నెల్లూరు అర్బన్, డిసెంబర్ 31:శాంతిభద్రలు కరవై దొంగతనాలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సోమవారం నాటికి 1400 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని స్థానిక విఆర్‌సిసెంటర్ నుండి గాంధీబొమ్మ, ఏసిసెంటర్ మీదుగా ఎన్‌టిఆర్ విగ్రహం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాకుండా వారి అనుచరులకు కొమ్ముకాస్తూ శాంతిభద్రతలపై దృష్టిపెట్టడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు వారి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఢిల్లీలో ఘోర సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళలు రాత్రిపూట ఎందుకు తిరుగుతున్నారని మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడటం అన్యాయమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ఆదేశించకుండా ఒక మంత్రిగా ఉండి మహిళలను ఉద్దేశించి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జిల్లాలో గొలుసుకట్టులో దాదాపు 400 కోట్ల రూపాయలను మతం పేరుతో ఏడు సంస్థలకు చెందిన వారు ప్రజల నుండి దోచుకున్నారన్నారు. చర్చిలలో ప్రమాణాలు చేయించుకొని క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఉప ఎన్నికలలో గెలిచిన ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు బాధిత ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. గొలుసుకట్టు కేసును పరిష్కరించలేని పోలీసులు కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మాట్లాడుతూ అసమర్థ అవినీతి కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడే కష్టాలను చూసి చలించి స్వయంగా తెలుసుకొనేందుకు చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు. రైతులకు కనీసం రోజుకు 4 గంటలకు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిసెంబర్‌లో కూడా కరెంట్ కోత విధించడం అన్యాయమన్నారు. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 1982లో ఆంధ్రరాష్ట్రం ఎలా ఉందో ప్రస్తుతం అదేవిధంగా ఉందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టుతున్నారన్నారు. నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పార్టీ జెండాలు మోస్తూ పోరాడే కార్యకర్తలే టిడిపికి ప్రాణమన్నారు. అనంతరం ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీమంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె మున్వర్‌బాషా, మాజీ కార్పొరేటర్లు వైవి సుబ్బారావు, ధర్మవరపు సుబ్బారావు, నాయకులు ఉచ్చి భువనేశ్వరప్రసాద్, నూనె మల్లికార్జునయాదవ్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షార్ కీలక విభాగాల్లో తెలుగు తేజాలు
సూళ్లూరుపేట, డిసెంబర్ 31: భాతర అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరికోట) కీలక విభాగాల్లో తెలుగు తేజాలకు పదోన్నతలు లభించాయి. రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్‌గా ఉన్న వి శేషగిరిరావును పదోన్నతిపై షార్ అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పదోన్నతిపై షార్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో శేషగిరిరావును నియమించడమే కాకుండా షార్ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. షార్‌లో శాస్తవ్రేత్తలుగా ఉన్న షార్ డిప్యూటీ డైరెక్టర్‌గా కె ఆదిశేషారెడ్డి, జనరల్ మేనేజర్‌గా ఎస్‌వి సుబ్బారావులను నియమించారు. కృష్ణా జిల్లా కోలవెన్ను గ్రామానికి చెందిన శేషగిరిరావు తొలిసారిగా 1976లో షార్ ఉద్యోగిగా చేరారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్‌లో ఆయన ఆరితేరిన వ్యక్తి. రేంజ్ ఆపరేషన్ డైరెక్టర్‌గా ఉంటూ కార్యాలయం పరిపాలన విభాగాలను కూడా చూస్తుండేవారు. రాకెట్ భూమి నుంచి ఎగిరి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేంత వరకు శాస్తవ్రేత్తలకు సూచనలు ఇస్తూ రాకెట్ గమనం అంతా ఈయన పర్యవేక్షణలోనే జరిగేది. ఈయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 6పిఎస్‌ఎల్‌వి, 3జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు విజయాలు సాధించాయి. చంద్రయాన్ విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈయన సేవలను గుర్తించి అసోసియేట్‌గా డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించడమే కాకుండా షార్ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ ఏడాది షార్‌లో కీలక విభాగాల్లో పదోన్నతలు తెలుగువారికి లభించడం ఇదే మొదటిసారి.
‘సాగునీటి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం’
కావలి, డిసెంబర్ 31: సాగు నీటి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మలిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం ఛేశారు. సోమవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో కావలి కాలువ పరిధిలోని కావలి, జలదంకి, బోగోలు మండలాలకు చెందిన రైతు ప్రతినిధులు, సంఘాల నాయకులతో కలిసి కావలి కాలువ కింద ఆయకట్టు మొత్తానికి సాగునీరు ఇవ్వాలంటూ స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా మలిరెడ్డి మాట్లాడుతూ రైతులంతా పార్టీలకు అతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఓవైపు సాగునీరులేక పంటలు ఎండి రైతులు మంచం పడుతుంటే వారిని పలకరించాల్సిన రాజకీయ పార్టీల నేతలు కారుల్లో తిరుగుతూ విహరిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. పెద్ద చెరువు డైరెక్టర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చివరి దశలో వున్న పొలాలకైనా నీరు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బలిజేపల్లి వెంకటేశ్వర్లు అధికారుల కాకిలెక్కల పట్ల తీవ్ర అభ్యంతరం చెప్పారు. అనంతరం రైతులతో కలిసి ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆర్‌డిఓ మాట్లాడుతూ అందుబాటులో వున్న నీటి వనరులను సద్వినియోగ పరిచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
మాతా శిశు మరణాల నివారణే లక్ష్యం: డిఎంఅండ్‌హెచ్‌వో
గూడూరు, డిసెంబర్ 31: మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తోందని, ఇందులో భాగంగానే మార్పు, రావమ్మా మహాలక్ష్మీ, అమృతహస్తం అనే కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించిందని, ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే ప్రభుత్వ వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల మన్ననలు అందుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాసిలామాణి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన గూడూరు ఐసిఎస్ రోడ్డులోని ఓ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి రికార్డులను, స్కానింగ్ సెంటర్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఆడపిల్లల మరణాలు జిల్లాలో అధికంగా సంభవిస్తున్నాయని, కోనేటి మిట్టలో ఓ పసికందు మృతదేహం లభ్యం కావడం, అది పత్రికల్లో ప్రచురితం కావడంతో దానిపై విచారణ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలిపారు. పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేశామన్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గూడూరులోని ప్రధాన ఆసుపత్రిలోని సిమాంక్ సెంటర్‌కు అన్ని వసతులతో కూడిన వైద్యులను త్వరలో నియమించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారుల మరణాలు సంభవించకుండా చిన్న పిల్లల వైద్యులను వారంలో రెండురోజుల పాటు చూసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలుగోడి గోడు వినేదెవరు?
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 31: తెలుగు ప్రజానీకం గోడు వినే రాజకీయ పార్టీ ఏదీ లేకుండా పోతోందని మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం నెల్లూరులో ఆయన విలేఖర్లతోమాట్లాడుతూ సమైక్యాంధ్రకు అనుకూలంగా తన బాణీ వినిపించారు. తెలంగాణా ప్రాంతం కంటే రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి వసూలవుతున్న పన్నుల మొత్తాలే ఇందుకు నిదర్శనమన్నారు. సీమాంధ్ర నుంచి వసూలయ్యే పన్నుల మొత్తం కేవలం మూడు కోట్లేనన్నారు. అదే కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాల నుంచి 11 కోట్ల రూపాయలు వసూలు అవుతోందన్నారు. ఇదే తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లో 11 కోట్ల రూపాయలు, ఒక్క హైదరాబాద్ నుంచే గరిష్టంగా 29 కోట్ల రూపాయల వరకు వసూలు అవుతున్నాయంటూ వివరించారు. అలాంటప్పుడు ఎంతో కీలకంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లేకుండా రాష్ట్ర విభజన ఎవరికీ ఆమోదయోగ్యంగా ఉండదనే అభిప్రాయం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలుగువారి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఓ ప్రాంతీయ పార్టీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గడం కేంద్ర ప్రభుత్వానికి తగదని హితవుపలికారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ సిఫారసులకు సైతం విరుద్ధంగా వ్యవహరించడం యూపిఏ సర్కార్‌కే చెల్లిందని విమర్శించారు. ప్రాంతీయ విభేదాలు సద్దుమణిగేలా ఈ కమిషన్ చేసిన సిఫారసుల్లో ఆరోదైన యధాతథ స్థితికి కొనసాగించడం సహా తెలంగాణాకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడం ఓ మంచి విధానమన్నారు. అయితే కేంద్ర హోం మంత్రిగా నియమితులైన షిండే శ్రీ కృష్ణ కమిషన్ ఓ ముగిసిన అధ్యాయమంటూ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆరోపించారు. గతంలో పే రివిజన్ కమిషన్‌పై ఏర్పాటైన శ్రీ కృష్ణ కమిషన్ అటు ఉద్యోగుల, ఇటు ప్రభుత్వ మనన్నలు పొందేలా అత్యుత్తమ పరిష్కార మార్గం చూపిందని గుర్తు చేశారు.
న్యూ ఇయర్ వేడుకలకు కలెక్టర్ దూరం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 31: ఢిల్లీలో వైద్య విద్యార్థిని అత్యాచారంతో మృతి చెందిన వైనంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంతో జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ 2013 నూతన సంవత్సర ఆగమన వేడుకలకు దూరం పాటిస్తున్నారు. మంగళవారం వేకువజామునే కలెక్టర్ సతీసమేతంగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోతున్నారని సమాచారం. ఉదయానే్న తనకోసం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే వారంతా ఈ అంశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. మరో ప్రకటనలో జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం కూడా తనను ఎవరూ కలవవద్దని కోరారు. ఇదిలాఉంటే జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా నూతన సంవత్సర వేడుకలకు అందుబాటులో ఉండటం లేదు. స్వతహాగానే ఆనం కుటుంబీకులు తమ రాజకీయ ప్రస్థానంలో జన్మదినోత్సవ, నూతన సంవత్సర ఆగమన వేడుకల్ని స్థానికంగా జరుపుకోవడానికి ఇష్టపడరు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చే వారి సంఖ్యా బాహుళ్యం వేర్వేరుగా ఉండటం, ఈ అంశాన్ని సరిపోల్చుకునేందుకు ఆస్కారం లేకుండా అనాదిగా నూతన సంవత్సర, తమ వ్యక్తిగత జన్మదినోత్సవాలకు సంబంధించి స్థానికంగా అందుబాటులో ఉండరు. హైదరాబాద్‌లోనే ఆ నాలుగురోజులు కాలం గడిపేందుకు మక్కువ చూపుతారు.
డిఎస్సీ నియామక
పత్రాల పంపిణీ పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 31: డిఎస్సీకి ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ పూరె్తైంది. సోమవారం ఎస్‌జిటి అభ్యర్థులు 271 మందికి వీటిని అందజేశారు. రెండురోజుల క్రితమే బిఇడి అసిస్టెంట్లకు వీటిని అందజేశారు. స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో డిఇఓ మువ్వా రామలింగం చేతులమీదుగా నియామక పత్రాలను పంపిణీ చేశారు.
700 బస్తాల స్టీమ్
బియ్యం పట్టివేత
నాయుడుపేట, డిసెంబర్ 31: నాయుడుపేట మండల పరిధిలోని విన్నమాల గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్ద ఉన్న విఎస్‌ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద బియ్యం లోడుతో ఆగి ఉన్న లారీని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు నెల్లూరులోని విజయదుర్గా రైస్ మిల్లు నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల వంతున ఉన్న ఏడువందల బస్తాల స్టీమ్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీలో బియ్యానికి, ఇతర సరకులకు ఎలాంటి బిల్లులేకపోవడంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్థానిక రెవెన్యూ అధికార్లకు అప్పగించారు. వీటి విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని అంచనా.
‘్ఫజు రియంబర్స్‌మెంట్ కల్పించాలి’
ఇందుకూరుపేట, డిసెంబర్ 31: రాష్ట్రంలోని పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ కల్పించాలని బిసి విద్యార్థి రాష్ట్ర కార్యదర్శి లీలా కృష్ణయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా నాలుగు నెలల క్రితం సీప్ పరీక్ష రాసిన పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశాలు పొందిన వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక ధోరణి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంటర్, ఐటిఐ పట్ట్భద్రులై పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వబోమని చెప్పడం చాలా దారుణమన్నారు. కౌనె్సలింగ్ సమయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ రాదని చెప్పకుండా కాలేజి ప్రారంభించిన నాలుగు నెలల తరువాత చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు కాలేజి యాజమాన్యాలకు 18.5వేల రూపాయలు ఫీజు చెల్లించలేక చదువుమానుకోవాల్సి వస్తుందన్నారు. గడువుమీరుతున్నందున వేరే కోర్సుల్లో చేరే అవకాశం లేకపోవడంతో ఈ విద్యాసంవత్సరం వృధా అవుతుందన్నారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు నగర సంఘ అధ్యక్షులు ఎం శ్రీకాంత్‌యాదవ్, కార్యదర్శి గుంజి నరేష్‌వడ్డే, గోకుల కృష్ణ, ఆదిశంకరా పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.