కాకినాడ, జనవరి 1: రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రసారభారతి సిద్ధం చేస్తోంది. ప్రైవేటు రేడియో, ఎఫ్‌ఎంలకు దీటుగా స్పందించేందుకు, మారుమూల ప్రాంతాలకు సైతం జనరంజకమైన ప్రసార కార్యక్రమాలను తీసుకువెళ్లడానికి ప్రసార భారతి ప్రత్యేకించి దృష్టి సారించింది. ప్రసార భారతి ఆధీనంలో కొత్తగా ప్రాంతీయ వార్తా విభాగాలు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో 44 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాలుండగా, ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడలలో రెండు విభాగాలు సేవలందిస్తున్నాయి. 11వ పంచవర్ష ప్రణాళికలో కొత్తగా మరో 7 ప్రాంతీయ వార్తా విభాగాల ఏర్పాటుకు ఆమోదం లభించగా ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో ప్రాంతీయ వార్తా విభాగాన్ని త్వరలో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విభాగం ఏర్పాటుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. విశాఖ విభాగం ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ప్రాంత శ్రోతలకు రేడియో ద్వారా తాజా వార్తలను అందించేందుకు మార్గం సుగమం అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేట్ ఎఫ్‌ఎంలకు దీటుగా త్వరలో ప్రసారభారతి ఎఫ్‌ఎంను ప్రారంభించనున్నది. జిల్లా కేంద్రం కాకినాడలో ఇప్పటికే ఎఫ్‌ఎం స్టేషన్‌కు అవసరమైన సాంకేతిక పనులు జరుగుతున్నాయి. జనవరి రెండవ వారంలో ఎఫ్‌ఎం స్టేషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్ళంరాజు ప్రారంభించనున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో ఆకాశవాణి శ్రోతల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కేంద్రాల్లో ఈ కొత్త సంవత్సరంలో ఎఫ్‌ఎం రేడియోలను ప్రారంభించడానికి ప్రసార భారతి ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రసార భారతి ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ఈ ఎఫ్‌ఎంలను ప్రైవేట్ ఎఫ్‌ఎంలకు దీటుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రసార భారతి అడిషనల్ డైరెక్టర్ జనరల్ (న్యూస్) పిజె సుధాకర్ తెలిపారు. కాగా వినూత్న కార్యక్రమాలతో ఇప్పటికే ప్రైవేట్ ఎఫ్‌ఎంలు వివిధ రకాల పేర్లతో దూసుకుపోతున్నాయి. విశాఖ, రాజమండ్రి, కాకినాడ నగరాల్లో ప్రైవేట్ ఎంఫ్‌లు ఇప్పటికే ప్రసారాలతో బిజీబిజీగా వున్నాయి. దూసుకుపోతున్న ప్రైవేట్ ఎఫ్‌ఎంలకు దీటుగా ఇప్పుడు ప్రభుత్వ ఎఫ్‌ఎంలు రానున్నాయి. విశాఖలో ఆకాశవాణి కేంద్రంతో పాటు ప్రసారభారతి ఇదివరకే ఓ ఎఫ్‌ఎంను ప్రారంభించినప్పటికీ మిగిలిన నగరాలకు విస్తరించలేకపోయింది. తాజాగా ఆయా నగరాల్లో ప్రారంభించనున్న ఎఫ్‌ఎం ప్రసారాల్లో న్యూస్ హెడ్‌లైన్స్ వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి జనరంజకమైన ప్రసారాలు చేయడం ద్వారా శ్రోతలకు చేరువయ్యేందుకు ప్రసార భారతి సన్నాహాలు చేస్తోంది.
...............
బడ్జెట్ల రూపకల్పనలో
మున్సిపాలిటీల నిర్లక్ష్యం
గడువు దాటినా పట్టించుకోని కమిషనర్లు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 1: వార్షిక అంచనా బడ్జెట్ల రూపకల్పనలో మున్సిపాలిటీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి ఆర్థ్ధిక సంవత్సరం మొదలుకావటానికి ముందే బడ్జెట్లను రూపొందించుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందాల్సిన మున్సిపాలిటీ బడ్జెట్లను అధిక శాతం మున్సిపల్ కమిషనర్లు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. పురపాలక సంఘాల విధి విధానాల ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావటానికి ముందు నవంబరు నెలలోనే అంచనా బడ్జెట్‌ను రూపొందించడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. వివిధ విభాగాల నుండి గణాంకాలను సేకరించి, నవంబరు 15వ తేదీ లోపునే అంచనా బడ్జెట్ కౌన్సిల్ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. ఇలా కౌన్సిల్ ఆమోదం పొందిన అంచనా బడ్జెట్‌ను మున్సిపాలిటీలు ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా డిసెంబరు 31వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలు అంచనా బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు మున్సిపాలిటీల కన్నా కాస్తంత ఎక్కువ గడువు ఉంటుంది. నగరపాలక సంస్థలు డిసెంబరు 10వ తేదీనాటికి అంచనా బడ్జెట్‌ను రూపొందించుకుని, స్థారుూ సంఘం ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్థారుూ సంఘం ఆమోదం పొందిన తరువాత ఫిబ్రవరి 20లోపు కౌన్సిల్ ఆమోదముద్ర వేయించుకుని, మార్చి 1వ తేదీలోపు ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. డిసెంబరు నెల ముగిసి, క్యాలండరు మారిపోతున్నా ఇంత వరకు ఈ ప్రక్రియకు చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు శ్రీకారం చుట్టలేదు. ప్రతి సంవత్సరం ముందుగానే మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఉన్నతాధికారులు అంచనా బడ్జెట్ రూపకల్పన పట్ల అప్రమత్తం చేస్తున్నా కమిషనర్లలో కనీస స్పందన లేకుండా పోయింది. మార్చి 31లోపు అంచనా బడ్జెట్ రూపకల్పన, రాష్ట్రప్రభుత్వ ఆమోదం పొందితే, కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా పుర పరిపాలన సాగేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి కీలకమైన బాధ్యతను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులు చాలా తేలికగా తీసుకుంటున్నారు. డిసెంబరు 31నాటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా సమర్పించాల్సిన అంచనా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలాఖరు కూడా రూపొందించలేనంత నిర్లక్ష్యాన్ని చాలా మున్సిపాలిటీలు ప్రదర్శిస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన బడ్జెట్ అంచనాలు సిద్ధంగా లేకపోవటంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త కాంట్రాక్టులకు టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో పాత కాంట్రాక్టులనే కొనసాగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా చాలా మున్సిపాలిటీలు వ్యవహరిస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీనాటికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం పొందిన అంచనా బడ్జెట్‌ను సిద్ధంచేసుకోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులపై చర్యలు తీసుకోకపోతే బడ్జెట్ల లక్ష్యం నెరవేరేలా కనిపించటం లేదు.
ప్రజలకు మరింత చేరువలో రేడియో ప్రసారాలు
english title:
s
Date:
Wednesday, January 2, 2013