కడప, డిసెంబర్ 31: ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో పౌష్టికాహార సరఫరాలో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకుని పథకం సక్రమంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 18 మండలాల్లో మంగళవారం నుంచి ఈ పథకం ప్రారంభం కానున్నది. ఈ పథకం ద్వారా గర్భిణి, బాలింతలకు పోరుమామిళ్ళ, ముద్దనూరు, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగనవాడీ కేంద్రాలలో 10,108 మంది మహిళలకు ఒక్కొక్కరికి రోజుకు మధ్యాహ్నం భోజనం, 200 మిల్లీలీటర్ల పాలు, ఒక కోడి గుడ్డును సరఫరా చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో చిన్న, పెద్ద అంగన్‌వాడీ కేంద్రాలు 3615 ఉన్నాయి. సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో పసి పిల్లలకు పౌష్టిహారాన్ని అందజేస్తున్నారు. ఆహారం పంపిణీలో కూడా అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 103698 గ్రేడ్-1 కింద, 88464 గ్రేడ్-2 కింద, 8647 గ్రేడ్-3,4ల కింద సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పౌష్టికాహారలోపం ఉన్న గర్భిణీలు, బాలింతలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఆదుకుంటూ జన్మించే శిశువుల మృతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 102 ప్రాజెక్టులలో ఇందిరమ్మ అమృత హస్తం పథకంను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టులలో 18 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో మంచి ఫలితాలు వస్తే జిల్లాలోని అన్ని ప్రాజెక్టులలో ఈ పథకం అమలకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా వరకు రాజకీయ జోక్యం ఉన్న కారణంగా పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. ఆ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కావడంతో సెంటర్ల నిర్వాహణలో చాలా అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. కార్యకర్తలుగా ఉంటూ చాలా వరకు సూపర్ వైజర్లగా పదోన్నతులు పొందిన వారు సైతం చేసిన తప్పులనే పర్యవేక్షణాధికారులుగా కూడా పునరావృతం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ అమృత హస్తం పకడ్బందీగా నిర్వహిస్తే తప్ప గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందడం కష్ట సాధ్యమే. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేద గర్భిణీ, బాలింతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
జిల్లాకు కొత్త కళ
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 31:నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఆఫీసులు, ఆస్పత్రులు, విద్యాలయాలు, అగ్నిమాపక కేంద్రాలు, పోలీసు స్టేషన్లలో పోటాపోటీగా అలంకరించారు. ముఖ్యంగా పోలీసు కార్యాలయం గ్రౌండ్‌ను తీర్చిదిద్దారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సంబంధిత సిబ్బంది కేంద్రాలు, కడపలో ఉన్న రిమ్స్ ప్రభుత్వాస్పత్రిలో డైరెక్టర్ సిద్ధప్ప గౌరవ్, ఆర్‌ఎంఓ వెంకట రత్నంల ఆధ్వర్యంలో రిమ్స్‌లోని ఓపి, ఐపి ప్రాంగణం అలంకరణలో నర్సులు, వైద్యులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రంగలతో ముగ్గులు వేశారు. సందర్భంగా అకతాయిల నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారుల కార్యాలయాలే కాకుండా బ్రాందీ షాపులు, బార్లు కూడా నూతన సంవత్సరం సందర్భంగా షాపులను అందంగా అలంకరిస్తున్నారు. నగరంలోని యువకులు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు నగరంలో సంచరించినా, ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు యువకులకు హెచ్చరికలు చేశారు. ఎక్కువగా నగరంలో అర్ధరాత్రి 12 గంటల సమయం దాటుతూనే మురళీ థియేటర్ సెంటర్, ఎర్రముక్కపల్లె, అప్సరా సర్కిల్, గోకుల్‌లాడ్జి సర్కిల్, ఏడు రోడ్ల కూడలి, వన్ టౌన్ పరిధి, పాత బస్టాండు సర్కిల్, ఐటిఐ సర్కిల్లో యువకులు మద్యం సేవించి రహదారిపై వెళ్లే ప్రజలపైన కుంకుమ, పూలు చల్లుతూ వీలలు, కేకలు వేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా జిల్లాలోని డివిజన్ స్థాయి అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి అకతాయిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని బ్రాందీషాపులు ఉదయం 10 నుండి తెరచి రాత్రి 10 లోపు మూసివేయాలని ఒక పక్క ఎక్సైజ్ అధికారులు, ఇంకోపక్క పోలీసు అధికారులు బ్రాందీ షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. గత వారం రోజుల నుండి ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం షాపుల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై ఆయా పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి అక్కడ ఉన్న మద్యం ప్రియులు కూర్చున్న ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేస్తారు. జిల్లాలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన బార్లలో కూడా సమయాన్ని పోలీసు, ఉన్నతాధికారులు సూచించారు. డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా పోలీసు స్టేషన్లకు సంబంధించిన సి ఐలు, ఎస్‌ఐలకు సమావేశాన్ని ఏర్పాటు చేసి 31 తేదీ రాత్రి వేళల్లో వాహనాల గస్తీని పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అకతాయిల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే జిల్లాలోని పోలీసు కార్యాలయానికి సమాచారాన్ని అందించాలని ఉన్నత పోలీసు అధికారులు కింది స్థాయి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప నగరం, రాజంపేట, పులివెందులకు సంబంధించి పోలీసు బందోబస్తును ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్, రిజర్వు కానిస్టేబుల్, హోంగార్డులు, ఎపిఎస్పీ కానిస్టేబుళ్లను ఎస్‌ఐ, సిఐ స్థాయి వారిని కూడా జిల్లా పోలీసు యంత్రాంగం ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి దొంగాట
రాయచోటి టౌన్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ,టిడిపి దొంగాట ఆడుతున్నాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చోటుచేసుకునే భవిష్యత్ పరిణామాలపై అన్ని రకాలుగా అధ్యయనం చేసి చర్చించాకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ విషయంలో మరింత కాలయాపన చేయడంతోపాటు ప్రజలను మభ్యపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో రోజుకోమాట మాట్లాడుతుండడం దారుణమన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బాబు పర్యటన సాగుతున్నందున ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమంటూ డ్రామాలు ఆడుతున్నట్లు తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనుకుంటే చేసేయవచ్చునన్నారు. అలా కాకుండా కాంగ్రెస్ పెద్దలు తమ స్వార్థ స్వలాభాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయాన్ని వివాదాస్పదం చేస్తూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అరాచకపరిస్థితులను ఏర్పరస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీయే కారణమని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోనే కాంగ్రెస్, టిడిపి నేతలు వెంటనే స్పందించి శ్రీ కృష్ణ కమిటి నివేదికను వెంటనే అమలు పర్చాలని, తెలంగాణ ఏర్పాటుపై వెంటనే తమ నిర్ణయాన్ని తేల్చాలంటూ కాంగ్రెస్ పెద్దలను నిలదీయాలని డిమాండ్ చేశారు.
కొత్త సభ్యులందరికీ ఓట్లు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 31: సహకార సంఘాల్లో ఓటర్ల నమోదు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాజకీయ నేతలు, అధికారులు ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖ అధికారులు అక్రమంగా ఓటర్లను చేర్పించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటన ఇచ్చి కేవలం ముగ్గురు సిఇఓలపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని మన్నూరు, వల్లూరు, ఎల్లటూరు కార్యదర్శులపైన మాత్రమే చర్యలు తీసుకొని అన్ని సక్రమంగా ఉన్నాయని అధికారులు చేతులెత్తేశారు. అన్ని రాజకీయ పార్టీల నేతల ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు నోరు మెదపకుండా ఓటర్ల నమోదుకు గడువు ముగిసినా ఇచ్చిన దరఖాస్తులు సైతం సక్రమంగా ఉన్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. గత నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా 25 వరకు కూడా దరఖాస్తులు తీసుకున్నారు. ఓటు హక్కు అర్హత లేని వారికి, భూమి లేని వారికి, కౌలు పేరుతో ఇష్టారాజ్యంగా ఓటర్లను చేర్పించుకున్నారు. జిల్లాలో 77 ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా 92,142 దరఖాస్తులు వచ్చాయి. ఆ సంఘాల్లో సోమిరెడ్డిపల్లె, మైదుకూరు, నర్సాపురం, పోరుమామిళ్ల, కొత్తకోట, అల్లాడుపల్లె, దేవపట్ల, లింగాపురం, లింగాల, అట్లూరు, ఎర్రబల్లె సొసైటీలకు అధికంగానే దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో చాలా వరకు నకిలీ అని రాజంపేట, కమలాపురం, బద్వేలు ఎమ్మెల్యేలు ఎ. అమర్‌నాథ్‌రెడ్డి, జి. వీరశివారెడ్డి, పి ఎం. కమలమ్మలతో పాటు అన్ని రాజకీయ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సంబంధిత దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపి దర్యాప్తు చేయిస్తామని అధికారులు ఎంతో అటహాసంగా ప్రకటించారు. అయితే చివరికీ ముగ్గరి సి ఇ ఓలపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. సంబంధిత దరఖాస్తులను డిసెంబర్ 27 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంది. సోమవారం నాటికి గడువు ముగియడంతో ఆ ముగ్గరి సిఇఓలపైనే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొని గ్రామాల్లో సహకార పోరు కొనసాగనున్నది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు నకిలీ ఓటర్లను ఎరివేసి అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించి ఎన్నికల్లో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బడుగు వర్గాల అభివృద్ధికి సహకరించాలి
రైల్వేకోడూరు, డిసెంబర్ 31: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు తమ వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. సోమవారం స్థానిక మండల సభాభవన్‌లో స్పెషలాఫీసర్ కెడి ప్రసాద్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ యాక్ట్ అమలుపై సమావేశం నిర్వహించారు. మండల స్థాయి అధికారులతో మండలాభివృద్ధిపై సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను ఖచ్చితంగా అమలు చేసి బడుగులకు న్యాయం చేసేందుకు అధికారులు తమవంతు పూర్తి సహకారాన్ని అందివ్వాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధులలో రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు నిధులను ఖచ్చితంగా కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశ అనంతరం నూతనంగా రెవెన్యూ శాఖ కార్యాలయంను అధికారులు పరిశీలించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఆర్డీఓ హరిత, తహశీల్దార్ రామచంద్రయ్య, ఎంపిడిఓ అరుంధతి, మండల అధికారులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి
కడప (అర్బన్), డిసెంబర్ 31:జిల్లాని ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై శ్రద్ధ వహిస్తామని కలెక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సభాభవనంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైతే అట్రాసిటీ కేసులు నమోదు అవుతాయో వాటిని తక్షణ పరిష్కారం చూపాలన్నారు. అట్రాసిటీ కేసులు జరుగకుండా అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్ట్భీములను ఇతరులు అక్రమణకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి చర్యలు త్వరితగతిన తీసుకుంటామన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అట్రాసిటీ కేసుల పట్ల ఆలస్యం లేకుండా విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిటీ సభ్యుడు జెవి రమణ మాట్లాడుతూ చిట్వేలి మండలంలోని దళితులకు పంపిణీ చేయాల్సిన భూమి ఇంత వరకు చేయలేదని తెలుపగా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ డివిజన్ చేసి త్వరిగతిన పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంబేద్కర్ మిషన్ నాయకుడు ప్లీడర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కుల దృవీకరణ ధృవీకరణ పత్రలు జారీ చేస్తున్నారని, అదే తరహాలో కడపలో కూడా జారీ చేసేందుకు తహశీల్దార్‌కు సూచనలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డిడి మదుసూధన్, డిఆర్‌డిఎ పిడి గోపాల్, డి ఆర్వో హేమసాగర్, ఎల్‌యం వీరారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి సరస్వతి, కడప,జమ్మలమడుగు ఆర్డీవోలు వీరబ్రహ్మయ్య, వెంకటరమణారెడ్డి, డి ఎస్‌పిలు, సియం రవికుమార్‌బాబు, సుబ్బరాయుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాటమార్చిన టిడిపి, వైకాపా
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 31: నాడు ఎన్టీఆర్ తెలుగు ప్రజలు సమైక్యంగా ఉంచాలనుకుంటే నేడు చంద్రబాబునాయుడు విడకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఎమ్మెల్యే వీరశివారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఇందిరా భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి ఐదు లక్షల ఓట్లతో గెలిపిస్తే ఎంపి జగన్ మోహన్‌రెడ్డి కూడా అదే తీరులో వ్యవహరించడం దారుణమన్నారు. అఖిల పక్షంలో జగన్, చంద్రబాబునాయుడు మాట మార్చి తెలంగాణకు మద్దతు తెలిపారన్నారు. వైకాపాకు ఆంధ్ర, రాయలసీమలో 16 అసెంబ్లీ సీట్లు వచ్చాయన్నారు. గత ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కర్నూలు జిల్లాలో తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్ర రాయలసీమ వాసులు హైదరాబాద్ నగరానికి వెళ్లాలంటే పాస్ పోస్టు, వీసా అవసరమని అన్న మాటను సీమాంధ్ర నేతలు, ముఖ్యంగా వైకాపా నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. హత్యారాజకీయాలు, అవినీతి రాజకీయాలు టిడిపికి తప్ప కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినవి కావన్నారు, నాడు షాద్ నగర్ జంట హత్యల కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన ఘనంత టిడిపిదేనన్నారు. కోడెల శివప్రసాద్ ఇంటిలో బాంబులు పేలడం, చంద్రబాబునాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. గాలి ముద్దుక్రిష్ణమనాయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం గురివింద సామెతను గుర్తు చేస్తోందన్నారు. హత్యారాజకీయాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల రవి గురించి చంద్రబాబునాయుడికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, రాజోలి వీరారెడ్డి, మూలే సరస్వతి, గ్రంథాలయ ఛైర్మెన్ రామకోటిరెడ్డి పాల్గొన్నారు.
నూతన సంవత్సరానికి
దేవుని కడపలో ఏర్పాట్లు
కడప (అర్బన్), డిసెంబర్ 31:నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళశారం భక్తుల సర్వ దర్శనం కోసం ఆలయ చైర్మెన్ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆ రోజు వేకువ జాము 3-00 గంటల నుంచి మధ్యాహ్నం భక్తుల సౌకర్యార్థ దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే భక్తుల కోసం శ్రీస్వామివారి లడ్డూలు కూడా విక్రయించడం జరుగుతుందన్నారు. అలాగే జయనగర్ కాలనీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఉదయం 5 గంటలత నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామి వారి దర్శనం ఏర్పాటు చేశామని ఆయాఆలయ చైర్మెన్లు ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాక ఉభయదారులు పూలసేవకు రూ.1000 చెల్లించి ఉదయం 3-00 గంటలకు జరుగు ధనుర్మాస పూజ, సహస్రనామార్చలకు 1 టికెట్లుకు ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన దలచిన భక్తులు ఆఫీసులో పైకం చేల్లించి రసీదు పొందలన్నారు. అలాగే స్వర్ణ పుష్పార్చన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు 300 రూపాయలు కట్టడి చెల్లించాలని, టిక్కెట్టుకు ఇద్దరికి మాత్రం ప్రవేశం ఉంటుందన్నారు. పూల సేవలో ఉభయదారులకు కండువా, రవిక, ప్రసాదం ఇవ్వబడుతుందన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి
వేంపల్లె, డిసెంబర్ 31: ఢిల్లీలో అత్యాచారానికి గురై మృతి చెందిన వైద్యవిద్యార్థిని కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి కోరారు. విద్యార్థి మృతిని నిరశిస్తూ సోమవారం వేంపల్లెలో జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి మహేష్‌బాబు నేతృత్వంలో విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ బజార్, నాలుగు రోడ్ల కూడలి, కాపువీధి మీదుగా సాగింది. ఈర్యాలీలో పాల్గొన్న సతీష్‌రెడ్డి మాట్లాడుతూ అత్యాచార ఘటన నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పాఠశాలల విద్యార్థులు, పెద్ద సంఖ్యలో చేనేత నాయకులు పాల్గొన్నారు.
మైలవరానికి కృష్ణాజలాల నిలిపివేత
మైలవరం, డిసెంబర్ 31: మైలవరం డ్యామ్‌కు వచ్చే కృష్ణజలాలను నిలిపివేసినట్లుగా తెలుస్తోందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల మైలవరానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కృష్ణాజలాలను తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐదురోజుల కిందట ఆ మేరకు వదిలారని ఆయన పేర్కొన్నారు. ఈ కృష్ణజలాలు మైలవరం జలాశయానికి రాకపోతే చుట్టు ప్రక్కల గ్రామాలైన తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు తాగునీటి బోర్లు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్‌డబ్య్లు ఎస్ ఎ ఇ వరప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణజలాలు అంతంతమాత్రం చేరడంతో గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఈ కృష్ణజలాలు వస్తే ఇటు జమ్మలమడుగునది పరివాహక ప్రాంతాలు తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవుకు ఇరిగేషన్ అధికారులు కృష్ణాజలాలను వదలాలని, ఇరిగేషన్ అధికారులు వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కేరళ 312కు అలౌట్
* సంజు విశ్వనాధ్, జగదీష్ సెంచరీలు
కడప (క్రైం), డిసెంబర్ 31:స్థానిక వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో మూడవ రోజు సోమవారం కేరళ జట్టు 98.5 ఓవర్లలో 312 పరుగులు చేసి అలౌట్ అయింది. సంజు విశ్వనాధ్, విఎ జగదీష్ ఇరువురు సెంచరీలు సాధించి కేరళ జట్టును ఆదుకున్నారు. మిగిలిన వారు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. సంజు విశ్వనాధ్ 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 122 పరుగులు చేయగా విఎ జగదీష్ 12 ఫోర్లతో 117 పరుగులు చేశారు. మిగిలిన కెఎస్ రాజేష్ 0, అక్షయ్ 2, అభిషేక్ 5, రాబర్ట్ 7, రోహన్ ప్రేమ్ 25, శ్రీశాంత్ 5, మానుక్రిష్టన్ 5, షాషీద్ 13 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని బోలర్లు విజయకుమార్ 4, అచుత్ రావు 4, షాబుద్దీన్ 2 వికెట్లను తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు 6 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా మ్యాచ్ విరామ సమయానికి 38 పరుగులు చేసింది. ఆంధ్రాకు మొదటి ఇన్నింగ్‌లో 17 పరుగుల ఆధిక్యత లభించింది.
ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా
పని చేయాలి
మైదుకూరు, డిసెంబర్ 31:ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా తమ విధులను నిర్వర్తించి పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఎ సూర్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ డిప్యూటీ డిఇవో మైదుకూరు మండల విద్యాశాఖాధికారి పి సుఖవనం పదవీ విమరణ సభను పురస్కరించుకొని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమర్‌నాధ్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ సభలో పివో సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా సమాజంలో తమ ఉనికిని కాపాడుకోవడంతో పాటు పేరు ప్రతిష్టలు పెంపొదించుకుంటారని తెలిపారు. తాము నిర్వర్తించే విధులు ఇతరులకు స్ఫూర్తి ఇచ్చేలా పని చేయడమే తమ ఉద్యోగ ధర్మమని తెలిపారు. సుఖవనం ఇటువంటి కోవకు చెందినవాడు కావడంతోనే ఈనాడు ఇంత ఘనంగా పదవీ విరమణ సత్కరం చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సుఖవనం గత 10 సంవత్సరాలుగా మైదుకూరు ఎం ఇవో పని చేయడం అభినందనీయమని తెలిపారు. ఆయన సేవలు నూతన బాధ్యతలు చేపట్టే ఎం ఇవోకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కష్టపడి పని చేసే అధికారులకు నిరంతరం తమ సహాయ సహకారాలు అందిస్తునే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఎండివో అమర్‌నాధ్, ఎ ఎంవో రాజేంద్రప్రసాద్, డిసిడివో ప్రమీలారాణి, ఎంఇవో సుబ్బారెడ్డి, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు పాలకొండయ్య, ఎపి శ్రీనివాసులు, సి ఇవిప్రసాద్ తదితరులు సుఖవనం సేవలు కొనియాడారు శాలువ పూలమాలతో వారి దంపతులను ఘనంగా సత్కరించారు,