Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

6న ముఖ్యమంత్రి రాక

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 31: వచ్చే నెల 6వ తేదీన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖకి వస్తున్నారు. ఆరోజు జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా బిటి రోడ్ల శంకుస్థాపనకి హాజరవుతారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేష్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అటవీహక్కుల చట్టం కింద అటవీ ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు గిరిజనులకు సామాజిక హక్కును కల్పించే కార్యక్రమాన్ని సిఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలను చింతపల్లిలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వి.శేషాద్రి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పిఎంజిఎస్‌వై) కింద గ్రామీ ణ ప్రాంతాల్లో బిటి రోడ్ల నిర్మాణానికి వెయ్యి కోట్ల ప్రాజెక్టు మంజూరైందన్నారు. దీనిలో తొలిదశలో రూ. 480 కోట్లు మంజూరైందని చెప్పారు. ప్రతి వంద మంది జనాభా కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతానికి బిటి రోడ్డును నిర్మించాలనేది పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. అలాగే మహారాష్టల్రో మాదిరి విశాఖ జిల్లా గిరిజనులకు అటవీ ఉత్పత్తుల రవాణా, క్రయ, విక్రయాలకు సామాజిక హక్కును ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. 6న ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

పెరిగిన ‘హామీ’
విశాఖపట్నం, డిసెంబర్ 31: గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జిఇఎస్) కింద 175 రోజులకు పనిదినాలు పెరగడంతో దాదాపు 80 వేల మంది లబ్ధి పొందనున్నారని కలెక్టర్ వి.శేషాద్రి తెలిపారు. కలెక్టరేట్ ఛాంబర్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 150 రోజుల పనిదినాలు 175రోజులకు పెరగడంతో 40వేల మంది నుంచి ఇప్పుడు 80 వేల మంది ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. ఇందిర జలప్రభ పథకం కింద జిల్లాలో ప్రతి పది ఎకరాలకు బోరు, విద్యుత్, నీటిపారుదల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఒక్కో బ్లాక్‌లో పది ఎకరాల వంతున వెయ్యి బ్లాక్‌ల్లో వీటిని కల్పించాలనేది లక్ష్యం కాగా, ఇందులో తొలిదశలో 500 బ్లాక్‌లను నిర్దేశించామన్నారు. ఎస్సీ,ఎస్టీ భూములకు వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. గత నెల నుంచి ఇంతవరకు 51 బోర్లు వేశామన్నారు. ఒక్కో బోరుకు 36వేలు ఖర్చవుతుందని, 150 నుంచి 160అడుగుల లోతులోనే నీరు పడుతున్న పరిస్థితులతో దీనికయ్యే వ్యయం స్వల్పంగానే ఉంటుందన్నారు. ఎనిమిది వేల గిరిజన కుటుంబాలకు జాబ్‌కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇందులో 50 శాతం మేర కార్యక్రమాన్ని అధికారులు పూర్తిచేశారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తారన్నారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి జిల్లాలో 11 గిరిజన మండలాల్లో 200 కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద పాడేరులో దీనిని అమలు చేస్తున్నామన్నారు. 26 ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టిపెడుతూ వీటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఇంతవరకు జిల్లాలో 200గ్రామాలకు చెందిన 8 వేల నుంచి పది వేల ఎకరాల్లో సర్వే రాళ్ళను పాతి, బోర్డులను ఏర్పాటు చేయగలిగామన్నారు. సర్వే జరిపి, బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు వీటి పూర్తివివరాలను ఇంటర్‌నెట్‌లో పెట్టామన్నారు. ప్రతి మండలంలో డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు, జమా బందీ నిర్వహించి స్థానిక రెవెన్యూ సమస్యలను పరిష్కరించే కార్యక్రమం చురుగ్గా నిర్వహించదలిచినట్టు పేర్కొన్నారు. కెజిహెచ్ అభివృద్ధికి ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధుల నుంచి మూడు కోట్ల రూపాయల మేర మంజూరు చేసినట్టు చెప్పారు. కొత్తగా ‘ఆరోగ్యశ్రీ ఫార్మసీ వార్డు’గా అభివృద్ధి చేస్తున్నారని, సర్జికల్, ఆర్ధోపెడిక్, ఓపి కంప్యూటరీకరణ, పది కౌంటర్లకు విస్తరిస్తాయన్నారు. డిఆర్‌డిఏ పరిదిలో 23 పాల ప్రగతి కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.

పౌష్టికాహార లక్ష్యంతో
ఇందిరమ్మ ‘అమృత హస్తం’ ప్రారంభం
ముంచంగిపుట్టు, డిసెంబర్ 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృత హస్తం కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. మండల కేంద్రంలో ఐ.సి.డి.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ అమృత హస్తం కార్యక్రమాన్ని మంత్రి సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతిరోజు గర్భిణి, బాలింతలకు పాలు, గ్రుడ్లతోపాటు ఒకపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పథకం రాష్ట్రంలో మొట్టమొదటగా ఈ మండలంలో ప్రారంభించడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. పథకం అమలు బాధ్యతను అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఐ.కె.పి. స్వయం సహాయక సంఘాలకు అప్పగించామన్నారు. గర్భిణి నుంచి వసతి గృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల వరకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి వాటి అమలుకు చర్యలు చేపడుతుందని ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ అమలుకాని పథకాలను మనరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. గర్భిణులు విధిగా ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసూతి చేయించుకోవాలని, అప్పుడే తల్లీబిడ్డలకు క్షేమమని ఆయన చెప్పారు. సి.హెచ్.సి.లో ప్రసూతికి తీసుకువచ్చిన వారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం నడుం బిగించిందని, మహిళల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సంక్షేమ, అభివృద్ధికి అందరూ సమష్టిగా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి గర్భిణి, బాలింతలతో కలిసి సంపూర్ణ భోజన పంతిలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ ఎమ్మెల్యే సివేరి సోమ, ఆర్డీవో గణపతిరావు, ఐ.సి.డి.ఎస్. ఆర్.జె.డి. అనసూయమ్మ, పి.డి. చెన్నదేవి, ఎం.పి.డి.ఒ. ఎం.ఎస్.బాపిరావు, తహశీల్దార్ ఎస్.వి. అంబేద్కర్, సి.డి.పి.ఒ. భాస్కరకుమారి, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తల, గర్భిణులు పాల్గొన్నారు.

ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగుబాటు
పెదబయలు, డిసెంబర్ 31: మండలానికి చెందిన ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. గోమంగి పంచాయతీకి చెందిన జంపరంగి తిరుపతిరావు, బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన కొర్రా జోగన్న, జాముగుడ పంచాయతీ చిన్నరావలి గ్రామానికి చెందిన కొర్రా మహేశ్వరరావు లొంగిపోయినట్టు ఎస్.ఐ. శ్రీనివాసరావు చెప్పారు. మావోయిస్టులకు భోజనాలు, సభలు ఏర్పాటు చేయ డం, కరపత్రాలు అతికించడం వంటి పనులు వీరు చేస్తుండేవారని ఆయన చెప్పారు. చిన్నరావలి, లింగువాడ, జామిగూడ, కోండ్రు, నల్లుగరువు, లొండాల గ్రామాల్లో మిలీషియా సభ్యులు ఉన్నట్టు తాము గుర్తించామని, వీరు స్వచ్చందంగా లొంగిపోతే కేసులు ఎత్తివేస్తామన్నారు.

నష్టపరిహారం కోసం మహిళల బైఠాయింపు
పాయకరావుపేట, డిసెంబర్ 31: నీలం తుపాను నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సోమవారం తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం తుపాను కారణంగా నష్టపోయిన తమకు సర్వే చేసి జాబితా తయారు చేశారన్నారు. జాబితాలో తమ పేర్లున్నా నష్టపరిహారం చెక్కుల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకు చెక్కులు నిలిపివేశారని ఆరోపించారు. నష్టపరిహారం జాబితాలో ఉన్న వారందరికీ చెక్కులు పంపిణీ చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయానికి తలుపులు వేశారు. పోలీసులు కలుగజేసుకొని ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించి వేశారు. ఈ విషయమై తహశీల్దార్ ఎం.శ్యాంబాబు మాట్లాడుతూ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి నష్టపరిహారం మంజూరైందని, వాటిని పూర్తి స్దాయిలో విచారణ చేసిన తరువాత పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనిశెట్టి బాబూరావు, లంకాసూరిబాబు, సుబ్బలక్ష్మి, విలియం కేరి పాల్గొన్నారు.

‘శాశ్వత వంతెనలు నిర్మించే వరకు
పోరాటం ఆగదు’
దేవరాపల్లి, డిసెంబర్ 31: శారదానదిపై శాశ్వత వంతెన నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు హెచ్చరించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డి. వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు సాగిస్తే తప్ప ప్రజాసమస్యలు పరిష్కారం కావని అన్నారు. రైవాడ పేరుచెప్పుకుని అందలం ఎక్కిన నాయకులు రైతులను పూర్తిగా మరచారని వారు విమర్శించారు. జిల్లాలో నలుగురు మంత్రులున్నా ప్రజాసమస్యలు పట్టించుకోకుండా స్వలాభం కోసం చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు. దేవరాపల్లి ప్రజలకు ఇళ్లపట్టాలు ఇచ్చి వారిగోడు పట్టించుకోలేదని, నగదు బదిలీ పధకాన్ని వెంటనే రద్దుచేయాలని, ఏడాదికి 12 గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిటికి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ర్యాలీ జరిపి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.వెంకన్న, సిహెచ్.రాజు, జి. చింతాలు, జి. దేముడునాయుడు, పేరయ్య, కర్రి దేముడు పాల్గొన్నారు.

320 కిలోల గంజాయి స్వాధీనం..
ఇద్దరి అరెస్టు
నర్సీపట్నం, డిసెంబర్ 31: గంజాయి అక్రమ రవాణాపై నిఘా చర్యలు పెంచడంతో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రోలుగుంట పోలీసులు పట్టుకుని నర్సీపట్నం ఎఎస్పీ కార్యాలయానికి తరలించారు. సోమవారం తెల్లవారు జామున రోలుగుంట ఎస్సై ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎం.కె.పట్నం పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆటోలో గంజాయిని తరలించేందుకు సిద్ధం చేశారు. పోలీసు జీపులను పసిగట్టిన గంజాయి అక్రమ రవాణాదారులు పరుగులు తీయడంతో వారిని వెంబడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 320 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం నర్సీపట్నం ఎఎస్పీ కార్యాలయానికి గంజాయితోపాటు నిందితులను పోలీసులు తీసుకువచ్చారు. అక్రమ రవాణా చేస్తు న్న గంజాయిని ఎఎస్పీ ఇక్బాల్ పరిశీలించారు. అనంతరం రోలుగుంట ఎస్సై విలేఖరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎం.కె.పట్నం ప్రాంతం నుం డి గంజాయిని తరలించేందుకు సిద్ధం చేసుకున్నారని, పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎం.కె.పట్నం సమీపంలో నిందితులు తమను చూసి పరుగులు తీశారన్నారు. వీరిని వెంటాడి పొన్నపు గంగరాజు, సరమండ గంగరాజులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా గంజాయి అక్రమ రవాణా కేసులో పాతనేరస్థులైన నక్కా అప్పారావు, ఊడి చిరంజీవులు ఉన్నారని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆటోలో తరలిస్తున్న 320 కేజీలు గంజాయి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కాఫీ అవినీతిపై రాజధానిలో
4న రౌండ్ టేబుల్ సమావేశం
* మాజీ ఎంపి మిడియం బాబూరావు
పాడేరు, డిసెంబర్ 31: విశాఖ మన్యంలో జరిగిన కాఫీ కుంభకోణంపై చర్చించేందుకు వివిధ వర్గాల వారితో జనవరి 4వ తేదీన హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు మాజీ ఎం.పి. మిడియం బాబూరావు తెలిపారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో కాఫీ నిధులను స్వాహాచేసి గిరిజన రైతులకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 349 కోట్ల రూపాయల నిధులతో అమలు చేస్తున్న కాఫీ ప్రాజెక్టులో గత మూడేళ్ళుగా పెద్ద యెత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, అధికారులు కుమ్మకై కోట్లాది రూపాయల నిధులను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఏజెన్సీలో చోటుచేసుకున్న కాఫీ అవినీతిపై సంఘం ఆధ్వర్యంలో సమగ్ర సర్వేను చేపడుతున్నామని, ఇంతవరకు 37 పంచాయతీల్లోని 4,767 గ్రామాలలో సర్వే పూర్తి చేసినట్టు ఆయన చెప్పారు. ఈ గ్రామాల్లోని గిరిజన రైతులకు 11 కోట్ల 80 లక్షల 66 వేల 750 రూపాయలను చెల్లించాల్సి ఉండగా, కేవలం రెండు కోట్ల 33 లక్షల 38 వేల 500 రూపాయలను చెల్లించి 9 కోట్ల 47 లక్షల 28 వేల 248 రూపాయలను కాజేసినట్టు వెలుగులోకి వచ్చిందని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతంలో మిగిలిన పంచాయతీలలో కూడా తమ సర్వే పూర్తయితే కాఫీ అవినీతి మరింత బట్టబయలయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పారు. గిరిజన లబ్ధిదారులకు చెల్లించాల్సిన కాఫీ ప్రోత్సాహక నిధులను వారికి ఇచ్చినట్టుగా రికార్డులలో తప్పుడు లెక్కలు చూపించి అధికారులు దిగమింగారని ఆయన ఆరోపించారు. మన్యంలో జరిగిన కాఫీ కుంభకోణంపై హైదరాబాద్‌లో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారులు, స్వచ్చంద సేవాసంస్థల ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం అధికారులు, పలు సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.
ఏజెన్సీలో జరిగిన కాఫీ అవినీతి విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సమగ్ర విచారణ నిర్వహించి నిధుల స్వాహాకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు బాబూరావు పేర్కొన్నారు. కాఫీ నిధుల అవినీతిపై ప్రభుత్వ శాఖల ద్వారా విచారణ నిర్వహించే కంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్‌మెన్ వంటి ఏజెన్సీల ద్వారా అవినీతిపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాఫీ సాగు చేస్తున్న రైతులకు పంచాయతీల స్థాయిలో శిక్షణ కల్పించి కాఫీ సాగు విధానంపై వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఏజెన్సీలో కాఫీ నిధులు పక్కదారి పట్టినా గిరిజన మంత్రి పసుపులేటి బాలరాజు ఏమాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాఫీ అవినీతిపై మంత్రికి ఎటువంటి ప్రమేయం లేనట్టయితే ఈ వ్యవహారంపై ఆయన ఎందుకు స్పందించడం లేదని బాబూరావు ప్రశ్నించారు.
ఏజెన్సీలోని కొండకుమ్మరి గిరిజనులను గిరిజన జాబితాలో చేర్పించే విషయమై కేంద్ర గిరిజన మంత్రితో ఇటీవల ఢిల్లీలో చర్చించినట్టు ఆయన చెప్పారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయడంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. బాక్సైట్ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుందని, దీనిని రద్దు చేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిలో బాక్సైట్ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేయాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ముఖ్యమంత్రి అనడంలో అర్థంలేదన్నారు. బాక్సైట్ ఒప్పందాలను ఇప్పటికైనా రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స పాల్గొన్నారు.

జిల్లాలో ఐదు లక్షల సంతకాలు లక్ష్యం
- వైఎస్సార్ సిసి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
పాయకరావుపేట, డిసెంబర్ 31: వైయస్ జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో జిల్లాలో ఐదు లక్షల సంతకాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండలంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 5వతేదీ కల్లా సంతకాల సేకరణ పూర్తి చేస్తామన్నారు. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా తాము నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. జగన్ అరెస్టు వెనుక ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడనే అక్కసుతో కుట్ర రాజకీయాలు చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ ఉన్న వ్యక్తిని జైలులో పెట్టడంపై రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జగన్ అరెస్టుపై రాష్టప్రతి స్పందించాలని బాబూరావు కోరారు. ఈ కార్యక్రమంలో ధనిశెట్టి బూబూరావు, లంకా సూరిబాబు, ధనిశెట్టి కృష్ణ, ఆడారి ప్రసాద్ పాల్గొన్నారు.

అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
పాయకరావుపేట, డిసెంబర్ 31: మండల స్దాయి అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్ ఎం.శ్యాంబాబు, ఎం.పి.డి.ఓ. ఎన్.సంతోషం, ఆర్.ఐ. ఒ.కె.రావులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన నీలం తుపాను కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అధికారులు పూర్తిస్దాయిలో సక్రమంగా సర్వేలు నిర్వహించలేదన్నారు. దీని కారణంగా బాధితులకు నష్టపరిహారం అందకుండా పోయిందన్నారు. నష్టపరిహారం పంపిణీలో జరుగుతున్న జాప్యంపై తహశీల్దార్‌ను నిలదీశారు. నష్టపరిహారం జాబితాలో ఉన్న వారికి చెక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యాలయం వద్దకు వస్తున్న బాధితులకు కనీసం సమాధానాలు చెప్పడం లేదని, ఇంటి వద్దకు వచ్చి చెక్కులు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనిశెట్టి బాబూరావు, లంకా సూరిబాబు పాల్గొన్నారు.

నిబంధనలను అనుసరించి
ఉద్యోగ నియామకాలు జరపాలి
చోడవరం, డిసెంబర్ 31: ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం మండలంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకునికి అర్హతలు ఉన్నప్పటికీ అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ మాలమహానాడు, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఎపిఇపిడిసిఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి అధికారులు ఉద్యోగ నియామకాలలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారని, ఇది విచారకరమన్నారు. ఎస్‌సి, ఎస్‌టి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కార్యాలయాలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 38 వేల ఉద్యోగాలలో ఈ విధానాలనే కొనసాగించాలన్నారు. అంతకుముందు అధికారుల చర్యలను నిరసిస్తూ విద్యుత్‌శాఖ ఎడి కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. ఈమేరకు జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్యను సెల్‌ఫోన్ ద్వారా వివరించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ ఎస్‌ఇ సత్యనారాయణ జనవరి 2వతేదీన ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు ఆందోళనను విరమించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానాడు ప్రధాన కార్యదర్శి సియాద్రి శ్రీనివాసరావు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మద్దిల సుబ్బన్న, వేచలపు ప్రకాశరావు, సిపిఎం జిల్లా నాయకులు మట్టారమణ, దళిత హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు పడవల చక్రవర్తి, డి. వెంకటగిరి, ఎల్.కోటేశ్వరరావు, జి.అమ్మతల్లి, ఎం. వెంకటరమణ, శంకరరావు పాల్గొన్నారు.

అరకులోయలో కొత్త సంవత్సర శోభ
అరకులోయ, డిసెంబర్ 31: అరకులోయ మార్కెట్‌లో కొత్త సంవత్సర శోభ సోమవారం కనిపించింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇంకా కొద్ది గంటల వ్యవధే ఉండడంతో శుభ సంకేతాలను తెలియజేసే వస్తువులకు మంచి డిమాండ్ ఏర్పడింది. గ్రీటింగ్ కార్డులు, మిఠాయి దుకాణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ షాపులు, పూలు, పండ్ల విక్రయ కేంద్రాలు, బేకరీలు, కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. శుభాకాంక్షలు తెలియజేసేందుకు అవసరమైన వస్తువులను పెద్ద మొత్తంలో ఈ ప్రాంతవాసులకు అందుబాటులో తీసుకువచ్చి ప్రత్యేకంగా వాటిని విక్రయించేందుకు ఆకర్షణీయంగా వ్యాపారులు ప్రదర్శించారు. న్యూయర్ ఆర్టికల్స్ అన్నీ అరకులోయలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పూలు, పండ్లు, బొకేల ధరలకు డిమాండ్ ఏర్పడింది. ఈ సరకులకు రెక్కలు రావడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. ఆపిల్ డజన్ ధర 200 నుంచి 250 రూపాయల వరకు పెరిగింది. మిగిలిన పండ్ల ధరలు చుక్కలను అంటాయి.
కమలాపండ్ల ధరలు మరింతగా పెరిగాయి. పూలు, బొకేల రేట్లు కూడా పెరిగి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీంతో పూల వ్యాపారులు విడిగా పూలను అమ్మకుండా పుష్పగుచ్చాల రూపంలో తయారుచేసి విక్రయిస్తుండడం విశేషం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాలను జరుపుకొనేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు అరకులోయలో బస చేయడం గమనార్హం.

‘పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలి’
ముంచంగిపుట్టు, డిసెంబర్ 31: మండలంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్రలో వెలుగుచూసిన సమస్యలను అధికారులు పారదర్శకంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే సివేరి సోమ కోరారు. స్థానిక ఎం.పి.డి.ఒ. కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సోమవారంసమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 150 గ్రామాల్లో పాదయాత్ర చేసి రెవెన్యూ, మండల పరిషత్, గృహనిర్మాణశాఖ, ఆర్.డబ్ల్యూ.ఎస్.,టి.డబ్ల్యూ, పి.ఆర్.,విద్యుత్ ఐ.సి. డి.ఎస్. శాఖలకు సంబంధించి 110 సమస్యలు గుర్తించామన్నారు. ఈ సమస్యలపై అధికారులకు నివేదికను అందిస్తున్నామని, వీటి పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి గైర్హాజరైన ఆర్.డబ్ల్యూ.ఎస్., గిరిజ న సంక్షేమ శాఖ డి.ఇ.ఇ.లపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ. ఎం.ఎస్.బాపిరాజు, తహశీల్దార్ ఎస్.వి .అంబేద్కర్, హౌసింగ్ డి.ఇ.ఇ. వాసుదేవరావు, ఎ.టి.డబ్ల్యూ. కె.వెంకటరమణ, పి.ఆర్. డి.ఇ.ఇ. అప్పలరాజు, ఎ.ఒ. ఉమాప్రసాద్, వెట్నరీ డాక్టర్ జయశంకర్, హె చ్.ఒ. లక్ష్మి, టి.డి.పి. నాయకులు గడ్డంగి రామ్మూర్తి, ఎ.తిరుపతి, కె.వైకుంఠరావు, ఎం.ముకుందపడాల్ పాల్గొన్నారు.

* గ్రామీణ బిటి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>