మండపేట, డిసెంబర్ 31: పట్టణానికి చెందిన కళాకారుడు ఎ వీరవెంకట సత్యనారాయణ నూతన సంవత్సరం 2013కు స్వాగతం పలుకుతూ తన కళానైపుణ్యంతో బియ్యపు గింజలపై హ్యాపీ న్యూ ఇయర్ చెక్కాడు. ఈ సందర్భంగా కళాకారుడు సోమవారం విలేఖరులతో మాట్లాడారు. పలు సూక్ష్మ చిత్రాలను చెక్కి అనేక బహుమతులు అందుకున్నానన్నారు. ఒక్కొక్క బియ్యపు గింజపై ఒక్కొక్క హ్యాపీ న్యూ ఇయర్ అక్షరాలను చెక్కానని తెలిపారు. తాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు.
జోష్ తగ్గింది...
అయినా 2013కు ఘన స్వాగతం
రాజమండ్రి, డిసెంబర్ 31: కొత్త సంవత్సర వేడుకల్లో ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రతీ ఏటా రాజమండ్రి ప్రజలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. అయితే ఈఏడాది ఢిల్లీలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. యువత కూడా ఈసంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఈనేపథ్యంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలు కొంత కళ తప్పినట్లు కనిపిస్తున్నాయి. వివిధ హోటళల్లో కూడా భారీ స్థాయి కార్యక్రమాలను తలపెట్టకపోవడం గమనార్హం. కొన్ని హోటళ్ల యజమాన్యాలు నూతన సంవత్సర వేడుకల బాధ్యతను ఇతర సంస్థలకు అప్పగించాయి. నిరుటి ఉత్సాహం లేకున్నా కొత్త సంవత్సరానికి సోమవారం అర్థరాత్రి నగర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం ఉదయం నుంచే నగరంలో నూతన సంవత్సర వేడుకల సందడి కనిపించింది. ప్రజలు పూల బోకేలు, స్వీట్లు, కేకుల కొనుగోలుతో బిజీగా కనిపించారు. దీంతో ఆయా దుకాణాలు రద్దీగా దర్శనమిచ్చాయి. మద్యం షాపుల్లో కొనుగోళ్లు భారీగా సాగాయి. సోమవారం ఒక్కరోజే సుమారు కోటి రూపాయల అమ్మకాలు సాగినట్లు అంచనా. బిర్యానీ, పలావు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈసందర్భంగా బిర్యానీ, పలావుల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్లు, ఫ్రీలు ప్రకటించారు. సోమవారం 12గంటలు దాటి, 2013 కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడంతోనే నగరం ఒక్కసారిగా సందడిగా మారింది. ఎక్కడ చూసినా యువత కేరింతలు కొడుతూ, ఉత్సాహంగా మోటార్‌సైకిళ్లపై తిరుగుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మద్యం బాబులను కనిపెట్టేందుకు ముఖ్యమైన కూడళ్లలో బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించారు.
ఆయన ‘సహకారం’ కోరాం!
టిడిపి ఎమ్మెల్సీ బొడ్డుతో భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 31: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుకు మంచి అవగాహన ఉందని, సహకార ఎన్నికల్లో ఆయన సహకారాన్ని తాము కోరిన మాట వాస్తవమేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలోని వైఎస్‌ఆర్ సిపి కార్యాలయంలో సోమవారం కుడిపూడి విలేఖరులతో మాట్లాడారు. బొడ్డును మీ పార్టీలోకి ఆహ్వానించారట కదా? అన్న ప్రశ్నకు కూడిపూడి బదులిస్తూ సహకార ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనకు సహకార రంగంపై మంచి అవగాహన ఉండటంతో వెళ్ళినట్టు చెప్పారు. మీపార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్ళారా? లేక ఆయనే మీ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ పార్టీలోకి రావాల్సిందిగా ఆయనను కోరామన్నారు. అయితే ఆలోచించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ బొడ్డు చెప్పినట్టు కుడిపూడి పేర్కొన్నారు. బొడ్డును కోరినట్టు ఇతర పార్టీల నేతల సహకారాన్ని కూడా సహకార ఎన్నికల నేపథ్యంలో కోరతారా? అన్న మరో ప్రశ్నకు, చాలామంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ముందుగా ఆ విషయాలను బయట పెట్టడం వలన ఆయా పార్టీల నేతలు జాగ్రత్త పడే అవకాశాలున్నాయని, అందుకే బహిర్గతం చేయడం లేదన్నారు. ఫలానా నియోజకవర్గానికి టిక్కెట్ నాకంటే నాకంటూ పలువురు వైఎస్‌ఆర్‌సిపికి చెందిన నేతలు ముందస్తు ప్రచారం చేసుకోవడం మీపార్టీకి మంచిదా? ఇలా ప్రచారం జరగడం వలన మీ పార్టీ మరో ప్రజారాజ్యం అయ్యే అవకాశం లేదా? అని అడగగా, ఎవరు తమ పార్టీలో చేరినా అటువంటి వారికి టిక్కెట్ల కేటాయింపునకు సంబంధించి ఏ విధమైన హామీని తమ అధినేత జగన్ ఇవ్వలేదని కుడిపూడి పేర్కొన్నారు. రానున్న సహకార ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. పార్టీలో గ్రూపు విభేదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మండపేట నియోజకవర్గంలో పార్టీలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఇటీవల చక్కబెట్టగలిగానని, జిల్లా కన్వీనర్‌గా ఎక్కడ ఏ విధమైన సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కృషి చేస్తున్నానని చిట్టబ్బాయి తెలియజేశారు. సమావేశంలో వైఎస్‌ఆర్ సిపి నాయకులు మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మరో వత్సరానికి తెర
చిగురించే ఆశలతో 2013 ఆరంభం
కడియం, డిసెంబర్ 31: జీవన కాల గమనంలో మరో వత్సరానికి తెరపడింది. చిగురించే ఆశలతో 2013 ఆరంభమయింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా ఉత్సాహం చూపుతున్నారు. నూతన సంవత్సర వేడుక పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ కాలక్రమంలో ఈ ఆంగ్ల వేడుక మనలోనూ ఇమిడిపోయింది. నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు..వయోభేదం లేకుండా ఆనందోత్సాహాలతో గడుపుతారు. అటువంటి ఔత్సాహికులకు గుభాళించే వన తెలుగు పదాలతో కడియం పల్ల వెంకన్న నర్సరీ స్వాగతం పలుకుతోంది. ఆలస్యంగానైనా గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మలాంటి తెలుగు భాషపై గడిచిన ఏడాది చివరిలో వేడుక జరిపింది. ఈ వేడుకను స్వాగతిస్తూ తెలుగు పదాల కూర్పుతో ల్యాండ్ స్కేపింగ్ చేసినట్టు నర్సరీ యజమాని పల్లా సుబ్రహ్మణ్యం తెలిపారు. నూతన సంవత్సర వేడుకను తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతూ తీర్చిదిద్దిన మొక్కల కూర్పు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మ్యాజిక్ 2013
సామర్లకోట, డిసెంబర్ 31: కొత్త సంవత్సరానికి కొంతమంది శుభాకాంక్షలు తెలపడంలో తమ నైపుణ్యాన్ని, ప్రత్యేకతను చాటుకొంటున్నారు. ఈ క్రమంలో గణిత ప్రక్రియలతో తమాషా చదరాలు రూపొందించే ప్రముఖ గణిత అవధాని, స్థానిక బచ్చు పౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం తోటకూర సాయిరామకృష్ణ ఎటు కూడినా 2013 వచ్చేలా గణిత మ్యాజిక్ చదరాల్ని రూపొందించి తనదైన శైలిలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. మ్యాజిక్ చదరంలో 2013లో ఏ అడ్డు వరుసలలోని నాల్గు సంఖ్యల మొత్తం కూడినా 2013. ఏ నిలువు వరుసలోని నాల్గు సంఖ్యలు కూడినా, కర్ణాల వెంబడి (మూలాలు) నాల్గు సంఖ్యల మొత్తం, వరుసగా రెండు అడ్డు వరసలు, రెండు నిలువు వరుసులతో ఏర్పడిన చదరాలలో నాల్గు సంఖ్యల మొత్తం 2013. నాలుగు మూలాల్లోని నాలుగు సంఖ్యల మొత్తం 2013. ఈ విధంగా మ్యాజిక్ చదరం మొక్క విశిష్టతను వివరించారు.
ఈవ్ టీజర్ల తాట తీస్తా...
*కళాశాలల వద్ద డ్రాప్ బాక్సులు
*వేధించే వారి బైక్ నెంబర్ రాస్తే చాలు
*విద్యార్థినులకు అర్బన్ ఎస్పీ రవి భరోసా
రాజమండ్రి, డిసెంబర్ 31: విద్యార్థినులు, మహిళలను వేధించే ఆకతాయిల తాట తీస్తానని అర్బన్ ఎస్పీ టి రవికుమార్‌మూర్తి హెచ్చరించారు. రాజమహేంద్రి అన్ ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కళాశాలల విద్యార్థులు ప్రదర్శనగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి మహిళా వేధింపులపై చట్టాలను కఠినతరం చేయాలని, ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తాను కూడా ఒక ఆడపిల్ల తండ్రినేనని, వారి బాధలు తనకు అనుభవమేనన్నారు. వేధింపుల విషయంలో తాను సీరియస్‌గా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈవ్ టీజింగ్ నిరోధానికి విద్యాసంస్థల వద్ద పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసినా, విద్యార్థుల సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవ్ టీజింగ్ నిరోధానికి కళాశాలల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. వేధించే వారి మోటార్‌సైకిల్ నెంబరు రాసి బాక్సులో వేస్తే అలాంటి వారికి తగిన గుణపాఠం నేర్పుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రుకా అధ్యక్షుడు టికె విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలను వేధించేవారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాలని కోరుతూ అన్ని కళాశాల విద్యార్ధుల నుండి సంతకాలు సేకరించి రాష్టప్రతికి పంపుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో రుకా అధ్యక్షుడు టికె విశే్వశ్వరరెడ్డి, కార్యదర్శి ఎస్పీ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు, మహిళల రక్షణకు పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కళాశాలల బంద్ జరిగింది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి, గోకవరం బస్టాండ్ మీదుగా ర్యాలీగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు.
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
రీజినల్ జాయింట్ డైరెక్టర్ బ్రహ్మానందం
ధవళేశ్వరం, డిసెంబర్ 31: ప్రతి ఒక్కరూ వారివారి విధుల్లో అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్ బ్రహ్మానందం అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం నాగమణి పదవీ విరమణ సందర్భంగా సోమవారం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. జక్కంపూడి సీతారత్నం కల్యాణ మండపంలో వీడ్కోలు, సత్కార సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా ఆర్జేడి బ్రహ్మానందం, రాజమండ్రి డివైఇఒ ఇమ్మానియేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బ్రహ్మానందం మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో ఆనందం పొందేవారు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారని అన్నారు. డివైఇఒ ఇమ్మానియేల్ మాట్లాడుతూ నాగమణి 31 ఏళ్లపాటు జూనియర్ కళాశాలలో పనిచేస్తూ క్రమశిక్షణతో ఉద్యోగం చేశారని, ప్రిన్సిపాల్‌గా ధవళేశ్వరం జూనియర్ కళాశాల అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. అనంతరం పూలమాలలు, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డివైఇఒ అనంతరావు, చంద్రరావు, సిటిఒ జిఎల్ సత్యవేణి, ప్రిన్సిపాల్ సరళా, టి వెంకటేశ్వరరావు, కె జగదీశ్వరరావు, బిఎస్‌ఎన్ మూర్తి, కాంట్రాక్టు లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు రాజాచౌదరి, వీర్రాజు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రణాళిక పక్కాగా ఉండాలి
మండల విద్యాశాఖాధికార్లకు ఐటిడిఎ పిఒ నాగరాణి ఆదేశం
రంపచోడవరం, డిసెంబర్ 31: ప్రాథమిక పాఠశాలల సర్వే, ప్రణాళిక -2013 నిర్వహణకు నిర్ధేశిత మార్గదర్శకాల ప్రకారం పక్కాగా నిర్వహించాలని ఐటిడిఎ పిఒ సి నాగరాణి మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐటిడిఎలోని ఆమె ఛాంబర్‌లో ఎంఇఒలతో సమావేశం నిర్వహించి ఎస్‌ఎస్‌ఎ, ఇతర ప్రణాళికా రచనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గిరిజన సంక్షేమ శాఖ, రాజీవ్ విద్యామిషన్ ఉన్నతాధికారులు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం సర్వే చేపట్టి పక్కాగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎక్కడ పాఠశాలల అవసరమన్నది, బడి బయట పిల్లలు ఎక్కడ ఉన్నది అన్న విషయాలు ఇప్పటికే విద్యాశాఖాధికారులందరికీ రూపొందించే నివేదికలపై అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం మారిన మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రణాళిక మరింత పటిష్టంగా చేపట్టి ఈ నెల 10వ తేదీనాటికి సమగ్ర నివేదిక ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుందన్నారు. జనవరి 1న స్థానిక ఐటిడిఎలో స్కూలు కాంప్లెక్స్‌ల వారీ ప్రాథమిక పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల వివరాలు, సర్వే టీము పాఠశాలలు సందర్శించే తేదీలను ఖరారు చేస్తామన్నారు. 43 స్కూల్ కాంప్లెక్స్‌ల హెచ్‌ఎంలు, సిఆర్‌పిలు సమావేశానికి హాజరు కావాలన్నారు. జనవరి 2న మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు ఎంపిడిఒ, ఎంఎంఎస్ లీడర్లు, ఐకెపి సిబ్బందిని ఆహ్వానించాలని, సర్వే టీము సందర్శించే స్కూలు షెడ్యూల్‌ను ప్రతీ స్కూలుకు ఆయా గ్రామ విఒకు ముందుగా తెలియపర్చాలన్నారు. సర్వే టీము స్కూలు సందర్శించే రోజున స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులను, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను మీటింగ్ నిర్వహణపై ముందస్తుగా సమాచారం ఇవ్వాలన్నారు. స్కూలు పిల్లలంతా హాజరయ్యేటట్లు చూడాలన్నారు. విద్యార్థుల రిజిస్ట్రేషన్, బడి బయట పిల్లల రిజిస్ట్రేషన్ వివరాలు స్కూలు టీచర్లు నిర్వహించాలన్నారు. సర్వే టీం స్కూలు సందర్శించే సమయానికి ఆయా టీచర్లు ఆయా ఫారాలు నింపి సిద్ధం చేసుకోవాలన్నారు. స్కూలు కాంప్లెక్స్ షెడ్యూల్‌ను ప్రతీ స్కూకు పంపుతూ పక్కాగా ప్రణాళిక రచన చేపట్టాలన్నారు. వౌలిక సదుపాయాలు, ఫర్నీచర్, రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయని, వౌఖిక పరీక్ష, రాత పరీక్ష నిర్వహించాలని, రోజంతా సర్వే చేపట్టి ఏ ఒక్కరూ మిస్ కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు, మెలకువలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏజన్సీ డిఇఒ పి రాజీవ్, పిఎమ్మార్సీ ఎఒ బిఎస్ కుమార్, ఎంఇఒలు పాల్గొన్నారు.
3వరకు అపరాధ రుసుముతో టెన్త్ పరీక్ష ఫీజు:డిఇఒ
కాకినాడ సిటీ, డిసెంబర్ 31: వచ్చే మార్చి నెలలో జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకాదలిచిన టెన్త్ విద్యార్థులు ఈ నెల 3వ తేదీ వరకు 1000 రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి కెవి శ్రీనివాసులరెడ్డి సోమవారం తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును జనవరి 4వ తేదీన సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బ్యాంక్‌లలో చలనా రూపంలో చెల్లించాలని వాటిని 5వ తేదీన జిల్లా విద్యాశాఖా కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి పరీక్ష ఫీజు కట్టని విద్యార్థులతో మాట్లాడి ఫీజు చెల్లించేటట్లు వారిని ప్రోత్సహించాలని డిఇఓ శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అవకాశం
కాకినాడ సిటీ, డిసెంబర్ 31: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్కాలర్‌షిప్‌లకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరి అయినందున జిల్లాలో ఉన్న ఆధార్ సెంటర్‌లలో వారం రోజుల పాటు ఎన్‌రోల్‌మెంట్‌కు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తెలిపారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో సోమవారం వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఎఎస్‌డబ్ల్యూఓలతో విద్యార్థుల స్కాలర్‌షిప్ నమోదులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు వారం రోజుల పాటు ఆధార్ నమోదుకు అవకాశం కల్పిస్తామని అనంతరం ప్రజలకు ఆధార్ నమోదు ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 9, 10 తరగతి చదువుతున్న 24 వేల 437 మంది విద్యార్థులు ఉన్నారని వీరిలో 14వేల మంది వివరాలను సేకరించామని మిగిలిన వారి వివరాలను సేకరించి సంబంధిత బ్యాంక్‌లకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎజెసి బి రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి విజయ్‌కుమార్, అధికారులు ధనరాజు, జగన్నాధరాజు, వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
17 నుండి ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కాకినాడ సిటీ, డిసెంబర్ 31: ప్రోహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అభ్యర్ధులకు ఈ నెల 17వ తేదీ నుండి దేహధారుఢ్య పరీక్షలను నిర్వహిస్తామని కాకినాడ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జోషఫ్ సోమవారం తెలియజేశారు. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్ళ ఉద్యోగాల నియామకానికి సంబంధించి డిసెంబర్ 1 నుండి 31 వ తేదీ వరకు కాకినాడ రూరల్ మండలం ఎడిబి రోడ్డులో నాలుగు కిలో మీటర్ల పరుగు పరీక్షను నిర్వహించామన్నారు. మొత్తం 22 వేల 840 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 15 వేల 311 మంది పరుగు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. హాజరైన అభ్యర్థుల్లో 10 వేల 492 మంది అభ్యర్థులు దేహధారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారన్నారు. వీరిలో 10 వేల 58 మంది పురుష అభ్యర్థులు, 434 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని ఆయన తెలిపారు. వీరికి ఈ నెల 9 వ తేదీ నుండి ముందుగా దేహధారుఢ్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందని అయితే రాష్ట్ర ఎక్సైజ్ కమీషనర్ ఆదేశాలతో ఈ నెల 17 నుండి ప్రారంభించి ఫిబ్రవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించి సంబంధిత తేదీలలో దేహధారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2 నుండి 13వ తేదీ వరకు ముందుగా హాజరుకావాల్సిన అభ్యర్థులు ఆయా తేదీల్లో హాజరు కావాలని డిప్యూటీ ఎక్సైజ్ కమీషనర్ జోషఫ్ స్పష్టం చేశారు.