Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అవినీతి పార్టీలను తరిమేయాలి

$
0
0

ప్రొద్దుటూరు, డిసెంబర్ 30 : తల్లీ, పిల్ల కాంగ్రెస్ పార్టీలను బంగాళాఖాతంలో వేసినా పాపం లేదని తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన ఆ రెండు పార్టీలను తరిమేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని యర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో పట్టణానికి చెందిన కామరాజు దండపాణి సంస్థల చైర్మన్ కామరాజు శ్రీనివాస్‌కుమార్ తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం సందర్భగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతో ప్రత్యేక పార్టీ పెట్టిన జగన్ ఢిల్లీకి కడపకు ముడిపెట్టి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నెగ్గారన్నారు. రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్న పాదయాత్రలో చెప్పిన షర్మిల ఆయన దోపిడీని ప్రజలపై రుద్దాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇన్‌పుట్ సబ్సీడి ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ధనమంతా ఆయన ఇంటికి తరలిస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. మాజీ మంత్రి రాజంపేట, కడప పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేత షర్మిల పాదయాత్ర, ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ బాట చేపట్టారన్నారు. పరిశ్రమాభివృద్ధి రెండుశాతం తగ్గిపోయిన ఘనత కాంగ్రెస్ పాలకులు దక్కించుకున్నారన్నారు. తిరుపతి మహాసభల్లో తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు లేకపోవడం విచారకరమన్నారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అవినీతి కంపు కొడుతోందన్నారు. శ్రీనివాస్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పట్టణంలో శాసనసభ్యుడు లింగారెడ్డి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పట్టణంలోని పురవీధుల గుండా సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శిగా కామరాజు శ్రీనివాస్‌కుమార్‌ను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి , ఎమ్మెల్సీ సతీష్ కుమార్‌రెడ్డి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

గండికోట ఉత్సవాలు వాయిదా
జమ్మలమడుగు, డిసెంబర్ 30 : గండికోట ఉత్సవాలు నిరవధికంగా వాయిదా పడినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ గండికోట ఉత్సవాలు వాయిదా వేసినట్లు అధికారులు చెప్పారన్నారు. నూతన సంవత్సర వేడుకలకు తాను అందుబాటులో వుండనన్నారు. స్థానికంగా నెలకొన్న కరువు, ఢిల్లీలో జరిగిన అఘాయిత్యం వంటి ఉదంతాలతో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వుండదలచామన్నారు. ఢిల్లీ సంఘటనతో సభ్యసమాజం తలదించుకోవాలన్నారు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులో లేని విషయాన్ని గమనించాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో అందుబాటులో తాను అందుబాటులో ఉండని విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గమనించాలని రామసుబ్బారెడ్డి తెలిపారు.

వలంటీర్ల ఇంటిదారి
* జిల్లాలో 255 టీచర్ పోస్టుల భర్తీ
* పురపాలక పాఠశాలలకు 61 మంది
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 30 : 2012 డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులను మూడురోజుల క్రితం నియామకం చేయడంతో విద్యావలంటీర్లు ఇంటిమొఖం పట్టాల్సి వస్తోంది. జిల్లాలో 261 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో 255 మందిని నియామకం చేశారు. దీర్ఘకాలంగా కడప నగరపాలకంలో ఖాళీగా ఉన్న 25 ఉపాధ్యాయ భర్తీలను, ప్రొద్దుటూరు పురపాలకంలో ఖాళీగా ఉన్న 36 ఖాళీలను భర్తీ చేశారు. వీటిలో 45 పోస్టుల్లో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులను నియామకం చేయగా స్కూల్ అసిస్టెంట్లలో వివిధ విభాగాలకు 44 మందిని నియామకం చేశారు. ఆంగ్లం బోధించే వారిని 18 మందిని, తెలుగు బోధించే వారిని ముగ్గురిని, హిందీ బోధించే వారిని ముగ్గురిని, భాషోపాధ్యాయులను 23 మందిని, హిందీ భాషోపాధ్యాయులను 14 మందిని, పిఇటిలను ముగ్గురిని, ఉర్దూ మీడియం, గణితం, బౌతిక శాస్త్రం బోధించే వారిలో ఒక్కొక్కరి చొప్పున నియామకం చేశారు. జిల్లాలో ఉన్న 3312 ప్రాథమిక పాఠశాలలు, 537 ప్రాధమికోన్నత పాఠశాలలు, 730 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1438 మంది విద్యావలంటీర్లు విద్యాబోధన చేస్తున్నారు. ప్రస్తుతం 255 మందిని ఉపాధ్యాయులను సంబంధిత పాఠశాలల్లో నియామకం చేయడంతో విద్యావలంటీర్లను తొలగించేందుకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు.
క్రీడలకు మహర్దశ
* జాతీయ స్థాయికి జిల్లా క్రీడాకారులు
* జిల్లాలో జాతీయ స్థాయి పోటీలు, రంజీ క్రికెట్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 30 : జిల్లాలో సరస్వతీ పుత్రులు అంచలంచెలుగా ఎదుగుతున్న విధంగానే క్రీడల్లో కూడా జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. 2012 నాటికి జిల్లాలో క్రీడలకు మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న రాష్టస్థ్రాయి రంజీ క్రికెట్ పోటీలు జిల్లా క్రికెట్ అకాడమీకి రావడంతో జిల్లాలో క్రీడాసంబరాలు అంబరాన్ని అంటాయి. అలాగే షటిల్ బ్యాట్మింటన్‌కు ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, వైఎస్ రాజారెడ్డి స్టేడియం, మున్సిపల్ స్టేడియాలు క్రీడాకారులకు అందుబాటులో రావడంతో ఆ క్రీడల్లో జిల్లా వాసులు సత్తాచాటుకుంటున్నారు. ముఖ్యంగా లారీ క్లీనర్‌గా జీవనాధారం ప్రారంభించిన వల్లూరు మండలం పైడికాలువకు చెందిన విజయకుమార్ మొట్టమొదటి సారి ఐపిఎల్ దక్కన్ ఛార్జస్ లో బౌలర్‌గా సెలెక్ట్ అయ్యాడు. అలాగే హాకీ, వాలీబాల్‌లో కూడా రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న కరీముల్లా జాతీయస్థాయి పోటీల్లో గెలుపొందారు. కడప ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2న జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. అలాగే వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాస్థాయి బ్యాట్మింటన్ టోర్నీ నిర్వహించారు. జనవరి 9న రాయలసీమ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రొద్దుటూరు అనిబిసెంట్ హైస్కూల్‌లో నిర్వహించారు. అదే హైస్కూల్ ప్రాంగణంలో ఫిబ్రవరి 16 నుంచి 19వరకు రాయలసీమ స్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కడప మున్సిపల్ స్టేడియంలో మార్చి 3న జోనల్ స్థాయి వికలాంగుల ఆటల పోటీలను నిర్వహించారు. అక్కడే అక్టోబర్ 3న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు కూడా నిర్వహించగా రన్నరప్‌గా కడప జట్టు ఎంపికైంది. నవంబర్ 3న రాజంపేటలో అండర్ - 19 విభాగంలో రాష్టస్థ్రాయి టక్ ఆఫర్ పోటీలు నిర్వహించారు. అక్కడే నవంబర్ 4న అండర్ - 19 విభాగంలో టక్ ఆఫర్ , సెపక్‌తక్రా, తైక్వాండో పోటీలను డిసెంబర్ 14న అక్కడే విత్‌క్వాండో పోటీలను రాష్టస్థ్రాయిలో నిర్వహించారు. ఇక స్పోర్ట్స్ స్కూల్ విషయానికొస్తే మార్చి 11న డబుల్ ఒలంపియన్, సత్తిగీతా స్పోర్ట్స్ స్కూల్ సందర్శించడం, సన్మానించడం జరిగింది. జూలై 1 నుంచి స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలకు ఎంపికలు జరుగుతాయి. ఆగస్టు 7న స్పోర్ట్స్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ హెచ్‌ఇసికి అనుమతి లభించింది. ఆగస్టు 29న స్పోర్ట్స్ స్కూల్ లో ఘనంగా క్రీడోత్సవాలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో నవంబర్ 6న నిర్వహించిన పోటీల్లో స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం పతకాలు లభించాయి. ఇక స్కూల్ గేమ్స్ విషయానికొస్తే జిల్లాకు చెందిన త్రోబాల్ క్రీడాకారులు రాష్టస్థ్రాయిలో జిల్లా జట్టు ఎంపికైంది. రెండవస్థానంలో హాకీలో రాష్టస్థ్రాయిలో జిల్లా క్రీడాకారులు నిలిచారు. 3వ స్థానంలో కూడా జిల్లా క్రీడాకారులే సాప్ట్ బాల్‌లో విజేతలుగా నిలిచారు. అలాగే జాతీయ స్థాయి హాకీ జట్టుకు వేములలోని కస్తూరీబా పాఠశాలలలో 7వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసన్న ఎంపికైంది. ఇక రాష్టస్థ్రాయి, జాతీయస్థాయి తెక్వాండోలో రాయచోటికి చెందిన విద్యార్థులు ఎంపిక కావడం విశేషం. జనవరి 20 నుంచి 25 వరకు రాజంపేటలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. జనవరి 20 నుంచి 23 వరకు వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఇంటర్ సర్కిల్ కోకోకోలా పోటీలు జరిగాయి. ఏప్రిల్ 16న ఆర్‌వివికె ప్రసాద్ మెమోరియల్ సౌత్ ఇండియన్ వెటర్నర్ క్రీడా టోర్నమెంట్‌లో కడప క్రీడాకారులకు అవకాశం వచ్చింది. ఇక బాడీ బిల్డింగ్ సీమ జిల్లాల స్థాయిలో జనవరి 9న గుంతకల్‌లో జరిగిన పోటీల్లో కడపకు చెందిన అజాద్ అలీఖాన్, ఫైరోజ్‌లకు స్వర్ణపథకాలు లభించాయి. అక్టోబర్ 21న జరిగిన బాడీ బిల్డింగ్ లో ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్‌గా ఫైరోజ్ ఎంపికయ్యారు. అలాగే జిల్లాలో మూగజీవులను కూడా గుర్తింపు తెచ్చేందుకు వారం క్రితం కాశినాయన 17వ ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్టస్థ్రాయి ఎడ్లపోటీల్లో జిల్లాలోని రాజుపాలెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామానికి చెందిన కె.లక్ష్మిరెడ్డి బండలాగే పోటీల్లో ప్రథమ స్థాయిలో నిలిచాయి. ఏదేమైనా జిల్లాలో 2012వ సంవత్సరం క్రీడలకు మహర్దశ లభించిందని చెప్పవచ్చు.

నేరాలు తగ్గుముఖం
* కడప డిఎస్పీ రాజేశ్వరరెడ్డి
కడప (క్రైం), డిసెంబర్ 30:కడప సబ్ డివిజన్‌లో 2012 నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని డిఎస్పీ రాజేశ్వరరెడ్డి అన్నారు. నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో సబ్ డివిజన్‌లోని సిఐలు, ఎస్‌ఐలతో సమావేశం నిర్వహించారు. గత రెండు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం రికవరీలో కూడా పోలీసులు పురోగతిని సాధించారన్నారు. దొంగతనాలు, హత్యలు 10, 11 సంవత్సరాలతో పోల్చితే 2012వ వత్సరంలో క్రైం రేటు తగ్గిందన్నారు. డబ్బు కోసం హత్యలు, హత్యాయత్నాలు, దారి దోపిడీలు, దోపిడిలు, పగలు ఇళ్లు పగలకొట్టడం, రాత్రిళ్లు ఇళ్లు పగలకొట్టడం, సాధారణ దొంగతనాలు, మానభగాలు, దాడులు, మోసం, నమ్మక ద్రోహులు, దొంగ నోట్లు 2010, 2011 సంవత్సరాల కంటే 2012వ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. మోటార్ వెహికల్ ప్రమాదాలు, టౌన్ న్యూసెన్స్, గ్యాబ్లింగ్, మట్కా, 2010, 2011 కన్నా 2012లో తగ్గిందన్నారు. డిసెంబర్ నెలలో మోటర్ వెహికల్‌పై జరిమానాలు 32,078 కేసుల్లో రూ. 96,87,130, గ్యాంబ్లింగ్‌లో 847 కేసుల్లో రూ. 18,25,008, మట్కాలో 208 కేసుల్లో రూ. 28,10,490, కోడి పందెలు 42 కేసుల్లో రూ. 49,260, క్రికెట్ బెట్టింగ్‌లో 28 కేసుల్లో రూ. 7,20,950 నగదుతో పాటు పోగొట్టుకున్న సొమ్ము గత రెండు సంవత్సరాల కంటె 2012వ సంవత్సరం 57.83 శాతం రికవరీ అయినట్లు తెలిపారు.
రంజీ ట్రోఫీకి వర్షం దెబ్బ
* మంజుధర్ సెంచరీ
* ఆంధ్రా - కేరళ జట్ల మధ్య మ్యాచ్ నిలిపివేత
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 30 : కడప కేంద్రంలోని వైఎస్. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో శనివారం నుంచి ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఆదివారం వర్షంతో వాయిదా పడింది. గ్రూప్ -సిలో భాగంగా ఆంధ్రా వర్సెస్ కేరళ జట్లు శనివారం తలపడ్డాయి. అయితే రెండవ రోజు అయిన ఆదివారం ఉదయం నుంచి వర్షం జల్లులతో కొంత ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్‌లో 7 వికెట్లకు 249 పరుగులు చేసింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా ఆంధ్రా జట్టును 20 ఫోర్లతో, ఓ సిక్స్‌తో మంజుధర్ 146 పరుగులు చేసి కష్టాల నుండి ఆదుకున్నాడు. కె ఎస్ షాబుద్దీన్ 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు, బి. సుమంత్ 9 ఫోర్లతో 47 పరుగులు చేశారు. కేరళ జట్టులోని బౌలర్లు మాను క్రిష్టన్ 3 వికెట్లు, వారియర్ 2, కె. ఎస్. రాజేష్ 2, సిపి షాషిద్ 2, శ్రీశాంత్ ఒక వికెట్‌ను తీసుకోగలిగారు. రెండవ రోజు ఆంధ్రా జట్టు ఆట ముగిసేంత వరకు క్రీజ్‌లో ఉన్న అతను లాస్ట్ వికెట్ కోల్పోవడంతో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం లంచ్ విరామం తరువాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు 18.2 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 55 పరుగులను చేసింది. కాగా వర్షం కారణంగా అంపైర్ల నిర్ణయంతో మ్యాచ్ రద్దు చేసే సమయానికి రోహన్ ప్రేమ్ 14, వి ఎ. జగదీష్ 17 పరుగులతోనే క్రిజ్‌లో ఉన్నారు. ఆంధ్రా బౌలరు విజయకుమార్ 2 వికెట్లను తీసుకోవడంతో ప్రేక్షకులు ఊలలు, చప్పట్లతో స్టేడియం మారుమ్రోగింది. వర్షం అధికమవ్వడంతో ప్రేక్షకులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. మూడవ రోజు వర్షం రాకపోతే యథావిధిగా మ్యాచ్ జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2012లో నేరాలు తగ్గుముఖం
* డిఎస్పీ జాన్‌మనోహర్
జమ్మలమడుగు, డిసెంబర్ 30:జమ్మలమడుగు సబ్‌డివిజన్ పరిధిలో 2012 సంవత్సరంలో నేరాలు తగ్గాయని డిఎస్పీ జాన్‌మనోహర్ పేర్కొన్నారు. స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌మనోహర్ మాట్లాడుతూ 2011 కంటే 2012 సంవత్సరంలో నేరాల రేటు తగ్గిందన్నారు. 2011లో హత్య కేసులు 12కాగా 2012లో 9 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యాయత్నం కేసులు 2011లో 8కాగా, 2012లో9, పగటి దొంగతనం కేసులు 2011లో 2, 2012లో3 నమోదయ్యాయన్నారు. రాత్రి దొంగతనం కేసులు 2011లో 4కాగా, 2012లో6, సాధారణ దొంగతనం కేసులు 2011లో38కాగా, 2012లో 28నమోదయ్యాయన్నారు. బలాత్కారం కేసులు 2011లో 2, 2012లో లేవన్నారు. చీటింగ్ కేసులు 2011లో 109కాగా 2012లో145, బెదిరింపు కేసులు 2011లో 209, 2012లో 241, చోరీలో పోయిన సొమ్ము 2011లో రూ.4869700కు గాను రూ.4035400 రికవరీ చేయగా 2012లో పోయిన సొమ్ము రూ.1758500కు రూ.1271081 రికవరీ చేయడం జరిగిందన్నారు. గాంబ్లింగ్, మట్కా కేసులు 2011లో 845కు రూ.1782901 పట్టుకోగా, 2012లో 587 కేసులకు రూ.4055866లు పట్టుకోవడం జరిగిందన్నారు. వాహనాల తనిఖీలో 2011లో1108కేసులకు రూ.3152215లు వసూలు చేయగా, 2012లో 2011 కేసులకు 3845000 లు వసూలు చేయడం జరిగిందన్నారు. 2012లో రూ.4356000 విలువ జేసే 140 ఎర్రచందనం దుంగలు, 8వాహనాలను పట్టుకొన్నామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 2012లో నేరాల రేటు తగ్గిందని డియస్పీ జాన్‌మనోహర్ తెలిపారు. సమావేశంలో రూరల్ సిఐ భాస్కర్‌రెడ్డి, కొండాపురం సిఐ క్రిష్ణమూర్తి వున్నారు.
తమలపాకు రైతులకు మంచుదెబ్బ
* తెగుళ్లతో పండిపోతున్న ఆకులు
* ధర ఉన్నా.. తగ్గిన దిగుబడి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 30 : జిల్లాలోని తమలపాకు తోటలకు మంచు దెబ్బతీస్తోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నీలం తుఫాన్‌తో జిల్లాలో 9.5 హెక్టార్లలో తమలపాకు తోటలు దెబ్బ తిన్నారు. ప్రస్తుతం విపరీతంగా కురుస్తున్న మంచుతో తెగుళ్లు విజృంభిస్తున్నాయి. జిల్లాలో 850 హెక్టార్లలో రైతులు తమలపాకు తోటలు సాగు చేశారు. చెన్నూరు, ఓబులవారిపల్లె, రాజంపేట, పుల్లంపేట, చింతకొమ్మదినె్న మండలాల్లో ఈ విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ పండే తమలపాకులను చెన్నై, తిరుత్తణి, తిరుపతి, హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తుంటారు. గతంలో రోజూ రెండు లారీల్లో తమలపాకులను దిగుమతి చేస్తుండే వారు. ప్రస్తుతం వారానికి ఒక లారీ ఆకులను కూడా ఎగుమతి చేయలేని పరిస్థితి నెలకుందని రైతులు వాపోతున్నారు. గంప తమలపాకులు 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. అయితే దిగుబడి లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు దాదాపు 60 వేలు ఖర్చు పెట్టామని, దీనికి తోడు రాత్రింబవళ్లు శ్రమిస్తే చివరికి చేతికి ఆశించిన లాభం రావడం లేదంటున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న మంచు తేమతో తోటలకు తెగుళ్లు ఏర్పడానికి కారణమైందని దీని వల్ల తీగలు వాలిపోతూ ఆకులు పండుగా మారి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మొక్క నుంచి మరో మొక్కకు ఈ తెగులు వ్యాపిస్తోందన్నారు. ఆకులు కత్తిరించినప్పుడు కూడా రోగం మరో మొక్కకు సంక్రమిస్తున్నట్లు తెలిపారు. తెగులు వల్ల తీగ చనిపోవడంతో ఆకుకు అసరాగా ఉండే అవిశ కూడా చనిపోతోందని, దీని వల్ల దిగుబడి బాగా తగ్గిపోతోందని తమలపాకు రైతులు పేర్కొంటున్నారు.

శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి
* డిఎస్పీ కరుణాకర్
ప్రొద్దుటూరు, డిసెంబర్ 30 : ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులోనే ఉండడంతో పాటు నేరాల సంఖ్య తగ్గాయని డిఎస్పీ కరుణాకర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా యువతలో మార్పు రావాలన్నారు. గత ఏడాది 18 హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది 10కి చేరుకున్నాయన్నారు. దొంగతనాల కేసులు గత ఏడాది 116 ఉండగా, ఈ ఏడాది 88కి తగ్గాయన్నారు. బాధించిన కేసులు గత ఏడాది 173 ఉండగా ఈ ఏడాది 178కి చేరుకున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు గత ఏడాది 105 ఉండగా ఈ ఏడాది 136కు పెరిగాయన్నారు. గత ఏడాది గ్యాబ్లింగ్ కేసులు వంద నమోదు కాగా ఈ ఏడాది 166 కేసులను నమోదు చేసి దాదాపు 16లక్షల రూపాయలు నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. మట్కా 277 కేసులను నమోదు చేసి 10 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారన్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి 50 కేసులను నమోదు చేసి కోటీ, 30లక్షల రూపాయలు నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. 26,960 వాహనాల తనిఖీలకు సంబంధించి కేసులను నమోదు చేసి దాదాపు 76లక్షల రూపాయల అపరాద రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

* మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>