Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నూతన సంవత్సరంలోనైనా అభివృద్ధి పరుగులు తీసేనా?

$
0
0

ఒంగోలు, డిసెంబర్ 31: జిల్లా ప్రజలు 2012 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2012లో జిల్లాలో జరిగిన అభివృద్ధి నామమాత్రమేనని చెప్పవచ్చు. ఆ సంవత్సరంలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సయోధ్య లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నూతన సంవత్సరంలోనైనా వారిద్దరూ సయోధ్యగా వ్యవహరించి జిల్లా అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేక పాతపాటే పాడతారా అన్న చర్చ సాగుతోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి కందుకూరు నియోజకవర్గానికి పరిమితవౌతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సంవత్సరంలోనైనా జిల్లా అభివృద్ధిపై దృష్టిసారిస్తారా అని ప్రజలు కొత్త ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో జలయజ్ఞం ద్వారా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు, రామతీర్ధం రిజర్వాయర్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. 2012 సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్మాణం ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం మేరకు పూర్తయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జాతికి అంకితం చేసినప్పటికి ఆ ఫలాలు రైతులకు అందలేదు. దీన్నిబట్టిచూస్తే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం ఏమేరకు ఉందో అర్ధవౌతుంది. అదేవిధంగా రామతీర్ధం రిజర్వాయరు నిర్మాణం పూర్తయినప్పటికి ఆయకట్టు పరిధిలోని రైతులకు సక్రమంగా నీరు అందటంలేదు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ కోతలతో గత సంవత్సరం తల్లడిల్లారు. అదేవిధంగా ఇంధన సర్‌చార్జీ పేరుతో విద్యుత్ బిల్లులను ట్రాన్స్‌కో అధికారులు వసూలు చేపట్టారు. పరిశ్రమల ప్రగతి కుంటుపడింది. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధి జరగలేదు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత సంవత్సరం నీలం తుపాను కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. వారిని ఆదుకునేందుకు జిల్లాయంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించింది. కాని ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ప్రజలు ఫ్లోరిన్ నీటిని తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. జిల్లాకు మంజూరైన వాన్‌పిక్ సిటీ మాత్రం కనుచూపు మేరలో వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. కాగా మంత్రి మహీధర్‌రెడ్డి కృషితో జిల్లాకు రామాయపట్నం పోర్టు మాత్రం మంజూరైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగర ప్రజలకు సక్రమంగా మంచినీరు అందటం లేదు. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు నగరానికి డంపింగ్ యార్డు సమస్య తలనొప్పిగా మారింది. ఈ సమస్య తీరకపోవటంతో చెత్తను రహదారులపై పారవేస్తూ ప్రజల జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు. నూతన సంవత్సరంలోనైనా జిల్లా ప్రగతిపథంలో నడిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం కృషి
ఎంపి రాయపాటి స్పష్టం
మద్దిపాడు, డిసెంబర్ 31: కేంద్రం నుండి నిధులు తెప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు తెలిపారు. మద్దిపాడు పప్పు శ్రీనివాసరావు హోటల్ వద్ద సోమవారం ఆయన కొద్దిసేపు ఆగిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. నీటి ఎద్దడిని నివారించడానికి అదనంగా నిధులను మంజూరు చేసి మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పూర్తిచేస్తుందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విషయాన్ని విలేఖర్లు ప్రస్తావించగా సిబిఐ ఆ వ్యవహారాన్ని చూస్తోందన్నారు. తెలంగాణా విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాగా కేంద్ర అధిష్ఠానం వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులతో చర్చలు కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్లు పూర్ణ, పార్టీ నాయకులు బోయపాటి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బాలుడి మృతికేసులో వీడిన మిస్టరీ
కందుకూరు, డిసెంబర్ 31: వలేటివారిపాలెం మండల పరిధిలోని బడేవారిపాలెం గ్రామ సమీపంలో వ్యవసాయ బావిలో ఈనెల 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గ్రామానికి చెందిన చుండూరి గణేష్ అనే బాలుడి మృతికేసులో మిస్టరీని ఛేదించినట్లు నిందితులుగా భావించబడుతున్న పొడపాటి సుశీల, నల్లూరి యానాదిని అరెస్ట్‌చేసినట్లు డిఎస్పీ ఎన్ అశోక్‌కుమార్ తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో డిఎస్పీ బాలుడి మృతికేసు వివరాలను తెలిపారు. ఈసందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నిందితులుగా భావించబడుతున్న సుశీల, యానాదికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈక్రమంలో ఈనెల 23న సుశీల తన ప్రియుడిని కలిసేందుకు పంట పొలాలకు వెళుతుండగా బాలుడు సుశీల వెంబడి వెళ్లాడని తెలిపారు. ఈక్రమంలో సుశీల, యానాది సన్నిహితంగా ఉన్న సన్నివేశాన్ని బాలుడు గమనించినట్లు, బాలుడు గమనించిన వైనాన్ని గుర్తించిన సుశీల, యానాది బాలుడిని తుదముట్టించినట్లు తెలిపారు. ఈక్రమంలో తమ నేరం వెలుగులోకి రాకుండా ఉండేందుకు బాలుడి మృతదేహాన్ని వ్యవసాయ బావిలో వేసినట్లు ఆయన తెలిపారు. ఈకేసులో ఏడు రోజులలోనే మిస్టరీని ఛేదించిన సిఐ అక్కేశ్వరరావు, రూరల్ ఎస్సై శివకుమార్‌లను డిఎస్పీ అభినందించారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా జనవరి 13వ తేది వరకు రిమాండ్ విధించారు.

నూతన సంవత్సరం సందర్భంగా
సందడే సందడి!
కళకళలాడిన దుకాణాలు
చీరాల, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా చీరాల రోడ్లన్నీ జనంతో రద్దీగా మారాయి. మిఠాయిలు, నూతన వస్త్రాల కొనుగోలుదారులతో షాపులు కళకళలాడాయి. నూతన సంవత్సరం జరుపుకునే వారిని ఆకర్షించేందుకు వివిధ దుకాణదారులు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించి ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ప్రధాన వీధులలో తమతమ మిత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకునేందుకు యువకులు చేరటంతో రోడ్లన్ని జనంతో నిండిపోయాయి. బేకరీల వద్ద ఎగబడి జనం కేక్‌లు కొనుగోలు చేశారు. అదేవిధంగా బొకేల షాపులు, బెలూన్ షాపుల వద్ద జనం రద్దీ ఎక్కువగా కన్పించింది. రంగు రంగుల కేక్‌లతో పలు బేకరి నిర్వాహకులు తమ తమ పరిధిలో ప్రజలను ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా పండ్లు దుకాణాలు, పూలకొట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకునేందుకు పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చారు. కొనుగోలుదారులతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినప్పటికీ పోలీసు వారు కూడా ప్రేక్షకపాత్ర వహించారు.
నూతన సంవత్సరానికి అట్టహాసంగా ఏర్పాట్లు
పర్చూరు: మండలంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకటానికి సోమవారం కొంతమంది అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మండల కేంద్రమైన పర్చూరులోని బొమ్మల సెంటర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో రద్దీగా మారింది. స్వీట్ షాపులు, బేకరీలు జనాలతో కిటకిటలాడాయి. తమ బంధువులు, మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపటానికి స్వీట్లు, పండ్లు, పూలబొకేలు కొనుగోలు చేశారు. స్వీట్ షాపుల వారు ప్రత్యేకంగా టెంట్‌లు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించి అమ్మకాలకు వివిధ రకాల స్వీట్లు సిద్ధం చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటానికి విద్యార్థులు తరగతి గదులను రంగు కాగితాలతో అలంకరించారు. కన్పించిన మిత్రులను పలకరిస్తూ ముందస్తుగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
‘దళితుల సమస్యలు పరిష్కరించాలి’
మద్దిపాడు, డిసెంబర్ 31: మండలంలోని అన్నంగి, కొలచనకోటలో అర్హులైన ఎస్టీలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని సిఐటియు ఒంగోలు డివిజన్ కార్యదర్శి కాలం సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్దిపాడు రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గంటసేపు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ గుండ్లకమ్మ ఒడ్డున ఉన్న అన్నంగికి ఇప్పటికి కూడా మంచినీటి సమస్య తీరలేదన్నారు. గుండ్లకమ్మ ముంపు కాలనీవాసులకు శ్మశాన స్థలాలను కేటాయించే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని మండిపడ్డారు. గుండ్లాపల్లి, వెల్లంపల్లి తదితరచోట్ల దళితులకు మంచినీటి వసతి, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, రేషన్‌కార్డులు తదితర వౌలిక సదుపాయాలు లేక పలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ మండల నాయకులు ఉబ్బా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో దళితుల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ జి నాగభూషణాన్ని కలిసి వివిధ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి కోటిరెడ్డి జడ్సన్, దళిత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి రహదారి భద్రతా వారోత్సవాలు
ఒంగోలు, డిసెంబర్ 31: ఈనెల 1 నుండి 7వ తేది వరకు 24వ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ప్రాంతీయ రవాణాశాఖాధికారి పి కృష్ణ మోహన్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాలను చిరకాలం జీవించండి, మద్యం సేవించి వాహనం నడపకండి అన్న ముఖ్య నినాదంతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వారోత్సవాలలో రహదారి భద్రత గురించి ప్రజలందరికి, డ్రైవర్లు, పాదచారులు, సైకిల్ నడిపే వారికి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రైవర్లకు ఆరోగ్య కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటోలు, లారీలు, స్కూల్ బస్సుల డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు ఇస్తామన్నారు. రహదారి భద్రతపై వీధి నాటకాలు, బుర్రకథల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. ఈ వారోత్సవాలలో ప్రత్యేక స్కూల్ బస్సుల కండీషన్ తనిఖీ చేస్తామన్నారు. హెల్మెట్ వాడని ద్విచక్ర వాహనచోదకులను తనిఖీ చేస్తామని తెలిపారు.

‘కాలనీల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలి’
ఒంగోలు, డిసెంబర్ 31: ఒంగోలు నగరంలోని కాలనీల్లో రోడ్లు, సైడు కాలువలు, మంచీనీరు, వీధిలైట్లు, పారిశుధ్యం తదితర వౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సిపిఎం ఒంగోలు నగర కమిటి ఆధ్వర్యంలో ఒంగోలు కార్పోరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ కాలనీల నుండి వచ్చిన పేదలు కార్యాలయం గేటు వద్ద నిలబడి నగరంలోని కాలనీలలో వెంటనే వౌళిక సధుపాయాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ స్థాయి నుండి కార్పోరేషన్ స్థాయికి చేరినప్పటికి కాలనీలలో వౌలిక సదుపాయాల కొరత ప్రజలను వేధిస్తోందన్నారు. నగరంలోని చైతన్య కాలనీ, గుర్రం జాషువా కాలనీ, అశోక్ నగర్, క్రాంతి నగర్‌లకు మంచినీటి పైప్‌లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. 32వ వార్డులో మంచినీటి పైప్ లైన్‌లలో మురికి నీరు వస్తుందన్నారు. కేశవరాజు కుంట, భగత్‌సింగ్ కాలనీలకు మంచినీటి పైప్ లైన్లు ఉన్న నీరు వదలడం లేదని, దీనితో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నాట్లు తెలిపారు. 32వ వార్డు యానాదిసంఘం, శివప్రసాద్ కాలనీ, కొత్తడొంక, గాంధీనగర్, వడ్డివాని కాలనీ, 26వ వార్డు అయ్యన్నరోడ్, 29వ వార్డు హెల్ప్ ఆఫీస్‌రోడ్, అడ్డరోడ్డు, 31వ వార్డు దత్తాత్రేయ కాలనీ, అశోక్‌నగర్, దారావారి కుంట రోడ్డు సైడు కాలువలు వేయాలని డిమాండ్ చేశారు. ఉదయం కాలనీ, కాంతి నగర్, దారావారి కుంట, మున్సిపల్ వర్కర్స్ కాలనీలకు వీధిలైట్లు రిపేరు చేయాలని డిమాండ్ చేశారు. జాషువా కాలనీ గుడిసె వాసులకు ఇంటి పన్ను వేయాలని కోరారు. సమస్యలు నిర్థిష్ట కాలం పరిమితిలో పరిష్కరించకపోతే ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపియం నగర నాయకులు జి రమేష్, దామా శ్రీనివాసులు, రాపూరి శ్రీనివాసరావు, ఎ శ్రీనివాసులు, ఎస్‌డి హుస్సేన్, తంబి శ్రీనివాసులు, కె శ్రీనివాసరావు, కె బాలచంద్రం, డివి రావు, సిహెచ్ రమాదేవి, కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
‘సమాజ సేవలో యువత ముందుండాలి’
ఒంగోలు, డిసెంబర్ 31: సమాజ సేవ యువత ప్రధాన కర్తవ్యమని ఎస్‌ఎస్ ఎన్ విద్యా సంస్థల అధినేత యల్లటూరి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక ఎస్ ఎస్ ఎన్ డిగ్రీ కాళాశాలలో సోమవారం జాతీయ సేవా పథకంలో భాగంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని చైర్మన్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానం సమాజ సేవలో భాగమన్నారు. అందరు నూతన సంవత్సర వేడుకల్లో తలమునకలై ఉంటే ఎస్ ఎస్ ఎన్ విద్యార్థులు రక్తదాన శిభిరంలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ శిభిరం బిలీఫ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ రవి కుమార్, రిమ్స్ బ్లెడ్ బ్యాంక్ నిర్వాహకుల పర్యవేక్షణలో జరిగింది. ఎస్ ఎస్ ఎన్ రెండు యూనిట్ల వాలంటీర్లు, ప్రోగ్రామ్ ఆపీసర్స్ టి రాజేంద్రబాబు, కె రజనీలు, కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

‘చట్టాలపట్ల ప్రజలకు అవగాహన ఉండాలి’
ఒంగోలు, డిసెంబర్ 31: ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రజలు చట్టాల పట్ల మరింత అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి రామ్‌గోపాల్ సోమవారంఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపట్ల యవతరం, మహిళలు తమ నిరసనను తెలియజేస్తున్నారన్నారు. చట్టాలపై జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ నందు జనవరి 2వ తేది సాయంత్రం 4 గంటలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి చక్రాధరరావు, జిల్లా అధనపు న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.

‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం’
సంతనూతలపాడు, డిసెంబర్ 31: నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇండ్ల స్థలాలు, సాగు భూమి ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ళగా ఇళ్ళ స్థలాలు లేక పేదలు అనేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కరెంట్ చార్జీలను విపరీతంగా పెంచి ఆ పైన సర్‌చార్జీల పేరుతో అధిక భారం మోపి పేదవాడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ ఎం గాంధీకి అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నెరసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు శేషారావు, టి ప్రభుదాస్, బంకా సుబ్బారావు, కిలారి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ జోన్ హాకీ విజేత ఎస్‌ఎన్ పాడు
సంతనూతలపాడు, డిసెంబర్ 31: స్థానిక హైస్కూల్ ఆవరణలో సోమవారం జరిగిన సెంట్రల్ జోన్ బాలుర హాకీ ఫైనల్ పోటీలో కందుకూరు, సంతనూతలపాడు హైస్కూల్ విద్యార్థులు తలపడగా సంతనూతలపాడు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. అలాగే బాలికలకు సంబంధించి సెంట్రల్ జోన్ హాకీ ఫైనల్ పోటీలో మద్దిపాడు, సంతనూతలపాడు విద్యార్థినిలకు జరిగిన పోటీలో సంతనూతలపాడు హైస్కూల్ విద్యార్థినులు విజేతలుగా నిలిచారు.

జిల్లాలో జోరుగా చర్చ
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>