హైదరాబాద్, జనవరి 1: విద్యార్థులకు ఉన్నత చదువులను, నాణ్యమైన బోధనను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటైన 73వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను ఆమె మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను డిగ్రీ చదువుకున్న కాలేజీలోనే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రదర్శనను తాను ప్రారంభించటం తనకెంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అత్యాచారం ఘటన, అత్యాచార బాధితురాలు మృతి చెందిన కారణంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హజరుకాలేకపోయారని, ఈ క్రమంలో తన చేతుల మీదుగా ప్రారంభించటం మరువలేని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఈ 73వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గతంలో పది స్టాళ్లతో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ నేడు 2200 స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనగా పేరుగాంచటం విశేషమన్నారు. జనవరి మాసంలో హైదరాబాద్ మహానగరంలో పారిశ్రామిక ప్రదర్శన జరుగుతుందన్న విషయం తెలిసి, ప్రపంచం మొత్తం కూడా దృష్టి పెడుతుందన్నారు.
దేశ, విదేశాల నుంచి అక్కడి ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు ఈ ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావటం సొసైటీ చేసిన కృషి ఫలితమేనని ఆమె వివరించారు. ఈ ప్రదర్శన ద్వారా వచ్చే నిధులతో విద్యార్థినిల విద్యాభ్యాసం కోసం వినియోగించటం ఎంతో అభినందనీయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో కూడా ఈ సొసైటీకి చెందిన మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉందని, ఆ కళాశాలను తాను కూడా సందర్శించానని ఆమె తెలిపారు. ఈ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం ఎందరో విద్యార్థినిలకు ఉన్నత విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రకరకాల ఉత్పత్తులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వినియోగదారులకు తక్కువ ధరలకే అన్ని రకాల వస్తువులను పారిశ్రామికవేత్తలు అందుబాటులోకి తెస్తున్నారన్నారు. 46 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను దాదాపు 25 లక్షల మంది సందర్శించే అవకాశమున్నట్లు హోం మంత్రి తెలిపారు. శాంతిభద్రతల పరంగా ఇటీవలి కాలంలో రాజధాని, రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో నుమాయిష్‌కు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి సుకేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. హైదరాబాద్‌లో మంగళవారం నుమాయష్‌ను ప్రారంభిస్తున్న రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి