Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టిడిపి ధ్యేయం

$
0
0

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 30: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి కృష్ణయాదవ్ అన్నారు. భారతీయ జనతాపార్టీ నేత యానం చినయోగయ్య యాదవ్‌తోపాటు మరో 50 మంది నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కృష్ణయాదవ్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా బిజెపి నేతలు అద్దంకి బస్టాండ్ సెంటర్లోని దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడి నుండి మేళతాళాలతో పార్టీ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణయాదవ్ మాట్లాడుతూ ఆనాడు అన్న ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. బిసిలకు సముచిత న్యాయం కల్పించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు బిసి డిక్లరేషన్‌ను ప్రకటించారన్నారు. దేశ చరిత్రలో ఏ పార్టీ ప్రకటించని విధంగా బిసిలకు వంద సీట్లు కేటాయించారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 వేల కోట్లతో బిసి సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పుట్టకొచ్చినా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. బిసిలకు న్యాయం జరగాలన్నా, సముచిత స్థానం కల్పించాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి బిసిలు అండగా ఉంటున్నారని, బిసిలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లాలో బిసిలకు కూడా రానున్న ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బిసిలకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు. పార్టీలో చేరిన యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు. జిల్లాలో పార్టీ పూర్వ వైభవానికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బిజెపి నేత యానం చినయోగయ్య యాదవ్‌తోపాటు మరో 50 మందిని పేరు పేరున సభావేదికపై ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, కనిగిరి, కొండపి నియోజకవర్గాల ఇన్‌చార్జులు దివి శివరాం, కదిరి బాబురావు, బాల వీరాంజనేయస్వామి, నగరపార్టీ అధ్యక్షుడు బొల్లినేని వాసుకృష్ణ, నాయకులు కె వెంకయ్య, కొమ్మూరి రవిచంద్ర, వైవి సుబ్బారావు, బొమ్మినేని మురళీ కృష్ణ, కొఠారి నాగేశ్వరరావు, యక్కలి తులసీరావ్, మారెళ్ళ వివేకానంద, గేనం సుబ్బారావు, సిరిపురపు రుద్రయ్య, మహిళా నాయకులు తమ్మిశెట్టి రమాదేవి, ఆర్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, ఆరే రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రాజకీయ అనిశ్చితి
వైఎస్‌ఆర్‌సిపి వైపు ఇద్దరు శాసనసభ్యుల చూపు
సింహవలోకనం - 2012
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,డిసెంబర్ 30: జిల్లాలో ఈ ఏడాది రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో జిల్లా ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని తూర్పుప్రకాశానికి చెందిన అధికారపార్టీ శాసనసభ్యులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఈపాటికే పావులు కదిపారు. వారిద్దరు వచ్చేనెలలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోననున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా వారిబాటలోనే మరికొంతమంది ప్రజాప్రతినిధులు వలసబాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలోని మరికొంతమంది నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ వైపుపరుగులు తీసేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం మరికొంతకాలం ఉండటంతో కొంతమంది నేతలు ఆ అధికారాన్ని వినియోగించుకుని పదిరాళ్ళు వెనకేసుకుని వెళ్ధామనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశంపార్టీకి చెందిన నేతలు కూడా ఈపాటికే ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది నేతలు తీర్థం పుచ్చుకుని పార్టీపురోభివృద్ధికి పాటుపడుతున్నారు. దీంతో ఆ రెండుపార్టీలకు ఈ సంవత్సరం గడ్డుకాలంగానే ఉంది. ఇదిఇలా ఉండగా ఈ సంవత్సరంలో జరిగిన ఒంగోలు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్, మాగుంట పార్వతమ్మ ఓటమిపాలయ్యారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఉపఎన్నికల్లో బాలినేనికి భారీ మెజార్టీ వచ్చింది. అదేవిధంగా రాష్టప్రురపాలకశాఖమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డికి ఆ నియోజకవర్గ ప్రజలు గుణపాఠం నేర్పారు. కనీసం ఆయన స్వంతగ్రామంలోకూడా కాంగ్రెస్‌పార్టీకి స్వల్పమెజార్టీ మాత్రమేరాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి అత్యధిక మెజార్టీవచ్చింది. దీంతో ఆ పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. ఇదిఇలా ఉండగా సహకారసంఘ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపక్షాలు మునిగి తేలుతున్నాయి. ఓటర్ల చేర్పింపులో ఆ పార్టీల నేతలు పోటీపడ్డారు. కాగా ఈపాటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీచేసే చైర్మన్ అభ్యర్థి కట్టా శివయ్యను ప్రకటించగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. కాగా జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య సయోధ్య లేకపోవటంతో జిల్లాఅభివృద్ధి మూడు అడుగుల ముందుకు ఆరుఅడుగుల వెనక్కి అన్నచందంగా తయారైంది. ప్రజాప్రతినిధుల సిఫార్సులను అధికారులు లెక్కచేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇదిఇలాఉండగా సిపిఎం,సిపిఐలకు చెందిన నేతలు ప్రజలపక్షన నిలుస్తూ పోరాటాలు నిర్వహించారు. ఆందోళన సమయంలో వామపక్షనేతలను పోలీసులు అరెస్టుచేసి జైళ్ళకు పంపిన సంఘటనలు కూడా ఉన్నాయి.మొత్తం మీద జిల్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొనటంతో అన్నివర్గాల్లో చర్చనీయాంశమైంది.

వైఎస్‌ఆర్‌సిపి గూటికి
ఎమ్మెల్యే గొట్టిపాటి
* బలం చేకూరుస్తున్న ఫ్లెక్స్‌బోర్డులు
అద్దంకి, డిసెంబర్ 30: అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్ నుండి వైఎస్‌ఆర్‌సిపి గూటికి చేరుతున్నారన్న దానికి అద్దంకి పట్టణంలో వెలసిన ఫ్లెక్స్‌బోర్డులు బలం చేకూర్చాయి. గత రెండు రోజులుగా మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కరి పరమేష్ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సెంటరులో ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీల్లో గొట్టిపాటి రవికుమార్ ఫొటోతో పాటు జగన్‌మోహనరెడ్డి, రాష్టప్రార్టీ నాయకులు వైవి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, భద్రారెడ్డి ఫొటోలు ఉండడం విశేషం. గతంలో కాంగ్రెస్ తరపున కట్టిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోలుండగా, ఇప్పుడు కట్టిన ఫ్లెక్సీల్లో జగన్‌మోహనరెడ్డి ఫొటోలుండడాన్ని బట్టి స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ త్వరలో వైఎస్‌ఆర్‌సిపి గూటికి చేరుతున్నాడనడంలో సందేహం లేదని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
అద్దంకిలో కాంగ్రెస్‌కు లీడరెవరు ?
స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్‌ఆర్ పార్టీలోకి వెళ్తే అద్దంకి నియోజకవర్గంలో సరైన కాంగ్రెస్‌పార్టీ నాయకుడు ఎవరని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతమున్న కాంగ్రెస్ క్యాడరంతా ఎమ్మెల్యేతో పాటు వైఎస్‌ఆర్‌పార్టీలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడే ప్రమాదముంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిచే సత్తాగల నాయకుడు ఉన్నాడా, లేక మరెవరైనా నాయకుడిని ఇతర జిల్లాల నుండి దిగుమతి చేసుకుంటారా అనేది ప్రశ్న. కాంగ్రెస్‌పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పార్టీని నమ్ముకొని ఉంటున్నందున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించవచ్చు. రాఘవరావు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాటి నుండి నేటి వరకు పార్టీనుండి ఎలాంటి పదవులు పొందలేదు. కాంగ్రెస్ నుండి రాఘవరావు పోటీచేస్తే ఒకవైపుగొట్టిపాటి, మరో పక్క తెలుగుదేశం పార్టీ తరపున కరణం బలరామకృష్ణమూర్తికి పోటీ ఇవ్వగలడా అనేది సందేహం. ఏది ఏమైనా గొట్టిపాటి వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళితే కాంగ్రెస్‌పార్టీ అద్దంకిలో కాంగ్రెస్‌పార్టీ బలహీన పడుతుందనడంలో సందేహం లేదు.

బిసి డిక్లరేషన్‌కు టిడిపి కట్టుబడి ఉంది
- తెలంగాణాకు తెలుగుదేశం అనుకూలమే
- రాష్ట్ర మాజీ మంత్రి కృష్ణ యాదవ్ -
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 30: బిసి డిక్లరేషన్‌కు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత, రాష్ట్ర మాజీమంత్రి సి కృష్ణయాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలలోని 124 కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించి ఆదుకుంటామన్నారు. అందులో భాగంగానే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా బిసిలకు 100 సీట్లు కేటాయించామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 వేల కోట్ల రూపాయలతో బిసి సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బిసి కులాలు టిడిపి వైపు మొక్కు చూపుతున్నాయన్నారు. కార్పొరేట్ స్థాయిలో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల బాధలను తమ అధినేత చంద్రబాబు స్వయంగా చూస్తున్నారని, కనీస సౌకర్యాలు లేని గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమన్నారు. తెలంగాణా జిల్లాల్లో బాబుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణాకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగానే ఉందన్నారు. కెసిఆర్‌ను తెలంగాణాలో ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని, తన కుటుంబ స్వార్థంకోసం టిడిపిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లాపార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్, కందుకూరు, కొండపి ఇన్‌చార్జులు దివి శివరాం, డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థిని మృతికి నివాళి
ఒంగోలు, డిసెంబర్ 30: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన వైద్య విద్యార్థినికి మహిళా సంఘాలు సంతాపం ప్రకటించాయి. విద్యార్థిని కేసులోని నిందితులను ఉరితీయాలని కోరుతూ వివిధ మహిళా, యవజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి అరుణ, ప్రశాంత మహిళా మండలి అధ్యక్షురాలు టి మాధవి, ఆంధ్రప్రదేశ్ మహిళా కార్యదర్శి టి పద్మ, లోక్‌సత్తా జిల్లా కార్యదర్శి సి రత్నకుమారి, సాక్షి మహిళా మండలి అధ్యక్షురాలు జి మేరీ రత్నకుమారి, సిబిసి సంక్షేమ సంఘం నాయకురాలు టి రమాదేవి, ఎపి ఎం ఎ ఎస్‌కు చెందిన బి అరుణ, పిడి ఎంసిసికి చెందిన ఎం శిరీష, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె సుబ్బరావమ్మ, స్ర్తి విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి పి శాంత, టి రేణుక, స్వయంకృషి మహిళా సమితి నాయకురాలు బి రాజేశ్వరి, సూర్య కుమారి, ఎ స్వాతి, ఎస్ లక్ష్మి కుమారి తదితర నాయకురాళ్ళు పాల్గొన్నారు.
చేపల మార్కెట్ మత్స్య మహిళా సొసైటీ ఆధ్వర్యంలో...
ఒంగోలు, డిసెంబర్ 30: ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై మృతి చెందిన వైద్య విద్యార్థినికి ఒంగోలు చేపల మార్కెట్ మత్స్య మహిళా సొసైటీ సభ్యులు చేపల మార్కెట్‌లో కొవ్వత్తులతో నిరసన తెలిపి ఆమెకు ఘన నివాళులను అర్పించారు. విద్యార్థిని కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య మహిళా సొసైటీ సభ్యులు నాయుడు సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
‘సహకార ఎన్నికలకు కాంగ్రెస్ దొడ్డిదారి యత్నాలు’
పామూరు, డిసెంబర్ 30: సహకార సంఘం ఎన్నికలలో దొడ్డిదారిలో కాంగ్రెస్‌పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి ఆరోపించారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ప్రతిపక్షపార్టీలకు ఇవ్వకుండా కార్యదర్శులు కుంటి సాకులతో తప్పుకుంటున్నారని, కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు జాబితాలు ఎవరికి ఇవ్వడం లేదన్నారు. నిజమైన అర్హత కలిగిన రైతులకు ఓటు చేర్చకుండా అధికారపార్టీకి అనుకూలమైన వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. నామినేటెడ్ పదవులుగా సహకార సంఘాలను హస్తగతం చేసుకొనేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విడుదల చేయాలని కోటి సంతకాల సేకరణ స్థానిక మమ్మిడాడి సెంటర్‌లో ప్రారంభించారు. 2013కనిగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని ఆయన ఆశించారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బ్రహ్మానందరెడ్డి, వై రామిరెడ్డి, ఎస్‌కె హజరత్, మీరామొహిద్దీన్, సిహెచ్ బాలాంజనేయరెడ్డి, రాజు, బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
నిందితులను బహిరంగంగా ఉరితీయాలి
- ప్రజా సంఘాల డిమాండ్ -
చీరాలరూరల్, డిసెంబర్ 30: డిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుంచి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీగా కొవ్వొత్తులతో బయలుదేరి స్థానిక గడియారస్తంభం సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం నాయకులు బెజ్జం విజయ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం లేదని, ఎస్‌సి, ఎస్‌టిలకు ఫలాలు అందటం లేదని విమర్శించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోహన్‌కుమార్ ధర్మా, లక్ష్మీప్రసాద్, మచ్చా వెంగళరావు, గుమ్మడి ఏసురత్నం, అందె విశే్వశ్వరరావు, దుడ్డు విజయ్‌సుందర్, శ్రీనివాసులు, ప్రకాష్, శీలం కోటేశ్వరమ్మ, మిక్కిలి వజ్రమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

- మాజీ మంత్రి కృష్ణ యాదవ్ స్పష్టం - బిజెపి నేత యోగయ్యతోపాటు మరో 50 మంది టిడిపిలో చేరిక
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>