిర్వహణపై వచ్చే నెలలో డివిజనల్ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో సహకార శాఖ, రెవిన్యూ అధికారులు సమన్వయంతో ఏ సమస్య ఉత్పన్నం కాకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. అన్నీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల రోజు 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. తప్పులు లేని విధంగా ఓటర్ల జాబితాలను రూపొందించుకోవాలన్నారు. సహకార ఎన్నికల్లో పోటీ చేసే ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్ధులు నామినేషన్ పత్రాలకు 100 రూపాయలు చొప్పున, బిసి అభ్యర్ధులు 200 రూపాయలు, ఇతర కులస్థులు 400 రూపాయలు నామినేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు స్వీకరణ దగ్గర నుండి పోలింగ్, ఓట్ల లెక్కింపు జరిగే ప్రక్రియ వరకూ ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను పరిశీలించి తుది ఓటర్ల జాబితాను ఖరారు చేయాలన్నారు. జనవరి 4వ తేదీ నాటికి సభ్యుల జాబితాను అందజేయవలసి వుంటుందన్నారు. జనవరి 8వ తేదీన ఓటర్ల జాబితా స్క్రూట్నీ, పరిశీలనా కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి పరిశీలించాలన్నారు. జనవరి 21వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవలసి వుంటుందన్నారు. మొదటి దశలో ఎన్నికలు నిర్వహించే సొసైటీలకు జనవరి 24న నామినేషన్ స్వీకరించి 25న పరిశీలన చేయాలన్నారు. 26వ తేదీ 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుంటుందన్నారు. జనవరి 31వ తేదీన సంబంధిత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా రెండవ విడతలో ఎన్నికల నిర్వహణకు జనవరి 28న నామినేషన్లు స్వీకరించి 29న పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. జనవరి 30 సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని, ఫిబ్రవరి 4వ తేదీన ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ సహకార సొసైటీల ఎన్నికల నిర్వహణలో జాగురూకతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో అనుసరించవలసిన నియమనిబంధనలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో డి ఆర్‌వో ఎం మోహనరాజు, జిల్లా సహకార శాఖాధికారి రామ్మోహన్, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, సూర్యారావు, వసంతరావు, సత్యనారాయణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎస్ మురళీకృష్ణ, రవికుమార్, శ్రీనివాస్ తదితరులతో పాటు పలువురు తహశీల్దార్లు, సహకార శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిఎస్సీ-2012లో 412 మందికి పోస్టింగులు
తొమ్మిది మంది విత్‌హెల్: తొమ్మిది మంది గైర్హాజరు
ఏలూరు, డిసెంబర్ 27 : డి ఎస్‌సి-2012 నియామకాలకు సంబంధించి తొలిరోజైన గురువారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో 412 మందికి నియామక ఉత్తర్వులను అధికారులు అందజేశారు. కోర్టు కేసుల కారణంగా తొమ్మిది మందిని విత్‌హెల్డ్‌లో ఉంచగా మరో 9 మంది కౌన్సిలింగ్‌నకు హాజరుకాలేదు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం డి ఎస్‌సి-2012లో ఎంపికైన అభ్యర్ధులకు కౌన్సిలింగ్ నిర్వహించి సబ్జెక్టుల వారీగా నియామకపు ఉత్తర్వులు అధికారులు అందించిన వివరాలు ఇలా వున్నాయి. లాంగ్వేజ్ పండిట్ తెలుగు జడ్పీ 12, మున్సిపాల్టీ 17, లాంగ్వేజ్ పండిట్ హిందీ జడ్పీ 40, మున్సిపాల్టీ 12, లాంగ్వేజ్ పండిట్ సంస్కృతం జడ్పీ 10, మున్సిపాల్టీ 1, పి ఇటి మున్సిపాల్టీ 1 , స్కూల్ అసిస్టెంట్ తెలుగు జడ్పీ 57, మున్సిపాల్టీ 4, స్కూల్ అసిస్టెంట్ హిందీ జడ్పీ 17, మున్సిపాల్టీ 14, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీ 38, మున్సిపాల్టీ 7, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం జడ్పీ 1, స్కూల్ అసిస్టెంట్ లెక్కలు జడ్పీ 30, మున్సిపాల్టీ 7, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జడ్పీ 36, మున్సిపాల్టీ 10, స్కూల్ అసిస్టెంట్ బైలాజికల్ సైన్స్ జడ్పీ 29, మున్సిపాల్టీ 6, స్కూల్ అసిస్టెంట్ సోషల్ జడ్పీ 63, మున్సిపాల్టీ 9 కలిపి జిల్లా పరిషత్‌లో 333, మున్సిపాల్టీలో 97 కలిపి మొత్తం మీద 412 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులను అందజేశారు. అయితే న్యాయ వివాదాల కారణంగా లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఇద్దరు, లాంగ్వేజ్ పండిట్ హిందీ ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్ లెక్కలు 1, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 1, స్కూల్ అసిస్టెంట్ బైలాజికల్ సైన్స్ 1, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 1 కలిపి మొత్తం తొమ్మిది మందిని విత్‌హెల్డ్‌లో ఉంచారు. గురువారం జరిగిన కౌన్సిలింగ్‌నకు తొమ్మిది మంది అభ్యర్ధులు హాజరుకాలేదు. ఇదిలా ఉంటే మొదటి జాబితాలో ఎంపికై ప్రభుత్వ నిబంధనను అనుసరించి రెండవ జాబితాలో ఎంపిక కాని అభ్యర్ధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కారణంగా మరికొంతమందికి ఉద్యోగాలు పొందే అవకాశం లభించింది. న్యాయస్థానాన్ని కొందరు అభ్యర్ధులు ఆశ్రయించడంతో మొదటి, రెండవ జాబితాలో కొంతమంది అభ్యర్ధులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యాశాఖాధికారులు విత్‌హెల్డ్‌లో ఉంచారు. న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తే మొదటి జాబితాలో ఎంపికైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన కౌన్సిలింగ్ రాత్రి పొద్దుపోయేంత వరకు కొనసాగుతూనే వుంది. ఇక శుక్రవారం సెకండరీగ్రేడ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందించనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు.
నీటి వినియోగంపై ప్రత్యేక నిఘా
తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 27 : జిల్లాలో రబీ పంటకు వంతుల వారీగా సాగునీరు సరఫరా చేస్తున్న దృష్ట్యా తహశీల్దార్లు నీటి వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని శివారు ప్రాంత భూములకు కూడా సమృద్ధిగా సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవడానికి రాబోయే మూడు నెలలూ నిరంతర నీటి పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ తహశీల్దార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం రాత్రి రెవిన్యూ అధికారుల సమావేశంలో ఎల్ ఇసి కార్డులు, ఆధార్, మీ-సేవ, భూ సమస్యలు, జమాబందీ, నీటి తీరువా తదితర రెవిన్యూ సమస్యలపై తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరు అక్రమంగా చేపల చెరువులకు, ఇతర వ్యాపారాలకు మళ్లించకుండా తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న దృష్ట్యా ఉన్న నీటి వనరులను కాపాడి రబీ పంటకు అవసరమైన నీటిని సక్రమంగా అందించగలగడానికి మండల స్థాయిలో ఈ అధికారుల బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఈ మేరకు ఆయా శాఖలకు నిర్వహించవలసిన విధులను స్పష్టంగా నిర్ధేశించడం జరిగిందన్నారు. జిల్లాలో అక్రమ లే అవుట్లను గుర్తించి నిర్ధాక్షిణ్యంగా తొలగించడానికి రెవిన్యూ అధికారులు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు, క్రైస్తవ, ముస్లిం, వక్ఫ్ బోర్డులకు సంబంధించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. కౌలు రైతులకు ఎల్ ఇ కార్డులు అందించడం, రుణాలు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మీ-సేవ కేంద్రాలను తరచూ తహశీల్దార్లు సందర్శించి వాటి పని విధానం పరిశీలించాలన్నారు. నీటి తీరువాకు సంబంధించిన నీటి పన్నులు వసూళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు ఆదేశించారు. అదే విధంగా విజిలెన్స్ రిపోర్టులు, జిల్లా కార్యాలయానికి పంపవలసిన నెలసరి నివేదికలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డి ఆర్‌వో ఎం మోహనరాజు, డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ, వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, జె వసంతరావు, సూర్యారావు, సత్యనారాయణ, నిక్‌నెట్ అధికారి గంగాధరరావు, జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి, జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన తహశీల్దార్లు పాల్గొన్నారు.
1222 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు: జెసి
ఏలూరు, డిసెంబర్ 27 : జిల్లాలో డి ఎస్‌సి-2012లో ఎంపికైన 1222 మందికి కొత్తగా టీచర్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు చెప్పారు. స్థానిక జిల్లా ప్రజాపరిషత్తు సమావేశ మందిరంలో గురువారం కౌన్సిలింగ్ ద్వారా 409 మందికి ఉద్యోగ నియామక ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతలు చేపడుతున్న నూతన ఉపాధ్యాయులు నీతి నిజాయితీలతో విధి నిర్వహణలో సక్రమ విద్యాబోధన సాగించి జీవితాన్ని సార్ధకత చేసుకోవాలని కోరారు. ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగం లేక చాలీ చాలని వేతనాలతో ప్రైవేటు రంగంలో రోజుకు 16 గంటలు శ్రమిస్తున్న స్థితిలో దేవుని దయ వల్ల జిల్లాలో 1222 మందికి టీచర్ ఉద్యోగావకాశాలు లభించాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులును తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తికే వనె్న తీసుకువచ్చే విధంగా పనిచేయాలని ఆయన హితవు పలికారు. క్రమశిక్షణతో చిన్నారుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే వనె్న తీసుకువచ్చే విధంగా నాణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని ఈ విషయంలో కొత్తగా ఉద్యోగాలు పొందిన ప్రతీ టీచర్ ఆత్మ విమర్శ చేసుకుని వృత్తికి న్యాయం చేయాలని హితవు పలికారు. డి ఇవో నరసింహారావు మాట్లాడుతూ స్కూలు అసిస్టెంట్స్, భాషాపండితులు, తెలుగు, హిందీ, సంస్కృతం, పి ఇటి అభ్యర్ధులు ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొన్నారని, గురువారం 409 మందికి కోరుకున్న చోటుకు ఉద్యోగావకాశాలు కల్పించామని శుక్రవారం జరిగే కౌన్సిలింగ్‌లో 813 ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సి ఇవో డి నారాయణ, డిప్యూటీ డి ఇవోలు మద్దూరి సూర్యనారాయణ, రవీంధ్రనాధ్‌రెడ్డి పాల్గొన్నారు.
నాల్గో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని విఆర్వోల ధర్నా
అత్తిలి, డిసెంబర్ 27: గ్రామ రెవెన్యూ సహాయకులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతన స్కేళ్లను అమలుచేయాలని కోరుతూ అత్తిలి మండల విఆర్‌ఎలు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రిటైర్మెంట్ సహాయం అందించాలని, కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కృష్ణమూర్తి, మండల శాఖ అధ్యక్షుడు మెరిపే బాలస్వామి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే చదువులు అవసరం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ
నల్లజర్ల, డిసెంబర్ 27: మన దేశంలో విద్యార్థుల్లో తెలివితేటలు ఉన్నా వాటిని ఉపయోగించకపోవడం వల్ల అనేక మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయినా వారిలో పనికొచ్చే వారు కొద్దిమందే ఉన్నారని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ పేర్కొన్నారు. నల్లజర్ల ఎకెఆర్‌జి కళాశాలలో గురువారం నిర్వహించిన మేధోమధన ప్రత్యేక గోష్ఠిలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చాలామంది బట్టీబట్టి చదివి ర్యాంకులు పొందుతున్నారేగాని వారిలో పరిజ్ఞానం ఉండటం లేదన్నారు. తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు కేవలం ర్యాంకులకోసమే తప్ప విద్యార్థుల్లో పరిజ్ఞానాన్ని పెంచేదిశగా ఆలోచన చేయడం లేదన్నారు. కష్టపడి విజ్ఞానం సముపార్జించిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో అటువంటి వారు విదేశాలకు వెళ్ళిపోతున్నారని జయప్రకాష్‌నారాయణ అన్నారు. విద్యకు సంబంధించి పీసా అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 74 దేశాల్లో సర్వే నిర్వహించగా అందులో భారతదేశం 73వ స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. మనతో సమానంగా ఉన్న చైనా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. విద్యకు సంబంధించి కనీస సదుపాయాలు, పరిజ్ఞానం ఉన్న అధ్యాపకులు లేకపోవడమే మన ఈ దుస్థితికి కారణమన్నారు. ప్రస్తుతం కేబుల్ వ్యవస్థ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. కావల్సిన సెట్‌ఆఫ్ బాక్సులను చైనా, కొరియా దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. దిగుమతులకోసమే ప్రతి ఏడాది రూ.4 లక్షల 25 కోట్లు మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కావల్సిన సెట్‌ఆఫ్ బాక్సులను స్థానికంగా తయారు చేసుకుంటే కొంతమందికి ఉపాధి కల్పించినవారమవుతామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ముందు ఆదాయంతోబాటు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఏడాది ఎంతోమంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చి ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జయప్రకాష్ నారాయణ సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమానికి అల్లాడి రామకృష్ణ అధ్యక్షత వహించగా ఎకెఆర్‌జి విద్యా సంస్థల ఛైర్మన్ చావా రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ నాగం శేషయ్య, లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు జానకిరాం తదితరులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహావిష్కరణ
నల్లజర్ల మండలం అల్లాడ రామయ్య కళ్యాణ మండపం వద్ద అల్లాడ రామకృష్ణ ఏర్పాటు చేసిన మహాత్మాగాంధి విగ్రహాన్ని జయప్రకాష్ నారాయణ గురువారం ఆవిష్కరించారు.
ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాలంకరణలు
వీరవాసరం, డిసెంబర్ 27: వీరవాసరం మండలం నందమూరు గరువు గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామభక్తాంజనేయ స్వామివారి ఉత్సవాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈసారి ఉత్సవాల్లో ఎల్‌ఇడి బల్బుల విద్యుత్ అలంకరణలను ఏర్పాటుచేశారు. అలాగే ఆలయాలను ప్రత్యేక పూలతో అలంకరించారు.
అన్ని దేవుళ్ళ చిత్రపటాలను ఏర్పాటుచేసి విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేయడంతో భక్తులు విద్యుత్ అలంకరణలు చూడటానికి తరలి వస్తున్నారు.
ఎర్రకాల్వ ప్రాజె క్టు నుండి రబీకి సాగునీరు విడుదల
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 27: మండలంలోని కొంగువారిగూడెం వద్ద శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ ప్రాజెక్ట్ నుండి రబి సీజన్‌కు సాగునీటిని గురువారం విడుదల చేసారు. ప్రాజెక్ట్ ఎడమ, కుడి ప్రధాన కాల్వల క్రింద ఆయకట్టులో వరి నారుమడులకు అవరమైన నీటిని విడుదల చేయాలని రైతులు కోరిన మీదట ఈ చర్యలు చేపట్టినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ చదలవాడ భాస్కరరావు తెలిపారు. కుడి ప్రధాన కాల్వకు 20 క్యూసెక్స్, ఎడమ ప్రధాన కాలువకు 10 క్యూసెక్స్ నీటిని విడుదల చేసినట్టు వివరించారు. జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున రబి సీజన్‌కు నీటి విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు దల్లి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, అమ్మపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు వందనపు సూర్యప్రకాశరావు, పంగిడిగూడెం సాగునీటి సంఘం అధ్యక్షుడు డి.వి.ఎస్.తిరుపతిరాజు(నానిబాబు) తదితరులు పాల్గొన్నారు.
చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్లకు కమిషన్ చెక్కుల పంపిణీ
ఏలూరు, డిసెంబర్ 27 : జిల్లాలో చిన్న మొత్తాల పొదుపులో 53 కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన 146 మంది ఏజెంట్లకు 9.57 లక్షల రూపాయల కమిషన్‌ను చెక్కుల రూపంలో అందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం రాత్రి ఎన్ ఎస్ ఎస్ ఏజెంట్లకు ప్రోత్సాహక కమిషన్ సొమ్మును కలెక్టర్ అందజేశారు. జిల్లాలో చిన్న మొత్తాల పొదుపు సంస్థ పధకాల కింద 146 మంది ఏజెంట్లు ఎంతో కష్టపడి గత ఏడాది నుండి 53 కోట్ల రూపాయలు పొదుపు మొత్తాలుగా సేకరించారని ఈ మేరకు తొలిదశగా వచ్చిన కమీషన్ సొమ్మును ఏజెంట్లకు అందించామని, మరికొంత సొమ్ము ప్రభుత్వం నుండి వచ్చిన వెంటనే ఆయా ఏజెంట్లకు చెక్కుల రూపంలో సమకూరుస్తామని చెప్పారు. చిన్న మొత్తాల పొదుపు కార్యక్రమాలను జిల్లాలో ఎంతో సమర్ధవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లి నిధులు డిపాజిట్ల రూపంలో సేకరించడంలో ఏజెంట్ల కృషి ప్రశంసనీయమని డి ఆర్‌వో ఎం మోహనరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్న మొత్తాల పొదుపు సంస్థ తహశీల్దారు ఎన్ రామకృష్ణ పాల్గొన్నారు.
బాల బాలికల కళ్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్
ఏలూరు, డిసెంబర్ 27 : పశ్చిమగోదావరి జిల్లాలో 4 లక్షల మంది బాల బాలికల కళ్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక అమీనాపేటలోని మున్సిపల్ పాఠశాలలో గురువారం చిన్నారి చూపు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికల కళ్ల సంరక్షణకు ప్రభుత్వం చిన్నారిచూపు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఇంత వరకూ 3.80 లక్షల మంది పిల్లల కళ్లను పరీక్షించడం జరిగిందన్నారు. వీరిలో 23529 మందికి వివిధ కంటి సమస్యలు, కళ్లజోళ్ల అవసరాలను గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో కళ్లజోళ్లు అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించడం జరుగుతుందని, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి గౌతమి నేత్రాలయం, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, పుష్పగిరి కంటి ఆసుపత్రులకు పంపడం జరుగుతుందన్నారు. ఏలూరులో మూడు వేల మందిని ప్రాధమికంగా గుర్తించి వీరిలో అవసరమైనవారికి కళ్లజోళ్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో శస్తచ్రికిత్సలు అవసరమైన వారిని గుర్తించి వారిని ఆయా ఆసుపత్రులకు పంపడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న 16 మంది నేత్రవైద్యులు అన్ని మండలాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆయా పిల్లలకు అవసరమైన వైద్య సహకారం అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల కంటిచూపును మెరుగు పరిచేందుకు గౌతమి నేత్రాలయం ఆరు మండలాల్లో, పాలకొల్లు లయన్స్ క్లబ్ మూడు మండలాల్లో, పలు మండలాల్లో గెయిల్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నదన్నారు. చోడిదిబ్బలోని నరసింహా ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకుంటున్న మజ్జి వెంకట దుర్గాప్రసాద్‌కు చిన్నారి చూపు కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయిలో ప్రాధమిక పరీక్షలు నిర్వహించి మండల స్థాయికి స్క్రీనింగ్ క్యాంపునకు సంబంధిత ఉపాధ్యాయులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ కళ్లను పరీక్షించిన వైద్యులు అతనికి శస్తచ్రికిత్స అవసరమవుతుందని, సరైన సమయంలో పరీక్షలు నిర్వహించుకోవడం ఎంతో మేలు చేసిందని, లేకపోతే కంటిచూపును శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేదన్నారు. అదే విధంగా చోడిదిబ్బకు చెందిన బంగారు శ్రీను కళ్లను పరీక్షించిన వైద్యులు కంటిలోని రెటీనా దెబ్బతిందని వీరికి కృత్రిమ రెటీనా, లెన్స్ అమర్చవలసి వుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అవసరమైన వారికి అందించారు. అదే విధంగా శస్తచ్రికిత్సలు అవసరమైన వారికి చికిత్స చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ పివో డాక్టర్ డివి రామ్మోహనరావు, ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.