తిరువనంతపురం, జనవరి 1: పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు 42 మంది 40 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలో ఈ కేసు బాధితురాలు తన తల్లిదండ్రులతో ఉండిన ఊరయిన సూర్యనెల్లి రేప్ కేసుగానే అందరికీ తెలుసు. అయితే ఈ సంఘటన జరిగి 16 ఏళ్లు గడిచి పోయినప్పటికీ బాధితురాలు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగినప్పటినుంచి ఆ కుటుంబం ఇరుగుపొరుగు వారి చీదరింపుల కారణంగా రెండు ఇళ్లు మారవలసి వచ్చింది. ‘ఎవరు కూడా మమ్మల్ని అంగీకరించడం లేదు. మమ్మల్ని చూస్తే చాలు మొహం చాటు చేస్తున్నారు. మేము బయటికి సైతం వెళ్లలేని స్థితిలో ఉన్నాం’ అని బాధితురాలి తండ్రి ఆవేదనగా అన్నాడు.
బాధితురాలు పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక బస్సు కండక్టర్ కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అతను ఆమెను రాష్ట్రంలో అప్పట్లో పలుకుబడి కలిగిన, పెద్దవాళ్లతో సంబంధాలున్న మరి కొంతమందికి అప్పగించాడు. ఆమె కేసు కారణంగానే కేరళలో తొలిసారిగా 1999లో మహిళలపై జరిగే సెక్స్‌పరమైన దాడుల కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసారు. బాధితురాలిపై అత్యాచారం జరిపినందుకు 36 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అయితే కేరళ హైకోర్టు కేవలం ఒక వ్యక్తిని దోషిగా పేర్కొనడం ద్వారా ఆ తీర్పును పూర్తిగా మార్చి వేసింది. హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి చూపిన కారణాలను చాలా మంది విమర్శించారు కూడా. హైకోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాసిక్యూటర్ 2005లో సుప్రీం కోర్టులో అపీల్ చేసారు. దీనిపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.
బాధితురాలి కుటుంబం ఆమె తల్లిదండ్రులకు వచ్చే పింఛనుపై జీవిస్తోంది. బాధితురాలికి ఒక ప్రభుత్వ శాఖలో ప్యూన్‌గా ఉద్యోగం ఇచ్చారు కానీ, ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణపై గత ఫిబ్రవరిలో ఆమెను సస్పెండ్ చేసారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై పోరాటం సాగిస్తున్నందుకే బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళా ఉద్యమ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
కందా ‘సర్వెంట్’ గీతిక!
హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు మండిపడిన బిజెపి, మహిళా సంఘాలు
సిర్సా (హర్యానా) జనవరి 1: హర్యానా మాజీ మంత్రి మోహన్ కందా ప్రధాన నిందితుడుగా ఉన్న గీతికా శర్మ ఆత్మహత్య కేసులో మృతురాలు గీతికను కందా ‘సేవకురాలు’ (సర్వెంట్) అంటూ రాష్ట్ర మంత్రి శివచరణ్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు, ఈ కేసు చాలా చిన్నదని కూడా రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి అయిన శర్మ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీతో పాటుగా మహిళా ఉద్యమ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేవిగా ఉండడమే కాకుండా మహిళలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆ సంఘాలు అంటుండగా, మంత్రి క్షమాపణలు చెప్పాలని గీతిక సోదరుడు అంకిత్ డిమాండ్ చేసాడు.
‘ఇది పెద్ద కేసేమీ కాదు. కందా గీతికను పొరబాటున ‘సర్వెంట్’గా నియమించుకున్నాడు’ అని గత నెల 29న సిర్సాలో కందా అభిమానులు ఏర్పాటు చేసిన ఆయన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మూతపడిన కందాకు చెందిన ఎండిఎల్‌ఆర్ ఎయిర్‌లైన్స్‌లో గీతిక ఉద్యోగినిగా పని చేస్తూ ఉండేది. గత ఏడాది ఆగస్టు 5న ఆమె ఢిల్లీ అశోక్ విహార్‌లోని తన నివాసంలో చనిపోయి కనిపించింది. కందా, ఈ కేసులో మరో నిందితురాలు అరుణా చద్దా వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో గీతిక పేర్కొంది. ‘కందా పుట్టిన రోజును జైల్లోను, ఢిల్లీలో కూడా జరుపుకొంటున్నారు. కందా ఎప్పుడూ మన మధ్యలోనే ఉంటున్నాడు. ఆయన దేనికీ, ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు’ అని కూడా శర్మ అన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్తూ, వివాదాన్ని తేలిక చేయడానికి ఆ తర్వాత శర్మ ప్రయత్నించారు. ‘నేను కోర్టును గౌరవిస్తాను. కందా తప్పు చేసాడా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. అతను నేరానికి పాల్పడి ఉంటే కోర్టు శిక్షిస్తుంది, లేకుంటే విడుదల చేస్తుంది. సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కొద్ది రోజుల్లోనే దర్యాప్తు ఫలితం మనకు తెలుస్తుంది’ అని శర్మ అన్నారు.
అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ మాత్రం శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శర్మ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవని నక్వీ అంటూ, సున్నితమైన ఇలాంటి విషయాల్లో అర్థం పర్థం లేకుండా చేసే వ్యాఖ్యల వల్ల ప్రజాగ్రహం పెరిగిపోతుందన్నారు. కాగా, శర్మ చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ అంటూ పార్టీ ఆయనతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. అయితే రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, గీతికను కందా సర్వెంట్‌గా అభివర్ణించడం ద్వారా మంత్రి ఆమెను అవమానించారని, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మమతా శర్మ అన్నారు.
కాగా, ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతితో వాతావరణం ఉద్రేకంగా ఉన్న సమయంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని బిజెపికి చెందిన స్మృతి ఇరానీ అన్నారు.