గుంటూరు, డిసెంబర్ 31: కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరానికి అత్యంత భారంగా బరువెక్కిన హృదయాల్లో స్వాగతం పలుకుతోంది జిల్లాప్రజానీకం. కారణాలేవైనా గత మజిలీ అత్యంత గడ్డుపరిస్థితుల నడుమ సాగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాత కన్నీటి నుంచి నేటితరం కీచకుల ఢిల్లీ అమానవీయ ఘటన వరకు 2012 ఏరకంగా చూసినా చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. కొత్తసంవత్సరం కోసం మనమంతా ఆర్తిగా, ఆనందంతో ఎదురుచూస్తుంటే మనపక్కనే ఉన్న జిజిహెచ్‌లో మూడురోజుల పసికందు మాయమైంది. రాజకీయనేతలకు సైతం ఇదివరకెన్నడూ చవిచూడని చిత్రవిచిత్రాలనే చూపించింది 2012. కేవలం తెలుగుదేశం పార్టీలోనేగాక జిల్లా ప్రజానీకం యావత్తు పల్నాటిపులిగా పిలుచుకునే టిడిపి అధికార ప్రతినిధి, ఒకప్పటి రాష్ట్ర పోలీసుబాస్ (హోంమంత్రి) డాక్టర్ కోడెల శివప్రసాద్ సాధారణ పోలీసు కానిస్టేబుళ్ల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. రాష్ట్ర డిజిపి, ఐపిఎస్ అధికారుల చేత సలాం కొట్టించుకున్న నేత... అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మామూలు కానిస్టేబుళ్ల చేతుల్లో లాఠీదెబ్బలు తినడం నిజంగా విధివైపరీత్యమే. కొత్తగా ఆవిర్భవించిన బుడిబుడినడకల వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మాత్రం 2012 తీపిగుర్తులనే మిగిల్చింది. ప్రత్తిపాడు, మాచర్ల అసెంబ్లీ ఉపఎన్నికల్లో జాతీయపార్టీ, పచ్చపార్టీలను తుత్తునియలుచేసి భారీమెజారిటీతో విజయబావుటా ఎగురవేసింది. ఇక కాంగ్రెస్‌పార్టీ విషయానికొస్తే గతం, వర్తమానం... ఎటుచూసినా గడ్డుపరిస్థితులే దర్శనమిస్తున్నాయి. చేతిలో అధికారం ఉందన్న పేరేగానీ ఆ పార్టీ సాధారణ కార్యకర్త నుంచి మంత్రుల వరకూ ఏ ఒక్కరూ ఒక్కరోజన్నా ప్రశాంతంగా నిద్రపోయిన దాఖలాలు లేవు. జిల్లారాజకీయాల్లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టి రాష్టస్థ్రాయిలో ఒక వెలుగువెలిగిన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాన్‌పిక్ పుణ్యమా అని ఉన్నపదవి పోగొట్టుకొని జైలుపాలయ్యారు. ఏడాది చివరిలో మరోమారు రాష్టవ్రిభజన బూచి తెరపైకి వచ్చి అందరిలోనూ అలజడి సృష్టిస్తున్న వేళ... ఢిల్లీ వినువీధిలో మనజిల్లానేత గాదె వెంకటరెడ్డి సమైక్యశంఖారావాన్ని పూరించి అటువంటి పరిస్థితే వస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని పరోక్షంగా అధిష్ఠానానికి సంకేతాలు సైతం ఇచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీనేతలకేగాక అన్నిపార్టీల నేతలకు స్ఫూర్తిగా నిలిచారు. మొత్తమీద ముళ్లబాటలాంటి గత మజిలీ అనుభవాలతో భవిత పూలపాన్పు కావాలని కలలుగంటూ... భయంభయంగా 2013కి సాదరంగా స్వాగతం పలుకుతోంది జిల్లాప్రజ.
రాష్ట్ర ప్రజలకు మంత్రి కాసు శుభాకాంక్షలు
నరసరావుపేట, డిసెంబర్ 31: రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో గడపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి కాసు సోమవారం పేర్కొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి సహజీవనం చేయాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జనవరి ఒకటోతేదీన మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన అధికార ప్రతినిధి దుర్గాబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.
మాజీ మంత్రి గాదెకు ఘన స్వాగతం
బాపట్ల, డిసెంబర్ 31: అఖిలపక్ష సమావేశంలో సమైక్య వాదాన్ని బలంగా వినిపించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి సోమవారం ఘనస్వాగతం లభించింది. తొలుత బాపట్ల శివారు నుండి పట్టణ కేంద్రం వరకూ మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ నాయకులు జికె నాయుడు, మధుసూధనరెడ్డి, వైఎస్ అంకిరెడ్డి, ఎజిపి టి భాస్కరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం గోపికృష్ణ, చింతా కిషోర్, ధోనేపూడి ప్రసన్న, చందోలు మార్కెట్‌యార్డు చైర్మన్ నర్సరాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు గిరిజారాణి, నాగేశ్వరరెడ్డి, రవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి,సుబ్బారావు, సాలేహు తదితరులు ఉన్నారు.
ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
ప మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, డిసెంబర్ 31: నగరంలోని శంకర్‌విలాస్ బ్రిడ్జిపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో రైల్వే, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి శాఖ అధికారులతో మంత్రి కన్నా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదనల ఆధారంగా సాధ్యాసాధ్యాలను బట్టి త్వరలో నిర్మాణ పనులను చేపడతామన్నారు. పట్ట్భాపురం వంతెనను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నగరంలో రద్దీగా ఉండే శంకర్‌విలాస్ సెంటర్ తర్వాత బ్రాడీపేట 14వ అడ్డరోడ్డు రైల్వేగేటువద్ద కూడా వంతెన నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శంకుస్థాపన చేసిన కంకరగుంట వంతెన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గతంలో సిఎం శంకుస్థాపన చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్, రైల్వే డిఆర్‌ఎం ఎన్‌కె ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ కె సుధాకర్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాధాకృష్ణ, ఆర్‌డిఒ వెంకటరమణ, ఆర్‌అండ్‌బి ఇఇ సతీష్, తహశీల్దార్ రజనీకుమారి తదితరు లు పాల్గొన్నారు.
‘తెలంగాణ’పై నిస్సహాయురాలిని
ప నన్నపనేని రాజకుమారి
గుంటూరు, డిసెంబర్ 31: తెలంగాణ అంశంపై పార్టీ నిర్ణయానికి తాను వ్యతిరేకంగా మాట్లాడలేనని, సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ తన అభిప్రాయం చెప్పే విషయంలో నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పారు. నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి సమైక్యవాదంపై తమ అభిప్రాయాన్ని తెలపడం తప్పుకాదన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలంగాణ అంశంపై ఆమె ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌డిఐపై వ్యతిరేకంగా పార్లమెంటులో ఓట్లు వేయని ఎంపిలు చంద్రబాబు పక్కనే తిరుగుతున్నా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తాము చేసే వ్యాఖ్యలను మాత్రం పార్టీ తప్పుగా భావిస్తోందన్నారు. డబ్బున్న నేతలు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతోందని, నా లాంటి డబ్బు లేని వారు చిన్న విషయం మాట్లాడినా రాద్ధాంతం చేస్తున్నారని వాపోయారు. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని 50 సీట్లు ఇస్తే ఆ పార్టీ 10 సీట్లు మాత్రమే గెలిచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. భారతదేశంలో మహిళలకు రక్షణ కరవైందని, ఢిల్లీ సంఘటన ఒక్కటే వెలుగులోకి వచ్చిందని, ప్రతిరోజూ ఏదోఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన శిక్షలు విధించాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు నల్లపనేని విజయలక్ష్మి, పోతురాజు ఉమాదేవి, చిట్టాబత్తిన చిట్టిబాబు, గడ్డిపాటి రాంబాబు, హనుమంతరావు, లంకా మాధవి తదితరులు పాల్గొన్నారు.
సామాన్యునికి అందుబాటులో హెచ్‌ఆర్‌సి
* 2005 నుండి 39,152 కేసుల నమోదు, 36,535 కేసుల పరిష్కారం * హెచ్‌ఆర్‌సి సభ్యుడు పెదపేరిరెడ్డి
నరసరావుపేట, డిసెంబర్ 31: సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) పనిచేస్తోందని, ఈ ఏడాది హెచ్‌ఆర్‌సికి 12,432్ఫర్యాదులు అందాయని, అందులో 3,425్ఫర్యాదులు నమోదు చేయడం జరిగిందని హెచ్‌ఆర్ కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 25శాతం కేసులను రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. 75శాతం కేసులు తమ పరిధిలోకి రాలేదన్నారు. పోలీసులు బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకోకపోవడం, ఒకవేళ తీసుకున్నా, కేసును రిజిస్టర్ చేయకపోవడం జరుగుతోందని, వాటిపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వ్యక్తులను ఇబ్బందులకు గురిచేస్తే వాటిని కూడా తమపరిధిలోకి తీసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 10నుండి 15కేసుల తీర్పును ఇస్తున్నామన్నారు. తమవద్దకు వచ్చిన ఫిర్యాదులను తీసుకున్నట్లయితే రిజిస్టర్ చేస్తే, అదేరోజూ సాయంత్రం నాలుగు గంటల్లోపు ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రాంతాలవారీగా తెలంగాణా రీజియన్‌లో ఈఏడాది 5681 ఫిర్యాదులు అందగా, అందులో 2081్ఫర్యాదులు నమోదు చేశామన్నారు. రాయలసీమ రీజియన్ నుండి 1620కేసులు వస్తే, అందులో 303 కేసులను నమోదు చేశామన్నారు. కోస్టల్ రీజియన్‌లో 4051కేసులు వస్తే అందులో 678 కేసులను నమోదు చేశామని తెలిపారు. తెలంగాణ రీజియన్‌లో 562 కేసులు రాగా, అందులో 325 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తాను హెచ్‌ఆర్‌సి సభ్యునిగా నియామకం అయిన 2005వ సంవత్సరం నుండి ఈ ఏడాది వరకు 39,152పిటిషన్లు రాగా, అందులో 36,535 పిటిషన్లపై తీర్పునివ్వడం జరిగిందన్నారు. 2010వ సంవత్సరం ఆగస్టు పదోతేదీనుండి ఈ ఏడాది డిసెంబర్ వరకు రెండుసంవత్సరాల కాలంలో 19,590కేసులను పరిష్కరించినట్లు కాకుమాను పెదపేరిరెడ్డి పేర్కొన్నారు. మా పరిధిలోకి వచ్చిన కేసులు 90శాతం సక్సెస్ అయ్యాయని తెలిపారు. సామాన్యునికి అందుబాటులో ఉండేవిధంగా తమ శాఖ పనిచేస్తుందన్నారు. అత్యాచారాలకు సంబంధించిన ఏమైనా కేసులు ఉంటే, వాటిని తక్షణమే స్వీకరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాల్లో అత్యాచార కేసులు ఎక్కువగా వస్తుంటాయని తెలిపారు. వీటిపై సుమోటోగా కేసులను నమోదు చేయడం జరుగు తుందన్నారు.
అత్యాచారాలను నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
మంగళగిరి, డిసెంబర్ 31: స్ర్తిలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ సోమవారం స్థానిక ఆర్‌టిసి బస్‌స్టాండ్ ఎదుట చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంఘం అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, కార్యదర్శి సిపోర మాట్లాడుతూ పాలకవర్గాలు దోపిడీని యధేచ్చగా కొనసాగించడానికి బడా పెట్టుబడిదారులకు కమిషన్ ఏజంట్లుగా మారారని, యువతను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. స్ర్తిలపై యువకులను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. సంస్కృతిని భ్రష్టు పట్టించడం కోసం మద్యం, పబ్‌లు, క్లబ్బులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. క్రాంతికుమార్ (పిడిఎం), సుబ్బారావు (కెఎన్‌పిఎస్), చైతన్య మహిళాసంఘం ప్రతినిధులు జానకి, రాజేశ్వరి, జ్యోతి, మల్లేశ్వరి, మంజు, లక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
అధ్వాన్నంగా మారిన ప్రభుత్వాసుపత్రి
ప ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 31: ప్రభుత్వం జిజిహెచ్‌లో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. పసికందు అపహరణ సంఘటనపై ప్రభుత్వాసుపత్రిని సోమవారం ఆమె సందర్శించి బాధితులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ సిబ్బంది కొరత, నిఘానేత్ర పరికరాలు పనిచేయడం లేదని, రోగులను ఒకే మంచానికి ఇద్దరు చొప్పున వేయడం దారుణమన్నారు. ఆసుపత్రికి కావాల్సిన పరికరాల కల్పనకై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను కలుపుకుని సిఎంకు సమస్య తీర్చాల్సిన ఆవశ్యకతను గట్టిగా తెలియజేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వాసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
మహిళా రక్షణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలి
ప బాధిత విద్యార్థిని మృతికి అవగాహన నివాళి
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 31: మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రవేశపెట్టిన చట్టాలను ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలని అవగాహన సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్భయ మృతికి సంతాప సూచికంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ పోలీసుల వైఫల్యం వలనే మహిళలపై దేశంలో దాడులు అధికమయ్యాయన్నారు. అత్యాచారాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా మహిళలు ఉద్య మించాలన్నారు. వావిలాల సంస్థ కార్యదర్శి వావిలాల లీలామహేశ్వరి మాట్లాడుతూ బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలవాలన్నారు. సమాజంలో నానాటికీ నైతిక విలువలు దిగజారుతున్నందునే అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. అవగాహన సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలోనూ, నిర్దిష్టకాలంలో శిక్షలు విధించడంలోనూ, చట్టాలను సక్రమంగా అమలు చేయని అధికారులను కూడా కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఇంజనీర్ సాంబశివరావు, అవగాహన సంస్థ సహాయ కార్యదర్శి అచ్యుత ఇందుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మోసపూరిత విధానాలపై సమరం
ప సిపిఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 31: ప్రజా ప్రయోజనాలను విస్మరించి నయవంచక పథకాలను అమాయక ప్రజలపై కుమ్మరించి, రాజకీయ లబ్ధికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలపై సమరభేరి మోగించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడో వినియోగించుకున్న విద్యుత్‌కు సర్‌చార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారని, రాష్ట్రప్రభుత్వ అడ్డగోలు విధానాలను సహించేది లేదన్నారు. అన్ని వర్గాల వారికి ప్రజాపంపిణీ ద్వారా సరఫరా చేస్తున్న విధంగానే 35 కేజీల బియ్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం వలనే ప్రజలపై సర్‌చార్జీల మోత పడుతుందన్నారు. నగదు బదిలీ పథకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర నాయకులు జివి కృష్ణారావు, సిపిఐ నగర కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు కోట మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, సిఐటియు నాయకులు డి లెనిన్, కాకుమాను నాగేశ్వరరావు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఉనికి కోసమే ఉద్యమాలు
ప డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 31: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన తెలుగుదేశం పార్టీ అధికారం నుండి దూరమై, కేవలం ఉనికి కాపాడుకునేందుకే ఉద్యమాలు చేస్తోందని డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు విమర్శించారు. సోమవారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోందని, దీన్ని ఓర్వలేకే టిడిపి నాయకులు నిందారోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మీకోసం పాదయాత్ర తన ఉనికిని కాపాడుకునేందుకే తప్ప ప్రజా సంక్షేమం కోరి కాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, జెల్ది రాజమోహన్, మంత్రి సుగుణ తదితరులు పాల్గొన్నారు.
కళకళలాడిన దుకాణాలు
గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 31: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం నగరంలోని ప్రజానీకం రెట్టించిన ఉత్సాహంతో వస్త్ర, వ్యాపార, స్వీట్స్ షాపులకు తరలిరావడంతో సందడి సంతరించుకుంది. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వినియోగించే కేక్‌లు, స్వీట్లను కొనుగోలు చేయడానికి ఆయా దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ధరలు రెట్టింపైనప్పటికీ వస్త్ర దుకాణాలు కళకళలాడాయి. పూజకు వినియోగించే గులాబి, చేమంతి, సన్నజాజి, కనకాంబరం, బంతి, సెంటుమల్లె, మల్లె, విరజాజి పూలకు గిరాకీ ఏర్పడింది.
చర్చిలలో విశేష ప్రార్థనలు
పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం సోమవారం నగరంలోని వివిధ డివిజన్లలో గల 70కు పైగా క్రైస్తవ ఆరాధనా మందిరాలు, చర్చిలలో సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు విశేష ప్రార్థనలు జరిగాయి. లాడ్జిసెంటర్‌లోని పరిశుద్ధ మత్తయి ఉత్తర గురుమండలం చర్చిలో పాత సంవత్సర వీడ్కోలు ఆరాధన సంఘకాపరులు రైట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ ఏలియా, రెవరెండ్ ఎన్ విలియం కేరి, రెవరెండ్ సిహెచ్ స్టీవెన్ సన్‌బాబు, రెవరెండ్ వి ఆడం ఆధ్వర్యంలో నిర్వహించారు. రోమన్ క్యాథలిక్ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ గాలిబాలి, పలువురు ఫాదర్లు ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు.
గత ఏడాది సమస్యాత్మక సంవత్సరం
* మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు
నరసరావుపేట, డిసెంబర్ 31: మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావురాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2012వ సంవత్సరం చాలా సమస్యాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో సర్వజనుల సమ్మె నుండి విద్యుత్ సంక్షోభం, వ్యాధులు, రైతులు ఎరువుల ధరలు పెరిగి వ్యవసాయం చేయలేకపోవడం, అతివృష్టి, అనావృష్టి, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం తదితర సమస్యలతో రాష్ట్రప్రభుత్వం కోమాదశలోకి వెళ్లిందని విమర్శించారు. శాంతిభద్రతల విషయానికొస్తే, మానభంగాలు, ప్రేమోన్మాదుల దాడులు, హత్యలు, అరాచకాలతో రాష్ట్రం అట్టుడికిపోయిందన్నారు. సమస్యలను అరికట్టలేని యంత్రాంగం ప్రజాందోళన చేస్తున్న వారిపై దౌర్జన్యం చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని సహకార సంఘాల ఎన్నికల పేరుతో ఆది నుండి ఇప్పటివరకు అన్ని అక్రమాలే చోటుచేసుకున్నాయని విమర్శించారు. రాష్ట్ర సహకార శాఖామంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి హైదరాబాదులో ఏర్పాటుచేసిన అర్బన్ సహకార సంఘాల ఫెడరేషన్‌లో పరోక్షంగా మాట్లాడుతూ చట్టాలు తెలియవా అని తనను ప్రశ్నించినట్లు కోడెల చెప్పారు. ఎన్నికల అక్రమాలకు మంత్రి ఎందుకు పాల్పడ్డారు, అధికారులపై ఎందుకు వత్తిడి తెచ్చాడో సమాధానం చెప్పాలన్నారు. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిపై ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి కాసును తొలిగించే ధైర్యం లేదన్నారు. ఉన్న మంత్రివర్గంలో అందరూ కాసులాంటి వారేనని విమర్శించారు. ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలని కోడెల మంత్రి కాసుకు సవాల్ విసిరారు. తన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తే ఖబడ్డార్ అన్నారు. మంత్రి అసమర్థతపై ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వం దిగొచ్చి క్షమాపణ చెప్పాలని కోడెల డిమాండ్ చేశారు. డిఎస్పీ వెంకటరామిరెడ్డిని వదిలిపెట్టే ప్రశే్నలేదని స్పష్టం చేశారు.
మాజీ హోంమత్రి అయిన తనను అవమానించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. 2013వ సంవత్సరంలో సమూలమైన మార్పులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కోడెల తెలిపారు. సమైక్యవాదంపై తనకన్నా ఎవరూ ఎక్కువ ఏమీ చేయలేదని కోడెల అన్నారు. తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణపార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రియాదవ్, పంగులూరి ఆంజనేయచౌదరి, రావెళ్ళ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామి సన్నిధిలో స్పీకర్
తెనాలి, డిసెంబర్ 31: ప్రజలంతా నూతన సంవత్సరంలో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో పాడి పంటలతో తులతూగాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి తెనాలి చేరుకున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ పలు చోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని న్యూ ఇయర్ కేలండర్లు ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా స్థానిక గోవర్ధన స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయంలోను, వేణుగోపాల స్వామి ఆలయంలోను ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదస్వస్తితో ఆశీర్వచన మందించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్యశశిధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ యు జానకీరామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ బి బాలస్వామి తదితరులు ఉన్నారు.
ఘట్టమనేని కృష్ణ బిఇడి కళాశాల
కరస్పాండెంట్ పెమ్మసాని అస్తమయం
తెనాలి, డిసెంబర్ 31: సుదీర్ఘ జీవిత కాలంలో పాకిస్తాన్ యుద్ధంలో సైనికుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడుగా, ఘట్టమనేని బిఇడి కళాశాల కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్న పెమ్మసాని సాంబశివరావు(63) స్వగ్రామమైన బుర్రిపాలెంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంలో ఆనారోగ్యసమస్యతో వైద్యసేవలు పొందుతున్న సాంబశివరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చంద్రశేఖర్ వైద్యవృత్తిలో స్థిరపడగా, రవిశంకర్ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. సాంబశివరావు మృతి వార్త తెలియడంతో తెలుగు దేశం పార్టీలోని వివిధ స్థాయి నాయకులు సాంబశివరావు భౌతిక కాయాన్ని సందర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, ఎఎస్‌ఎన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ అన్నాబత్తుని శివకుమార్, విఎస్‌ఆర్ అండ్ ఎన్ విఆర్ కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, మాజీ చైర్మన్ యడ్ల గంగాధర్రావు, తదితర ప్రముఖులు పెమ్మసానికి నివాళి అర్పించారు. మంగళవారం అత్యక్రియలు నిర్వహించ నున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ విడుదల కోసం కోటి సంతకాల సేకరణ
బాపట్ల, డిసెంబర్ 31: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బాపట్లలో ముమ్మరంగా కొనసాగుతున్నది. సోమవారం పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కోన రఘుపతి నేతృత్వంలో గడప గడపకు పర్యటించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ ప్రజాభిమానం పుష్కలంగా ఉన్న జగన్‌కు నూతన సంవత్సరంలో తప్పకుండా బెయిల్ లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల
అధికారులతో 9న సమీక్ష
గుంటూరు, డిసెంబర్ 31: జిల్లా వ్యాప్తంగా జరగనున్న పంచాయితీ ఎన్నికలకు నియమించిన అధికారులతో జనవరి 9వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరం నుండి వివిధ మండలాల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో పంచాయితీ ఎన్నికల అధికారులకు జనవరి 5వ తేదీన ఆర్‌డిఒ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్లు శాంతి భద్రతలు, నామినేషన్ ప్రక్రియ వంటి అంశాలపై చర్చించిన వివరాలను 8వ తేదీలోగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ పరిశీలనకు సంబంధించిన వివరాలను ఈనెల 4వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. 9,10 తరగతుల విద్యార్థులకు సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి బ్యాంకుల ఖాతాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. ఖాతాలు లేనివారికి తహశీల్దార్ కార్యాలయాలతో పాటు సమీప బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ను సంప్రదించి ఖాతాలు తెరిచేలా చూసి కార్యక్రమం 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి 29వ తేదీ నాటికి పూర్తి చేయడం పట్ల కలెక్టర్ అభినందనలు తెలిపారు. మార్పులు, చేర్పులు, అభ్యర్థనలపై విచారణ చేపట్టాలన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు జెసి కె శారదాదేవి, డిఆర్‌ఒ నాగబాబు, జడ్పీ సిఇఒ జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.