Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజాసంక్షేమం కోసమే సమైక్యాంధ్ర

$
0
0

నరసరావుపేట, డిసెంబర్ 30: ప్రజా సంక్షేమం కోసం సమైక్యవాదానే్న బలపరుస్తున్నానని నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ఏ విధంగా సమైక్యాంధ్రను బలపరుస్తున్నారో అదేవిధంగా తాను తెలుగుదేశంపార్టీ నుండి సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపిస్తున్నానని చెప్పారు. సమైక్యాంధ్రపై రెండు, మూడురోజుల్లో తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసి ప్రజల మనోభావాలను తెలుపనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబునాయుడుకు రెండు ప్రాంతాలు ప్రధానమేనన్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్టమ్రైతే అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులను నిలుపుదల చేయలేమన్నారు.
రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు వచ్చే పరిస్థితి ఏర్పడనుందని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం వస్తే మరీ ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో 450 టిఎంసిల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 200 టిఎంసిలు, శ్రీశైలంలో 40 టిఎంసిలు, పులిచింతల్లో 15 టిఎంసిల నీటి నిల్వను చేసే సామర్థం ఉందని తెలిపారు. సాగునీటి కోసం ఉపయోగించుకునే ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం తాగునీటి కోసమే వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
‘కాంగ్రెస్‌కు తొత్తులా అధికార యంత్రాంగం’
నరసరావుపేట, డిసెంబర్ 30: అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాల ఓట్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, పార్టీ కార్యకర్తలపై స్థానిక డిఎస్పీ పి వెంకటరామిరెడ్డి లాఠీచార్జీ చేయడం దారుణమన్నారు. వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్పీని సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారంటే, పోలీసు వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రభుత్వం స్పందించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు చేయాలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పోలీసులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విషయంలో కూడా అతిగా స్పందించారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ దౌర్జన్యాలు, అరాచకాలు చేసే పరిస్థితి నూతన సంవత్సరంలో రాకుండా యంత్రాంగం పనిచేయాలన్నారు. నరసరావుపేట పట్టణంలో ఐచ్చికంగా బంద్ జరిపి, వాస్తవంగా ప్రజలు నిరసనను తెలియజేయడం అధికారులకు చెంప పెట్టు అన్నారు. ఈ సమావేశంలో వేల్పుల సింహాద్రియాదవ్, కొల్లి ఆంజనేయులు, డాక్టర్ శివరామకృష్ణ, పులిమి రామిరెడ్డి పాల్గొన్నారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడిగా పూర్ణచంద్రరావు ఏకగ్రీవం

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, డిసెంబర్ 30: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన పి పూర్ణచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గుంటూరు అరండల్‌పేటలోని వైన్‌డీలర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా అధ్యక్షుడు వల్లెపు కృపారావు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. ఎన్నిక కార్యక్రమానికి రిటర్నింగ్ అధికారిగా కందుకూరి సత్యనారాయణ, ఎన్నికల అధికారిగా జిల్లా ఇన్‌చార్జి యు శ్రీనివాసరాజు వ్యవహరించారు. అధ్యక్షుడి స్థానానికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో పూర్ణచంద్రరావు నియామకం ఏకగ్రీవమైంది. ఇదే సమయంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు 12 అసెంబ్లీలకు చెందిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పొన్నూరుకు చెందిన ఆరె వెంకట్రావ్, మంగళగిరి నుంచి బండ్రెడ్డి కోటేశ్వరరావు, బాపట్ల నుంచి కెవి రమణ, పెదకూరపాడు నుంచి దాసరి లక్ష్మీ మంగేశ్వరరావు, తాడికొండ నుండి ఏకుల విజేంద్రకుమార్ (ఎస్‌సి), సత్తెనపల్లి నుంచి తాడువాయి సురేష్, నరసరావుపేట నుంచి అన్నా వెంకటేశ్వర్లు, తెనాలి నుంచి అన్నవరపు సత్యవేణు గోపాల్, ప్రత్తిపాడు నుంచి జంధ్యాల వెంకట లింగేశ్వరశాస్ర్తీ వినుకొండ నుంచి అచ్యుత వెంకట మూర్తయ్య, రేపల్లె నుంచి పర్వతనేని కృష్ణమూర్తి, చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పండ్రంగి వెంకటేశ్వర్లు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నిక అనంతరం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న సహకార, స్థానిక, మున్సిపల్, సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపధంలో నడిపేందుకు నాయకులను, కార్యకర్తలను సన్నద్ధం చేస్తామని చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతూ పార్టీని ఆదర్శవంతంగా తీర్చదిద్దుతామని పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు జమ్ముల శ్యాంకిషోర్, రాష్ట్ర క్రమశిక్షణా సంఘ కోకన్వీనర్ ఆర్ లక్ష్మీపతి, జిల్లా ప్రధాన కార్యదర్శులు వి పాండురంగ విఠల్, సిహెచ్ విజయభాస్కరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, సాంకేతిక విభాగం కన్వీనర్ వైవి సుబ్బారావు, ఆయా మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
తెలంగాణ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలి
భట్టిప్రోలు, డిసెంబర్ 30: తెలంగాణ ఇవ్వాలా లేక సమైక్యంగా ఉండాలా నిర్ణయిం తీసుకోవాల్సింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తక్షణం ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని వైఎస్‌ఆర్ సిపి రాష్ట్ర అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆదివారం భట్టిప్రోలు వచ్చిన ఆయన పార్టీ నాయకుడు నాగేశ్వరావు నివాసంలో మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం ప్రత్యేక రాష్ట్రం, సమైక్యవాదం ఉద్యమాలు తీవ్ర స్థాయికి వెళ్ళి ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయని, అభివృద్ధి అతలాకుతలమై అన్ని రంగాల్లో ఒడుదుడుకులకు లోనైందన్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ తెలంగాణపై తమ పార్టీ చెప్పిందే తుది నిర్ణయమన్నారు. ఈ నెల 28న జరిగిన ఆఖిలపక్ష సమావేశంలో రెండు వాదనలు వినిపించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగన్ నేరారోపణ చేస్తే వైఎస్‌ఆర్ సిపి దెబ్బతింటుందని కాంగ్రెస్, టిడిపి భావించాయని, కాని జగన్‌కు ప్రజాదరణ మరింత పెరిగి 2014లో జరగనున్న ఎన్నికల్లో వన్‌సైడ్ ఫలితాలు రానున్నాయని అంబటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు డిపాజిట్లు కోల్పోయేలా వైఎస్‌ఆర్ సిపి బలోపేతం అవువుతోందన్నారు. అనంతరం స్థానిక రథం సెంటర్ వద్ద అంబటి సంతకాల సేకరించారు.
నాట్యకళాభిమానుల మదిని దోచిన బాలు బృంద నృత్య విభావరి
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 30: విశాలమైన విజ్ఞాన మందిరవేదికపై 55 మంది వర్ధ, ప్రవర్ధమాన నర్తకీమణులు కూచిపూడి సంప్రదాయ నృత్యశైలిలో మూడు గంటల పాటు విభిన్నమైన నృత్యాంశాలను అలవోకగా, అద్భుతంగా ప్రదర్శించి కిక్కిరిసిన నాట్య కళాభిమానులను కనురెప్ప ఆర్పకుండా చేశారు.
పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిథులుగా విచ్చేసి నాట్యహేలను ఆద్యంతం తిలకించి కళాకారులందరిపై ప్రశంజల జల్లును కురిపించిన ఈ నవరసభరిత నాట్యవినోద వల్లరిని ఆదివారం రాత్రి నాట్యవిశారద, పలు అవార్డులు అందుకున్న నృత్య కళాభారతి నిర్వాహకుడు నాట్యాచార్య ఎన్ బాలు తన శిష్యబృందంతో నిర్వహించారు. 55 మంది నర్తకిలు వేదికపై నయన మనోహరంగా నర్తించి ప్రేక్షక జనావళిని తమ అభినయ విన్యాసాలతో సమ్మోహనం చేశారు. కూచిపూడి సంప్రదాయ నృత్యశైలికి అద్దంపట్టిన ఈ నటరాజ నాట్య సంబరాల్లో భాగంగా తొలతు గణనాయకా ధీమహి, గోవర్ధనగిరిధారి, ఇదిగో భద్రాద్రి, శివాష్టకం, వినాయకౌతమ్, అన్నమయ్యకీర్తన, జానపద నృత్యాంశాలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపర్చారు.
ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో జ్యోతి ప్రజ్వలన చేసిన అర్బన్ ఎస్‌పి ఎ రవికృష్ణ, గౌరవ అతిధి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావురత్తయ్య, వ్యాపార వేత్త మాణిక్యవేల్, సీనియర్ ఆడిటర్ కొత్తమాసు శ్రీనివాసరావు, అర్బన్‌బ్యాంకు డైరెక్టర్ జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు బాలు అంకితభావంతో తన శిష్యులను తీర్చిదిద్ది సంప్రదాయ నాట్యకళ ప్రచారానికి అవిరళ కృషి చేస్తున్నారని అభినందించారు. బాలు స్వయంగా నట్టువాంగ నృత్యదర్శకత్వం వహించడమే కాకుండా గణనాయక అంశాన్ని, శివాష్టకాన్ని నయనానందకరంగా ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించిన ప్రతిఒక్కరూ పులకించారు.
అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్
పెదకాకాని, డిసెంబర్ 30: పలు జిల్లాల్లో ఆటోలను దొంగలించిన అంతర్‌జిల్లా దొంగను ఆదివారం పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి మధుసూధనరావు మాట్లాడుతూ తాడికొండ గ్రామానికి చెందిన ఈదర యలమంద ఈనెల 10వ తేదీన స్థానిక శివాలయం సమీపంలోని హెచ్‌పి గ్యాస్ కంపెనీ వద్ద ఆటోను నిలపగా అపహరణకు గురైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెదకాకాని సిఐ శ్రీనివాసరావు తన సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం బుడంపాడు రైల్వేవంతెన వద్ద రెండు ఆటోలతో ఉన్న దొంగ బి నాగరాజు అలియాస్ గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి పలు కేసులతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.
టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మానవహారం
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 30: అత్యాచార నిందితులను శిక్షించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ గద్దె దిగాలని టిడిపి నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు.
ఆదివారం టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి బృందావన గార్డెన్స్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఈ దుర్ఘటన దేశానికి మాయని మచ్చ అని, దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న సోనియాగాంధీ మన్మోహన్‌సింగ్, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ దేశరాజధానిలో విద్యార్థినిపై అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్టవ్య్రాప్త ఆందోళనకు పిలుపునిచ్చిందని, అందులో భాగంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నగర తెలుగు విద్యార్థి అధ్యక్షుడు సాకిరి వెంకట చైతన్య మాట్లాడుతూ ఈ అత్యాచారం ఒక అమ్మాయిపై జరిగింది కాదని, యావత్ భారతదేశంపై జరిగిన అత్యాచారంగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగళ్ల తిరుపతయ్య, పోతురాజు, ఉమాదేవి, పానకాల వెంకట మహాలక్ష్మి, ఎలుకా వీరాంజనేయులు, బొంతల సాయి, ముప్పాళ్ల మురళి, కె సాంబశివరావు, జొన్నలగడ్డ శ్రీనివాస్, బండ్లమూడి హరిబాబు, రాంబాబు లక్ష్మీ, అడ్డగడ్డ చిరంజీవి, వేములపల్లి నరేంద్ర, చిరుమామిళ్ల అమర్, శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు.
జగన్ కోసం సంతకాల వెల్లువ
ప్రత్తిపాడు, డిసెంబర్ 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమ అరెస్ట్‌కు, సిబిఐ పక్షపాత ధోరణికి నిరసనగా ఆ పార్టీ జగన్ కోసం జనం పేరుతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుచరితతో పాటు పలువురు కార్యకర్తలు తమ రక్తంతో వేలిముద్ర వేసి సంతకాలు చేశారు. జగన్ ప్రజా నాయకుడని, ప్రజల మద్దతు జగన్‌కే ఉంటుందని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ విభాగ ఉపాధ్యక్షుడు షేక్ జిలాని, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిబాబు, మండల కన్వీనర్ చాగంటి ఉమామహేశ్వరావు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు బాపతు బ్రహ్మానందరెడ్డి, మూలె శ్రీనివాసరెడ్డి, డి శ్రీనివాసరెడ్డి, ఎం విశే్వశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, కె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
గురజాల, డిసెంబర్ 30: పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళను పురస్కరించుకుని మండల రైతు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఆదివారం ఆసక్తికరంగా కొనసాగాయి. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. జూనియర్ విభాగంలో గుంటూరు జిల్లా లింగాయపాలెం గ్రామానికి చెందిన విజయలక్ష్మీ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 2,547 అడుగుల దూరం బండను లాగి ప్రథమ బహుమతిని, కర్నూలు జిల్లా గుంపరమాదిని గ్రామానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి ఎడ్ల జత 2,408 అడుగుల దూరం బండను లాగి ద్వితీయ బహుమతిని, కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన రవీంద్రచౌదరి ఎడ్ల జత 2,400 అడుగుల దూరం బండను లాగి తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. సబ్ జూనియర్ విభాగంలో ఖమ్మం జిల్లా పాతలింగాలకి చెందిన ఆర్‌ఎన్ రెడ్డి ఎడ్ల జత 2,600 అడుగుల దూరం బండ లాగి ప్రథమ బహుమతిని, ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి ఎడ్ల జత 1,636 అడుగుల దూరం బండను లాగి ద్వితీయ బహుమతిని, విజయవాడకు చెందిన మండవ రవీంద్ర ఎడ్ల జత 1,632 అడుగుల దూరం బండను లాగి తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. సోమవారం సేద్యం, పాలపళ్ళ విభాగాల్లో ఎడ్ల పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సాక్షర భారతి సామాజిక బాధ్యతగా భావించాలి
అమృతలూరు, డిసెంబర్ 30: రెండవ విడత సాక్షర భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో గ్రామ కో- ఆర్డినేటర్ల పాత్ర కీలకమైందని ఎంపిడిఓ కుర్ర మంగాపురనాధ్ అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాక్షర భారతి విజయవంతం కావడానికి ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం కో-ఆర్డినేటర్లకు తక్కువే అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో తమ పాత్ర ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. రెండవ విడత మండలంలో 3750 మంది వయోజన నిరక్షరాస్యులను గుర్తించారని వారి కోసం ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, ఆశ వర్కర్లు, యానిమేటర్లు, ఆదర్శ రైతులు, అంగన్‌వాడీలను వాలంటీర్లుగా తీసుకున్నట్లు తెలిపారు. వీరికి ఆయా గ్రామ పంచాయితీలలో జనవరి 2,3 తేదీల్లో శిక్షణను గ్రామ కో-ఆర్డినేటర్లు ఇవ్వాలని ఆదేశించారు.
రేపల్లె తీర ప్రాంతానికి తాగునీరు విడుదల
రేపల్లె, డిసెంబర్ 30: తెనాలి డెల్టా ప్రాంతంలో తాగునీటి చెరువులను నీటితో నింపుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇఇ నాగేశ్వరావు చెప్పారు. ఆదివారం కాల్వలకు తాగునీరు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సాగునీరిచ్చే విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు లేనందున సాగునీరు విడుదల చేసే అవకాశం లేదన్నారు. జనవరి 5 వరకు తాగునీరు విడుదల జరుగుతుందని, ఈలోగా గ్రామాల్లో తాగునీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కృష్ణా పశ్చిమ కాలువకు 800 క్యూసెక్యుల నీటిని విడుదల చేశామన్నారు.
కొంగ్రొత్త వత్సరానికి
కోటి ఆశలతో స్వాగతం
తెనాలి, డిసెంబర్ 30: కాలచక్ర గమనంలో కనుమరుగయ్యే 2012కు వీడ్కోలు పలుకుతూ, ముందుకు సాగే క్రమంలో మనతో కలిసి వస్తానంటున్న 2013కు స్వాగతం పలుకుతూ సర్వేజన సుఖినో భవంతు శుభాకాంక్షల శుభాశీస్సులు పంచుకునే విధానాన్ని ఆహ్వానిద్దాం. సమాజమనే దేవాలయంలో గౌరవంగా జీవించేందుకు ఎంచుకున్న మార్గంలో ఏర్పరుచుకున్న లక్ష్య సాధన కోసం కొత్త ఆలోచనలతో రాణిస్తూ, కుటుంబ అనందానికి, ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నాలు సఫలం కావడం ద్వారా సమాజం సస్యశ్యామలం కావాలని ఆశిద్దాం. గడచిన కాలంలో చేదు అనుభవాలు, తీపి జ్ఞాపకాలు మననం చేసుకుందాం. జరిగిన లోపాలను సవరించుకుంటూ, సంతోషాల ఉత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపనతో కార్యసాధకులమవుదాం. అలా ఎదిగేందుకు ఎంచుకునే మార్గం సన్మార్గమై సమాజ హితకారిణియై ఉంటే సర్వేజన సుఖినోభవంతు ఆశీర్వచనానికి అర్థం చేకూరుతుంది. సర్వజన హితం కోరుకునే మహనీయులు చూపిన మార్గమే సన్మార్గం. వారి ఆశయాలు, ఆలోచనలు మన జీవన గమనంలో అన్నీ కాకున్నా కొన్నైనా పాటించి, సమాజంలో అలుముకుంటున్న ఆశాంతిని రూపు మాపే ప్రయత్నంలో భాగస్వాములమవుదాం. పాఠక లోకానికి రాబోయే నూతన సంవత్సరం నిత్య నూతనమై మనందరి జీవితాలు సుందర నందన వనాలుగా విలసిల్లాలని, ఎవరికి వారు సర్వజన హిత ప్రియులుగా తమ జీవితాలను మలచుకోవాలని కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సరానికి శుభ స్వాగతం. సర్వేజనా...సుఖినోభవంతు...
భక్తి సంగీత కార్యక్రమంగా రుక్మిణీ కళ్యాణం హరికథ
బాపట్ల, డిసెంబర్ 30: శారదా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం 116వ కార్యక్రమంగా నిర్వహించిన రుక్మిణీ కళ్యాణం హరికథ అందరినీ అలరించింది. కపిలేశ్వరం హరికథా పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పురాణం విజయలక్ష్మి తన మృదుమధుర గానంతో ఆలపించిన హరికథ ఆద్యంతం రమణీయంగా కొనసాగింది. పాణ్యం దక్షిణామూర్తి వయోలిన్, నగధరరావు మృదంగంతో వాద్య సహకారం అందించారు.
మద్దిబోయినవారిపాలెంలో కోదండ రామాలయ నిర్మాణం
బాపట్ల, డిసెంబర్ 30: మండలంలోని మద్దిబోయినవారిపాలెంలో కోదండ రామాలయాన్ని 5 లక్షల వ్యయంతో నిర్మించడానికి ఆదివారం శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. జన్ని శంకరరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>