‘ఆమె’ మరణంతో జాతి మేల్కొంది. చట్టాలూ పదునెక్కుతున్నాయి. రేపిస్టులకు మరణ శిక్షే తగిన దండనన్న డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా విస్తృతస్థాయి భేటీలు జరిపారు. తన విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మరోపక్క తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రేపిస్టులకు మరణ శిక్షే తగినదన్న వాదనతో 13 అంశాల కార్యాచరణ వ్యూహాన్ని ప్రకటించారు. మానభంగ కేసులను గూండా చట్టాల పరిధిలోకి తెచ్చే పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇలా ఒక్కో రాష్ట్రం మహిళా భద్రతపై వేస్తున్న అడుగు సమగ్ర చట్ట రూపకల్పనకు దారి తీస్తున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 1: మహిళా రక్షణ చట్టాలను బలోపేతం చేయడానికి ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన ఊతం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ యోచిస్తున్నారు. విదేశీ విహారయాత్ర సైతం రద్దు చేసుకుని న్యాయ నిపుణులు, రాజకీయ, సామాజిక, మహిళా వర్గాలతో ఎడతెరిపిలేని చర్చలు సాగిస్తున్నారు. మొదటిసారి పరిపాలనా సంబంధమైన విషయాల్లో సోనియా నేరుగా జోక్యం చేసుకోవటం గమనార్హం. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన తరువాత ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు తీవ్రస్థాయిలో స్పందించిన తీరు తెన్నులను పరిశీలించిన సోనియా, మహిళకు గట్టి భద్రత కల్పించే సమగ్ర చట్ట రూపకల్పనపై దృష్టిపెట్టారు. నూతన సంవత్సరాన్ని విదేశాల్లో జరుపుకోవాల్సిన సోనియా, కార్యక్రమాలు రద్దు చేసుకుని కొత్తచట్టం రూపకల్పనపై సంప్రతింపులు జరుపుతున్నారు. అందరితో చర్చలు జరిపి అభిప్రాయాలను క్రోడీకరించిన తరువాతే న్యాయమూర్తి వర్మకు పార్టీ తరఫున అందజేసే నివేదిక తయారు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కొత్త చట్టంలో మరణశిక్ష లేదా 30ఏళ్ల కారాగారం, నపుంసకత్వం కలిగించటంతోపాటు పోలీసు సంస్కరణలు, పరిపాలనా సంబంధ సంస్కరణలు, పోలీసులకు సమగ్ర శిక్షణ, విద్యార్థులకు మహిళల పట్ల సమ దృష్టి కలిగించేందుకు అవసరమైన బోధన, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలను నివేదికలో పొందుపరుస్తున్నట్టు తెలిసింది. సోనియా ఆదేశం మేరకు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మొహిసీనా కిద్వాయి పలువురు మహిళా ఎంపీలతో సమావేశమై చట్టంలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు, చేర్చాల్సిన అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. మహిళా ఎంపీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆధారంగా తయారు చేసిన సిఫార్సులను కాంగ్రెస్ నివేదికలో పొందుపరుస్తున్నారు. మానభంగాలు, అత్యాచారాలకు పాల్పడేవారి పూర్తి వివరాలను అంతర్జాలంతోపాటు స్థానిక పోలీసు స్టేషన్‌లో పెట్టాలని పలువురు మహిళా ఎంపీలు సిఫార్సు చేసినట్టు తెలిసింది. మానభంగాలు, మహిళలపై అత్యాచారాలు చేసే వారి వివరాలతో కూడిన జాతీయస్థాయి, రాష్టస్థ్రాయి వివరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని, దీన్ని అంతర్జాలంలో ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపర్చటం వల్ల వారు సమాజంలో ముఖం ఎత్తుకుని తిరగటం సాధ్యం కాదన్నారు. ఇదొక గట్టి శిక్ష కావటంతోపాటు సమాజపరంగా గట్టి చర్య అవుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. మానభంగాలు, అత్యాచారాలకు పాల్పడే వారికి ఇళ్లు అద్దెకు లభించకుండా చేయాలి. ఉద్యోగావకాశాలకు దూరం పెట్టాలి. పెళ్లి జరగకుండా చూడాలని మహిళా ఎంపీలు సూచించినట్టు తెలిసింది. సమాజపరంగా ఇలాంటి వారందరినీ వెలివేయాలని కొందరు మహిళా ఎంపీలు గట్టిగా వాదించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే, మానభంగాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించటం, కెమికల్ కాస్ట్‌రేషన్ వంటి చర్యలు మంచివికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైందని అంటున్నారు. అత్యంత అరుదైన మానభంగం కేసుల్లో మాత్రమే ఈ రెండు శిక్షలు విధించాలి తప్ప ఇతర కేసులో ఇలాంటి శిక్షలు విధించటం మానవత్వానికి విరుద్దమని కొందరు మహిళా ఎంపీలు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. మానభంగం నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలనేది న్యాయ స్థానాలకు వదిలివేయటం మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమైందని అంటున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుందని వారంటున్నారు. పారా మెడికో మానభంగం కేసు మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రత్యేక మలుపు కావాలని మహిళా ఎంపీలు సూచించారు.