Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

$
0
0

అనకాపల్లి టౌన్, డిసెంబర్ 30: స్థానిక శారదాగ్రంథాలయంలో ఏర్పాటుచేసిన ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఖాదీవస్త్రాలను ఆయన పరిశీలించారు. వస్త్రాల నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకొని వస్త్రాలను కొనుగోలు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తయారైన ఉత్పత్తులను అమ్మకానికి ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహానికి ఖాదీవస్త్రంతో తయారుచేసిన మాలను గాంధీమెడలో మంత్రి గంటా అలంకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, ఖాదీపరిశ్రమ అదనపు అసిస్టెంట్ డైరక్టర్ జి శ్రీనివాస్‌గన్, శారదాగ్రంథాలయ అధ్యక్షుడు కోరుకొండ బుచ్చిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ, ఖాదీకో-ఆర్డినేటర్ చౌదరీ పాల్గొన్నారు.

రానున్న కాలంలో కాపులే
రాష్ట్రాన్ని శాసిస్తారు
మంత్రి గంటా వెల్లడి
అనకాపల్లి, నెహ్రూచౌక్ 30: రానున్న కాలంలో ఆంధ్రరాష్ట్రాన్ని కాపులే శాసిస్తారని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇక్కడకు సమీపంలోని సత్యనారాయణపురం కొండ ప్రాంగణంలో అనకాపల్లి తూర్పుకాపుల సంఘం విస్తృత సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాపులు అధికారంలోకి వచ్చి ఈ సామాజికవర్గ సత్తా ఏమిటో రుజువు చేశారన్నారు. తాను ఎంపిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ ఉన్నత పదవులు నిర్వహించడంలో కాపులు అండదండలు లభించాయని, వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. కేవలం 21 రోజుల్లో రాజకీయ రంగం ప్రవేశంతో తనను ఎంపిగా గెలిపించిన ఘనత కాపులకే దక్కుతుందన్నారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాపులు శాసించడం తథ్యమన్నారు. జిల్లాలో తూర్పు కాపులందరికీ బిసి(డి) ధ్రువీకరణ పత్రాలు ఇప్పించానన్నారు. కాపుల సామాజిక వర్గపరమైన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి పప్పల చలపతిరావు మాట్లాడుతూ జిల్లాలోని కాపులను తూర్పు కాపులుగా గుర్తించేందుకు గత 20ఏళ్లుగా చేస్తున్న కృషికి ఇప్పుడు ఫలితం లభించిందన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఆర్థికంగా యువత బలపడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటాను తూర్పుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశం ప్రారంభంలో కాపు సంఘం నేత కెఎస్‌మూర్తి చిత్రపటానికి మంత్రి గంటా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, అనకాపల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ మలసాల కిషోర్, ఆర్‌ఇసిఎస్ వైస్‌చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పట్టణ తూర్పు కాపుసంఘం అధ్యక్షుడు కొణిదల నారాయణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ కౌన్సిలర్స్ పలకారాము, తాడి రామకృష్ణ, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ తాకాశి బాబు పాల్గొన్నారు.

సహకార ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్
* వైఎస్సార్ సిపి నేత కొణతాల ద్వజం
అనకాపల్లి రూరల్, డిసెంబర్ 30: సహకార ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కశింకోట ఆర్‌ఇసిఎస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో ఘోరపరాభవం తప్పదనే భయంతో దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకునే కుటిలయత్నాలకు అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల యలమంచిలి, నాగులాపల్లి సొసైటీల్లో ఓటర్ల నమోదులో అధికార కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు కార్యదర్శులను బెదిరించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి బినామీ ఓటర్లను చేర్పించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సొసైటీ కార్యదర్శి కాంగ్రెస్ పెద్దల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్‌సిండికేట్లపై ఎసిబి దాడులు చేసింది వారే, ఏమిలేదని చెప్పింది వారేనని ప్రభుత్వం అధికారులను బెదిరించి తప్పుడు నివేదికలను తయారు చేస్తుందన్నారు. వారికి అనుకూలంగా నివేదికలు ఇవ్వకపోతే బెదిరిస్తుందని కొణతాల ఆరోపించారు.
తెలంగాణపై తమ వైఖరి ఎప్పుడో చెప్పామని కొణతాల అన్నారు. ఆర్టికల్-3 ప్రకారం కేంద్రప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్రంలో అన్నిపార్టీలు తీర్మానం చేసినా జాతీయ స్థాయిలో కేంద్రం ఆమోదం పొందకపోతే ఆ తీర్మానం చెల్లదన్నారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్దాంతంతో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి, ఆర్‌ఇసిఎస్ చైర్మన్ చల్లా కనకారావు, మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.

ఢిల్లీ ఘటన దురదృష్టకరం: మంత్రి గంటా
* మహిళల వౌన ప్రదర్శన
గాజువాక, డిసెంబర్ 30: ఢిల్లీ సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆధ్వర్యంలో గాజువాక పోలీస్‌స్టేషన్ కూడలిలో ఢిల్లీ సంఘటనపై భారీ సంఖ్యలో మహిళలు వౌన ప్రదర్శన నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, మహావిశాఖ కమిషనర్ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అర్థరాత్రి ఒంటరిగా రోడ్లుపై తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు పూజ్య బాపూజీ అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. నేడు ఢిల్లీ సంఘటన చూస్తే నేటికీ భారతదేశానికి స్వాతంత్య్రం రాలేదని చెప్పవచ్చునన్నారు. అత్యాచారం చేసే మృగాలను శిక్షించేందుకు కఠనమైన చట్టాలు అవసరమన్నారు. దీనికి అనుగుణంగా చట్టాల్లో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఢిల్లీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే విద్యార్థిని మృతికి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఎన్‌ఎం రాజా, మంత్రి మూర్తి, గుడివాడ అమ్మన్న, కరణంరెడ్డి నర్సింగరావు, బలిరెడ్డి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కొవ్వుత్తుల ప్రదర్శన
ఢిల్లీ సంఘటనపై 65వ వార్డు పరిధి మింది గ్రామంలో మదర్ థెరిసా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీ సంఘటనకు కారకులైనా వ్యక్తులపై కఠన చర్యలు తీసుకోవాలని టిడిపి మహిళా నేత గుడివాడ నాగమణి డిమాండ్ చేశారు. మృతురాలు ఆత్మశాంతి చేకూరాలని మహిళలు కొవ్వుత్తులు వెలిగించి ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్‌నాథ్, నేతలు అప్పలరామ్మూర్తి పాల్గొన్నారు.

ఆర్.ఇ.సి.ఎస్ నూతన చైర్మన్‌గా
చల్లా ప్రమాణ స్వీకారం
కశింకోట, డిసెంబర్ 30: ఆర్‌ఇసిఎస్ నూతన చైర్మన్‌గా పరవాడ డైరక్టర్ చల్లా కనకారావు ఆదివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో అట్టహాసంగా నాయకులు, అభిమానుల మధ్య జరిగిన కార్యక్రమంలో నూతన చైర్మన్ కనకారావు మాట్లాడుతూ మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి ఆదేశాలు మేరకు మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ సలహాలు తీసుకుంటూ తమ పాలకవర్గమంతా సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్‌ఇసిఎస్ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో ఉన్న వినియోగదారులకు సంస్థ నుండి మరింత లబ్దిపొందే అవకాశాలు కల్పిస్తామన్నారు. వైస్ చైర్మన్‌గా గొల్లవిల్లి శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారోత్సవంలో బాణాసంచా వెలిగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జి, అనకాపల్లి వర్తకసంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ(పెదబాబు), ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ మలసాల కిషోర్, ఆర్‌ఇసిఎస్ డైరక్టర్లు సబ్బవరపు నారాయణమూర్తి, దొడ్డి బాలాజీ, పెంటకోట శ్రీనివాసరావు, శానాపతి గంగునాయుడు, కాపుశెట్టి శేషుబాబు, కశింకోట మాజీ సర్పంచ్ మళ్లబుల్లిబాబు, సంస్థ ఉద్యోగులు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఐటిడిఎలో అవినీతిపై ఎసిబితో విచారణ జరిపించాలి
* మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు డిమాండ్
ముంచంగిపుట్టు, డిసెంబర్ 30: పాడేరు ఐ.టి.డి.ఎ.లో జరిగిన అవినీతిపై ఎ.సి.బి. చేత విచారణ నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరా వు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐ.టి.డిఎ.లో ప్రాజెక్టు అధికారిగా గ్రూ ప్-1 అధికారులను నియమించి వారి ద్వారా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, అరకు ఎమ్మెల్యేలు కలిసి అవినీతికి పా ల్పడుతున్నారని ఆరోపించారు. మన్యం అభివృద్ధిని గాలికి వదిలేసి ఏడాది కాలంగా పాలకవర్గ సమావేశం నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారన్నారు. పాలకవర్గ సమావేశం ని ర్వహిస్తే మంత్రి, ఎమ్మెల్యే, అధికారుల అవినీతి బట్టబయలు అవుతుందనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఐ.టి.డి .ఎ. పి.ఒ., సబ్ కలెక్టర్‌లను ఐ.ఎ.ఎస్. అధికారులనే నియమించి మన్యం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మన్య ంలో జరిగిన కాఫీ నిధుల స్వాహాపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మన్య ంలో సుమారుగా 30 కోట్ల రూపాయల వరకు కాఫీ సొమ్ము స్వాహా అయిందని ఆరోపించారు. పెదబయలు మండలంలోనే మూడు కోట్లకు పైగా నిధులు స్వాహా జరిగినట్టు తేలిందన్నారు. కొన్ని మండలాల్లో కాఫీ రైతులకు తొమ్మిది వందల నుంచి 1600 రూపాయలు మాత్రమే అందించి మిగిలిన సొమ్ము అధికార పార్టీ నాయకులు, అధికారులు అక్రమంగా స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సి.ఎం. పర్యటన అనంతరం విచారణ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, నేటికి నెలరోజులు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పిప్పళ్లు పండించే రైతులకు గిట్టుబాటు ధర లేక అన్యాయానికి గురవుతున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. ముంచంగిపుట్టు పిహెచ్.సి.ను సిహెచ్.సి.గా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదన్నారు. అనంతరం జర్జుల పంచాయతీ సోబల్డ గ్రామంలో పర్యటించి గ్రామ గిరిజనులు ఎదుర్కొంటు న్న సమస్యలను సర్వేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి.కాసులమ్మ, పాంగి పాండురంగస్వామి, ఎస్.వరలక్ష్మి, కె.మ త్స్యలింగం, రాందాస్, లింగమూర్తి, కూర్మారావు పాల్గొన్నారు.

వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు, డిసెంబర్ 30: విశాఖ గిరిజన ప్రాంతంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మర్రిచెట్టు అప్పారావు కోరారు. స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో ఆదివారం జరిగిన గిరిజన ప్రాంత వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడం సరికాదని అన్నారు. గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విశేష సేవలు అందిస్తున్న వైద్య ఉద్యోగులు అనేక సమస్యలతో విధులను నిర్వహించాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఏజెన్సీలో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగుల కంటే వైద్య ఉద్యోగులే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ఇటువంటి వారి సమస్యల పట్ల సర్కారు చిన్నచూపు చూస్తుండడం తగదని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి వారికి న్యాయం చేయాలని, ఇందుకోసం తమ సంఘం పోరాటం సాగిస్తుందని అప్పారావు చెప్పారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు మాట్లాడుతూ తమ సమస్యలపై అనేకసార్లు మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెండో ఎ.ఎన్.ఎం.లను రెగ్యులర్ ఎ.ఎన్.ఎం.లుగా పదోన్నతి కల్పించాలని, ఏజెన్సీలో జనాభా ప్రాతిపదికన నూతన సబ్ సెంటర్లను ఏర్పాటుచేసి గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అర్హులైన వారికి హెల్త్ విజిటర్, పి.హెచ్.ఎన్., ఎం.పి .హెచ్.ఎస్.లుగా పదోన్నతి కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖలో పెరుగుతున్న అవినీతిని అరికట్టాలని, జి.ఒ.నెం-68 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు బుక్కా చిట్టిబాబు, ఏజెన్సీలోని అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలల్లో వౌలిక సదుపాయాలపై సర్వే
పాడేరు, డిసెంబర్ 30: గిరిజన ప్రాంతంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో వౌలిక సదుపాయాలపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్టు ఐ.టి.డి.ఎ. ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సర్వేపై చర్చించేందుకు ఈనెల 31వ తేదీన ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో ఏజెన్సీలోని అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారులు, ఐ. ఆర్.జి.లు, స్కూల్ కాంప్లెక్స్‌ల ప్రధానోపాధ్యాయులతో వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. వర్క్‌షాపునకు హాజరైన ప్రధానోపాధ్యాయులు మండల స్థాయిలోని ఉపాధ్యాయులకు సర్వేపై సమగ్ర శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న వౌలిక వసతులపై సర్వే చేయడానికి అవసరమైన సామగ్రిని పి.ఎం.ఆర్.సి. ద్వారా సరఫరా చేయనున్నట్టు చెప్పారు. వర్క్‌షాపునకు విద్యాశాఖ, గిరిజన సంక్షేమ అధికారులు హాజరు కావాలన్నారు.
‘వ్యవసాయ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయాలి’
పాడేరు, డిసెంబర్ 30: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు పండించే రాజ్‌మా, పిప్పళ్లు, కాఫీ వంటి వాటిని గిరిజన సహకార సంస్థ (జి.సి.సి.) కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామగోపాల్ కోరారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జి.సి.సి. వీటిని కొనుగోలు చేయకపోవడంతో దళారీలు తక్కువ ధర చెల్లించి రైతులను మోసం చేస్తున్నారని అన్నా రు. తుపాను ప్రభావంతో ఇప్పటికే నష్టపోయిన రైతులు వారు పండిస్తున్న రాజ్ మా, పిప్పళ్లు, కాఫీ వాటికి సరైన గిట్టుబాటు ధర లేక మరింత నష్టపోతూ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. మార్కెట్‌లో వీటికి గిరాకీ ఉన్నప్పటికీ దళారులు సిండికేట్‌గా ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ విషయమై జి.సి.సి. అధికారులు చర్యలు తీసుకుని గిరిజనులు పండించే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజన రైతులను ఆదుకోవాలని కోరారు.

కాఫీ సొమ్ముల అవినీతిపై విచారణ జరపాలి
జి.మాడుగుల, డిసెంబర్ 30: మండలంలోని కాఫీ, సిల్వర్ ఓక్ మొక్కల పెం పకానికి లబ్ధిదారులకు చెల్లించిన సొ మ్ముల్లో జరిగిన అవినీతిపై తక్షణమే బహిరంగ విచారణ జరిపించాలని మా జీ పార్లమెంట్ సభ్యుడు మిడియం బా బూరావు డిమాండ్ చేశారు. మండలం భీరం పంచాయతీ వి.కోడాపల్లి గ్రామా న్ని ఆదివారం ఆయన సందర్శించి కాఫీ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011-12 సంవత్సరంలో 183 ఎకరాలకు 183 మంది గిరిజన రైతులు కాఫీ, సిల్వర్ ఓక్ మొక్కల పెంపకం చేపట్టారన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోత్సాహక నిధులు ఒక్కొక్కరికి 18, 489 రూపాయలు అందించాల్సి ఉండగా, ఎవరికీ 15 వేల రూపాయలకు మించి ఇవ్వలేదని ఆయన ఆరోపించా రు. నర్సరీలో గోతులు తవ్వడం, మొక్కలకు నీరు పోయడం ఇతర పనులను ఉపాధి హామీ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదన్నారు. కాఫీ మొక్కల పెంపకంలో గిరిజన రైతులకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాలని ఆయ న కోరారు. కాఫీ కుంభకోణంపై ముఖ్యమంత్రి విచారణ జరిపించి అక్రమార్కులను శిక్షిస్తామని ప్రకటించినా ప్రస్తుతం ఉన్న మొక్కలు కాపాడుకోవడం కోసం రైతులకు బకాయిపడ్డ సొమ్మును తక్షణ మే చెల్లించాలన్నారు. కాఫీ అక్రమాలపై శాఖాధికారులతోపాటు ప్రజాసంఘా లు, ప్రజాప్రతినిధులతో విచారణ జరిపించాలని బాబూరావు డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో పార్టీమం డల కార్యదర్శి జె.దేవుళ్ళు, గిరిజన సంఘం ప్రతినిధి ధర్మన్నపడాల్ పాల్గొన్నారు.

చంఢీయాగంతో మన్యానికి మేలు
అరకులోయ, డిసెంబర్ 30: అరకులోయలో నిర్వహించిన చంఢీయాగంతో విశాఖ మన్యానికి మేలు జరుగుతుందని గురు భవానీలు చందు, వీరభద్రరావు అన్నారు. స్థానిక ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ చంఢీయాగం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురుభవానీలు మాట్లాడుతూ ప్రకృతి రూపం చంఢీమాత అన్నారు. చంఢీ యాగం వల్ల గిరిజన ప్రాంతానికి మంచి జరుగుతుందని, చంఢీమాతను ఆరాధించడం వల్ల రాబోయే కాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సుఖంగా ఉంటారని వారు చెప్పారు. ఇటువంటి యాగం నిర్వహించడం వల్ల సమాజంలో అందరి మధ్య సోదరభావం పెరుగుతుందన్నారు. ప్రతీ సంవత్సరం గురు భవానీలు కలసిమెలసి చంఢీయాగం నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందని చందు, వీరభద్రరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రాంతాల భవానీలు, అయ్యప్పస్వాములు పాల్గొన్నారు.
విద్యార్థినికి బహుమతి ప్రదానం
పాడేరు, డిసెంబర్ 30: విశాఖపట్నంలో ఈనెల 21వతేదీన నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమస్థానంలో గెలుపొందిన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎన్.రాజుకుమారికి స్థానిక అదనపు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం నగదు బహుమతితోపాటు ధ్రువపత్రాన్ని అందజే శారు. విద్యార్థులు ఇటువంటి పోటీల్లో చురుగ్గా పాల్గొవడం ద్వారా విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం పాడేరు డివిజన్ ప్రతినిధులు బి.చిట్టిబాబు, జి.అశ్వనికుమారి, కె.ఉమమహేశ్వరి పాల్గొన్నారు.
‘అత్యాచార నిందితులను ఉరితీయాలి’
అరకులోయ, డిసెంబర్ 30: ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే ఉరితీయాలని గిరిజన ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, విద్యార్థినీ, విద్యార్థులు డిమాండ్ చేశారు. అత్యాచార బాధితురాలి మృతితో అరకులోయలో శనివారం రాత్రి మరోసారి ఆందోళనలు జరిగాయి. సభ్య సమాజం తలదించుకునే ఈ దుర్ఘటనకు తీవ్రంగా స్పందించిన అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారం నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థిని ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. మహిళలకు రక్షణ కల్పించాలని, ఢిల్లీ యువతి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, గిరిజన నాయకులు మాట్లాడుతూ కిరాతకులకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని నిండు ప్రాణాన్ని తమ పాశవిక చర్య ద్వారా బలితీసుకున్న దుండగులకు శిక్ష పడేంతవరకు ఆందోళనలు కొనసాగుతాయని ప్రకటించారు.

’కొణతాల బాబ్జీల సహకారంతోనే
చైర్మన్ పదవికి న్యాయం చేస్తా’
సబ్బవరం, డిసెంబర్ 30: తనకు రాజకీయాల్లో స్ధానం కల్పించటంలోనూ, ఆర్‌ఇసిఎస్ చైర్మన్ పదవికి ఎంపిక చేయటంలోనూ ఎంతో సహకారం అందించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ,మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీలకు పేరు తెచ్చేవిధంగా సంస్ధను లాభాల బాటలో నడిపిస్తానని అనకాపల్లి విద్యుత్ సహకార సంస్ధనూతన చైర్మన్ చల్లాకనకారావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆరిపాక చెరకు కాటావద్ద నిర్మించిన శ్రీషిర్డీసాయిబాబా మందిరం వద్ద హైమాస్ట్‌లైట్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌ఇసిఎస్‌కు మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ చేసిన విధంగానే తాను అన్నివర్గాల ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన సర్‌చార్జీల భారం తమ సంస్ధతోపాటు వినియోగదారులపై కూడా పెనుభారం మోపటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆరిపాక ప్రధాన గ్రామం నుంచి కాటావరకు వీధి దీపాల నిర్మాణానికి కృషిచేయాలని, టెక్కలిపాలెం జంక్షన్ వద్ద హైమాస్ట్ దీపాలను ఏర్పాటు చేయాలని మాజీ సుగర్‌కేన్ డైరెక్టర్ మళ్లకోటేశ్వరరావు చైర్మన్ ను కోరగా ఆయన స్పందిస్తూ ముందు వీధి దీపాలు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామని, మరో నాలుగు నెలలు తర్వాత ఆరిపాక-చోడవరం రోడ్డుపై టెక్కలిపాలెం వెళ్లేరోడ్డువద్ద హెమాస్ట్‌లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ వినియోగానికి ఎపిఇపి డిసిఎల్ కంటే మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు. అనంతరం ఇక్కడి శ్రీషిర్డీసాయిబాబా ఆలయం కమిటీ కొత్తగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఇసిఎస్ మాజీ వైస్ చైర్మన్ కాపుశెట్టిశేషు,డైరెక్టర్ సబ్బవరపునారాయణమూర్తి,వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గండి రవికుమార్,మళ్లకోటేశ్వరరావు,ముత్యలింగం,పివిఎస్‌ఎన్‌రాజు,(మాస్టారు),ఎం.కోటి,ఎపిఇఎల్.శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

రైలు చక్రాల పరిశ్రమ
విశాఖలోనే ప్రారంభించాలి
* అఖిలపక్షాల డిమాండ్
విశాఖపట్నం, డిసెంబర్ 30: రైలు చక్రాల పరిశ్రమను ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఏర్పాటుకు కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసి విశాఖలో ఈ పరిశ్రమను ప్రారంభించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ విషయమై ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా నెలకొల్పాలనుకున్న రైలు చక్రాల పరిశ్రమ విశాఖలోనే నిర్మించాలని అఖిలపక్షాల నాయకులు తీర్మానించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ రాయ్‌బరేలిలో ఈ పరిశ్రమను నెలకొల్పడం పూర్తిగా రాజకీయ ఒత్తిడితోనే జరిగిందని, ఈ విషయంపై నగర ఎంపి, కేంద్రమంత్రి నేటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తపర్చారు. టిడిపి జిల్లా సమన్వయ కమిటీ కార్యదర్శి పి.ఎస్.నాయుడు, సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు బి.వెంకటరావు, వైఎస్సార్ సిపి జిల్లా నేత పక్కి దివాకర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, విద్యుత్ చార్జీల పెంపుదల, థర్మల్ ప్లాంట్ నీటి వనరులపైనా ప్రసంగించారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు డాక్టర్ బి.గంగారావు, పద్మనాభ రాజు, వైఎస్సార్ సిపి నేత నారా నాగేశ్వర రావు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి కె.సత్యాంజనేయ, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు కె.సురేష్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సింహాద్రప్పడు పోటీ
విశాఖపట్నం, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరగబోవు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యదర్శి గుల్లిపల్లి సింహాద్రప్పడును రాష్ట్ర సంఘం నిర్ణయించింది. 60 ఏళ్ళుగా ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఉద్యమనేత సింహాద్రప్పడును ఉపాధ్యాయులంతా బలపరిచి గెలిపించాలని టీచర్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లాశాఖ పిలుపునిచ్చారు. 1966నుంచి వివిధ పదవులను నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ ఉద్యమాన్ని బలోపేతం చేయడంతోపాటు, 1979 డిసెంబర్ 29వ తేదీన ఫ్యాస్టో పిలుపుపై విశాఖ జిల్లా చోడవరంలో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎదుట బహిరంగంగా నల్లజెండాలతో వందలాది మందితో ప్రదర్శన జరిపారు. లాఠీచార్జీలో వందమంది గాయపడగా 13 మంది కార్యకర్తలను జైలులో వేశారు. అలాగే 1996లో నాటి సిఎం చంద్రబాబు ఎదుట చిట్టివలస వద్ద నిరసన చేపట్టి ఎయిడెడ్ టీచర్లకు 40 కోట్ల రూపాయలను గ్రాంట్‌ను మంజూరు చేయించడంలో సింహాద్రప్పడు కృషి మరువలేనిదన్నారు.
ఏనుగులను ఢీకొన్న కోరమండల్ రైలు
* 12 గంటలు ఆలస్యం.. ప్రయాణికుల ఆగ్రహం
విశాఖపట్నం, డిసెంబర్ 30: ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల గుంపును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. రైల్వేట్రాక్‌పై నుంచి ఎనుగులు గుంపు వెళ్తుండగా జరిగిన ఘటనతో రైలు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఘోర రైలు ప్రమాదం తప్పినట్టు అయింది. ఏనుగులను ఢీకొన్న రైలు ఇంజన్ దెబ్బతినగా, ఆరు ఏనుగులు మృతి చెందాయి. ఇందులో రెండు పెద్ద ఏనుగులున్నాయి. మిగిలిన వాటిలో కొన్నింటికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ కారణంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 12 గంటలు ఆలస్యంగా ఇక్కడకు చేరుకుంది. ఫలితంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కనీసం సమాచారం అందివ్వకపోవడంతో ఈ రైలులో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గంటల తరబడి నిరీక్షించిన మరికొంతమంది ప్రయాణికుల నుంచి అధికారులు ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. కాగా హౌరా నుంచి విశాఖకు వచ్చే పలు సూపర్‌పాస్ట్ రైళ్ళు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.

స్థానిక
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>