Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మిశ్రమ నామ సంవత్సరంగా 2012

$
0
0

అనంతపురం, డిసెంబర్ 30 : జిల్లాకు 2012వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. జిల్లాలోని వివిధ రంగాలైన రాజకీయం, వ్యవసాయం, అభివృద్ధి, నేరాలు ఇలా అన్ని రంగాల్లోనూ మిశ్రమ ఫలితాలు అందాయని చెప్పవచ్చు. ఇక ప్రతి యేడు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రైతుకు ఎదురీత తప్పలేదు. జిల్లా రైతాంగం వ్యవసాయం పట్ల పూర్తి విముఖతను చూపిస్తున్న తరుణంలో అయ్యప్పన్ కమిటీ జిల్లాలో పర్యటించడం వల్ల రైతాంగంలో కొత్త ఆశలను నింపింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలన్న అయ్యప్పన్ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతాంగం పరిస్థితి ఆశాజనకంగా తయారవుతుంది. ఇక ఈ ఏడు వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. మూడు మండలాల్లో వర్షం జాడలేదు. 36 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదవగా, మరో 26 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న కరవుతో జిల్లా రైతాంగం ప్రభుత్వం మంజూరు చేసే ఇన్‌పుట్ సబ్సిడీ, బీమాలపైనే ఆధారపడే పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అనంతపై ఒక స్పష్టత వస్తే జిల్లా రైతాంగం కోలుకునే పరిస్థితి ఉంటుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక జిల్లాకు వరదాయినిగా ఉన్న హంద్రీనీవా ద్వారా జిల్లాలోకి కృష్ణమ్మ జలాలు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇక జిల్లాలోకి వచ్చే తుంగభద్రమ్మ ప్రతి యేటా తన వాటాను తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో తుంగభద్రమ్మను నమ్ముకుని పంటలు సాగు చేసుకునే రైతుల పరిస్థితి అగమ్మగోచరంగా తయారతోంది. దీంతో రైతులు సాగు నీటి కోసం ధర్నాలు, గొడవలు చేసుకునే పరిస్థితి దాపురించింది. జిల్లాలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతన్న ప్రతి ఏటా వ్యవసాయ జూదంలో ఓడిపోతున్నాడు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు అనంతకు రూపకల్పన చేస్తే జిల్లా రైతాంగం తలరాత మారుతుందన్న ఆశ రైతన్నలో నెలకొంది. ఇక ప్రభుత్వం రైతులకు అందించిన ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పంపిణీని అర్హులైన రైతులకు పంపిణీ చేయడంలో వ్యవసాయ,రెవెన్యూ శాఖలు విఫలమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అందించిన రూ.398 కోట్లలో ఇప్పటికీ రూ. 95 కోట్లపై సందిగ్ధత వీడలేదు. ఇక రాజకీయంగా చూస్తే జిల్లాలో రాజకీయ పార్టీలు పాదయాత్రలతో హోరెత్తించాయి. అక్టోబర్ రెండున టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్రను మొదలుపెట్టగా, అదే బాటలో వైకాపా నుంచి షర్మిల యాత్ర చేపట్టారు. వీరితోపాటు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకు వస్తున్నామంటూ రెవెన్యూమంత్రి రఘువీరారెడ్డి భగీరథ యాత్రను చేపట్టారు.వామపక్షాలు కూడా పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో తమ బలం పెంచుకున్నాయి. కానీ అధికార కాంగ్రెస్‌పార్టీ మాత్రం అన్ని రకాలుగా వెనకబడిందనే చెప్పవచ్చు. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో జిల్లా కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఇక జిల్లాలో రాష్టమ్రుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరుసార్లు జిల్లాలో పర్యటించినా ఏ మాత్రం లాభం లేదనే చెప్పాలి. ఆయన పర్యటనలో జిల్లాకు సంబంధించి వరాలు వస్తాయన్న ఆశతో ఉన్న ప్రజలకు ఆయన నిరాశను మిగిల్చారు. ఇక జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టినా ధర్మవరంలో కిడ్నాప్‌ల పర్వం సంచలనం కలిగించిందనే చెప్పాలి. ఇక అక్రమ సంబంధ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, వీటితోపాటు ఎర్ర చందనం అక్రమ రవాణాకు, నిల్వకు జిల్లా కేంద్రంగా మారడం కొంత ఆందోళన కలిగించే పరిణామంగా చెప్పవచ్చు. ఇలా పలు అంశాల్లో 2012 సంవత్సరం మిశ్రమ నామ సంవత్సరంగా మిగిలింది.

అంధుడు సూర్యుడితో సమానం
రాయదుర్గం రూరల్, డిసెంబర్ 30 : అంధుడు సూర్యుడు లాంటివాడని ప్రముఖ కవి, విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్‌రావు అభివర్ణించారు. సూ ర్యుడు తన వెలుగుతో లోకాన్ని చూస్తే అంధుడు తన అంతరంగ దృష్టిలో చీకటిని చీల్చుకుని లోకాన్ని ఆవిష్కరిస్తాడని అన్నారు. ఆ వాస్తవాన్ని ‘రాత్రి సూర్యుడు’ దీర్ఘ కావ్యం ఆవిష్కరించిందన్నారు. ఆదివారం స్థానిక బాలికోన్నత పాఠశాల్లో జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు శాంతి నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ‘రాత్రి సూర్యుడు ’ దీర్ఘ కా వ్యం పుస్తకం, ఆడియో బుక్‌ను ఆయ న ఆవిష్కరించారు. పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అంధుల జీవితాలపై దీర్ఘ కావ్యం రచించడం అభినందనీయమన్నారు. పెంచుల నరసింహమూర్తి మాట్లాడుతూ అంధులను చూసి జాలిపడకూడదని, స్నేహభావంతో సహకారం అందించాలన్నారు. సింగమనేని నారాయణ మాట్లాడుతూ వాస్తవాలను ప్రజల ముందు పెట్టినవాడే కవిగా పేరు పొందుతారని పేర్కొన్నారు. కార్యక్రమానికి సిఐ బాస్కర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ పివో జబీవుల్లా, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రముఖ కవులు మోపూరు పెద్దల నరసింహులు, వౌన శ్రీ మల్లిక్, సాహిత్య ప్రకాష్, పెద్దూరు వెంకటదాస్, జూపల్లి ప్రేమ్‌చంద్, మల్లెల నరసింహమూర్తి, స్ఫూర్తి సంస్థ అధ్యక్షులు పోగునూలు కళ్యాణచక్రవర్తి పాల్గొన్నారు.

ప్రతిభతోనే గుర్తింపు
సినీ రచయిత, కవి వౌనశ్రీ మల్లిక్
ఏ రంగంలోనైనా ప్రతిభ కనబరిస్తే వారికి గుర్తింపుతద్యమని సినీ రచయిత, కవి వౌనశ్రీ మల్లిక్ పేర్కొన్నారు. ఆదివారం రాయదుర్గంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ‘నాలో తొలిసారిగా’ అనే చిత్రం ద్వారా సినీ రచయితగా ప్రస్థానం ప్రారంభించిన తాను తాజాగా చేతిలో చేయివేసి, థ్రిల్లింగ్, గుడ్‌మార్నింగ్ అనే సినిమాలకు పాటలు రాసానని చెప్పారు. అయితే గుడ్‌మార్నింగ్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని, ప్లాటినం డిస్క్ కూడా వచ్చిందన్నారు. శివాజీ హీరోగా నటిస్తున్న దక్షిణ మధ్య రైల్వే, ఎలా చేసావు నన్ను, రాగాలపల్లకిలో, మా అత్త సూర్యకాంతం, అనే చిత్రలకు పాటలు రాసానన్నారు. త్వరలో విడుదల కాన్నుట్లు చెప్పారు. ఇప్పటి వరకు విడుదలైన ఆరు సినిమాల్లో 20 పాటలు రచించానన్నారు. సినిమాలకు మాత్రమే కాకుండా ఆల్బమ్స్ కూడా పాటలు రచించానని, సద్గురు సాయి..సప్తస్వర మాల అనే ఆల్బమ్‌కు ఏడు పాఠశాలు రిచించానని చెప్పారు. ‘దిగంబరం’ అనే కవితా సంపుటికి పది అవార్డులు లబించాయని, రచించిన 200 కవిత్వాల్లో 163 కవిత్వాలకు ప్రథమ బహుమతి లభిచిందని ఆనందం వ్యక్తం చేశారు. రచయిత ఎదగడానికి కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం ఎంతగానో దోహదపడిందని కొనియాడారు. ఈ సమావేశంలో టివి రచయిత సాహిత్య ప్రకాశ్, స్ఫూర్తి సంస్థ అధ్యక్షులు పోగునూలు కళ్యాణ చక్రవర్తి, ఎన్ ఎస్ ఎస్ పి ఓ జబీవుల్లా పాల్గొన్నారు.

జగన్ జైలు నుండి బయటకు రావడం ఖాయం
* వైకాపా జిల్లా కన్వీనర్
చిలమత్తూరు, డిసెంబర్ 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుండి బయటకు రావడం ఖాయమని వైకాపా జిల్లా కన్వీనర్ శంకరనారాయణ పేర్కొన్నారు. ఆదివారం చిలమత్తూరుకు విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా ఆయా పార్టీలు అడ్డుకొంటున్నాయన్నారు. జగన్‌కు బెయిల్‌లు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో సంతకాలు సేకరించి రాష్టప్రతికి సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు సదాశివరెడ్డి, రాజారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, హనుమంతప్ప పాల్గొన్నారు.

ఎఎం లింగణ్ణ భావితరాలకు స్ఫూర్తి ప్రదాత
పరిగి, డిసెంబర్ 30: మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, సేవే పరమావధిగా భావించి అతి చిన్న వయస్సులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సేవామందిరం వ్యవస్థాపకులు ఎఎం లింగణ్ణ భావితరాలకు ఆదర్శప్రాయుడని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్‌జె రత్నాకర్ పేర్కొన్నారు. ఆదివారం సేవామందిరంలో ఎఎం లింగణ్ణ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ శాంతియుత పోరాటం పట్ల ఆకర్షితుడైన ఎఎం లింగణ్ణ హిందూపురం కర్నాటక ప్రాంతాల్లో స్వాతంత్య్రోద్యమం పట్ల ప్రజలను చైతన్యపరచారని, ఆయన స్పూర్తితో ఆయన వారసులు నేటికీ సేవా ధృక్పతంతో పలు కార్యక్రమాలు కొనసాగించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఎఎం లింగణ్ణ ఆశయాలను సేవామందిరం సభ్యులు కొనసాగించాలన్నారు. ఆనాటికే ఎఎం లింగణ్ణ గ్రామీణ విద్యకు పెద్దపీట వేసి సేవామందిరంలో పాఠశాలను స్థాపించి గ్రామీణ పిల్లలకు విద్యనందించడంతో పాటు వారిలో దేశభక్తి పెంపొందించడానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవరాజు, స్వాతంత్య్ర సమరయోధులు విఎన్ రెడ్డి, పూర్వపు విద్యార్థి వెంకటసుబ్బయ్య, ఎస్‌కె యూనివర్సిటీ ప్రొఫెసర్ గోవిందప్ప, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్‌రావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామలింగప్ప, రేణుకాదేవి, వెంకటరమణ, ఆదెప్ప పాల్గొన్నారు.

చమన్‌తో సంబంధం లేదు..!
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం,డిసెంబర్ 30 : తెలుగుదేశం నాయకుడు చమన్ అనుచరులుగా ప్రచారం జరుగుతున్న ఆరుగురు వ్యక్తులను శనివారం రాత్రి ఎన్‌ఎస్ గేటు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో జరుగుతున్న విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘం ఎన్నికల్లో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం, గతంలో జరిగిన హత్యలకు ప్రతీకారంగానే ఇదంతా చేయాల్సి వచ్చిందని పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలుస్తోంది. తమ బృందానికి చమన్‌కు ఎలాంటి సంబంధం లేదని, కామిరెడ్డిపల్లి సంఘటనకు ప్రతీకార చర్య కోసం వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ధర్మవరానికి చెందిన ఒక టిడిపి నాయకుడి పేరు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తమకు ఆయుధాలు, డబ్బులు ఒక యువనేత సమకూర్చాడని కూడా వారు విచారణలోవెల్లడి చేసినట్లు తెలిసింది. ఈ నెల 21వ తేదీన రామగిరి మండలానికి చెందిన ఓ నేతను హత్య చేయాలని కూడా పథకం వేశామని కానీ ఆ సమయంలో పోలీసులు ఉండడంతో సాధ్యం కాలేదని వారు తెలిపినట్లు సమాచారం. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఆ నాయకుడు వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. ఇక జిల్లాలో పరిస్థితి ఈ విధంగా ఉంటే శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ టిడిపి నాయకుడు, దివంగత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు చమన్ మీడియాతోమాట్లాడారు. తనకు, ప్రస్తుతం పోలీసులకు దొరికిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు తనను జిల్లాలోకి రానివ్వకుండా చేసేందుకే ఇలాంటి చౌకబారు యత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత వాళ్లు అనుకున్న వాళ్లే ఇలాంటి యత్నాలకు పాల్పడడం తనను ఎంతగానోకలచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కృత్రిమ అవయవాలు అమర్చడం ప్రశంసనీయం
అమరాపురం, డిసెంబర్ 30: ప్రపంచంలో ఎలాంటి సంపదనైనా కూడబెట్టవచ్చుకాని అందులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సు ధాకర్‌లు పేర్కొన్నారు. ఆదివారం అమరాపురంలో వైద్య, ఆరోగ్య మైత్రీ కూటమి, జైన్ మిషన్, కర్ణాటక మా ర్వాడీ యూత్ ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో కాళ్లు కోల్పోయిన వారికి కృత్రి మ కాళ్లను అమర్చే కార్యక్రమాన్ని అమరాపురంలో చేపట్టారు. జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ గుండుమల, ఎమ్మెల్యే సుధాకర్‌లు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు, ఇతర కారణాల వల్ల కాళ్లు కోల్పోయిన వికలాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్లను ఉచితంగా అమర్చే బృహత్తర కార్యక్రమం చేపట్టిన దాతలను కొనియాడారు. మార్వాడీ యూత్ ఫెడరేషన్ ప్రతినిధి సింగ్ మాట్లాడుతూ ఇప్పటికే 300 ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించి దాదాపు మూడు వేల మందికి పైగా కాళ్లు పోగోట్టుకున్న బాధితులకు కృత్రిమ కాళ్లను అందజేయడం జరిగిందన్నారు. దీంతో పాటు చర్మ వ్యాధులు, దంత వ్యాధి శిబిరాలను కూడా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు ఆశాప్రభ, పద్మనాభజైన్, గుప్త, డాక్టర్ శివరాజ్, వాగేష్ పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
* డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి
యాడికి, డిసెంబర్ 30: ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినీ మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. టిడిపి హాయంలో మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. జగన్ కోసం కోటి సంతకాల సేకరణ చేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కారం అవుతుందని తెలిపారు. వచ్చే 2014 ఎన్నికలలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రఫీ, పూలరంగా, రాజు, వెంకటరమణ పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
* డిఎస్పీ సుప్రజ
గుంతకల్లు, డిసెంబర్ 30: నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు చేపడుతామని డిఎస్పీ సుప్రజ పేర్కొన్నారు. స్థానిక కసాపురం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సాయంకాలం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ సుప్రజ, రూరల్ సిఐ మున్వర్ హుసేన్, ఎస్సై సునీతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ సుప్రజ మాట్లాడుతూ నూతన సంవత్సరం, వేడుకలు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే వేడుకలలో యువకులు అల్లర్లకు పాల్పడితే వెంటనే అరెస్ట్ చేస్తామన్నారు. యువకులు ద్విచక్రవాహనాలకు సైలెన్సర్‌లు పీకి, పెద్ద ఎత్తున శబ్ధం చేసి ప్రజలకు ఇబ్బందులకు కల్గిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించడం లాంటి చర్యలు పాల్పడవద్దని ఆమె కోరారు. అర్ధరాత్రి 12.30 గంటలకు రోడ్లపై కన్పిస్తే వారిని అదుపులోకి తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరికొందరు అనుమానితులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 30: ఢిల్లీలో పారా మెడికల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మరణించిన యువతి ఆత్మశాంతికి ఆదివారం నగరంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ నుండి ప్రారంభమైన ర్యాలీ సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు దిల్షాద్, సావిత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా.ప్రసూన, ఐద్వా నాయకులు లక్ష్మిదేవి, చంద్రిక, అరుణమ్మ, రామాంజినమ్మ, లలితమ్మ, మస్తాన్‌బీ, అనసూయమ్మ, ఫరీదా తదితరులు పాల్గొన్నారు.

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
* ఎమ్మెల్యే కొట్రికె
గుత్తి, డిసెంబర్ 30: విధుల నిర్వహణలో నిరంతరంగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ హామీ ఇచ్చారు. ఆదివారం గుత్తి ఆర్‌ఎస్‌లోని బుకింగ్ కార్యాలయం వద్ద గల రైల్వే పెన్షన్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన పెన్షన్ల దినోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎంపిపి కోనామురళీధర్‌రెడ్డి, గుత్తి డీజిల్‌షెడ్ సీనియర్ డిఎంఇ శ్రీనివాస్, గుంతకల్లు డివిజన్ నాయకులు సుంకన్న, బిఎస్పీ నాయకులు రంగనాయకులు, ప్రతాప్ సింగ్, కృష్ణమూర్తి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రైల్వే యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారానికి ఎప్పటికప్పుడు అవసరమైన సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

సిఐటియు తీరుతో కార్మికుల్లో అశాంతి

హిందూపురం రూరల్, డిసెంబర్ 30: హిందూపురం ప్రాంతంలో సిఐటియు కార్మిక సంఘం అవలంబిస్తున్న తీరు వల్ల కార్మికుల్లో అశాంతి నెలకొని పలు పరిశ్రమలు మూత పడడానికి కారణమవుతోందని ఎఐటియుసి కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, ఇటీవల సూపర్ స్పిన్నింగ్ మిల్లులో తాత్కాలిక ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న యాజమాన్య తీరుకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఎఐటియుసి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఎఐటియుసి ఎన్నో ఏళ్ళుగా కార్మికుల భద్రత కోసం పోరాడుతూ ఎన్నో విజయాలు సాధించిందని, దీన్ని ఓర్వలేక సిఐటియు సంఘం కార్మికుల మధ్య చిచ్చురేపి స్వార్థ ప్రయోజనాల కోసం పాటు పడుతోందన్నారు. సిఐటియు తీరు వల్ల హిందూపురం ప్రాంతంలో పలు పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు వీధిన పడ్డారన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎఐటియుసిని విమర్శించడం సిఐటియుకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సురేష్‌బాబు, దాదాపీర్, ఎఐటియుసి నాయకులు జగన్నాథ్, శివప్ప, శ్రీనివాసరెడ్డి, నారాయణరెడ్డి, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు రాజకుమార్, నారాయణస్వామి పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
గుంతకల్లు, డిసెంబర్ 30: దేశ రాజధానిలో జరిగిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఆదివారం టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్, ఆంజినేయులు, పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో మెడికో విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆమెను బస్సులో విసిరి వేసి రాక్షసంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నిందితుల ఆచూకిని ఇంత వరకు గుర్తించలేక పోయారన్నారు. ప్రస్తుతం వరుసగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారం కేసులో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్ల దేశంలో శాంతి భద్రతలు క్షీణించి మహిళలకు రక్షణ లేకుండ పోయిందన్నారు. మహిళా రక్షణ, సంక్షేమం కోసం అనేక చట్టాలు, పథకాలు అమలు చేస్తున్నప్పటికి, వాటి అమలు జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా అవి నీరుగారుపోతున్నాయన్నారు. ఇప్పటికైన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆమ్లేట్ మస్తాన్ యాదవ్, జింకల జగన్నాథ్, పోతప్ప, శ్రీనివాసులు, న్యాయవాది వెంకటేష్, బిసి సెల్ నాయకులు నాగరాజు, కిరణ్, గిడ్డయ్యై తిమ్మప్ప, మాజీ ప్రధాన ఉపాధ్యాయుడు పాపన్న, ఎం రామాంజినేయులు, తెలుగు మహిళ సంఘం నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles