Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గొలుసు దొంగలు ముగ్గురు అరెస్టు

$
0
0

తిరుపతి, డిసెంబర్ 31: బంగారు గొలుసులను లాక్కెళ్లే ముగ్గురు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్‌పి ఎస్వీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. సోమవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ గతంలో నిరక్షరాస్యులు దొంగతనాలు చేసేవారన్నారు. నేడు బాగా చదువుకుని నిరుద్యోగులుగా మారిన వారే చోరీలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పట్టుపడిన ముగ్గురు దొంగల్లో ఎంబిఎ విద్యార్థి వున్నారని తెలిపారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో మహిళల మెడల్లో నుండి ఆభరణాలను లాక్కెళ్లే ముఠా ఆగడాలు రోజురోజుకు శృతిమించడంతో తాను ఆదేశించడంతో ఎఎస్‌పి శ్రీరామ ఉమా మహేశ్వర శర్మ నేతృత్వంలో క్రైమ్ డిఎస్‌పి ఎంవిఎస్ స్వామిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో సిసిఎస్ సిఐ ఓ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్‌పిళ్లైలు తమ సిబ్బందితో నిఘాపెట్టి దొంగను పట్టుకున్నారని చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరుపతి నాలుగుకాళ్ల మండపం వద్ద కావలికి చెందిన మహమ్మద్ జిహార్ (26), విజయవాడకు చెందిన సి నరేంద్ర (21), నెల్లూరుకు చెందిన షేక్ హాసన్ బాషా (20)లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనంతో పాటు 18 లక్షల రూపాయలు విలువ చేసే 586 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధాన ముద్దాయి జహీర్ బెంగుళూరులో ఎంబిఎ చదువుతున్నట్లు గుర్తించామన్నారు. తల్లిదండ్రులు చదువుకోమని ఇచ్చిన 13 లక్షల రూపాయలను జహీర్ జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో సుమారు 10 లక్షల రూపాయలు నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో పాల్గొని పోగొట్టుకున్నట్లు తెలిపారు. అటు తరువాత దిక్కుతెలియని పరిస్థితుల్లో ఇంటి నుండి తెచ్చిన 13 లక్షల రూపాయలను ఎలాగైనా రికవరీ చేయాలని భావించి ఇద్దరు వ్యక్తులను జత చేసుకుని మహిళల మెడల్లో నుండి బంగారు చైన్లను లాకెళ్లే ముఠాగా మారినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ ముఠా సభ్యులు తిరుపతిలో గత నాలుగు నెలల కాలంలో సుమారు 30 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. తిరుపతి అర్బన్, తిరుచానూరు, అలిపిరి, యూనివర్శిటీ, ఎంఆర్‌పల్లి, గాజులమండ్యం, రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, కావలి ప్రాంతాల్లో 10కిపైగా చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. బంగారు చైన్లు, బంగారు గాజులు, సెల్‌ఫోన్లు, మహిళల దగ్గర లాక్కుని చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 22 బంగారు గొలుసులు, 4 బంగారు గాజులు, సెల్‌ఫోన్‌తో పాటు సుమారు 18లక్షల విలువ చేసే సుమారు 586 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని విచారించగా బెంగుళూరులో కాలేజిలో ఎంబిఎ సీటు కొరకు జహీర్ 3 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది. అలాగే మిగిలిన డబ్బులు నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్‌లల్లో పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఎస్‌పి రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎఎస్‌పి ఉమామహేశ్వర్‌శర్మ నేతృత్వంలో క్రైమ్ సిఐ ఎంవిఎస్ స్వామి ఆధ్వర్యంలో సిఐ రామచంద్రారెడ్డి, ఎస్‌ఐలు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌పిళ్ళై, రేంజ్ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్ సిబ్బంది డి శ్రీనివాసులరెడ్డి, రాధాకృష్ణ, జి సుధాకర్, మున్వర్‌బాషా, రామయ్య, మునిరాజా, మురళి, వాసుదేవరావు, గడ్టం రాఘవ, హుసేన్, శ్రీనివాసులు, స్వయం ప్రకాష్, ప్రసాద్, డ్రైవర్లు లక్ష్మీనారాయణ, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో కృషి చేసిన ప్రతి ఒక్కరికి రివార్డులు అందించనున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇంత పెద్ద స్దాయిలో చోరీలను ఛేదించి రికార్డు సృష్టిస్తున్న క్రైమ్ పోలీసు బృందాన్ని ఎస్‌పి రాజశేఖర్‌బాబు అభినందించారు. రాబోయే నూతన సంవత్సరంలో కూడా ఇదే తరహాలో చోరీలనివారణకు కృషి చెయ్యాలని క్రైమ్ సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు.

ఒకేషనల్ కోర్సు పరీక్షల్లో అవకతవకలు
* అమ్మాయికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అబ్బాయి
* కాలువలో నకిలీ హాల్ టిక్కెట్లు
* పరారైన కళాశాల నిర్వాహకులు
* పోలీసులకు ఫిర్యాదు
మదనపల్లె, డిసెంబర్ 31: మదనపల్లెలో జరుగుతున్న ఒకేషనల్ వృతి విద్యా కోర్సు పరీక్షల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఒక పరీక్షా కేంద్రంలో సోమవారం నిర్వహించిన పరీయల్లో ఒక అమ్మాయికి బదులు మరొక అబ్బాయి పరీక్ష రాస్తూ ఎగ్జామినేషన్ చీఫ్‌కు పట్టుబడ్డాడు. అదే సమయంలో పరీక్షా కేంద్రానికి వచ్చిన కళాశాల నిర్వహకులు తమవద్ద ఉన్న నకలీ హాల్ టిక్కెట్లను తీసుకుని పరారవుతూ ఎదురుగా ఉన్న కాలువలో పడేశారు. దీంతో ఎగ్జామినేషన్ చీఫ్ పరీక్షలు రాస్తున్న వారందరినీ పరిశీలించగా నలుగురు నకలీ విద్యార్థులు పరార్ కావడంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష రాస్తూ పట్టుబడిన నకలీ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మదనపల్లె రెండవ పట్టణ సిఐ గంగయ్య కథనం ప్రకారం పట్టణంలోని సొసైటీ కాలనీలోని ఒక ఒకేషనల్ కళాశాలలో రెండు మాసాల షాట్ టర్మ్ కోర్సులు నిర్వహించారు. వీటికి సంబంధించిన పరీక్షలు స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించారు. బేసిక్ వెల్డింగ్ అనే కోర్సులో 350మంది విద్యార్థులకు రెండుమాసాల శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించారు. ఎగ్జామినేషన్ చీఫ్, ప్రిన్సిపాల్ పద్మలత సెంటర్‌లో పర్యవేక్షించారు. ఈ పర్యవేక్షణలో ఒక విద్యార్థి షమీంభాను అనే విద్యార్థిని పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనను గమనించిన అదే గదిలోని మరో ఇద్దరు విద్యార్థులు పరార్ కాగా, మరో గదిలో మరో ఇద్దరు నకలీ విద్యార్థులతో పాటు బయటవున్న నిర్వాహకుడు బయటకు పరుగులు తీసి గేటుదూకి పరారయ్యారు. ఆయన వద్ద ఉన్న నకలీ హాల్ టిక్కెట్లను ఎదురుగా ఉన్న పెద్దకాలువలో పడేశారు. సిఐ గంగయ్య, ఎస్‌ఐ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాలువలో పడివున్న నకలీ హాల్ టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపాల్ పద్మలత ఫిర్యాదు మేరకు అమ్మాయి షమీంభాను, పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అబ్బాయిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంగయ్య తెలిపారు.
తనకేం తెలియదు
తనకేమీ తెలియదని, పరీక్ష రాయమంటే రాస్తున్నానని పట్టుబడ్డ విద్యార్థి తెలిపారు. తాను మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని ఓ ఐటిఐ కళాశాలలో ఐటిఐ చదువుతున్నానన్నారు.

‘అన్నమయ్య కుటుంబాలు పది’
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, డిసెంబర్ 31: పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్యకు సంబంధించి ప్రస్తుతం 10కుటుంబాలు ఉన్నాయని తాళ్లపాక వంశస్థులు తాళ్లపాక నాగభూషణాచార్య వెల్లడించారు. సోమవారం స్థానిక సరోజనిదేవి రోడ్డులోని శ్రీసీతారామాంజనేయ ఆలయంలో నిర్వహించిన ధార్మిక పాశుర ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసులుగా తాము 12వ తరానికి చెందుతామన్నారు. అన్నమయ్య వారసులకు సంబంధించి ఇప్పుడు 10కుటుంబాలు ఉన్నాయన్నారు. తిరుమల శ్రీవారికి సుప్రభాతసేవ మొదలుగా ఏకాంతసేవ నిర్వహించడం పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యం అని తెలిపారు. ఆలయ ధర్మకర్త బివి రమణ మాట్లాడుతూ తిరుమల దివ్యక్షేత్రానికి వెళ్లేమార్గంలో తిరుపతి సరోజినీదేవి రోడ్డులో వెలసిన శ్రీసీతారామాంజనేయ ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలదన్నారు. ఈ ఆలయంలో శ్రీగోదాదేవి అమ్మవారు ఉత్సవ విగ్రహం రూపంలో భక్తుల్ని సాక్షాత్కరిస్తుండడం విశేషమన్నారు. వాతావరణం, ధ్యానానికి ఆలవాలమైన ఈ ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణ ప్రభువులతో బాటు, భగవత్ రామానుజులవారు, భక్తాంజనేయస్వామి, శ్రీవినాయకస్వామి, మహాలక్ష్మి, అమ్మవారితో పాటు నవగ్రహాలు కొలువు ఉన్నారన్నారు. ప్రముఖ వ్యాఖ్యాత వాచస్పతి, పద్యకవి సముద్రాల రంగనాథ్ ధనుర్మాస పాశుర ప్రవచనంలో భాగంగా 16వ పాశురాన్ని భక్తులచేత గానం చేయించారు. తిరుమల శ్రీవారికి కన్యాదానం నిర్వహించే మహద్భాగ్యాన్ని కలిగిన శ్రీమాన్ తాళ్లపాక నాగభూషణాచార్యులు, శ్రీగోవిందరాజస్వామి ఆలయ పరిచారిక స్వామి శ్రీ మణివణ్ణన్ శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి తరలిరావడం రామభక్తులకు అదృష్టమని చెప్పారు.

జిల్లా ప్రజలకు కలెక్టర్, ఎస్పీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
చిత్తూరు, డిసెంబర్ 31: జిల్లాలోని ప్రజలు సుఖ శాంతులతో నూతన సంవత్సరంలో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా, జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ అన్నారు. 2012వ సంవత్సరం కన్నా 2013వ సంవత్సరంలో జిల్లాలోని ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా వర్థిలాలని కోరుతున్నామన్నారు. 2012వ సంవత్సరంలో జిల్లా ప్రజల సమస్యలను అన్ని విధాలా పరిష్కరించామని ఎవరికి ఏలాంటి ఇబ్బందులు వచ్చినా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని ఎస్పీ అన్నారు. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలను అన్నివిధాలా ఆదుకొంటామని అందరు సుఖశాంతులతో ఆనందంగా జీవించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లాలో తగ్గిన నేరాలు: ఎస్పీ
చిత్తూరు, డిసెంబర్ 31: జిల్లా వ్యాప్తంగా 2012వ సంవత్సరంలో నేరాలు, ఘోరాలు సంఖ్య గత ఏడాది కన్నా తగ్గిందని జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా తెలిపారు. సోమవారం చిత్తూరు పోలీస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా సంవత్సర సంవత్సరానికి క్రైమ్ రేటు పెరుగుతుందని, అయితే 2011కన్నా 2012వ సంవత్సరంలో క్రైమ్ రేటు తగ్గిందని వివరించారు. 2011-12 సంవత్సరాల్లో జరిగిన నేరాలు వాటి వివరాలను ఎస్పీ వివరించారు. దొంగతనాలు 600-471, రాత్రిపూట రాబరీలు 130-123, పగటివేళ దొంగతనాలు 21-20, డెకాయిటీ 5-3, లాభాపేక్షతో చేసిన హత్యలు9-8, రాబరీ 16-10జరిగాయని వీటితో పోలిస్తే 2011వ సంవత్సరంలో మొత్తం 781వివిధ రకాల క్రైమ్‌లు జరుగగా ఈఏడాది 635జరిగిందన్నారు. గత ఏడాది జిల్లాలోని ప్రజలు 4,25,34,203 రూపాయలు నష్టపోగా అందులో 3,32,46,130 రూపాయలను రికవరీ చేసి రికవరీలో 78.16శాతం సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. ఈఏడాది ప్రజలు వివిధ రూపంలో 3,72,16,712 రూపాయలు నష్టపోగా అందులో 2,85,38,229 రూపాయలు రికవరీ చేసి 77శాతం సాధించామన్నారు. అడిషనల్ ఎస్పీ టి.అన్నపూర్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలకు సంబందించిన డౌరీ అరాస్‌మెంట్ కేసులను ఐసిడిఎస్ పి.డికి పంపించామన్నారు. వారు దానిపై విచారణ జరిపి పలువురు మహిళలకు రూ.50 నుండి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఇప్పించినట్లు చెప్పారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి, సి.ఐలు సుధాకర్‌రెడ్డి, రెడ్డెప్ప, శ్రీకాంత్, అల్లాభక్షు, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

నలుగురు దొంగలు అరెస్ట్
* రూ. 18 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
* డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి వెల్లడి
చిత్తూరు, డిసెంబర్ 31: జిల్లాలో 2012వ సంవత్సరంలో జరిగిన పలు దొంగతనాల్లో తప్పించుకొని తిరుగుతున్న నలుగురు ముద్దాయిలను చిత్తూరు రేంజ్ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్ ఇన్‌చార్జి సిఐ కె.రెడ్డెప్ప, వారి సిబ్బంది అరెస్టు చేసినట్లు డిఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. సోమవారం డిఎస్పీ చిత్తూరు అర్బన్ స్టేషన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పలమనేరు మండలం గంటావూరుకు చెందిన ఎస్.మంజునాధ్(49), పలమనేరు గుడియాత్తం రోడ్డులో ఉన్న కొడవలి భాస్కర్ అలియాస్ చిన్నా(34), కూర్మాయి పల్లెకు చెందిన ఎస్.మున్వర్ అలియాస్ చోటు(28), వేలూరు జిల్లా అర్కోనం, బాణావరంకు చెందిన ఎస్.సారధి(20)లు కలసి 2012లో జిల్లాలోని కుప్పం, కర్ణాటక రాష్ట్రంలోని నంగిలి, ముళ్‌బాగ్‌ల్, కోలార్ జిల్లాలోను, తమిళనాడు రాష్ట్రంలోను వివిధ నేరాలు చేశారన్నారు. వీరిని సోమవారం రెడ్డిగుంట చెక్‌పోస్టు వద్ద క్రైమ్‌రేంజ్ ఇన్స్‌పెక్టర్ కె.రెడ్డెప్ప, అర్బన్ సిఐ ఎన్.సుధాకర్‌రెడ్డి, చిత్తూరు ఈస్ట్‌సిఐ వి.అల్లాభక్షు, వెస్ట్ సిఐ పి.శ్రీకాంత్ అరెస్టుచేసి నేరానికి ఉపయోగించిన టవేరాకారును, బంగారునగలు, వెండి వస్తువులు, రెండు మోటారుసైకిళ్ళు, డివిడి ప్లేయర్, యుపిఎస్, రాగివైరు ముద్దలు స్వాధీనం చేసుకున్నామని, మొత్తం వాటి విలు 18లక్షలు ఉంటిందని చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ కాంతిరాణాటాటా అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డిఎస్పీ చెప్పారు.

ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి మృతితో పెల్లుబికిన నిరసనలు
* న్యాయవాదులు, విద్యార్ధుల ధర్నాలతో దద్ధరిల్లిన తిరుపతి
తిరుపతి, డిసెంబర్ 31: ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ బాధితురాలు మృతి చెందిన ఘటనపై తిరుపతిలో సోమవారం నిరసనలు పెల్లుబికాయి. స్ధానిక టౌన్‌క్లబ్ సర్కిల్లో తిరుపతి న్యాయవాదుల సంఘం నేతలు లక్ష్మన్న, పురుషోత్తం, రమేష్, శ్రీనివాసులు, అజేయ్‌కుమార్,రాజేంద్ర, కందారపు సుబ్రమణ్యం,చాయాపతి, ఉమాపతి తదితరులు పెద్ద ఎత్తున మద్దతుగా మానవహారం నిర్వహించారు. చట్టాలను సవరించి అయినా సరే గ్యాంగ్‌రేప్ నిందితులకు మరణశిక్ష విదించాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించినప్పుడే భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం ప్రపంచానికి చాటినట్లు అవుతుందన్నారు. శ్రీకోందడరామస్వామి హైస్కూల్, ఇతర ప్రైవైటు పాఠశాలలు టౌన్‌క్లబ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి, బాధితురాలు నిర్భయకు మద్దతుగా నిలిచారు. అలాగే బిజెవైఎం జిల్లా అధ్యక్షుడ రాటకొండ విశ్వనాథ్ ఆధ్వర్యంలో స్ధానిక శ్రీగోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. యుపిఏ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే జివిఎస్ రాష్ట్ర వ్యవస్ధాపకుడు శంకర్‌నాయక్ ఆద్వర్యంలో శ్రీపద్మావతి డిగ్రీ,మరియూ పిజి కళాశాల, చైతన్య, నారాయణ, కేశవరెడ్డి, బాష్యం, ఎన్‌ఆర్‌ఐ, గాయత్రీ, ఎమరాల్డ్స్ విద్యాసంస్ధలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక గల్లీలోని మహిళల పరిస్దితి ఏమిటని ప్రశ్నించారు. అత్యంత కిరాతకంగా, హేయమైన రీతిలో గ్యాంగ్‌రేప్‌కు గురై మృతి చెందిన నిర్భయ కుటుంబాన్ని పూర్తి స్దాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ జిఎం సత్యనారాయణ ప్రసాద్, ఎస్‌పిడభ్లూ డిగ్రి కళాశాల అధ్యాపకురాలు కృష్ణవేణి, వై జయశ్రీ,జివిఎస్ నేతలు ఈశ్వర్‌నాయక్, సూర్యప్రతాఫ్, నారాయణస్వామి, రవి,శ్రీనునాయక్, రాధ, రాజు, వెంకటేష్,బాపూజి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకలకు దూరం
* మంత్రి గల్లా అరుణకుమారి స్పష్టం
తిరుపతి, డిసెంబర్ 31: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు దూరంగా వుండాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి గల్లా అరుణకుమారి ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ ఘటనలో మృతి చెందిన మృతురాలి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. మృతిరాలి ఘటన తనను ఎంతగానో కలచివేసిందని, అందుకే నూతన సంవత్సర వేడుకలకు తాను, తన కుటుంబం దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. తనకు ఎవరు శుభాకాంక్షలు చెప్పేందుకు తన ఇంటికి రావద్దని ఆమె పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు తెలిపారు.

రేపు జిల్లాకు గవర్నర్ రాక
చిత్తూరు, డిసెంబర్ 31: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ 2013 జనవరి 2, 3వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని జిల్లాకలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గవర్నర్ హైదరాబాదులో బయలుదేరి 2వ తేదీ ఉదయం 8.35గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొంటారు. రేణిగుంట విమానశ్రయం నుండి బయలుదేరి ఉదయం 9.10గంటలకు పద్మావతి అతిథిగృహం చేరుకొని ఉదయం 10 నుండి 11గంటల వరకు టిటిడి దేవస్థానం వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 1.30గంటల వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం రెండు గంటలకు పద్మావతి అతిథిగృహం చేరుకొని విశ్రాంతి తీసుకొంటారు. సాయంత్రం 4గంటలకు తిరుపతి శ్రీపద్మావతి అతిథిగృహం నుండి బయలుదేరి తిరుమల పద్మావతి అతిథిగహం చేరుకొని రాత్రి బసచేస్తారు. 3వ తేదీ ఉదయం 7.30గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం నుండి బయలుదేరి 8.30గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి హైదరాబాదు వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

రైల్వే జాతీయ నాయకుడికి ఘనస్వాగతం
రేణిగుంట, డిసెంబర్ 31: రేణిగుంట రైల్వేస్టేషన్‌ను ఆలిండియా ఓబిసి ఎంప్లాయిస్ యూనియన్ న్యూఢిల్లీ జనరల్ సెక్రటరీ ఓ.సుందరరామయ్యకు ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం సోమవారం ఉదయం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రేణిగుంటకు చేరుకున్న ఆయన్ను రైల్వే గ్యారేజీ రిపేర్‌షాప్ ఓబిసి నాయకులు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుందరరామయ్య మాట్లాడుతూ న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సుమారు 8వేలమంది ఓబిసి ఉద్యోగులతో డిసెంబర్ 9న నిర్వహించిన మహాసభ విజయవంతం అయ్యిందన్నారు. ఈ సభలో రాష్టమ్రంత్రులు, ఎంపిలు పాల్గొన్నారన్నారు. ఈ సభలో ప్రధానమైన డిమాండ్లను ప్రస్తావించడం జరిగిందన్నారు. తమ పోరాట ఫలితమే అన్ని రైల్వేగ్యాంగ్‌కు 24కంప్యూటర్లతో ఇంటర్‌నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫెడరేషన్‌కు రైల్వే నిలయం ఆఫీసు ఇవ్వడం జరిగిందన్నారు. 27శాతం రిజర్వేషన్లను 52శాతానికి జనాభాప్రాతిపదికన పెంచమని డిమాండ్ చేశామన్నారు. సభ అనంతరం దేశప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, ఓబిసి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ విజయకృష్ణకు కార్మికుల సంక్షేమం కోరుతూ వినతిపత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి జనరల్ సెక్రటరీ అర్జున్‌రెడ్డి, ఎవి రమణారెడ్డి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గణనాథుని దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
చిత్తూరు, డిసెంబర్ 31: నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఇఓ పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం వేకువజామున 3గంటల నుంచి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందన్నారు. భక్తులకు అవసరమైన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆలయంలో మంగళవారం అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం సుమారు లక్ష లడ్డులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయం ఉంటుందన్నారు. సాధారణంగా వేయి మందికి అన్నదానం ఉంటుందని, కానీ ఆంగ్ల సంవత్సరం సందర్భంగా దాన్ని 1500మందికి పెంచుతున్నట్లు తెలిపారు. భక్తుల కాలక్షేపం కొరకు డిసెంబర్ 31వ తేది రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆలయంలో మూషిక మండపంలో, సుబద మండపం, అనే్వటి మండపాల్లో ప్రత్యేక పష్ప అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

నూతన సంవత్సరానికి ముస్తాబైన అమ్మవారి ఆలయం
తిరుచానూరు, డిసెంబర్ 31: ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని టిటిడి అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం మొత్తం పుష్పమాలలు, రంగు రంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. విద్యుత్‌దీపాల వెలుగులు, పుష్పాల సువాసనల మధ్య అమ్మవారి ఆలయం ఎంతో సుందరంగా ఉంది. మంగళవారం ఉదయం 3గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని సూపరింటెండెంట్ శేషాద్రిగిరి తెలిపారు. భక్తులకు కావాల్సిన అన్ని వసతీ ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.

‘మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని శిక్షించాలి’
తిరుపతి, డిసెంబర్ 31: మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తిరుపతిలో సోమవారం విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళ చట్టాల్ని పటిష్టంగా అమలుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకురాళ్లు యశోద, హేమలత, హైమావతిలు మాట్లాడుతూ ఢిల్లీ గ్యాంగ్‌రేప్ మృతురాలికి నివాళులు అర్పించారు. నేడు 6 సంవత్సరాల నుండి 60సంవత్సరాల వృద్ధురాలి వరకు మహిళలపై అత్యాచారాలు జరుపుతున్నా మహిళల రక్షణకు పటిష్టంగా అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగభూషణమ్మ, సాయిలక్ష్మి, లక్ష్మి, కుమారమ్మ, నాగరత్న, విద్యార్థినులు పాల్గొన్నారు.

* రూ. 18 లక్షలు విలువ చేసే 586 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం * గతంలో నిరక్షరాస్యులు.. నేడు నిరుద్యోగులు దొంగతనాలు చేస్తున్నారు * అర్బన్ ఎస్‌పి ఎస్‌వి రాజశేఖర్‌బాబు వెల్లడి
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles