Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎడిఇ

$
0
0

బనగానపల్లె, డిశెంబర్ 31: బనగానపల్లె ట్రాన్స్‌కో ఎడిఇగా పనిచేస్తున్న రమణారెడ్డి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పీ విజయపాల్ తెలిపిన వివరాల మేరకు... బనగానపల్లె మండలంలోని ఉశేనాపురం గ్రామానికి చెందిన ఎద్దుల నాగేశ్వరరెడ్డి అను రైతు సుమారు ఏడాది క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కోసం డిడి చెల్లించారు. కాగా అప్పటి నుండి రైతుకు ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వలేదని అందుకు ఎడిఇ 10 వేల రూపాయలు వరకు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అయితే రైతు ఎడితో మాట్లాడగా చివరకు ఆరువేల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుని తదుపరి తమను ఆశ్రయించాడని తెలిపారు. రైతు నాగేశ్వరరెడ్డి సోమవారం సాయంకాలం ట్రాన్స్‌కో కార్యాలయంలో వున్న ఎడిఇ రమణారెడ్డికి ఆరువేల రూపాయలు ఇవ్వబోగా ఆయన తమ డ్రైవర్ శ్రీనివాసులుకు ఇవ్వమని చెప్పడంతో రైతు డ్రైవర్‌కు ఇచ్చాడు. అదే సమయంలో మాటువేసుకుని వున్న ఎసిబి అధికారులు వెంటనే దాడులుచేసి ఎడిఇ, డ్రైవర్లను కస్టడీలోకి తీసుకున్నారు. కేసు పూర్వాపరాలు అన్ని విచారించి ఆపై ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదులో తీసుకున్నారు. వీరిని ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ విజయపాల్ చెప్పారు. ట్రాన్స్‌కో కార్యాలయంలో ఒక అధికారి ఎసిబికి పట్టుబడడం ఇదే తొలిసారి. కాగా బనగానపల్లెలో ఇది మూడవ కేసు. ఎసిబి దాడులు చేశారని తెలిసి అధికసంఖ్యలో జనం ట్రాన్స్‌కో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎసిబి అధికారులు దాడుచేశారని తెలిసి సోమవారం సాయంకాలం ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగుల్లో ఆందోళన చోటు చేసుకుంది. ప్రభుత్వం నుండి వేలాది రూపాయలు జీతాలు పొందుతూ ఇలా లంచాలకు పాల్పడడం పట్ల ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఈ దాడుల్లో ఎసిబి సిఐలు రామకృష్ణారెడ్డి, ప్రసాదరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.

కొత్త కాంతులతో కొత్త ఏడాదిలోకి...
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, డిసెంబర్ 31: కరవు, ధరల పెరుగుదలలతో ఇబ్బందులు పెట్టిన పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కోటి ఆశలతో కొత్త కాంతులతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు. కొత్త సంవత్సరం ప్రవేశించే ఘడియల్లో యువకులు కేరింతలు కొడుతూ ఉత్సాహం వీధుల్లో తిరుగుతూ ఆనందంగా గడుపగా ప్రతి ఇంటి ముందు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మహిళలు ఆకర్శనీయంగా రంగవల్లులను తీర్చి దిద్దారు. కొత్త సంవత్సరం అడుగుపెడుతున్న సమయం ఆసన్నమయ్యే కొద్దీ ప్రజలు ఉత్సాహంగా గడిపారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఆయా వర్గాల ప్రజలు సిద్ధపడ్డారు. కర్నూలు నగరంలోనే కాకుండా జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహాన్ని నింపగా స్నేహితులు, బంధు మిత్రులతో ఇళ్లల్లోనే ఉత్సవాలు నిర్వహించుకున్నారు. యువకులు తమ మిత్రులతో కలిసి భారీ ఎత్తున రహదారులపై చేరి టపాసులు పేల్చుతూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కరవు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఉత్సాహం కనిపించకపోవడం విశేషం. పట్టణాలు, నగరంలో మాత్రం కొత్త సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి.
ప్రముఖుల కొత్త సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, ఎంపి ఎస్పీవై రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘురామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ గౌరు వెంకట రెడ్డి, సిపిఎం తరపున మాజీ ఎమ్మెల్యే గఫూర్ తదితరులు ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రానున్న సంవత్సరం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వారు కోరుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా
శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలం, డిసెంబర్ 31: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో నూతన సంవత్సరం సందర్భంగా దేవస్థానం అధికారులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటే పుణ్యం ప్రాప్తిస్తుందని ముందస్తుగా భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారు. సర్వదర్శనం చేసుకునేందుకు ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 3.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రార్థకాల పూజ, మహా మంగళ హారతి, కార్యక్రమాలు జరిపించి 5.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు కార్యనిర్వహణ అధికారి సాగర్‌బాబు తెలియజేశారు. భక్తులను అదుపు చేసేందుకు క్యూలైన్ల వద్ద, ప్రధాన ద్వారా వద్ద ప్రత్యేక విధులను సిబ్బందిని కేటాయించారు. ఆలయాన్ని రంగు రంగుల పూలతో అలంకరించారు.

436 శాఖలతో
ఐదు జిల్లాల్లో విస్తరించిన ఎపిజిబి
పెద్దకడుబూరు, డిసెంబర్ 31: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 436 శాఖలతో కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిందని బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ రంగన్న వెల్లడించారు. సోమవారం మండల పరిధిలోని హెచ్.మురవణి గ్రామంలో నూతన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో రూ.4,650 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. రూ.5,450 కోట్ల రుణాలు అందజేశామన్నారు. కర్నూలు జిల్లాలో 86 శాఖల ద్వారా రూ.945 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. రూ.1125 కోట్లు రుణంగా అందజేశామని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులో రూ.25 ప్రీమియంతో సేవింగ్ ఖాతా తెరిచే వారందరికీ రూ.లక్ష వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రైతులందరికీ రూ.5 ప్రీమియంతో రూ.50 వేల వరకు ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అని స్పష్టం చేశారు. పొదుపుసంఘాలకు రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణ సౌకర్యం, రైతులకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణసౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకులో డిపాజిట్ చేసి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ ఎపిరెడ్డి, ఎమ్మిగనూరు మేనేజర్ ఉరుకుందప్ప, పెద్దకడుబూరు మేనేజర్ నరసింగరావు, మాజీ సర్పంచులు జయన్న, జోహాన్, గ్రామపెద్దలు గిడ్డయ్య, ఖాజ పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు రుణాలు మంజూరు చేయాలి
కర్నూలు, డిసెంబర్ 31: కోడుమూరు అసెంబ్లీ పరిధిలోని చేనేత కార్మికులకు పరపతి కార్డులు, చేనేత వ్యక్తిగత రుణాలు, పట్టుదారం సబ్సిడీ ధర పెంచాలని భారతీయ జనతా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డికి సోమవారం వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా చేనేత కార్మిక సంఘం కోడుమూరు అధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి భాస్కర్, కోశాధికారి అశోక్, భారతీయ జనతా మజ్దుర్ మహాసంఘ్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రావు, భారతీయ జనతాపార్టీ కోడుమూరు అసెంబ్లీ కన్వీనర్ వేల్పుల గోపాల్‌లు కలెక్టర్‌ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడుమూరు అసెంబ్లీ పరిధిలో దాదాపు 2వేల మంది చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. వీరి జీవితం చాలా దుర్భరంగా వుందని ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకోవడంలో అధికారులు విఫలమయ్యారని వారు విమర్శించారు. ఇప్పటికి దాదాపు వెయ్యి మంది రుణాల కోసం చేనేత అభివృద్దిశాఖ అధికారులకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందని, ఏడాది క్రితం దరఖాస్తు పెట్టుకున్న వారిలో ప్రస్తుతం దాదాపు 350 మందికి రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిగితా వారి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు. అదే విధంగా పట్టుదారం ఒక మగ్గానికి 4 కిలోలకు రూ.13850 ఖర్చు అవుతుందని, ప్రభుత్వం తరుపున 1కిలోకి రూ.150 ఇస్తున్నారని, ఇటీవల ప్రభుత్వం సబ్బిడి నిలిపి వేసిందని వారు పేర్కొన్నారు. సబ్బిడీని 1 కెజికి రూ.250 పెంచాలని వారు కోరారు. నిలిపివేసిన సబ్బిడి వెంటనే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆళ్లగడ్డ, డిసెంబర్ 31: మండలంలోని అహోబిలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ(60) మృతి చెందాడు. అహోబిలానికి చెందిన ఆ వ్యక్తి గ్రామంలోని వాహన టోల్‌గేటు వద్ద వున్న ఆంజనేయస్వామికి పూజలుచేసి లక్ష్మినరసింహ్వామి దర్శనానికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదవశాత్తు నారాయణను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి ఆళ్లగడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జయతీర్థ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతి
ఆలూరు, డిసెంబర్ 31: అరికెర తండాలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత కురువ భీమక్క(18) సోమవారం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మూడురోజుల క్రితం భీమక్క పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక సోమవారం మృతి చెందినట్లు ఆలూరు పోలీసులు వెల్లడించారు. భీమక్కకు నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన గోవిందుతో వివాహమైంది. కాగా తమ కూతురు మృతికి భర్త, అత్తమామల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జూపాడుబంగ్లా, డిసెంబర్ 31: జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని తూడిచెర్ల గ్రామానికి చెందిన వెంకటనారాయణ (25) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జయశేఖర్ కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దాడి కేసులో ముగ్గురి అరెస్టు
కొత్తపల్లె, డిసెంబర్ 31: మండలంలోని లింగాపురం గ్రామంలో పాత కక్షలతో దాడిచేసి గాయపరిచిన సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చంద్రబాబు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన చిన్న లారెన్, బక్కన్న, సుబ్బన్న అనే ముగ్గురు వ్యక్తులు నడిపి వెంకటేశ్వర్లును గాయపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులోని నింధితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 31: పట్టణంలోని శారద కమిటీ వద్ద సోమవారం సాయంత్రం ఇంటివద్ద ఉన్న నీటితొట్టిలో పడి 18 నెలల అబ్దుల్ మృతి చెందాడు.
ట్రాక్స్, ట్రాక్టర్ ఢీ - నలుగురికి గాయాలు
ఎమ్మిగనూరు, డిసెంబర్ 31: మండల పరిధిలోని స్టేషన్‌రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్స్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మద్యం తాగడానికి డబ్బు
ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
ఆదోనిటౌన్, డిసెంబర్ 31: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని పట్టణంలోని కార్వన్‌పేటకు చెందిన ముద్దిరప్ప ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం జరిగిన సంఘటనతో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఏరియాసుపత్రికి తరలించారు.

విధులకు సక్రమంగా
హాజరైతేనే గుర్తింపు:ఎంపి

నంద్యాల రూరల్, డిసెంబర్ 31:ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరై పనిచేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, పదవీవిరమణ తప్పనిసరి అని నంద్యాల పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డిలు అన్నారు. సోమవారం నంద్యాల నిశాంత్ భవనంలో జరిగిన విఆర్వో జయశంకర్‌రెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నంద్యాల ఆర్డీవో శంకర్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు, ప్రజల మన్ననలు లభిస్తాయన్నారు. నూనెపల్లె విఆర్వోగా జయశంకర్‌రెడ్డి చేసిన సేవలు మరువలేనివన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలందిస్తూ ప్రజల గుర్తింపు పొందారన్నారు. నంద్యాల డివిజన్ పరిధిలోని జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో రెవెన్యూ అధికారులు పాల్గొని విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లాలో తెలుగు మహాసభలు విజయవంతమయ్యాయని ఎంపి ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డిలు అన్నారు. అనంతరం విఆర్వో జయశంకర్‌రెడ్డిని పూలమాలలతోను, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మాలకొండయ్య, ఆర్‌ఐ రామనాధరెడ్డి, మల్లికార్జున, విఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యుగంధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, డివిజన్‌లోని విఆర్వోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నిందితులను శిక్షించాలని
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నంద్యాల రూరల్, డిసెంబర్ 31: అత్యాచారానికి పాల్పడిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని కోరుతూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను సోమవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నాయకులు రఫి, జిల్లా కార్యదర్శి నవీన్‌కుమార్‌లు మాట్లాడుతూ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మెడికో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ చేసిన వారిని ఇంతవరకూ శిక్షించకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థత అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నూనెపల్లె కలీల్ సిద్దిఖ్ స్కూల్ నుంచి సాయిబాబా నగర్ వరకు పిడిఎస్‌యు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, మున్నా, జిలానిబాషా, తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
నంద్యాల టౌన్, డిసెంబర్ 31:మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దొంగతనాలు అరికట్టాలంటే పోలీస్ అధికారులు, న్యాయవాదులు కఠినంగా వ్యవహరించాలని అప్పుడే 99శాతం అరికట్టవచ్చని సిపిఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు, అత్యాచారాలు చేసే వారి పట్ల పోలీసులు సమర్థించకుండా కేసులు నమోదు చేసినప్పుడే ప్రజల్లో, యువకుల్లో మార్పు వస్తుందన్నారు. పట్టణంలో రోజురోజుకు దొంగతనాలు మితిమీరిపోయాయన్నారు. పోలీస్ అధికారులు స్పందించి ప్రత్యేక నిఘా వేయాలన్నారు.

కస్తూరిబా పాఠశాల తనిఖీ
మహానంది, డిసెంబర్ 31: మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలోని కస్తూరిబా పాఠశాలను సోమవారం మహానంది మండల ప్రత్యేక అధికారి సతీష్ తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, నాణ్యమైన విద్యను బోధించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సువర్ణలత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల ఇన్‌చార్జి తహశీల్దార్‌గా స్వరూప్‌కుమార్
మహానంది, డిసెంబర్ 31:మహానంది మండల తహశీల్దార్ మునికృష్ణయ్య దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జి తహశీల్దార్‌గా బండి ఆత్మకూరు తహశీల్దార్ స్వరూప్‌కుమార్ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విఆర్వోల సమావేశం నిర్వహించారు.
16 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు
చాగలమర్రి, డిసెంబర్ 31: మండలానికి కొత్తగా 16 ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎంఇఓ అనురాధ సోమవారం తెలిపారు. మండల పరిషత్ పాఠశాలలకు 11 మందిని, మిగతా ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాలలకు కేటాయించినట్లు తెలిపారు.
శ్రీ వేంకటేశ్వరస్వామికి లక్ష తులసి అర్చన
నంద్యాలటౌన్, డిసెంబర్ 31:నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో సోమవారం శ్రీ వేంకటేశ్వరస్వామికి లక్ష తులసి అర్చన చేసినట్లు కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ధనుర్మాసంలో లక్ష తులసి అర్చన చేసినట్లయితే సకల దోషాలు నివారణ జరిగి సుఖః సంతోషాలతో ఉంటారన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష తులసి అర్చనతోపాటు కుంకుమార్చన చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు సురేష్, గురుచరణ్, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
సూక్ష్మప్రణాళికపై శిక్షణ
చాగలమర్రి, డిసెంబర్ 31: చాగలమర్రి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల, మండల పరిషత్ ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ఎస్‌ఎంసి సభ్యులకు సోమవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సూక్ష్మప్రణాళిక తయారీ, అవాస ప్రాంత విద్యా ప్రణాళికపై సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంఇఓ అనురాధ మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన సమస్యలు, వౌలిక సదుపాయాల గురించి పొందుపరచాలన్నారు.
నాగిరెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
నంద్యాల రూరల్, డిసెంబర్ 31:గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్న కోటిరెడ్డి తండ్రి నాగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన చేసిన సేవలు మరువలేనివని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గోస్పాడు మండలంలోని ఎం.కృష్ణాపురం గ్రామంలో నాగిరెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చి నాగిరెడ్డి కుటుంబానికి సంతాపం తెలిపారు.ఈయన వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ ఎంపిపి పామిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటిసి ప్రహ్లాదరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.
విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి
రుద్రవరం, డిసెంబర్ 31: విద్యాహక్కు చట్టాన్ని అన్ని విధాలుగా అమలుచేయాలని ఎంపిడిఓ అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠశాల ప్రణాళిక అనే అంశంపై ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాల బాలికలను బడిలో చేర్పించాలన్నారు. రిసోర్స్‌పర్సన్ వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలలో వౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం, పాఠశాల అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంఇఓ సాహేబ్ వుశేన్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బనగానపల్లె
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>