మచిలీపట్నం, డిసెంబర్ 31: సహకార ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి కోరారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని సోమవారం ఇక్కడ జరిగిన అధికారుల సమావేశంలో ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి పనిచేసే ఎన్నికల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. దిన పత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై సహకార శాఖ అధికారి ఫణికుమార్‌తో సమీక్షించారు. నిర్ణీత సమయానికి ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. 108, 104 అంబులెన్స్‌లలో రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళటాన్ని నిరోధించాలని ఆరోగ్యశ్రీ జిల్లా కో - ఆర్డినేటర్ డా. సుధాకర్‌ను ఆదేశించారు. అవకతవకలకు పాల్పడే అంబులెన్స్‌ల పైలెట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే వారిని బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించారు.
గొట్టుముక్కల సొసైటీలో సభ్యత్వం నమోదుపై హైకోర్టు స్టే
కంచికచర్ల, డిసెంబర్ 31: గొట్టుముక్కల సహకార సంఘం డివిజనల్ సహకార శాఖ అధికారి ద్వారా 42మంది సభ్యులను సంఘంలో చేర్చుకోరాదని రాష్ట్ర హైకోర్ట్ సోమవారం స్టే ఇచ్చినట్లు సంఘ అధ్యక్షుడు తాటుకూరు భాస్కరరావు తెలిపారు. విజయవాడ డివిజన్‌లో కొందరు రైతులు సహకార సంఘాల్లో పాలకవర్గంతో సంబంధంలేకుండా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో సభ్యత్వ రుసుం చెల్లించి ఫారం జె ద్వారా సభ్యత్వ దరఖాస్తును విజయవాడ డివిజన్ సహకార శాఖ అధికారికి అందజేశారు. దీనిపై సహకార శాఖ అధికారి తన వద్దకు వచ్చిన దరఖాస్తుదారులను పాలకవర్గ తీర్మానంతో నిమిత్తం లేకుండా సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. గొట్టుముక్కల సహకార సంఘంలో 41మందిని ఫారమ్ జె ద్వారా సభ్యులుగా చేర్చుకోవాలని సహకార శాఖ అధికారి ఇచ్చిన ఉత్తర్వులపై సంఘ పాలకవర్గం తరుఫున అధ్యక్షుడు భాస్కరరావు రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్టేవిధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా ప్రజలకు ప్రముఖుల నూతన వత్సర శుభాకాంక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 31: జిల్లా ప్రజలకు పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సోమవారం నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా సహజీవనం సాగిస్తూ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు, ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య, జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, ఎస్పీ జె ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, అడిషనల్ ఎస్పీ వి ప్రేమ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొండి కృష్ణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, పార్లమెంట్ మాజీ సభ్యులు బాడిగ రామకృష్ణ, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ డా. కుక్కల నాగేశ్వరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
15 వరకు నీరు విడుదల చేయాలి
కైకలూరు, డిసెంబర్ 31: నియోజకవర్గంలోని అన్ని శివారు ప్రాంతాలకు తాగునీరు అవసరమైన దృష్ట్యా ఈనెల 15 వరకు పంట కాల్వల్లో నీరు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కోరారు. సోమవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం వద్ద తాగునీటి విడుదలపై ఇరిగేషన్, రెవెన్యూ, మండల పరిషత్, ఆర్‌డబ్ల్యుఎస్, నీటి సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి అధికంగా ఉందని, పోలరాజ్, సీబీ కెనాల్ పరిధిలో ఉన్న అనేక శివారు ప్రాంతాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శివారు ప్రాంతాల్లోని మంచినీటి చెరువులు సైతం నింపేవరకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ ఎస్‌ఇ నరసింహంను కోరారు. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న అన్ని మంచినీటి చెరువులు నింపుకునేందుకు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రేపటి నుంచి అధికారులందరూ టీములుగా ఏర్పడి కాల్వల వెంబడి తిరుగుతూ అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ పైపులైన్లు, ఇంజన్లు తొలగించాలన్నారు. పంట కాల్వలు గుర్రపుడెక్క, నానా వ్యర్ధాలతో పూడిపోయాయని శివారు ప్రాంతాలకు నీరు అందటం కష్టమని, కాల్వలు బాగుచేయకుండా నీరు విడుదల చేసినా ప్రయోజనం ఏమిటని నీటి సంఘాల నాయకులు బొబ్బిలి రత్తయ్య నాయుడు, శాయన రామారావు, చదలవాడ శేషగిరిరావు, పల్లంరాజు, సుబ్బరాజు, టిడిపి నాయకులు పెనె్మత్స త్రినాథ్‌రాజు తదితరులు అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఎస్‌ఇ నరసింహం మాట్లాడుతూ పంట కాల్వల బాగుచేతపై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం డిసెంబర్ 31 వరకే సాగర్ నీరు విడుదల చేయాలని పై నుంచి ఆదేశాలున్నాయని, అయినప్పటికీ ఇక్కడి తాగునీటి ఎద్దడి దృష్ట్యా 15 వరకు నీరు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు అధికారుల బృందం కైకలూరు ఛానెల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఇఇ, కైకలూరు, కలిదిండి తహశీల్దార్లు, మండవల్లి ఎడీవో, స్థానిక ఇరిగేషన్, కైకలూరు, మండవల్లి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అసమర్థుల పాలనలో సామాన్యుల జీవితం దుర్భరం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 31: ప్రభుత్వ అసమర్ధ పరిపాలన వల్ల సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర వస్తున్నా మీకోసం పాదయాత్ర 500 కిలోమీటర్లు ముగిసిన సందర్భంగా స్థానిక చిలకలపూడి సెంటరులో సోమవారం జరిగిన బహిరంగ సభలో కొనకళ్ళ మాట్లాడుతూ అన్ని వస్తువులపై విపరీతంగా ధరలు పెంచి సామాన్య ప్రజలతో పాలకులు చెలగాటమాడుతున్నారని నిప్పులు చెరిగారు. విద్యుత్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని విమర్శించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన నాయకులు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బ్రష్ఠుపట్టిపోయిందని దుమ్మెత్తిపోశారు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. 500కిలో మీటర్లు పాదయాత్ర చేసిన రవీంద్రను ఆయన అభినందించారు. చంద్రబాబు నాయుడు స్పూర్తితో తాను చేపట్టిన ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని రవీంద్ర అన్నారు. సమస్యల వలయంలో కూరుకున్న ప్రజలకు ఏమాత్రం మేలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుల కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, కాశీవిశే్వశ్వరరావు, పల్లపాటి సుబ్రహ్మణ్యం, చిలంకుర్తి తాతయ్య, మోటమర్రి బాబాప్రసాద్, పచ్చిగోళ్ళ కొండలరావు, కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్‌పై నుంచి రోడ్డుపై జారి పడిన చెరకు
చల్లపల్లి, డిసెంబర్ 31: ట్రాక్టర్‌పై కర్మాగారానికి తరలిస్తున్న చెరకు మార్గమధ్యంలో రామానాగరం వద్ద ప్రధాన రహదారిపై జారి పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే బందురు రోడ్డులో ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. గంటల తరబడి చెరకు రోడ్డుపై ఉండిపోవటంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు.
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 31: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిఆర్‌ఓ ఎల్ విజయచందర్ స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలివే
జిల్లాలో ప్రస్తుతం ఉన్న మీ-సేవా కేంద్రాలకు అదనంగా మరో 35 మీ-సేవా కేంద్రాలు ఏర్పాటుకు అనుమతి కోరుతూ అర్జీ దాఖలు చేశారు. గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామానికి చెందిన పి లక్ష్మికుమారి బాలికల సంరక్షణ పథకంలో బాండు మంజూరు చేయాలనలి అర్జీ దాఖలు చేసింది. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన ఎం ప్రసన్న పాల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేయాలని, మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కుంభ దేవానంద్ గ్రామంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అర్జీ సమర్పించారు. విజయవాడ అర్బన్ మండలం శరణం టవర్స్ కాలనీకి చెందిన మాకినేని నాగేంద్రబాబు రక్షిత మంచినీటి పథకం ట్యాంక్ ప్రైవేటు స్థలంలో నిర్మించిన స్థలానికి నష్టపరిహారంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని, పెడన మండలం నందిగామ గ్రామానికి చెందిన సాదు సుబ్రహ్మణ్యం గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని, మచిలీపట్నం రూరల్ మండలం దేవుడు చెరువుకు చెందిన సిహెచ్ సక్కుబాయి తన గ్యాస్ కనెక్షన్‌ను పునరుద్దరించాలని అర్జీ దాఖలు చేసింది.
కైకలూరు మండలం కొట్టాడ గ్రామానికి చెందిన సైదు ఫీబా ఇల్లు మంజూరు చేయాలని, వీరులపాడు మండలం అల్లూరి గ్రామానికి చెందిన కె బేబి సరోజిని వరదల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇప్పించాలని అర్జీ సమర్పించింది. అవనిగడ్డకు చెందిన కుప్పా భాస్కర్ తన స్థలం సర్వే చేయించి స్వాధీనం పర్చాలని, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన కొండల సూర్యప్రకాశరావు తన తల్లికి ప్రభుత్వం సిలింగ్ భూమి ఇచ్చిందని దానిని వేరొకరు ఆక్రమించుకున్నారని, దానిని సర్వే చేయించి స్వాధీన పర్చాలని అర్జీ సమర్పించారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన మాజీ సైనికుడు షేక్ సుభాని ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని, ఇల్లును నిర్మించాలని అర్జీ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బందరు ఆర్డీవో ఐ వెంకటేశ్వరరెడ్డి, సోషల్ వెల్ఫేర్ జెడి పిఎస్‌ఎ ప్రసాదు, వ్యవసాయ శాఖ జెడి ప్రసాదు, జిల్లాపరిషత్ సిఇవో కొండయ్యశాస్ర్తీ, డిఇవో దేవానందరెడ్డి, మత్స్యశాఖ ఉప సంచాలకులు కళ్యాణం, హౌసింగ్ పిడి పి రవికుమార్, సిపివో వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి కో-ఆర్డినేటర్ రామారావు, డిఎస్‌వో ప్రభాకరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శోభాయమానంగా కోనేరు సెంటర్, పార్కు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 31: ఆంగ్ల సంవత్సరాదికి స్వాగతం పలుకుతూ పట్టణంలోని పలు కూడళ్ళు, పార్క్, వ్యాపార సంస్థలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో పురవీధులు మిలమిలా మెరిశాయి. స్థానిక కోనేరుసెంటరును అందంగా అలంకరించారు. పురపాలక సంఘ ప్రధాన పార్కులోని మ్యూజికల్ ఫౌంటెన్, చెట్లను అలంకరించటంతో పార్కు శోభాయమానంగా రూపుదిద్దుకుంది. పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు, బేకరీలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. రేవతి సెంటరు వద్ద కేక్ కొనుగోలు దారులతో రద్దీ ఏర్పడింది. కొన్నిసార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాజకీయ ప్రముఖులు, అధికారులు, పట్టణ ప్రముఖులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించడానికి ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారు. యాపిల్, కమలాల వంటి పండ్లకు, పూల మాలలు, తురాయిలు, కేక్‌లకు గిరాకీ పెరిగింది. మిత్రులు, బంధువులకు ప్రత్యేక బహుమతులు అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. మొబైల్ ఎస్‌ఎంఎస్, ఫుల్ ఆన్ ఎస్‌ఎంఎస్ తదితర సౌకర్యాలు ఏర్పడిన కారణంగా గ్రీటింగ్ కార్డుల విక్రయం జోరు తగ్గింది.
రోడ్డు పాడవుతోందని ఇసుక లారీలు అడ్డుకున్న రైతులు
తోట్లవల్లూరు,డిసెంబర్ 31: చిలకలదిబ్బపాయలోని రహదారిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు తోట్లవల్లూరు రైతులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. రైతులు కిలారం శ్రీనివాసరావు, మేకల నాంచారయ్య, తోట సాయిబాబు, మేకల శ్రీనివాసరావు తదితరులు చిలకలదిబ్బపాయకు చేరుకుని వల్లూరుపాలెం క్వారీ నుంచి వస్తున్న ఇసుక లారీలను నిలిపివేశారు. ఇసుక లారీల వల్ల రహదారి గోతులమయంగా మారిందని, దీనివల్ల చెరకు రవాణాకు ఆటంకంగా ఉందని అన్నారు. దీంతో క్వారీ సిబ్బంది వచ్చి రహదారిని అభివృద్ధి చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతు కిలారం శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్ద పెద్ద లారీలకు క్వారీలోకి ప్రవేశం లేదని, అయినా రాత్రిపూట 12 టైర్ల లారీల్లో పొక్లెయిన్లతో లోడ్ చేసి ఇసుక రవాణా చేస్తున్నారని అన్నారు. లారీల్లో రవాణా వల్ల పంటలు బాగా దెబ్బతింటున్నాయని తెలిపినా పట్టించుకోవటం లేదని తెలిపారు. ఇసుక లారీల రవాణా ద్వారా లంకలలోని రహదారులు అన్ని గోతులమయంగా మారయని దీనివల్ల రైతులకు చెరకు రవాణా చేయటానికి చాలా కష్టంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అజ్మతున్నీసాకు ‘ఆణిముత్యం లైఫ్‌టైమ్’ అవార్డు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 31: కృష్ణా జిల్లా మొట్టమొదటి మహిళా ప్రభుత్వ న్యాయవాది, మచిలీపట్నం రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి, పట్టణ బార్ అసోసియేషన్ మొట్టమొదటి మహిళా మాజీ ఉపాధ్యక్షురాలు, మహిళా సేవా మండలి లీగల్ కన్వీనర్ అజ్మతున్నీసా సమాజ సేవా కార్యక్రమాలను గుర్తించి మదర్ థెరిస్సా సాంఘిక సంక్షేమ సంస్థ హైదరాబాద్, ఆదివారం విశాఖలో రాష్ట్ర ‘ఆణిముత్యం లైఫ్‌టైమ్’ అవార్డుతో ఘనంగా సత్కరించారు.
ఢిల్లీ ఘటనకు నిరసనగా పేటలో
వౌన ప్రదర్శన
జగ్గయ్యపేట, డిసెంబర్ 31: ఢిల్లీలో మెడిలో విద్యార్థినిపై అత్యాచారం, ఆమె మృతికి సంతాపంగా గంగాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీ వౌన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలో బలుసుపాడు గురుథామ్ వ్యవస్థాపకులు గెంటేల వెంకట రమణ, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, పలు పార్టీల నేతలు అగ్రభాగాన నిలిచారు. పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుండి వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆడది ఆట వస్తువు కాదని, అశ్లీల చిత్రాలు నిషేధించాలని, అత్యాచారాల నిరోధానికి కఠిన చట్టాలు ఏర్పాటు చేయాలని తదితర ప్లకార్డులు ప్రదర్శించారు. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 31: మచిలీపట్నం ఎపిఎస్ ఆర్టీసి వైద్యశాలను మేనేజ్‌మెంట్ వారు విజయవాడకు తరలించే ప్రయత్నాలను మానుకోవాలని కోరుతూ స్థానిక డిపో ఎదుట మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, అవనిగడ్డ డిపోల కార్మిక నాయకులు, కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైద్యశాలను విజయవాడకు తరలించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని, లేకుంటే తర్వాతి కార్యాచరణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, అవనిగడ్డ డిపోలకు చెందిన కార్మిక సంఘ కార్యదర్శులు, రిటైర్డ్ కార్మికులు కూడా పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ అభయ వీరాంజనేయ స్వామికి అభిషేకాలు
కూచిపూడి, డిసెంబర్ 31: వేలాదిమంది భక్తుల వాసుదేవ నామస్మరణల నేపథ్యంలో ముత్తేవి సీతారాం గురుదేవులు, ఉత్తర పీఠాధిపతులు గౌరాకృష్ణ శ్రీ కృష్ణాశ్రమంలోని శ్రీ అభయాంజనేయ స్వామికి నిర్వహించిన అభిషేకాలు భక్తులకు నేత్రానందం కలిగించాయి. ధనుర్మాస మహావ్రతాల్లో భాగంగా సోమవారం పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలోని శ్రీ అభయ వీరాంజనేయ స్వామికి ఆవు పాలతో, శ్రీగంధం, పళ్ళ రసాలతో సీతారాం గురుదేవులు అభిషేకించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో ప్రారంభమైన దైవ కార్యక్రమాల్లో భాగంగా తిరుప్పావై రసధుని పారాయణం, నిత్యానుష్ఠాన పఠనం, ప్రత్యేక పూజల అనంతరం ఆంజనేయ స్వామిని రజత ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, ముత్తేవి సీతారామదాసు, తుర్లపాటి ఆనంద్ పర్యవేక్షణలో వేలాది మంది భక్తులకు అన్న సమారాధన చేశారు.
నగరంలో నూతన వత్సరానికి ఘన స్వాగతం...
అంబరాన్నంటిన సంబరాలు
* అర్ధరాత్రి వేళ వీధులు కళకళ
* శుభాకాంక్షలు, కేరింతలతో సందడే సందడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 31: కొత్త ఆశలతో వస్తున్న 2013 నూతన సంవత్సరానికి అర్ధరాత్రి వేళ సరిగ్గా 12గంటలకు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ నగరవాసులు సందడిగా చేసుకున్న సంబరాలు అంబరాన్నంటాయి. రాత్రి 8గంటల నుంచే ప్రధాన రహదారులు, మారుమూల వీధుల్లో సైతం సందడి నెలకొంది. మిఠాయిలు, బొకేలు కొనేవారితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక యువకులు, విద్యార్థులు మోటార్ సైకిళ్లపై రయ్యిమని దూసుకుపోతూ సందడి చేస్తే నివాస ప్రాంతాల్లో మహిళలు తమ ఇళ్ల ముంగిట హ్యాపీ న్యూ ఇయర్ నినాదంతో ఆకర్షణీయమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం నేటి సంబరాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. పాశ్చాత్య పోకడలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. స్టార్ హోటళ్లు, క్లబ్బులు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో భారతీయ, తెలుగు సంప్రదాయ నృత్యాలు, వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భవానీ భక్తులు, అయ్యప్ప భక్తులు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు జరపగా, చర్చిలలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. సరిగ్గా 12గంటల వేళ గంటలు మార్మోగాయి. బాణసంచా పేలుళ్లు, రంగులు వెదజల్లుతూ దూసుకెళ్లే తారాజువ్వలు కళ్లు మిరుమిట్లు గొలిపాయి. వీధుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నగర పోలీస్ కమిషనర్ ఎస్ మధుసూదనరెడ్డి నేతృత్వంలో సాయుధ పోలీసులు తెల్లవారుఝాము వరకు పహారా కాశారు. బైక్‌లపై దూసుకెళ్లే యువకులకు ఎక్కడికక్కడ కళ్లెం వేశారు. అపార్టుమెంట్లలో పలు రకాల వినోదాత్మక విందు కార్యక్రమాలు జరిగాయి. స్టార్ హోటళ్లు, క్లబ్‌లలో కమెడియన్లతో వినోదాత్మక కార్యక్రమాలు, లక్కీడిప్‌లు నిర్వహించగా, ప్రత్యేక ఆఫర్లలో పలు రకాల వంటకాలు నోరూరించాయి. విజయవాడ క్లబ్‌లో సినీతార కామ్నా జెత్మలానీ, పలువురు సినీ, టీవీ తారలు తమ నృత్యాలతో అలరింపచేశారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్లలోనే గాక హోటళ్లు, క్లబ్‌లలో మద్యం ఏరులై ప్రవహించింది. ఈ ఒక్కరోజే నగరంలో కనీసం 5కోట్ల రూపాయలకు పైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఏడాది నుంచి సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ఒక్కరోజు అప్పోసొప్పో చేసి సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
* ధర్నాలో ప్రజాసంఘాల డిమాండ్
సబ్ కలెక్టరేట్, డిసెంబర్ 31: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్ సంఘటనతో మహిళలకు రక్షణ లేదనే విషయం మరోసారి స్పష్టమైందని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్, భారత జాతీయ మహిళా సంఘం, పిడిఎస్‌యు, పిఓడబ్ల్యు, పివైఎల్ నాయకులు విమర్శించారు. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినవారిని కఠినంగా శిక్షించడంతోపాటు మహిళా వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజాసంఘాలు సంయుక్తంగా సోమవారం ఉదయం బందరురోడ్డులోని సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాయి. ఐద్వా నగర కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ నిర్భయ గ్యాంగ్ రేప్‌కు గురైన తర్వాత ఢిల్లీలో మరో మూడు రేప్‌లు జరిగాయని చెప్పారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే ఈ సంఘటనలు పునరావృత్తం అవుతున్నాయన్నారు. మహిళా వేధింపులకు అంతం ఎప్పుడని ప్రశ్నించారు. నగరంలో కూడా మహిళా వేధింపులు అధికంగా జరుగుతున్నాయని వివరించారు. పోలీసులు మఫ్టీల్లో కళాశాలలు, బస్‌స్ట్ఫాల దగ్గర ఉండి ఈవ్‌టీజింగ్‌ను నివారించాలన్నారు. దేశం మొత్తం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి అత్యాచారం కేసులను త్వరితగతిన విచారించాలని డిమాండ్ చేశారు. పిఓయు నగర కార్యదర్శి రమ మాట్లాడుతూ మహిళలు ధరించే దుస్తుల వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని రాజకీయ పార్టీ నాయకులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. దేశంలో ప్రతి ఇరవై నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 700 అత్యాచారాలు జరిగి కేసులు నమోదైతే అందులో ఒక్క కేసులోనే శిక్ష పడిందంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో తెలుస్తుందన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడినవారిని శిక్షించడానికి చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మహిళలకు స్వేచ్ఛగా తిరిగే రోజులు రాలేదన్నారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రవీణ్, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి మాధవ్, వెంకట్, రాణి, ఎఐవైఎఫ్ నాయకులు సురేష్, గోవిందరాజులు, రాహేలు, గణేష్, సిహెచ్ రఘువీర్, ఆజాద్, గిరీష్, పిడిఎస్‌యు నాయకులు ఎ.అశోక్, రవిచంద్ర, లక్ష్మి, జె.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
* బస్సు అద్దాలు ధ్వంసం * నిందితుల అరెస్ట్
పాతబస్తీ, డిసెంబర్ 31: చిన్నకారు ముందుకెళ్ళడానికి దారివ్వలేదని ఆగ్రహించిన తాగుబోతుల గుంపు రెచ్చిపోయి ఇనుపరాడ్లతో ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా సిబ్బందిని చితకబాదిన కేసులో ఆరుగురు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హన్మకొండ నుండి తిరుపతికి బయలుదేరిన ఆర్టీసీ బస్ వెనుక కారు వస్తోంది. ఇబ్రహీంపట్నం వద్ద నుండి భవానీపురం వచ్చే వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నకారు వాళ్లు ముందుకెళడానికి బస్ డ్రైవర్ దారి ఇవ్వలేకపోయాడు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ గుడికి వెళ్ళే చిన్నకారులో విజయవాడకు బయలుదేరిన ఆరుగురు పీకలదాకా మద్యం సేవించి ఉన్నారు. అడిగిన వెంటనే దారివ్వని ఆర్టీసీ డ్రైవర్‌పై పట్టరాని కోపం వచ్చిన మిత్ర బృందం భవానీపురం బ్యాంక్ సెంటర్‌కి రాగానే చిన్నకారుని బస్‌కి అడ్డంగా పెట్టారు. అదే ప్రాంతాల్లో రాజకీయ పార్టీ జెండాలు కట్టిన ఐరన్‌రాడ్డులు అందుకుని విచక్షణా రహితంగా బస్ ముందు అద్దాలు, పక్క అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా డ్రైవర్ మొగలగాని జనార్దన్ (35)ని మరో సహాయ డ్రైవర్, కండక్టర్‌లను అందినవారిని అందినట్టు ఐరన్‌రాడ్డుతో బాదేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ధ్వంసమైన బస్‌ని వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం నిందితుల కారుని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భవానీపురానికి చెందిన అన్నదమ్ములు చుక్కా వెంకటేశ్వరరావు (32), చుక్క నాగరాజు (22), ముప్పడి రమణ (40), తాతారపు సాయికుమార్ (20), భవరాజు మల్లేశ్వరరావు (32), రమణారెడ్డి (28)లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసి గాయపర్చడమే కాకుండా ఆర్టీసీ బస్‌ని ధ్వంసం చేసిన ఆరుగురు నిందితులను సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. సిఐ కె హనుమంతరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రెహమాన్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ భారాలపై రాజీలేని పోరు
* 22న సబ్ కలెక్టరేట్ ముట్టడి
* సిపిఐ నగర కార్యదర్శి శంకర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 31: ప్రస్తుత ఏడాది తాము నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో రాబోయే నూతన సంవత్సరంలో ప్రధానంగా విద్యుత్ భారాలపై రాజీలేని పోరు సాగిస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 22న సబ్ కలెక్టరేట్ ముట్టడికి తమ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోందన్నారు. పాలక వర్గాలు ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా అలుపెరుగని, మడమ తిప్పని పోరాటాలకు ప్రణాళికాబద్ధంగా సిపిఐ సమాయత్తం అవుతోందని ఆయన వివరించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2012లో తాము జరిపిన పోరాటాలను విశే్లషిస్తూ దేశంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అంతమొందించాలనే లక్ష్యంతో ‘అవినీతిపై ఎరద్రండు సమరం’ నినాదంతో ఈ ఏడాది అంతంలో ముందెన్నడూ లేనివిధంగా వేలాది మంది రెడ్‌షర్ట్ వలంటీర్లు, ఎర్రచీరల మహిళలతో ప్రతిష్టాత్మకమైన రీతిలో నగరంలో మార్చ్‌పాస్ట్ నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు కూడా సవాల్ విసిరామన్నారు. ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు, పాల ధర, ఆర్టీసీ చార్జీలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు, భానునగర్‌లో పేదల ఇళ్లు తొలగింపు వంటి అనేక అంశాలపై ధర్నాలు, ప్రదర్శనలు, బంద్‌లు నిర్వహించామని ఆయన వివరించారు. విలేఖర్ల సమావేశంలో పల్లా సూర్యారావు, జి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యక్ష పోరాటాలు
* జాప్యం వల్ల 2వేల 50కోట్ల నిధులు కోల్పోయిన గ్రామ పంచాయతీలు
* పంచాయతీ సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 31: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇక రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలతో ప్రత్యక్షపోరు సాగించనున్నామని ఎపి పంచాయతీ సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనమడలి సభ్యుడు వైవిబి రాజేంద్రప్రసాద్ చెప్పారు. దేశంలో నిర్ణీతకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. ప్రస్తుత పాలకులు రాజీవ్‌గాంధీని తమ నేతగా నేటికీ చాటిచెప్పుకుంటున్నారు. అలాంటిది రాజీవ్‌గాంధీ లక్ష్యాలు ఆశయ సిద్ధికి ఎందుకు తూట్లు పొడుస్తున్నారని ఆవేశంతో ప్రశ్నించారు. ఎపి పంచాయతీ సర్పంచ్‌ల సంఘం ముద్రించిన 2013 డైరీని సోమవారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మాజీ సర్పంచ్‌లు హాజరయ్యారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 72శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారని, అయితే గడచిన రెండేళ్లుగా ఎన్నికలు లేక ఏదైనా సమస్యవస్తే ఎవరికీ చెప్పుకునే దిక్కులేక తల్లడిల్లిపోతున్నారన్నారు. పేరుకు అధికారుల పాలనేకాని గ్రామాలవైపు కనె్నత్తి చూసే నాథుడు లేడన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి వౌలిక సదుపాయాల గురించి పట్టించుకునేవారు లేకుండా పోయారన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ‘అమ్మ పెట్టనూ పెట్టదు.. అడుక్కోనివ్వదు..’ గ్రామాలకు ఈ ప్రభుత్వం ఎటూ నిధులు ఇవ్వటం లేదు. సకాలంలో ఎన్నికలు జరపకపోవటం వల్ల రాష్ట్రంలోని 22వేల గ్రామ పంచాయతీలు కేంద్రం నుంచి రావాల్సిన రూ.2వేల 50కోట్ల నిధులను కోల్పోవాల్సి వచ్చిందంటూ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రభుత్వం ఎన్నికలు జరుపటానికి భయపడుతున్నదన్నారు. దీనివల్ల గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయన్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ వెల్ది శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామ కార్యదర్శి జ్ఞానశేఖర్, రాష్ట్ర గౌరవ సలహాదారు వీరంకి వెంకట గురుమూర్తి, జిల్లా గౌరవ సలహాదారు మురారి పాల్గొన్నారు.
కృష్ణా వర్సిటీ వెయిట్, పవర్ లిఫ్టింగ్..
స్ట్రాంగ్ ఉమెన్‌గా సిద్ధార్థ లిఫ్టర్లు
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 31: కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు బంగారు పతకాలు సాధించి స్ట్రాంగ్ ఉమెన్‌గా ఎంపికయ్యారు. గుడివాడలోని ఎఎన్‌ఆర్ కళాశాలలో జరిగిన ఈ టోర్నీలో పవర్ లిఫ్టింగ్‌లో ఎస్‌కె నాగీనా 63కేజీల విభాగంలో బంగారు పతకం, వెయిట్ లిఫ్టింగ్‌లో జె.పల్లవి 75 కేజీల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకొని స్ట్రాంగ్ ఉమెన్‌గా ఎంపికయ్యారు. వీరు ఉదయ్‌పూర్‌లో జరుగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో కృష్ణావిశ్వవిద్యాలయం జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విజేతలను సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, పి.లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.విజయలక్ష్మి, వ్యాయామ విద్య సంచాలకులు డాక్టర్ జి.వనజాకుమారి, కళాశాల స్పోర్ట్స్ కమిటీ, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు అభినందించారు.
భక్తుల హృదయాల్లో..
నూతనత్వం ప్రతిబింబించాలి
* బిషప్ గోవిందు జోజి
* సెయింట్ పాల్స్‌లో వైభవంగా న్యూ ఇయర్ వేడుకలు
పటమట, డిసెంబర్ 31: పటమటలోని నిర్మలా కానె్వంట్ పక్కన సెయింట్ పాల్స్ కథెడ్రల్‌లో సోమవారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. విజయవాడ (కృష్ణా జిల్లా) కతోలిక పీఠం అపోస్థలిక పాలనాధికారి బిషప్ గోవిందు జోజి సెయింట్ పాల్స్ కథెడ్రల్ విచారణ కర్తలు ఫాదర్ పిజె స్టీఫెన్ నూతన సంవత్సర వేడుకలను ప్రారంభించారు. అనంతరం సెయింట్ పాల్స్ కథెడ్రల్ (చర్చి)లో బిషప్ గోవిందు జోజి, ఫాదర్ పిజె స్టీఫెన్, సహాయ గురువు ఫాదర్ దేవకుమార్, ఫాదర్ విజయ్, ఫాదర్ క్రీస్తురాజు, తదితర గురువులు గడచిన సంవత్సరానికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ సమష్టి దివ్యపూజ బలిని సమర్పించారు. ఈసందర్భంగా బిషప్ గోవిందు జోజి క్రిస్మస్ సందేశమిస్తూ గత సంవత్సరం దేవుడు మనకు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలపాలని భక్తులకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం అంటే ప్రతిఒక్కరిలో హృదయంలో నూతనత్వం రావాలన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతిఒక్కరూ కరుణ, శాంతి, సమాధానం, సహోదరి ప్రేమతో జీవించాలన్నారు. అంతకుముందు అర్ధరాత్రి 12గంటలు దాటిన మరుక్షణం భక్తులు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొవ్వొత్తులు వెలిగించి న్యూ ఇయర్ గీతాలు ఆలపించారు. క్రిస్మస్ వేడుకలు క్రీస్తు జననం కాగా, న్యూ ఇయర్ వేడుకల రోజున క్రీస్తుకు బాలయేసు అని నామకరణం చేస్తారు కనుక నూతన సంవత్సరానికి కూడా క్రైస్తవులు అంతే ప్రాధాన్యతనిచ్చి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. బిషప్ గోవిందు జోజి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభానికి ముందు భక్తులు సెయింట్ పాల్స్ కథెడ్రల్‌లో దివ్యసత్ప్రసాద ఆరాధనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బిషప్ గోవిందు జోజి, ఫాదర్ స్టీఫెన్, తదితర గురువులు న్యూ ఇయర్ కేక్‌ను కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
పాల ఉత్పత్తిదారులకు శుభవార్త
* లీటరుకు 2రూపాయల బోనస్
పాయకాపురం, డిసెంబర్ 31: కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గం సోమవారంనాడు జరిపిన సమావేశంలో 2013 నూతన సంవత్సర శుభాకాంక్షల్ని ఉత్పత్తిదారులకు తెలియజేయడంతోపాటు ఒక ప్రత్యేకమైన కానుకను అందజేయడానికి తీర్మానించి